Home జాతీయ national telgu బేరూత్‌లో ఇజ్రాయెల్ దాడులు: ‘ఎక్కడికెళ్లినా యుద్ధమే, తప్పించుకునే దారే లేదు’

బేరూత్‌లో ఇజ్రాయెల్ దాడులు: ‘ఎక్కడికెళ్లినా యుద్ధమే, తప్పించుకునే దారే లేదు’

5
0

SOURCE :- BBC NEWS

లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, EPA

లెబనాన్ రాజధాని బేరూత్‌లోని రౌచే ప్రాంతంలో శనివారం(మార్చి 7) అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో భారీ పేలుడు జరిగింది.

ఈ యుద్ధంలో మొదటిసారి బేరూత్‌ సిటీ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేసింది. స్టార్ రమాడా ప్లాజా హోటల్‌పై ఈ దాడి జరిగింది. ఈ సముద్రతీరప్రాంతం రెస్టారెంట్లు, హోటళ్లతో నిండి ఉంటుంది.

హోటల్ లోపల ఇరాన్ అధికారుల రహస్య సమావేశం జరుగుతోందని ఇజ్రాయెల్ మిలటరీ చెబుతోంది. ఈ ఆరోపణను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది.

ఎలాంటి హెచ్చరికలేకుండా ఈ దాడి జరిగింది. స్థానికులు, అక్కడున్నవారు దాడితో చెల్లాచెదురయ్యారు. కిటికీలు, బాల్కనీల దగ్గరకు పరుగెత్తి ఏం జరుగుతోందో గమనించే ప్రయత్నం చేశారు. దగ్గరలోని వీధుల్లో రంజాన్ సందడిలో మునిగితేలుతున్నవారు దాక్కోడానికి పరుగులు తీశారు.

ఇరాన్ మద్దతున్న సాయుధ గ్రూప్ హిజ్బొల్లాకు, ఇజ్రాయెల్‌కు మధ్య వారం కిందట యుద్ధం తిరిగి మొదలైనప్పటి నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ వందల సంఖ్యలో దాడులు చేసింది.

ఆ దాడుల్లో చాలా భవనాలు పూర్తిగా కూలిపోయాయి. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 500మంది చనిపోయారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

లగ్జరీ హోటల్‌పై దాడి

హిజ్బొల్లా, లెబనాన్ షియా ముస్లిం కమ్యూనిటీకీ గట్టిపట్టున్న దక్షిణ లెబనాన్, తూర్పు బెక్కా వ్యాలీ, బేరూత్ దక్షిణ శివార్లపై ఇజ్రాయెల్ దృష్టిసారించింది.

కానీ రౌచేలో జరిగిన ఈ ఇజ్రాయెల్ డ్రోన్ దాడి ఈ ప్రాంతాలకు బాగా దూరంలో ఉంది. హై-రైజ్ హోటల్ నాలుగో అంతస్థును లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది

హోటల్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో నలుగురు చనిపోయారని, 10మంది గాయపడ్డారని, కానీ వారిని గుర్తించలేదని లెబనీస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మొదట చెప్పింది.

ఇరాన్ ఎలైట్ ఖుద్స్ ఫోర్స్‌కు చెందిన ఐదుగురు దాడుల్లో చనిపోయారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తెలిపింది. ఖుద్స్ ఫోర్స్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్‌జీసీ)విదేశీ కార్యకలాపాల విభాగం.

వారిలో హిజ్బొల్లాకు డబ్బులు పంపించే సీనియర్ ఒకరు ఉన్నారని, ఇంటెలిజెన్స్‌లో నిపుణులైన కమాండర్లు ఉన్నారని చెప్పింది.

ఈ ఘటనపై ఇరాన్ వెంటనే స్పందించలేదు. ఐక్యరాజ్యసమితిలోని తమ ప్రతినిధి కార్యాలయం నుంచి ఓ లేఖ విడుదల చేసింది. ”ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు చెందిన నలుగురు ప్రతినిధులను క్రూరమైన ఉగ్రదాడిలో హత్యచేశారు” అని ఇజ్రాయెల్‌ను ఉద్దేశించి ఆరోపించింది.

దాడులమీదగానీ, దాడుల లక్ష్యాలమీదగానీ హిజ్బొల్లా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

హోటల్‌లో చిన్నభాగంపైనే దాడి జరిగినప్పటికీ, పక్కనేనిల్చుని ఉన్నవారిలో కొందరు కూడా గాయపడ్డారు. ఈ దాడితో యుద్ధం తమ పక్కకు కూడా చేరిందని స్థానికంగా భయాందోళన నెలకొంది.

లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, Reuters

‘ఎక్కడ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు’

”ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేం. చాలా భయమేసింది” అని 47ఏళ్ల యాహ్య స్థానిక స్ఠార్‌బక్స్‌లో కాఫీ కోసం వెయిట్ చేస్తూ చెప్పారు.

”మనసు ప్రశాంతత కోసం బయటికి వస్తాం. కానీ మన పక్కన, మన పక్కనున్న భవనంలో ఎవరున్నారో మనకు తెలియదు. బాంబులు వేసే సమయంలో వాళ్లు హెచ్చరికలు చేస్తారు. కానీ హత్యలు టార్గెట్‌గా ఉన్నప్పుడు వాళ్లు హెచ్చరించరు. పక్కనుండేవాళ్ల గురించి ఇజ్రాయెలీలు పట్టించుకోలేదు” అని యాహ్యా అన్నారు.

బేరూత్ దక్షిణప్రాంతాల్లో జరిగే దాడుల శబ్దం సముద్రతీరంలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లోకి ఎప్పుడోగానీ వినిపించదని కానీ ఆదివారం(మార్చి 8)ఉదయం పేలుడు శబ్దంతో తాను మేల్కొన్నానని, రౌచేలోని ఇళ్లు, వ్యాపార సముదాయాల నుంచి ఈ శబ్దం వచ్చిందని, కిటికీలు కంపించాయని, గాజు అద్దాలు ముక్కలుగా పగిలిపోయాయని యాహ్యా అన్నారు.

హోటల్ కింద ఉన్న కార్ పార్కింగ్ దగ్గర 33ఏళ్ల మౌసా ఖొగౌర్ ఒక కాఫీ షాప్‌లో పనిచేస్తున్నారు.

ఇజ్రాయెల్ డ్రోన్ పైన ఎగురుతుంటే వచ్చే శబ్దం గురించి ఆయన పెద్దగా పట్టించుకోలేదు. లెబనాన్‌లో ఆ శబ్దం సాధారణం. కానీ పేలుడు శబ్దం వినగానే ఆయన కిందపడిపోయారు.

”అది భారీ పేలుడు. ఆ ప్రదేశం మొత్తం కంపించింది” అని ఆయన చెప్పారు. నా నలుగురు పిల్లలు అక్కడే నిద్రపోతున్నారు. వాళ్లకేమన్నాఅయిందేమోనని వాళ్ల దగ్గరికి పరుగుతీశాను. వాళ్లు క్షేమంగానే ఉన్నారు. వాళ్లకు ఎలాంటి గాయాలు కాలేదు. భయంతో వాళ్లేడుస్తున్నారు”అని మౌసా ఖొదౌర్ చెప్పారు.

పిల్లలకు ఏం కాలేదుగానీ మౌసా అనే వారి బంధువు గాయపడ్డారు. కారు పార్కింగ్‌లోకి ఎగిరిపడ్డ పేలుడు తునకలు ఆయన్ను గాయపరిచాయి.

సోమవారం(మార్చి 9)సాయంత్రం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే 30ఏళ్ల మౌసా బీబీసీతో మాట్లాడారు. శనగగింజతటి పరిమాణంలో ఉన్న పేలుడు తునక తన కాలుగుండా వెళ్లిందని చెప్పారు.

”పెద్ద శబ్దం రావడం, గ్లాస్ కింద పడడం మాత్రమే నాకు గుర్తుంది. చాలా నొప్పిగా అనిపించింది” అని సిరియాకు చెందిన ఆయన చెప్పారు.

లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, EPA

‘సురక్షిత ప్రాంతమే లేదా?’

సిరియాలో జరుగుతున్న యుద్ధం నుంచి తప్పించుకోవడానికి ఆయన 2013లో తన దేశం నుంచి లెబనాన్ వచ్చేశారు.

”రౌచేలో తప్ప ఎక్కడైనా దాడులు జరుగుతాయని మేమనుకునేవాళ్లం. కానీ ఇక్కడా జరిగింది. సంతోషం…కాలికితగిలింది..ఇంకెక్కడో కాకుండా” అని ఆయన అన్నారు.

అయితే రౌచేలో కొందరికి ఈ దాడి అంత దిగ్భ్రమ కలిగించలేదు.

సాధారణంగా పర్యటకులు, వ్యాపారవేత్తలుండే ఆ ప్రాంతంలోని విలాసవంతమైన హోటళ్లలో ఇప్పుడు ఇళ్లను వదిలివచ్చిన కుటుంబాలు ఉంటున్నాయి. మిలటరీ చర్య తీసుకుంటామని, ఇళ్లనుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించడంతో వాళ్లంతా వచ్చేశారు.

ఇజ్రాయెల్, హిజ్బొల్లా మధ్య మళ్లీ యుద్ధం మొదలవడంతో దాదాపు 7లక్షలమంది చెల్లాచెదురయ్యారని ఐక్యరాజ్యసమితి అంచనావేసింది.

ఇరాన్ సుప్రీంలీడర్‌ మరణం తర్వాత హిజ్బొల్లా ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించడంతో ఇది మొదలయింది.

2024 నవంబరులో కాల్పుల విరమణ జరిగిన తర్వాత కూడా ఇజ్రాయెల్ దాదాపు ప్రతి రోజూ లెబనాన్‌లో హిజ్బొల్లాపై దాడులు చేస్తోంది.

ఇప్పుడు చెల్లాచెదురయినవారిలో ఎక్కువమంది దక్షిణ బేరూత్ శివార్లకు చెందినవారు. గూడు, భద్రత కోసం వారు రాజధాని ఉత్తరప్రాంతం వైపు వచ్చారు.

దాడి తర్వాత తమ గది పొగతో నిండిపోయిందని, అత్యవసరమార్గంనుంచి తాము తప్పించుకున్నామని రమాడా హోటల్‌లో పిల్లలతో కలిసి ఉన్న ఓ మహిళ చెప్పారు.

హోటల్ దగ్గర రోడ్డుపై పగిలిపోయిన గాజుముక్కల దగ్గర నిలబడ్డ 47ఏళ్ల వ్యక్తి దక్షిణ లెబనాన్‌లోని టైర్‌కు చెందినవారు. పగిలిపోయిన కారు అద్దంపై ప్లాస్టిక్ సంచులు అతికిస్తున్నారు.

”మేం చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. మాకలవాటైపోయింది. మేమేం భయపడడం లేదు” అని ఆయన అన్నారు. ఆయన పక్కనే నిల్చున్న కొడుకు తండ్రి చెప్పిన మాటలకు తలాడించాడు. ”అక్కడ ఇరానియన్లు ఉన్నారని చెబుతున్నారు. కానీ మాకు తెలియదు” అన్నాడు.

లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, EPA

‘కచ్చితమైన సమాచారంతో దాడులు చేశాం’

హోటల్ నాలుగో అంతస్తులో దాడి తర్వాత మూలన ఉన్న గదిలో కాలిపోయి, నల్లబారిన గోడలను పోలీసులు, మిలటరీ అధికారులు పరిశీలిస్తున్నారు.

తామేం మాట్లాడబోమని హోటల్ మేనేజ్‌మెంట్ చెబుతోంది.

పోలీసుల దర్యాప్తు కోసం హోటల్ మూడు, నాలుగు అంతస్తులు మూసివేశారని హోటల్ ఉద్యోగి ఒకరు బీబీసీతో చెప్పారు. అక్కడ ఉన్న శరణార్థులను మరో చోటకి మార్చారని తెలిపారు. హోటల్ చాలా పెద్దదని, ఎప్పుడూ రద్దీగా ఉంటుందని, దాడి జరిగిన గదిలో ఎవరున్నారో తమకు తెలియదని, వార్తల్లో మాత్రమే వివరాలు విన్నామని చెప్పారు.

హోటల్ మూడో, నాలుగో అంతస్తుల్లో లెబనాన్‌కు చెందిన ముగ్గురు రూమ్స్ బుక్ చేసుకున్నారని అధికారికవర్గాలు బీబీసీతో చెప్పాయి. ఆ రూమ్‌ల్లో ఉన్నవారినే దాడుల్లో లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు.

హోటల్‌పై మూడుసార్లు దాడి జరిగిందని, వాటిలో రెండు దాడుల్లో ఎలాంటి పేలుడు జరగలేదని ఆ వర్గాలు చెప్పాయి.

”ఐడీఎఫ్ ఇంటెలిజెన్స్ కచ్చితంగా ఇచ్చిన సమాచారంతో నేవీ ఈ దాడులు జరిపిందని ఐడీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది. లెబనాన్, పాలస్తీనా కోర్‌కు చెందిన సీనియర్ ఖుద్ ఫోర్స్ అధికారులు సాధారణ ప్రజలుండే హోటల్‌లో దాక్కున్నారని ఆరోపించింది.

ఈ దాడిలో చనిపోయిన ముగ్గురు కీలక కమాండర్లు మాజిద్ హస్సాని, సీనియర్ ఇంటెలిజెన్స్‌కు చెందిన అలిరెజా బి-అజర్, అహ్మద్ రసౌలీ అని, ఇరాన్ ప్రభుత్వ అనుచరులకు డబ్బులు అందించే బాధ్యతను మాజిద్ హస్సానీ చూసుకునేవారని తెలిపింది.

ఖుద్స్ ఫోర్స్‌కు చెందిన హుస్సేన్ అహ్మద్‌, అబు మొహమ్మద్ అలీ కూడా చనిపోయారని చెప్పింది.

లెబనాన్‌లో ఇరాన్ ప్రభావానికి, హిజ్బొల్లా సంస్థకు ఈ మరణాలు గట్టి, అవసరమైన దెబ్బగా ఐడీఎఫ్ వ్యాఖ్యానించింది.

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌కు పంపిన లేఖలో హస్సాని బి-అజార్, రసౌలీ, అహ్మద్‌లౌ చనిపోయారని ఇరాన్ ప్రతినిధి అమిర్-సయీద్ ఇర్వానీ ధ్రువీకరించారు.

బేరూత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయంలో పనిచేసే సెకండ్ సెక్రటరీ, థర్డ్ సెక్రటరీ, ఓ మిషన్ కోసం నియమించిన ఎట్టాచె ఉన్నారని చెప్పారు. వాళ్లను చంపడం తీవ్రమైన నేరమన్నారు.

ఒక సార్వభౌమదేశ అధికారప్రతినిధులైన నలుగురిని మరో దేశభూభాగంలో లక్ష్యంగా చేసుకుని చంపడం అంతర్జాతీయ చట్టాల తీవ్ర ఉల్లంఘన అని ఇర్వానీ పోస్టు చేశారు.

లెబనాన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా

ఫొటో సోర్స్, EPA

‘యుద్ధం ఇంకా ఇంకా విస్తరిస్తోంది’

హోటల్‌ను లక్ష్యంగా చేసుకుని రౌచేలో గతవారం రెండోసారి జరిగిన దాడి ఇది. లెబనాన్‌లోని ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు తక్షణమే వెళ్లిపోవాలని, లేకపోతే లక్ష్యంగా చేస్తామని అంతకుముందు ఇజ్రాయెల్ మిలటరీ హెచ్చరించింది.

దేశంలో మిలటరీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌ను అరెస్టు చేసి దేశం నుంచి పంపించేయాలని లెబనాన్ ప్రధాని నవాఫ్ సలామ్ కూడా గత వారం అధికారులను ఆదేశించారు.

ఇజ్రాయెల్ మిలటరీ హెచ్చరిక తర్వాత ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు 150మందికిపైగా ఇరాన్ ప్రజలు లెబనాన్ విడిచి వెళ్లారని సీనియర్ లెబనీస్ సెక్యూరిటీ వర్గాలు రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీతో చెప్పాయి.

తమ అధికారిక నివాసాల నుంచి హస్సాని, బి-అజర్, రసౌలీ, అహ్మద్‌ రమాడా ప్లాజాకు మారారని, లెబనాన్ విదేశాంగమంత్రిత్వ శాఖకు కూడా ఈ సమాచారం అందించారని ఇర్వానీ సయీద్ హస్సానీ చెప్పారు.

ఇరాన్ ఉగ్రవాద ప్రభుత్వానికి చెందినవారు లెబనాన్‌లో స్థిరపడడానికి తాము అనుమతించబోమని, వారు ఎక్కడినుంచి కార్యకలాపాలు నిర్వహించినా ఇరాన్ ఉగ్రవాద ప్రభుత్వ కమాండర్లను హతమారుస్తామని రౌచే దాడుల తర్వాత విడుదల చేసిన ప్రకటనలో ఐడీఎఫ్ తెలిపింది.

రౌచే వీధుల్లో పరిస్థితులు విభిన్నంగా ఉన్నాయి. హోటల్ బయట వీధుల్లో బిజీగా వెళ్తూ పైకి చూస్తూ హోటల్‌కు జరిగిన నష్టాన్ని స్థానికులు గమనిస్తున్నారు.

తాను సురక్షితమైన ప్రాంతంగా భావించి రౌచేకు వచ్చానని, అంతకుముందు దక్షిణ లెబనాన్‌లో నాలుగు దాడులను అత్యంత దగ్గరగా చూశానని శరణార్థి మొహమ్మద్ అబ్బాస్ చెప్పారు.

”లెబనాన్‌లో ఎక్కడా సురక్షిత ప్రాంతం లేదు.ఇప్పుడు జరిగింది దానికి ఉదాహరణ. ఇజ్రాయెల్‌కు ఎక్కడా పరిమితులు లేవు. వాళ్లు ఎక్కడ కావాలంటే అక్కడ దాడి చేస్తారు. ఎవరిని కావాలంటే వారిని చంపుతారు” అని ఆయన చెప్పారు.

శరణార్థులుగా ఇక్కడికి వచ్చినవారికి యుద్ధంనుంచి తప్పించుకోలేమన్న సంకేతాలను ఈ దాడి పంపింది.

దక్షిణ ప్రాంతంలో ఉన్న నా ఇల్లు మునుపటియుద్ధంలో ధ్వంసమయింది. దక్షిణ బేరూత్‌లోని దహియేలో ఉన్న నా ఇల్లు ఈ యుద్ధంలో ధ్వంసమయింది” అని రమాడా ప్లాజా శిథిలాల కింద నిల్చుని 23 ఏళ్ల వ్యక్తి చెప్పారు.

”యుద్ధం ఇంకా ఇంకా మరింతగా విస్తరిస్తోంది” అని ఆవేదన వ్యక్తంచేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)