SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, T. Narayan/Bloomberg via Getty Images
పహల్గాంలో పర్యటకులపై దాడిని ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తీవ్రంగా ఖండించాయి. భారత్‌కు తమ సానుభూతిని తెలిపాయి.
చైనా కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. అయితే, ప్రస్తుత భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఈ వివాదానికి కాస్త దూరంగా ఉండాలని చైనా కోరుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో చైనా, పాకిస్తాన్ మధ్యలో సాన్నిహిత్యం పెరిగింది. చైనాతో భారత్‌కు ఎటూ సరిహద్దు వివాదం ఉంది.
భారత్, పాకిస్తాన్ మధ్యలో ఘర్షణలు నెలకొన్నప్పుడు, గతంలో పాకిస్తాన్‌వైపు నిలిచేది అమెరికా. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది 1971నాటి ఇండో-పాక్ యుద్ధం.
కానీ, గత వారం జరిగిన పహల్గాం దాడి తర్వాత, అమెరికా బహిరంగంగా భారత్‌కు మద్దతు ప్రకటించింది.


ఫొటో సోర్స్, Getty Images
అమెరికా నేతలు ఏమన్నారు?
పహల్గాంలో పర్యటకులపై గత మంగళవారం జరిగిన దాడిలో 26 మంది మరణించారు. చాలామంది గాయపడ్డారు. బాధితుల్లో చాలామంది పర్యటకులే.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్‌లో స్పందించారు. ”కశ్మీర్ నుంచి బాధాకరమైన వార్త తెలిసింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో భారత్‌కు అమెరికా మద్దతు ఇస్తుంది. ప్రధాని మోదీకి, భారత ప్రజలకు మేం పూర్తి మద్దతు ఇస్తాం, ఘటనపై నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అని ట్రంప్ రాశారు.
పహల్గాంలో దాడి జరిగిన సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన కుటుంబంతో కలిసి భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన కూడా బాధితులకు సానుభూతి తెలియజేశారు.
సోషల్ మీడియా ఎక్స్‌లో భారత్‌కు అమెరికా మద్దతు ఇస్తుందని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ పునరుద్ఘాటించారు.
”ఈ హేయమైన దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంలో మేం మీ తరఫున నిలబడతాం” అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏమంటున్నారు?
అమెరికా నేతల ఈ ప్రకటనలను బట్టి భారత్, పాకిస్తాన్ మధ్యలో ఏదైనా ఘర్షణ నెలకొంటే, భారత్‌కు అమెరికా మద్దతు ఇస్తుందని అనుకోవచ్చా?
‘‘భారత్‌వైపుకే అమెరికా ఎక్కువ మొగ్గు చూపుతుంది. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి క్వాడ్‌లో భారత్ సభ్యదేశం. అలాగే, ప్రస్తుతం అమెరికా-చైనా మధ్యలో సుంకాల యుద్ధం నడుస్తోంది. చైనా-పాకిస్తాన్‌లు ఇటీవల చాలా సన్నిహితంగా ఉంటున్నాయి. దీనిపై అమెరికా ఓ కన్నేసి ఉంచుతుంది’’ అని మిడిల్ ఈస్ట్ ఇన్‌సైట్స్ ప్లాట్‌ఫామ్ వ్యవస్థాపకులు డాక్టర్ సుభదా చౌదరి అన్నారు.
క్వాడ్‌లో భారత్‌తో పాటు అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు కూడా ఉన్నాయి.
‘‘క్షేత్రస్థాయిలో ఎలాంటి ఘర్షణల్లోనూ అమెరికా సైన్యం నేరుగా పాల్గొనాలని ట్రంప్ కోరుకోవడం లేదు. ప్రస్తుతం ట్రంప్ దృష్టంతా.. అమెరికా ఆర్థిక పరిస్థితిని, వాణిజ్య లోటును మెరుగుపర్చడంపైనే. పరిస్థితిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు” అని సుభదా చౌదరి చెప్పారు.
”ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, పహల్గాంలో ఏం జరిగింది? ఎలా జరిగిందో మొత్తం సమాచారాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ సేకరిస్తుంది. అయితే, అమెరికా నేరుగా ఈ ఘర్షణల్లో కల్పించుకుంటుందా? అంటే లేదనే చెప్పాలి. మిత్రదేశం సౌదీ అరేబియా ద్వారా ఈ విషయాల్లో పరోక్షంగా జోక్యం చేసుకోవచ్చు” అని అన్నారు.
పహల్గాం దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్తతలు నెలకొనడంతో.. సౌదీ అరేబియాతో పాటు కొన్ని దేశాలు దౌత్య ప్రయత్నాలను ప్రారంభించాయి.
సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ ఇప్పటికే పాకిస్తాన్, భారత్‌లతో మాట్లాడారు. ఇరు దేశాల మధ్య మధ్యవర్తిత్వానికి ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా చొరవ చూపించారు.
‘‘ ట్రంప్ దృష్టిలో ఇప్పుడు భారత్, పాకిస్తాన్ లేదా దక్షిణాసియా ఏది కూడా అంత ప్రాధాన్యం కావు. వ్యాపారవేత్తగా, స్వదేశీ విషయాలే ఆయనకు ముఖ్యం” అని సుభదా చౌదరి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
పహల్గాంలో పర్యటకులపై దాడికి పాల్పడిన వారికి ఊహించిన దానికంటే అతిపెద్ద శిక్షను వేస్తామని ఈ దాడి తర్వాత బిహార్‌లోని మధుబనిలో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీ అన్నారు.
తీవ్రవాదుల మిగిలిన స్థావరాలను ధ్వంసం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. 140 కోట్ల మంది భారతీయుల సంకల్ప శక్తి ఇప్పుడు తీవ్రవాదుల వెన్ను విరిచేస్తుందని అన్నారు.
” ఇరు దేశాల మధ్య సంఘర్షణ ఉంటుంది. అయితే, ఎంత పెద్దదిగా ఉంటుందో చెప్పడం కష్టం. ఇరు దేశాలు తమ ప్రజలను శాంతింపజేసేందుకు ఏదో ఒకటి చేస్తాయని మాత్రం అర్థమవుతుంది” అని సుభదా చౌదరి చెప్పారు.
మరోవైపు అమెరికాకు పాకిస్తాన్‌తో గతంలో బలమైన సంబంధాలు ఉన్నాయని మరికొందరు నిపుణులు అంటున్నారు. దక్షిణాసియాలో పూర్తి స్వాతంత్య్రాన్ని భారత్‌కు అమెరికా ఇవ్వాలనుకోవడం లేదని తెలిపారు.
‘‘అమెరికా ఎవరి వైపు ఉండదు. ఇటీవల భారత్‌తో అమెరికా సంబంధాలు మెరుగయ్యాయి. కానీ, పాకిస్తాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. ఆ రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలు ఉన్నాయి” అని దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల నిపుణులు, దక్షిణాసియా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన ధనంజయ్ త్రిపాఠి అన్నారు.
‘‘తాలిబాన్లకు పాకిస్తాన్ రహస్యంగా మద్దతు ఇచ్చి ఉండొచ్చు. అయితే, పాకిస్తాన్‌పై చిన్న చిన్న చర్యలు తీసుకుంటున్నప్పటికీ, పాకిస్తాన్ ఎప్పుడూ అమెరికాను బహిరంగంగా సవాలు చేయలేదు’’ అని చెప్పారు.
పాకిస్తాన్‌పై కొన్నిచర్యలు ఉంటున్నప్పటికీ, ఆసియాలో భారత్‌కు పూర్తి స్వాతంత్య్రాన్ని మాత్రం అమెరికా ఇవ్వదని త్రిపాఠి అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
అనేక అంశాల్లో చిక్కుకుపోయిన అమెరికా
అమెరికా ఏ దేశం వైపున నిలబడదని, తన గురించే చూసుకుంటుందని న్యూదిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టడీస్, ఫారిస్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ హర్ష్ వి. పంత్ చెప్పారు.
‘‘ ప్రస్తుతం అమెరికా భారత్‌పట్ల సానుకూలంగా ఉంది. కానీ, భారత్, పాకిస్తాన్ మధ్యలో యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లో ఈ విషయం అంతపెద్ద మార్పు తీసుకురాదు. దీనిలో అమెరికా చురుగ్గా పాలుపంచుకోదు’’ అని పంత్ అన్నారు.
మునుపటి యుద్ధాల్లో పాకిస్తాన్‌కు అమెరికా మద్దతు ఇచ్చినప్పటికీ, కాలం చాలా మారిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఘర్షణలు నెలకొంటే, అమెరికా వైఖరి ఏంటో మనం చూడాల్సి ఉంటుందన్నారు.
అమెరికా ప్రస్తుతం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య రష్యా, యుక్రెయిన్ మధ్యలో యుద్ధం. దీనికి ముగింపు పలకాలని ట్రంప్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు.
‘‘ భారత్, పాకిస్తాన్ మధ్యలో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని అమెరికా కోరుకుంటుంది. ఎందుకంటే, అమెరికా ఇప్పటికే చాలా విషయాల్లో ఇరుక్కుపోయి ఉంది. యుక్రెయిన్ యుద్ధం, గాజా సంక్షోభం, యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులపై దాడులు.. ఇలా చాలా విషయాలలో అమెరికా తలమునకలై ఉంది” అని విదేశాంగ వ్యవహారాల నిపుణులు ఖమర్ ఆఘా అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)