Home జాతీయ national telgu మహారాష్ట్ర: అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ కేసులో ట్విస్ట్, 121 వీడియోలు స్వాధీనం.. ఫిర్యాదుదారుడే అరెస్ట్

మహారాష్ట్ర: అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ కేసులో ట్విస్ట్, 121 వీడియోలు స్వాధీనం.. ఫిర్యాదుదారుడే అరెస్ట్

11
0

SOURCE :- BBC NEWS

లైంగిక వేధింపులు, లైంగిక హింస

ఫొటో సోర్స్, Getty Images

మహారాష్ట్రలో అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న మరో కేసు వెలుగుచూసింది. నాసిక్‌లోని సాత్పూర్ బలవంతపు వసూళ్ల కేసు అనూహ్య మలుపు తిరిగింది. అశ్లీల వీడియోలు, లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేసిన వ్యక్తే అరెస్టయ్యారు.

అరవై మూడేళ్ల రవీంద్ర ఎరండేపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఐటీ యాక్ట్, అట్రాసిటీ చట్టం కింద కూడా కేసులు నమోదయ్యాయి. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఏప్రిల్ 3న నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఆయనకు ఏప్రిల్ 6 వరకు పోలీస్ కస్టడీ విధించింది. నిందితుడి తరపు న్యాయవాదులు స్పందించడానికి నిరాకరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
నాసిక్, బెదిరింపుల కేసు, అశ్లీల వీడియోలు

అసలేం జరిగింది?

ఏప్రిల్ 2న రవీంద్ర ఎరండే బలవంతపు వసూళ్ల వ్యవహారంపై సాత్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించి, పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి మొబైల్, పెన్ డ్రైవ్, మెమరీ కార్డులను జప్తు చేశారు.

వాటిని తనిఖీ చేయగా పోలీసులకు 121 అశ్లీల వీడియో క్లిప్పులు లభించాయి. ఈ వీడియోలన్నింటిలో ఫిర్యాదుదారుడు వివిధ మహిళలతో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

ఈ క్రమంలోనే ఒక మహిళ సాత్పూర్ పోలీసులను సంప్రదించి, రవీంద్ర ఎరండే తనను లైంగికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.

“సాత్పూర్ నివాసి రవీంద్ర ఎరండే మా అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని, భవిష్యత్తు బాగుంటుందని ఆశ చూపారు. నేను దళిత మహిళను, నా పరిస్థితిని ఆసరాగా చేసుకుని, నాసిక్ పరిసరాల్లోని వివిధ హోటళ్లకు తీసుకెళ్లి పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు” అని ఆ మహిళ తన ఫిర్యాదులో తెలిపారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా సాత్పూర్ పోలీసులు రవీంద్ర ఎరండేపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69, 77, ఐటీ యాక్ట్ సెక్షన్ 67(ఎ), అట్రాసిటీ చట్టంలోని సెక్షన్లు 3(1)(W), 3(2)(V), 3(2)(VA) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

నిందితుడు అనేక మంది మహిళలతో శారీరక సంబంధాలు పెట్టుకుని, వారి రహస్య వీడియోలు తీసినట్లు పోలీసు విచారణలో తేలింది.

రవీంద్ర,  నాసిక్ కేసు, సాత్పూర్

పోలీసులు ఏం చెప్పారు?

“రవీంద్ర ఎరండేను నలుగురు వ్యక్తులు అశ్లీల వీడియోలతో బెదిరిస్తూ డబ్బులు అడిగారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మరింత విచారణ చేయగా, నిందితుల వద్ద లభించిన హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్‌లలో 121 వీడియోలు గుర్తించాం. ఈ వీడియోలు 2003 నుంచి ఇప్పటి వరకు ఉన్నవి” అని పోలీస్ డిప్యూటీ కమిషనర్ కిషోర్ కాలే తెలిపారు.

“మేం దీనిపై దర్యాప్తు ప్రారంభించాం. ఈ కేసులో ప్రస్తుతం ఒక బాధితురాలు ముందుకు వచ్చారు. ఆమె ఫిర్యాదు మేరకు రవీంద్ర ఎరండేపై కేసు నమోదు చేశాం, అరెస్టు చేశాం. కేసును అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సచిన్ బారి విచారిస్తున్నారు ” అని చెప్పారు.

కాగా, స్పందన కోసం నిందితుడి తరఫు న్యాయవాదులను సంప్రదించగా వారు నిరాకరించారు.

సాత్పూర్ పోలీస్ స్టేషన్‌

కోర్టులో ఏం జరిగింది?

నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు, డిజిటల్ ఆధారాలను సేకరించేందుకు, బాధితురాలు ఇచ్చిన సమాచారం ప్రకారం దర్యాప్తు చేసేందుకు నిందితుడిని 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు.

దీనిపై డిఫెన్స్ తరఫు న్యాయవాదులు వాదిస్తూ, నిందితుడే స్వయంగా పోలీసుల వద్దకు వచ్చారని, వీడియోలకు సంబంధించిన సమాచారం కూడా ఆయనే స్వయంగా ఇచ్చారని, కాబట్టి నిందితుడిని పోలీస్ కస్టడీకి ఇవ్వకుండానే దర్యాప్తు చేయవచ్చని పేర్కొన్నారు.

ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, నిందితుడిని ఏప్రిల్ 6 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసుల విజ్ఞప్తి, సంప్రదించాల్సిన నంబర్లు: ఈ కేసులో ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే సాత్పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

సచిన్ బారి (ఏసీపీ): 9049872822

ప్రకాష్ అహిరే (సీనియర్ పీఐ): 9823234176

స్వప్నాలి పలాండే (పీఐ): 7774002710

అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సచిన్ బారి ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)