SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Trish Prosser
తనకు మలద్వార క్యాన్సర్ అని తెలిసినప్పటి కంటే, ఆ చికిత్స తర్వాత పడిన బాధే తనను ఎక్కువగా భయపెట్టిందని ఓ మహిళ అంటున్నారు.
పెల్విక్ రేడియోథెరపీ వల్ల కలిగిన వేదన తట్టుకోలేక, తాను ఇక చనిపోతానేమోనని భయపడ్డానంటూ 57 ఏళ్ల ట్రిష్ ప్రోసర్ తన అనుభవాలను పంచుకున్నారు.
రేడియోథెరపీ దుష్ప్రభావాల వల్ల తన యోని గోడలు ఒకదానికొకటి అతుక్కుపోయాయని, ఆ చికిత్స జరిగి ఆరేళ్లు గడుస్తున్నా.. ఆ నొప్పి తనను ఇంకా వెంటాడుతూనే ఉందని ఆమె తెలిపారు.
నలుగురు పిల్లల తల్లయిన ట్రిష్, మలద్వారం క్యాన్సర్ పట్ల సమాజంలో ఉన్న చులకన భావం కారణంగా తనకు వచ్చిన క్యాన్సర్ గురించి కుటుంబ సభ్యులకు లేదా సన్నిహితులకు చెప్పడానికి ఇబ్బంది పడినట్లు చెప్పారు.
మలద్వార క్యాన్సర్ చాలా అరుదైన వ్యాధి. ఏటా యూకేలో సుమారు 1,500 మందికి ఈ వ్యాధి నిర్ధరణ అవుతుండగా, వారిలో సుమారు 40-50 కేసులు ఉత్తర ఐర్లాండ్‌కు చెందినవే.
“శరీరంలోని సున్నిత భాగాల్లో లేదా పిరుదుల దగ్గర ఉండే సమస్యల గురించి మాట్లాడటానికి ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఇది ఇబ్బందికరంగా లేదా నిషిద్ధంగా కూడా అనిపించవచ్చు. కానీ, నేను ఆ చులకన భావాన్ని పోగొట్టడంలో సహాయపడాలనుకుంటున్నా” అని ట్రిష్ చెప్పారు.
ట్రిష్‌కు 2020లో ఆనల్ క్యాన్సర్ నిర్ధరణ అయిన తర్వాత, తన ‘ప్రయాణం’ ఒంటరిగా సాగిందని, ఇటీవలే ఆ బాధ గురించి మాట్లాడగలుగుతున్నానని ట్రిష్ తెలిపారు.
“నాకు జుట్టు రాలకపోవడం వల్ల బయటికి నేను మామూలుగానే కనిపిస్తూ ఉండవచ్చు కానీ, లోపల మాత్రం చాలా భయంకరంగా అనిపించేది. నేను పూర్తిగా కుప్పకూలిపోతున్నట్లు భావించాను” అని ఆమె అన్నారు.
“నాకు ఎదురైన అత్యంత తీవ్రమైన లక్షణం అలసట. నేను చాలా నీరసించిపోయేదాన్ని. మలద్వారం చుట్టూ దురద ఉండేది. కానీ, నా మలవిసర్జన అలవాట్లలో ఎలాంటి మార్పులు లేవు. నిజం చెప్పాలంటే, సాధారణంగా క్యాన్సర్‌కు సంబంధించిన ఏ లక్షణాలు కూడా నాకు లేవు” అని ట్రిష్ వివరించారు.

ఫొటో సోర్స్, Trish Prosser
యూకేలోని మిగతా ప్రాంతాల్లో ఉన్నట్లుగా, పెల్విక్ రేడియోథెరపీ చేయించుకున్న రోగుల కోసం ఉత్తర ఐర్లాండ్‌లో ఎటువంటి ప్రత్యేక క్లినిక్ లేదా ‘వన్-స్టాప్-షాప్’ (ఒకే చోట అన్ని రకాల వైద్య సేవలు అందే) సౌకర్యం లేదు.
చికిత్స నుంచి బయటపడటం కోలుకునే ప్రక్రియలో మొదటి దశ మాత్రమే, చాలామందికి ఇది సంవత్సరాలు పట్టొచ్చు అంటారు ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్ నివాసి ట్రిష్.
“పెల్విక్ రేడియోథెరపీ చేయించుకున్న వారికి పేగులు, గర్భాశయ ముఖద్వారం, యోని ప్రాంతాల్లో మచ్చలు ఏర్పడి విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి” అని ఆమె చెప్పారు.
“నేను ఏ విషయంలో బాధ పడుతున్నానో ఇతరులకు తెలియడం నాకిష్టం లేదు. ఎందుకంటే అది నా శరీరంలోని ప్రైవేట్ పార్ట్. అందుకే ఎవరైనా అడిగితే, నేను బాగున్నానని చెప్పేదాన్ని” అన్నారు ట్రిష్.
ఫొటో సోర్స్, Trish Prosser
ఆనల్ క్యాన్సర్ అంటే ఏమిటి?
ఆనల్ క్యాన్సర్ ప్రధానంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ అధిక-ప్రమాదకర రకాలతో కలిగే దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. దాదాపు 90 శాతం కేసులు దీనివల్లే సంభవిస్తాయి.
హెచ్‌పీవీ వైరస్ మలద్వార నాళంలోని కణాలు అసాధారణంగా పెరగడానికి, కణితులుగా మారడానికి కారణమవుతుంది.
వ్యాధి నిరోధక శక్తి బలహీనంగా ఉండటం లేదా ఇతర గైనిక్ క్యాన్సర్ల చరిత్ర ఉండటం వంటివి మరికొన్ని ముఖ్యమైన ప్రమాద కారకాలు.
అయితే, హెచ్‌పీవీ ఉన్న రోగులలో కేవలం అతి తక్కువమందికే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
ఫొటో సోర్స్, Trish Prosser
కలయికపై ప్రభావం చూపుతుందా?
ఆనల్ క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇచ్చే పెల్విక్ రేడియోథెరపీ వల్ల యోని కణజాలాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. యోని కణజాలాలు చికిత్స జరిగే ప్రాంతానికి అతి సమీపంలో ఉండటమే దీనికి ప్రధాన కారణం.
దీనిని వైద్య పరిభాషలో ‘రేడియేషన్-ఇండ్యూస్డ్ వెజైనల్ స్టెనోసిస్’ అని పిలుస్తారు.
దీనివల్ల స్కార్ టిష్యూ ఏర్పడి యోని మార్గం చిన్నగా, ఇరుకుగా మారిపోతుంది. అంతేకాకుండా, అది తన సహజమైన మెత్తదనాన్ని కోల్పోయి పొడిబారిపోతుంది. దీనివల్ల యోని కణజాలంలో గాయాలు, చిట్లడటం వంటి సమస్యలు కలగొచ్చు.
ఇది చికిత్స జరుగుతున్న సమయంలో మొదలుకావచ్చు. కానీ తరచుగా చికిత్స ముగిసిన నెలలు లేదా సంవత్సరాల తర్వాత కూడా దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.
“నా యోని గోడలు వాస్తవానికి ఒకదానికొకటి అతుక్కుపోయాయని నాకు తెలియదు. నేను వాటిని మళ్లీ తెరిచేలా చేయాల్సి వచ్చింది. అది డైలేటర్ ఉపయోగించడం ద్వారా లేదా శారీరక కలయిక ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కానీ, ఆ సమయంలో కలయిక చాలా నొప్పిగా ఉండేది” అని ట్రిష్ చెప్పారు.
“కోలుకుంటున్న కొద్దీ కలయికపైనే ఆలోచన వస్తుంది. ఆ సమయంలో నాకు తోడుగా ఉండి, ఓపికగా సహాయం చేసిన ప్రేమగల భాగస్వామి దొరకడం నా అదృష్టం” అని ట్రిష్ అన్నారు.
ఫొటో సోర్స్, Trish Prosser
చికిత్స తర్వాత సంరక్షణ
బెల్‌ఫాస్ట్ హెల్త్ అండ్ సోషల్ కేర్ ట్రస్ట్‌లోని జీఐ క్లినికల్ ఆంకాలజీ బృందంతో రేడియోథెరపీ యూకే ఒక చర్చను ప్రారంభించాలనుకుంటోంది. అతి తక్కువగా చర్చిస్తున్న క్యాన్సర్‌లలో ఒకటిగా పరిగణించే ఆనల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడమే వీరి లక్ష్యం.
క్యాన్సర్ చికిత్స సమయంలో, చికిత్స ముగిసిన తర్వాత కూడా రోగులకు పూర్తిస్థాయి సంరక్షణ లభించేలా ఒక మార్గాన్ని రూపొందించడం స్వచ్ఛంద సంస్థలు, వైద్యుల ప్రధాన ఉద్దేశం.
“క్యాన్సర్ చికిత్స ముగిసిన నెలలు లేదా సంవత్సరాల తర్వాత కూడా కొన్ని దుష్ప్రభావాలు బయటపడవచ్చు. ఇవి ఒక వ్యక్తి జీవన ప్రమాణాలను, వారి స్వతంత్రతను, శ్రేయస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి” అని రేడియోథెరపీ యూకేకు చెందిన సారా క్విన్లాన్ అన్నారు.
“చికిత్స ముగిసిన తర్వాత తమను వదిలేశారని రోగులు భావించకూడదు. అందుకే అన్ని వనరులున్న, నిపుణులతో కూడిన ‘లేట్ ఎఫెక్ట్స్ సర్వీస్’ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం” అని ఆమె తెలిపారు.
పెల్విక్ రేడియోథెరపీ వల్ల కలిగే తదుపరి ప్రభావాలను పరిష్కరించడానికి ప్రత్యేక క్లినిక్ ఉండాలని ట్రిష్ కూడా డిమాండ్ చేస్తున్నారు.
“నా చికిత్స సమయంలో, మా ఫ్యామిలీ డాక్టర్ నాకు ప్రాణదాతలా నిలిచారు, ఎంతో దయతో సహాయం చేశారు. కానీ, చికిత్స తర్వాత పెల్విక్ రేడియోథెరపీ వల్ల కలిగే సంక్లిష్టమైన దీర్ఘకాలిక దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి మన వ్యవస్థ సిద్ధంగా లేదని నాకు అర్థమైంది. వాటన్నింటినీ నేనే ఒంటరిగా ఎదుర్కోవాల్సి వచ్చింది” అని ట్రిష్ చెప్పారు.
మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోయినప్పుడు వాడే ఇన్‌కాంటినెన్స్ ప్యాడ్లు, నాపీలు, యోని కణజాలాన్ని సాగదీయడానికి రూపొందించిన డైలేటర్లతో గడపడం చాలా బాధాకరంగా అనిపించేదని చెప్పారు.
“దీర్ఘకాలిక మలబద్ధకం, బరువు పెరగడం వల్ల నా పొట్ట ఎంతగా ఉబ్బిపోయిందంటే, అద్దంలో చూసుకున్నప్పుడు నన్ను నేను గుర్తుపట్టలేనంతగా మారిపోయాను” అని ట్రిష్ అన్నారు.

శారీరక, మానసిక గాయాలు
ఆనల్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఉత్తర ఐర్లాండ్‌లో మొదటిసారిగా ఈ వారాంతంలో రోగులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
బెల్‌ఫాస్ట్ క్యాన్సర్ సెంటర్‌లో క్లినికల్ నర్స్ స్పెషలిస్ట్‌గా అలిసన్ ఇర్విన్ పనిచేస్తున్నారు. చికిత్స తర్వాత రోగులకు ప్రాథమికంగా అందుబాటులో ఉండేవారిలో అలిసన్ ఒకరు.
“ఈ వ్యాధి పట్ల సమాజంలో ఉన్న చులకన భావాన్ని పోగొట్టడానికి రోగులకు సరైన పదజాలం, అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. తద్వారా వారు తమ కుటుంబ సభ్యులకు, యజమానులకు తమ అనారోగ్యం గురించి ధైర్యంగా చెప్పగలరు” అని అలిసన్ అన్నారు.
“రోగులు తమ శరీరంలో కలిగే ప్రతి మార్పును మాకు స్పష్టంగా చెప్పగలగాలి. నేను ఇప్పటికే ఇలాంటివి ఎన్నో విని ఉన్నాను కాబట్టి, రోగికి, మాకు మధ్య ఉండే సంబంధం చాలా ముఖ్యం” అన్నారు.
ఆనల్ క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే రేడియోథెరపీ ద్వారా చికిత్స చేయవచ్చని బెల్‌ఫాస్ట్ హెల్త్ ట్రస్ట్‌కు చెందిన కన్సల్టెంట్ క్లినికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ క్యాథరిన్ హన్నా చెప్పారు.
“ఇది చాలా అరుదైన క్యాన్సర్. ఆ ప్రాంతంలో గడ్డలు ఏర్పడటం, దురద లేదా రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటే ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. మీ శరీరంలో ఏదైనా అసాధారణ మార్పును గమనించినట్లయితే, వెంటనే పరీక్ష చేయించుకోవడం ఉత్తమం” అని ఆమె సూచించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



