Home జాతీయ national telgu పాకిస్తాన్: భారత జాతీయ గీతం పాడిన నలుగురు విద్యార్థులకు యూనివర్సిటీ నుంచి బహిష్కరణ, అసలేంటి వివాదం

పాకిస్తాన్: భారత జాతీయ గీతం పాడిన నలుగురు విద్యార్థులకు యూనివర్సిటీ నుంచి బహిష్కరణ, అసలేంటి వివాదం

19
0

SOURCE :- BBC NEWS

బాచా ఖాన్ యూనివర్సిటీ

ఫొటో సోర్స్, Getty Images

”నన్ను యూనివర్సిటీ నుంచి తీసేసిన విషయం మా నాన్నకు ఇప్పటికీ తెలియదు. అమ్మకు మాత్రమే తెలుసు. ఈసారి రంజాన్ ఇంట్లోనే జరుపుకుంటానని ఇంటికి వెళ్లి అమ్మతో చెప్పా”

ఇదీ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో లోయర్ దీర్ జిల్లాకు చెందిన మురాద్ ఖాన్ ఆవేదన.

ఒక వీడియో వైరల్ కావడంతో ఫిబ్రవరి 13వ తేదీన బాచా ఖాన్ యూనివర్సిటీ నుంచి బహిష్కరించిన నలుగురు విద్యార్థుల్లో ఆయన ఒకరు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే, ఒక విద్యార్థి భారత జాతీయ గీతం ‘జనగణమన’ పాడుతుంటే, మరో ముగ్గురు విద్యార్థులు కూడా ఆయనతో కలిసి పాడుతున్నారు.

ఈ విషయమై బాచా ఖాన్ యూనివర్సిటీ యాజమాన్యం వివరణ కోసం బీబీసీ పలుమార్లు ప్రయత్నించింది. అయితే, ఈ వార్త ప్రచురితమయ్యే సమయానికి వారి నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఆ వీడియోలో ఏముంది?

బాచా ఖాన్ యూనివర్సిటీలో ‘యూత్ ఫెస్టివల్’ తొలి రోజు ముగింపు సందర్భంగా ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ వీడియో చిత్రీకరించారు.

ఫార్మసీ విద్యార్థి జిబ్రాన్ రియాజ్ భారత జాతీయ గీతాన్ని ఆలపిస్తుంటే, ఆ సమయంలో ఆయన పక్కనే నిలబడిన మరికొందరు విద్యార్థులు కూడా కలిసి పాడుతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ నేపథ్యంలో బాచా ఖాన్ యూనివర్సిటీ క్రమశిక్షణా కమిటీ ఫిబ్రవరి 13వ తేదీన సమావేశమైంది. సమావేశం అనంతరం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, నలుగురు విద్యార్థులను యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

‘జిబ్రాన్ రియాజ్, సయ్యద్ కాతిబ్ షా, బషీర్ ఖాన్, మురాద్ ఖాన్ అనే విద్యార్థులు అశాంతి కలగజేయాలని, జాతీయ సమగ్రతకు భంగం కలిగించాలనే ఉద్దేశంతో భారత జాతీయ గీతాన్ని ఆలపించారు. దాన్ని రికార్డు చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా షేర్ చేశారు’ అని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఆ నలుగురు విద్యార్థులు వెంటనే హాస్టల్ గదులను ఖాళీ చేయాలని కూడా ఆ నోటిఫికేషన్‌లో ఆదేశించారు.

క్షమాపణలు కోరుతూ మరో వీడియో చేసిన జిబ్రాన్ రియాజ్

ఫొటో సోర్స్, Jibran Riaz/Social Media

‘వివరణ ఇచ్చేందుకూ అవకాశం ఇవ్వలేదు’

భారత జాతీయ గీతం పాడుతున్న వీడియో వైరల్ కావడంతో, జిబ్రాన్ రియాజ్ అనే విద్యార్థి మరో వీడియోను రూపొందించారు. తాను చేసిన పనికి క్షమాపణలు కోరుతూ ఆ వీడియోలో కనిపించారు.

”యూత్ ఫెస్టివల్ సందర్భంగా విద్యార్థులమంతా ఒకచోట చేరాం. మనం సరదాగా భారతీయ పాటలు ఎలా పాడతామో లేదా వింటామో, అలాగనే భారత జాతీయ గీతం పాడాను. ఆ తర్వాత నా స్నేహితుడొకరు వచ్చి, ‘నీ వీడియో వైరల్ అయ్యింది’ అని చెప్పారు.”

”అదొక సరదాగా చేసిందే. పాకిస్తాన్ మా సొంత దేశం. మేము మా దేశానికి వ్యతిరేకంగా ఆలోచించలేం కూడా. ఇక భారత్ మా శత్రువు” అని జిబ్రాన్ రియాజ్ ఆ వీడియోలో చెప్పారు.

ఈ సంఘటన తర్వాత క్రమశిక్షణా కమిటీ తమను పిలిచి, ‘మీరు ఈ వీడియోలో కనిపిస్తున్నారు’ అని మాత్రమే అన్నారని విద్యార్థి మురాద్ ఖాన్ వెల్లడించారు.

”మాకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మా కెరీర్ నాశనం చేశారు. మేము ఇప్పటికే తదుపరి సెమిస్టర్ ఫీజు, హాస్టల్ ఫీజు అడ్వాన్స్‌గా చెల్లించాం” అని మురాద్ ఖాన్ తెలిపారు.

”ఇలాంటి చర్యకు ఇంత పెద్ద శిక్ష ఉంటుందని ఊహించలేదు. జాతీయ గీతం ముగిసిన తర్వాత నేను కేవలం ‘జైహింద్’ అని నినాదం చేసినప్పుడే స్పందించాను, అంతే” అని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)