Home జాతీయ national telgu బీబీసీ అధ్యయనం: ప్రతి నలుగురు భారతీయ యువతుల్లో ఒకరు క్రీడలను కెరీర్ ఆప్షన్‌గా చూస్తున్నారు

బీబీసీ అధ్యయనం: ప్రతి నలుగురు భారతీయ యువతుల్లో ఒకరు క్రీడలను కెరీర్ ఆప్షన్‌గా చూస్తున్నారు

11
0

SOURCE :- BBC NEWS

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

13 మార్చి 2026, 12:30 IST

చదివే సమయం: 5 నిమిషాలు

భారత్‌లోని 14 రాష్ట్రాలలో నిర్వహించిన ఓ కొత్త అధ్యయనంలో 2020 నుంచి క్రికెట్‌ ఆడే భారతీయ మహిళల సంఖ్య రెట్టింపైంది. దేశంలో క్రీడలు ఆడుతున్న 10 మంది మహిళల్లో ఒకరు క్రికెట్ ఆడుతున్నారు.

బీబీసీ,కలెక్టివ్ న్యూస్ రూమ్ చేయించిన ఈ అధ్యయనంలో ప్రతి ఇద్దరిలో ఒకరు (51శాతం) గత ఆరునెలల్లో మహిళలకు సంబంధించిన క్రీడా వార్తలను, ప్రసారాలను చూశారు. ఇది పురుషుల క్రీడా వార్తా ప్రసారాలు చూసేవారితో (63శాతం) పోల్చితే మరీ తక్కువేం కాదు.

మహిళల క్రీడల్లో భాగస్వామ్యం, వాటిని వీక్షించే వారిలో యువతుల(15-24 ఏళ్లు)ది కీలక భూమిక.

ప్రతి నలుగురు యువతుల్లో ఒకరు (26శాతం) క్రీడలను కెరీర్ ఆప్షన్‌గా చూస్తున్నట్టు చెప్పారు. 2020లో ఇది 16 శాతంగా ఉంది.

మహిళలు, క్రీడలు, క్రికెట్, బ్యాడ్మింటన్
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
మహిళలు, క్రీడలు, క్రికెట్, బ్యాడ్మింటన్

క్రికెట్‌లో పెరిగిన మహిళల భాగస్వామ్యం

బీబీసీ, కలెక్టివ్ న్యూస్ రూమ్‌ కోసం భారత్‌లోని 14 రాష్ట్రాల్లో 10,304మందిని గ్లోబల్ రీసెర్చ్, ఇన్‌సైట్స్ కంపెనీ కాంటర్ ఇంటర్వ్యూలు చేసింది. బీబీసీ ఇండియా స్పోర్ట్స్‌ఉమన్ ఆఫ్ ది ఇయర్‌లో భాగంగా ఇది నిర్వహించారు.

ఈ ఫలితాలను క్రీడల్లో మహిళల భాగస్వామ్యం, క్రీడాకారిణులపై విస్తృతమైన సామాజిక దృక్పథాన్ని అంచనావేసేందుకు 2020లో నిర్వహించిన ఇలాంటి అధ్యయనంతో సరిపోల్చారు.

భారతీయ క్రీడాకారిణులు గణనీయ విజయాలు సాధించిన సమయంలో ఈ అధ్యయనం వచ్చింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో షూటర్ మను బాకర్ చారిత్రక డబుల్ మెడల్‌ను గెలుచుకుంది. పారాలింపిక్స్‌లో పారా స్పోర్ట్స్ ఉమెన్ 10 బహుమతులు గెలుచుకున్నారు. 2025లో సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌ను మహిళల క్రికెట్ జట్టు గెలుచుకుంది. ఇవన్నీ గడిచిన కొన్ని సంవత్సరాలుగా పతాక శీర్షికలుగా నిలిచాయి.

ఈ విజయాల కథలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహిళల క్రీడలను ప్రత్యక్ష ప్రసారంలో చూస్తామని అధ్యయనంలో పాల్గొన్నవారిలో 43శాతం చెప్పారు. పురుషుల క్రీడల విషయంలో ఇది 54శాతంగా ఉంది. ఆటలను ప్రత్యక్షంగా మైదానంలో చూసేవారి విషయంలో ఈ తేడా ఇంకా తక్కువగా ఉంది. మహిళల క్రీడలను స్డేడియంలో చూశామని 29శాతం చెప్పగా పురుషుల క్రీడలను స్టేడియంలో చూశామని 37శాతం మంది చెప్పారు.

ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకుని ఎక్కువమంది మహిళలు క్రికెట్, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు.

భాగస్వామ్యం రీత్యా చూసినప్పడు మహిళలు, పురుషులు ఇద్దరూ క్రికెట్‌ను ఎక్కువగా ఎంచుకుంటున్నారని అధ్యయనంలో తేలింది. కిందటి అధ్యయనంతో పోలిస్తే ప్రస్తుతం మహిళలు పెద్ద ఎత్తున క్రికెట్ ఆడుతుండటంతో ఈ ఆటలో స్త్రీ,పురుష అంతరం తగ్గిపోయింది. 2020లో క్రికెట్ ఆడే మహిళలతో పోలిస్తే పురుషుల సంఖ్య ఐదురెట్లు ఎక్కువగా ఉంది. 2026 నాటికి ఈ తేడా మూడు రెట్ల వరకు తగ్గింది.

మహిళలు, క్రీడలు, క్రికెట్, బ్యాడ్మింటన్

బ్యాడ్మింటన్‌కు మహిళల్లో పెరుగుతున్న ఆదరణ

క్రికెట్‌తో పాటు మహిళల్లో బ్యాడ్మింటన్‌కు ప్రాచుర్యం పెరిగింది. 2020లో 4 శాతం మహిళలు బ్యాడ్మింటన్ ఆడితే ఇప్పుడు వారి సంఖ్య 6 శాతానికి పెరిగింది.

దక్షిణ భారతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తర భారతంలో పంజాబ్‌లో బ్యాడ్మింటన్ ఆడే మహిళల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా ప్రసిద్ధ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులైన పీవీ సింధు, సైనా నెహ్వాల్, తన్వీ శర్మ ఈ ప్రాంతాలకు చెందినవారే.

ప్రజలు మహిళా క్రీడాకారిణులను కూడా తమలాంటివారిగానే భావించడంతో, క్రీడల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం, వారి ఆటలను చూసే వారి సంఖ్య పెరగడంలో కీలకపాత్ర పోషిస్తోంది.

క్రీడా కార్యక్రమాలనుు చూడటానికి ఓ కారణం ”ఓ క్రీడాకారిణికి మద్దతివ్వడానికి” అని సర్వేలో పాల్గొన్న మూడోవంతుమంది (33శాతం) చెప్పారు. 2020లో ఈ కారణం 21శాతంగా మాత్రమే ఉంది. ఓ ఆటగాడికి మద్దతుగా క్రీడాకార్యక్రమాలు చూస్తామని చెప్పే వారి సంఖ్య 17 శాతం మాత్రమే ఉంది.

ప్రత్యేకించి ఈ ఏడాది ‘ఏ భారతీయ క్రీడాకారిణిని ఎక్కువమంది ప్రజలు ఇష్టపడుతున్నారు’ అనే ప్రశ్నకు ప్రతి ఇద్దరి మహిళల్లో ఒకరు(51శాతం) సమాధానం చెప్పగలిగారు. 2020లో ఇదే ప్రశ్నకు సమాధానం ఇచ్చిన వారి సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు 7 శాతం ఎక్కువ.

మహిళలు, క్రీడలు, క్రికెట్, బ్యాడ్మింటన్

భద్రత విషయంలో మహిళల ఆందోళన

తాము ఏ ఆటనూ ఆడకపోవడానికి భద్రతాపరమైన ఆందోళనలే కారణమని సర్వేలో పాల్గొన్న 13 శాతం మంది మహిళలు చెప్పారు. సర్వే చేసిన రాష్ట్రాలతో కలిపి చూసినప్పుడు 3 కోట్ల27లక్షల మంది మహిళలు ఈ కారణంతో క్రీడల్లో పాల్గొనడంలేదని ఈ అధ్యయనం గుర్తించింది. గడచిన దశాబ్దంలో మహిళలపై లింగ ఆధారిత హింస పెరిగిందని వెల్లడైన రాష్ట్రాల్లో ఇది మరింత పెద్ద సమస్యగా ఉందని అధ్యయనం సూచించింది.

క్రీడల్లో మహిళల భాగస్వామ్యం, క్రీడలు చూసే మహిళల సంఖ్య పెరగడంతో పాటు మహిళల క్రీడలపై పత్రికూల భావాలు, మూసధోరణులు 2020లో నిర్వహించిన అధ్యయనంతో పోలిస్తే మరింత బలపడ్డాయని ఈ అధ్యయనంలో తేలింది.

పురుషుల క్రీడలతో పోలిస్తే మహిళల క్రీడలు అంత వినోదం కలిగించవని సర్వేలో పాల్గొన్న ప్రతి పదిమందిలో నలుగురు (43శాతం) చెప్పారు. 2020లో ఈ అభిప్రాయం 38శాతంగా ఉంది. మహిళాక్రీడాకారిణులు తగినంత ఆడతనంగా అనిపించరని చెప్పినవారి సంఖ్య 37 శాతం నుంచి 43శాతానికి పెరిగింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ అభిప్రాయాలు కేవలం మగవారికే పరిమితం కాలేదు. క్రీడాకారిణులు అందంగా కనిపించాలని దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు(46శాతం) భావించారని, మగవారికన్నా మహిళలు ఎక్కువమంది ఈ అభిప్రాయాన్ని సమర్థించినట్టు అధ్యయనం గుర్తించింది.

‘సమయం లేక ఆటలు వదిలేస్తున్నారు’

అటు పురుషులకు, ఇటు మహిళలకు ఆటలను వదిలేయడానికి అతిపెద్ద కారణం సమయం చిక్కకపోవడమే. క్రికెట్ ఆడేవారి సంఖ్య పెరిగినప్పటికీ మొత్తంగా ఆటలు ఆడే భారతీయుల సంఖ్య కొద్దిగా మాత్రమే పెరిగిందని అధ్యయనం గుర్తించింది. అన్ని క్రీడలను కలిపి చూసినప్పుడు భారతీయులు క్రీడల్లో పాల్గొనడం పెద్దగా పెరగలేదని అధ్యయనం తెలిపింది.

సమయం లేకపోవడం చాలామంది క్రమంగా ఆటల అలవాటును వదిలేస్తున్నారని అధ్యయన కర్తలు ఆందోళన వ్యక్తంచేశారు.

సర్వేలో పాల్గొన్నవారిలో తమ చిన్నప్పుడు ఆటలు ఆడామని 74శాతం చెప్పారు. 2020లో ఈ సంఖ్య 69శాతం మాత్రమే ఉంది. అయితే పిల్లలుగా ఉన్నప్పుడు ఆటలు ఆడామని చెప్పినవారిలో సగంమంది మాత్రమే పెద్దయ్యాక కూడా ఆటలు కొనసాగించామని చెప్పారు.

ఆటలు ఆడకపోవడానికి కారణమేమిటని అడిగితే సర్వేలో పాల్గొన్నవారిలో (65శాతం) సమయం లేకపోవడం వల్లే ఆటలు ఆడడం లేదని చెప్పారు. పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత తక్కువగా ఉండడమనే ఆందోళనకర ధోరణిని ప్రతిబింబిస్తోందని అధ్యయనం గుర్తించింది.

పని-వ్యక్తిగత జీవిత సమతుల్యత మెరుగుపడితే ఎక్కువగా ప్రయోజనం కలుగుతుందని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా మహిళలకు ఎందుకంటే ‘‘ మహిళలు ఉద్యోగాలతోపాటు ఇంటి పనులు, కుటుంబ సంరక్షణా బాధ్యతలను ఎక్కువగా భుజాన మోస్తుంటారు’’ అని పేర్కొంది.

సర్వే ఇలా చేశారు

ఈ సర్వేను కాంటర్ ఇండియా నిర్వహించింది. ఈ సంస్థే 2020 నాటి అధ్యయనాన్ని కూడా నిర్వహించింది. ఈ ప్రాజెక్టు కోసం 15ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న 10,304 మందిని దేశంలోని 14 రాష్ట్రాల్లో ప్రైవేటు స్థలాల్లో ముఖాముఖి ఇంటర్వ్యూ చేశారు. కంప్యూటర్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూ విధానంలో టాబ్లెట్లను ఉపయోగించి ఈ ఇంటర్వ్యూ చేశారు. వయసు, లింగం, సామాజిక-ఆర్థిక స్థితి (ఎన్‌సీసీఎస్)గ్రామీణ, పట్టణ నేపథ్యం వంటి అంశాల్లో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఉండేలా చూశారు.

రెండు సర్వేల ఫలితాలను పోల్చేందుకు ప్రశ్నావళి నమూనా ఎంపికను ఏకరీతిలో ఉండేలా చూశారు. కొద్దిపాటి అదనపు ప్రశ్నలు మాత్రమే చేర్చారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)