Home జాతీయ national telgu భారత్ vs వెస్టిండీస్: ఈడెన్ పిచ్ స్పిన్నర్లదా, బ్యాటర్లదా.. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుందా?

భారత్ vs వెస్టిండీస్: ఈడెన్ పిచ్ స్పిన్నర్లదా, బ్యాటర్లదా.. ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుందా?

5
0

SOURCE :- BBC NEWS

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్, భారత్ వర్సెస్ వెస్టిండీస్

ఫొటో సోర్స్, Nikhil Patil/Getty Images

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది.

సెమీ-ఫైనల్ బెర్తును నిర్ణయించే కీలక పోరులో భారత్, వెస్టిండీస్ జట్లు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం(నేడు) రాత్రి 7 గంటలకు తలపడనున్నాయి.

సూపర్-8లో గ్రూప్-1 నుంచి దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించగా, మిగిలిన ఒక స్థానం కోసం ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి.

పవర్‌ హిట్టింగ్‌తో వణికిస్తున్న వెస్టిండీస్‌, జింబాబ్వేపై గెలుపుతో జోరుమీదున్న భారత్.. ఈ రెండింటి మధ్య జరిగే సమరంలో విజయం ఎవరిని వరిస్తుంది?

ఈ నాకౌట్ పోరుకు వర్షం అడ్డంకి కానుందా, పిచ్ రిపోర్ట్ ఏం చెబుతోంది? తెలుసుకుందాం..

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్, భారత్ వర్సెస్ వెస్టిండీస్

ఫొటో సోర్స్, Pankaj Nangia/Getty Images

పిచ్ ఎలా ఉంది?

ఈడెన్ గార్డెన్స్‌లో ఈ టోర్నీలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే, పిచ్ స్వభావం, స్కోరింగ్ సరళిపై ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తోంది.

ఎన్డీటీవీ కథనం ప్రకారం, ఈ మైదానంలో పరుగుల వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ, ఇన్నింగ్స్ సాగుతున్న కొద్దీ పిచ్ ప్రవర్తించే తీరు మారుతోంది.

ఈ టోర్నీలో ఇక్కడ ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో స్కాట్లాండ్ సాధించిన 207 పరుగులు అత్యధికం కాగా, ఇంగ్లండ్ కూడా 202 పరుగులతో భారీ స్కోరును నమోదు చేసింది. టోర్నీలో భాగంగా ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ తొలి ఇన్నింగ్స్ స్కోరు 150 మార్కును దాటాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 181.6గా నమోదవగా, లక్ష్య ఛేదనలో అది 147.4కు పడిపోయింది.

క్రిక్‌ఇన్ఫో కథనం ప్రకారం, శనివారం పిచ్‌ను పరిశీలించిన వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ, ఉపరితలం “పొడిగా” కనిపిస్తోందని అన్నారు. పిచ్ పొడిగా ఉండటం వల్ల ఆట సాగుతున్న కొద్దీ బంతి నెమ్మదించి స్పిన్నర్లకు పట్టు దొరికే అవకాశం ఉంది. అందుకే, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి.

మరోవైపు, భారత జట్టులో ఎక్కువగా ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటంతో, వెస్టిండీస్ ఆఫ్-స్పిన్నర్ రోస్టన్ చేజ్ కీలకం కానున్నాడు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్, భారత్ వర్సెస్ వెస్టిండీస్

ఫొటో సోర్స్, Getty Images

మంచు ప్రభావం..

కోల్‌కతాలో రాత్రిపూట జరిగే మ్యాచ్‌లలో మంచు ఒక ప్రధాన అంశంగా మారుతుంది.

సాధారణంగా మంచు కురిస్తే బంతి తడిగా మారి బౌలర్లకు పట్టు దొరకదు, దీనివల్ల రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సులభమవుతుంది. అయితే, ఈ టోర్నీలో ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వస్తున్నాయి.

ఎన్డీటీవీ కథనం ప్రకారం, మంచు ప్రభావాన్ని తగ్గించడానికి గ్రౌండ్ స్టాఫ్ కెమికల్ స్ప్రేలు వాడుతున్నప్పటికీ, మైదానంలోని తేమ వల్ల రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ నెమ్మదిస్తోంది.

స్కోరు బోర్డు ఒత్తిడికి తోడు పిచ్ స్లో అవ్వడం ఛేజింగ్ చేసే జట్లను ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన కెప్టెన్, సంప్రదాయానికి భిన్నంగా మొదట బ్యాటింగ్ వైపు మొగ్గు చూపుతారా అనేది ఉత్కంఠగా మారింది.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్, భారత్ వర్సెస్ వెస్టిండీస్

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images

వర్షం పడే అవకాశం ఉందా?

ఈ మ్యాచ్ ఫలితంపై వాతావరణం ప్రభావం చూపే అవకాశం ఉందా అన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

AccuWeather రిపోర్టుల ప్రకారం, మ్యాచ్ జరిగే సమయంలో కోల్‌కతాలో వర్షం కురిసే అవకాశం లేదు (0% అవకాశం). సాయంత్రం వేళ ఆకాశం నిర్మలంగా ఉండనుంది.

ఉష్ణోగ్రతలు 24 నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావొచ్చు. కాబట్టి, ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి స్థాయి మ్యాచ్ జరిగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్, భారత్ వర్సెస్ వెస్టిండీస్

ఫొటో సోర్స్, Prakash Singh/Getty Images

సెమీ-ఫైనల్ సమీకరణాలు

ప్రస్తుతం ఇరు జట్లు చెరో రెండు పాయింట్లతో ఉన్నాయి.

అయితే, నెట్ రన్ రేట్ విషయంలో వెస్టిండీస్(+1.791) , భారత్ (-0.100) కంటే మెరుగైన స్థితిలో ఉంది.

ఒకవేళ ఊహించని విధంగా వాతావరణం మారి మ్యాచ్ రద్దయినా లేదా ఫలితం తేలకపోయినా, మెరుగైన రన్ రేట్ ఆధారంగా వెస్టిండీస్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంటుంది. భారత్‌ సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో విజయం ఒక్కటే మార్గం.

ముఖాముఖి గణాంకాలు:

  • మొత్తం మ్యాచ్‌లు: 30
  • భారత్ విజయం: 19
  • వెస్టిండీస్ విజయం: 10
  • ఫలితం తేలనివి: 1

గణాంకాల పరంగా భారత్‌కు ఆధిపత్యం ఉన్నప్పటికీ, వెస్టిండీస్ జట్టు ప్రస్తుత టోర్నీలో మంచి ఫామ్‌లో ఉంది. 2016లో టైటిల్ గెలిచిన తర్వాత మరోసారి సెమీస్ చేరాలని వెస్టిండీస్ ఆశిస్తుండగా, డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది.

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్, భారత్ వర్సెస్ వెస్టిండీస్, ర్యాన్ టెన్ దస్కతే

ఫొటో సోర్స్, Gareth Copley/Getty Images

మా బౌలర్లు సిద్ధం: ర్యాన్ టెన్ దస్కతే

“వెస్టిండీస్ రిస్క్ తీసుకుంటూ ఆడే జట్టు, వారిని ఎదుర్కోవడానికి మా బౌలింగ్ విభాగం సిద్ధంగా ఉంది” అని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ దస్కతే మీడియాతో అన్నారు.

బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై స్పందిస్తూ ”గ‌త మ్యాచ్‌లో తిల‌క్ వ‌ర్మ‌ను ఐదో స్థానంలో ఆడించాం, వెస్టిండీస్ పైనా అలాగే ఆడిస్తామా, లేదా? అనే విష‌యాన్ని ఇప్పుడే చెప్ప‌లేం. జ‌ట్టులో చాలా ఆప్ష‌న్లు ఉన్నాయి. టాప్ ఆర్డ‌ర్‌లో సంజూ శాంస‌న్ ఆడ‌టం వ‌ర్కౌట్ అయింది. కాంబినేష‌న్‌ను అప్ప‌టిక‌ప్పుడు మార్చుకుని బ‌రిలోకి దిగుతాం. తిల‌క్ వ‌ర్మ ఏ స్థానంలో బ‌రిలోకి దిగినా స‌రే సౌక‌ర్య‌వంతంగా ఆడ‌తాడు. ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకుని చ‌క్క‌గా రాణిస్తాడు” అన్నారు ర్యాన్ టెన్ దస్కతే.

మరోవైపు వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ స్పందిస్తూ, “చరిత్ర పునరావృత్తమవుతుందని అనుకుంటున్నా. వేదిక వేరైనా (2016 ముంబై సెమీఫైనల్‌ను ఉద్దేశించి), ఫలితం అలాగే ఉండొచ్చు. రేపు స్టేడియంలో ఉన్న 67 వేల మందితో పాటు మరో 140 కోట్ల మంది భారత్‌కే మద్దతు తెలుపుతారని నాకు తెలుసు. తుది జట్టు వివరాలను ఇప్పుడే చెప్పలేను. కానీ, భారత్‌ను ఎదుర్కోవడానికి మా సైనికులంతా సిద్ధంగా ఉన్నారు” అన్నారు.

ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు మార్చి 5న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగే సెమీ-ఫైనల్‌లో తలపడుతుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)