Home జాతీయ national telgu పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్: 34 లక్షల అప్పీళ్లు దాఖలు, ఓటరు జాబితాలోకి కేవలం 1,607 పేర్లు.....

పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్: 34 లక్షల అప్పీళ్లు దాఖలు, ఓటరు జాబితాలోకి కేవలం 1,607 పేర్లు.. ఎన్నో ప్రశ్నలు

4
0

SOURCE :- BBC NEWS

పశ్చిమ బెంగాల్, ఎన్నికలు, ఎస్ఐఆర్

ఫొటో సోర్స్, Diptendu Dutta/NurPhoto via Getty Images

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ఒక రోజు ముందు, మంగళవారం నాడు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాకు సంబంధించిన అదనపు జాబితాను విడుదల చేసింది. ఇందులో 1,468 మంది ఓటర్ల పేర్లను తిరిగి చేర్చగా, అసలు జాబితా నుంచి ఆరుగురిని తొలగించింది.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కింద ఓటర్ల జాబితాలో చేసిన మార్పులపై దాఖలైన అప్పీళ్లను విచారించిన సుప్రీంకోర్టు నియమిత ట్రిబ్యునళ్ల తీర్పుల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు.

మంగళవారం రెండో అదనపు జాబితా విడుదలైంది. మొదటి విడత పోలింగ్‌కు ఒక రోజు ముందు, అంటే ఏప్రిల్ 22న మొదటి జాబితా వచ్చింది. అందులో కేవలం 139 మంది ఓటర్లను చేర్చగా, ఎనిమిది మందిని తొలగించారు.

మొత్తంగా, ఈ రెండు జాబితాల ద్వారా 1,607 మంది ఓటర్లను చేర్చగా, 14 మందిని తొలగించారు.

ట్రిబ్యునళ్లలో 34 లక్షలకు పైగా అప్పీళ్లు దాఖలైనట్లు ఈ నెల ప్రారంభంలో సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ గణాంకాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

ఎస్ఐఆర్ ప్రక్రియపై సందేహాలు

ఎస్ఐఆర్ తర్వాత పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మందిని తొలగించారు.

వీరిలో 63 లక్షల మందిని ‘గైర్హాజరు, వలస వెళ్లినవారు, మరణించిన వారు లేదా డూప్లికేట్’ ఓటర్లుగా గుర్తించారు. మిగిలిన 27 లక్షల మంది పేర్లలో అక్షర దోషాలు, లింగ నమోదులో పొరపాట్లు, తల్లిదండ్రులు లేదా తాతముత్తాతల వయస్సుతో పోలిస్తే అసాధారణ వ్యత్యాసాలు వంటి ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది.

పశ్చిమ బెంగాల్, ఎస్ఐఆర్

ఎస్ఐఆర్ కింద ఓటర్ల అర్హతపై ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలపై అభ్యంతరాలు వినడానికి సుప్రీంకోర్టు 19 ట్రిబ్యునళ్లను నియమించింది. గత నెలలో ఈ ట్రిబ్యునళ్లు ఏర్పాటైనప్పటి నుంచి 34 లక్షలకు పైగా అప్పీళ్లు వచ్చాయి. అయితే, వీటిలో ఎన్ని అప్పీళ్లను విచారించారనే అంశంపై స్పష్టత లేదు.

పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మనోజ్ కుమార్ అగర్వాల్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, పరిష్కరించిన కేసుల సంఖ్య తన వద్ద లేదని, అదొక ‘పేపర్ వర్క్’ అన్నారు.

కానీ, కొత్తగా చేర్చిన 1,607 మంది, తొలగించిన 14 మందిని కలిపినా మొత్తం 34 లక్షల అప్పీళ్లలో ఇది 0.05 శాతం కంటే తక్కువ. పైగా, ట్రిబ్యునళ్ల తీర్పుల వల్ల ఎక్కువ మందికి ఓటు హక్కు తిరిగి లభించింది.

తొలగింపు – చేరికల నిష్పత్తి సుమారు 1:115గా ఉంది. అంటే ప్రతి ఒక్క పేరు తొలగింపునకు బదులుగా 115 కొత్త పేర్లు జాబితాలో చేరాయి.

పశ్చిమ బెంగాల్, ఎస్ఐఆర్
పశ్చిమ బెంగాల్, ఎన్నికలు, ఎస్ఐఆర్

ఫొటో సోర్స్, Samir Jana/Hindustan Times via Getty Images

‘చాలామందికి అప్పీల్ చేయడం తెలియదు’

ఈ గణాంకాలు వెలువడిన తర్వాత, ట్రిబ్యునల్ విచారణ అనంతరం ఓటర్ల జాబితాలో తిరిగి చోటు సంపాదించుకున్న వారు కూడా అయోమయంలో ఉన్నారు.

ముర్షిదాబాద్ జిల్లా ధులియాన్ మున్సిపల్ చైర్మన్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంజాముల్ ఇస్లాం పేరు మొదటి అదనపు జాబితాలో చేర్చిన 139 మందిలో ఉంది. తన పేరు చేరినప్పటికీ, తనతో పాటు ఓటు హక్కు కోల్పోయిన ఇద్దరు సోదరుల పరిస్థితి ఏంటో ఇప్పటికీ స్పష్టత లేదని గతవారం ఆయన ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’తో అన్నారు.

ఇంజాముల్ ముర్షిదాబాద్‌లోని సంషేర్‌గంజ్ నియోజకవర్గ ఓటర్. ఆ ప్రాంతంలో అత్యధికంగా 74,775 పేర్లు తొలగింపునకు గురయ్యాయి.

తాను మొదటి దశలో ఓటు వేసినట్లు ఇంజమామ్ మంగళవారం బీబీసీ బంగ్లాతో చెప్పారు. అయితే మరిన్ని వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తూ, “మే 4వ తేదీ (ఫలితాల రోజు) తర్వాత మాట్లాడతాను” అన్నారాయన.

ఓటు హక్కు కోల్పోయిన వారి నుంచి తనకు రోజుకు 150 నుంచి 200 ఫోన్ కాల్స్ వస్తున్నాయని ‘సబర్ ఇన్‌స్టిట్యూట్’ ప్రధాన పరిశోధకులు సబీర్ అహ్మద్ బీబీసీ బంగ్లాకు తెలిపారు. పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ గణాంకాలను ఆయన విశ్లేషిస్తున్నారు.

ఓటర్లు అప్పీల్ దాఖలు చేయడానికి ఈ సంస్థ ఒక ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది.

“ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేసే విధానంపై చాలామందికి సరైన అవగాహన లేదు” అని అహ్మద్ అభిప్రాయపడ్డారు.

అప్పీల్ చేసేవారు తమ ఫిర్యాదు వివరాలను, అర్హత పత్రాల సమాచారాన్ని 1,000 పదాల లోపు రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలామందికి కష్టతరమైన పని అని అభిప్రాయపడ్డారాయన.

పశ్చిమ బెంగాల్, ఎన్నికలు, ఎస్ఐఆర్

ఫొటో సోర్స్, ANI

ఒకే కుటుంబంలో కొందరి పేర్లు తొలగించి, మరికొందరిని ఓటర్లుగా ఉంచిన సందర్భాలను తాను గమనించినట్లు రాజకీయ కాలమిస్ట్, అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో డెవలప్‌మెంట్ స్టడీస్ ఫ్యాకల్టీ మెంబర్ ఆదిల్ హుస్సేన్ తెలిపారు.

ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన హుస్సేన్, మొదటి దశలో ఓటు వేయడానికి తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ కనీసం 13 మందికి ట్రిబ్యునల్‌లో అప్పీల్ దాఖలు చేయడానికి సాయం చేసినట్లు ఆయన చెప్పారు.

“వాళ్లు పేదవారు, అప్పీల్ చేసుకునేంత చదువుకోలేదు. పైగా న్యాయ సహాయ కేంద్రాలు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి” అని హుస్సేన్ అన్నారు.

చివరి నిమిషంలో విడుదలైన అదనపు జాబితాలపై హుస్సేన్ స్పందిస్తూ, బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) సమాచారం ఇవ్వకపోతే, తమ పేరు తిరిగి జాబితాలో చేరిన విషయం ఓటర్లకు తెలియడం కష్టమని పేర్కొన్నారు.

ట్రిబ్యునళ్లు కేసులు పరిష్కరిస్తున్న తీరును(నెమ్మదిగా) చూస్తుంటే, ఈ ప్రక్రియను హడావుడిగా అమలు చేసినట్లు కనిపిస్తోందని, దీనివల్ల పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని కోల్‌కతా ప్రెసిడెన్సీ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ జాద్ మహమూద్ ఆందోళన వ్యక్తం చేశారు.

“ఈ ప్రక్రియ వెనుక ఉద్దేశం సరైనదే కావచ్చు కానీ, ఇంత పెద్ద ఎత్తున పత్రాల వెరిఫికేషన్ చేయడానికి ఎక్కువ సమయం అవసరం” అని మహమూద్ అన్నారు.

పశ్చిమ బెంగాల్, ఎన్నికలు, ఎస్ఐఆర్

ఫొటో సోర్స్, Asian News International

ప్రిసైడింగ్ అధికారుల పేర్లు కూడా తొలగింపు

ట్రిబ్యునళ్ల పనితీరుపై వస్తున్న సందేహాలు పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ ప్రక్రియలో కొత్త వివాదానికి కారణమయ్యాయి.

లక్షలాది మంది ఓటర్లను ‘విచారణలో ఉన్నవారు’గా మారుస్తూ ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ (తార్కికంగా సరిపోని లేదా అసాధారణంగా కనిపించే వివరాలు) అనే కేటగిరీపై ఈ వివాదం మొదటి నుంచీ కొనసాగుతోంది.

ఎన్నికల సంఘం మొదట జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ కేటగిరీ లేదు. అలాగే పశ్చిమ బెంగాల్ కంటే ముందు ఏ రాష్ట్రంలోనూ దీనిని అమలు చేయలేదు. తొలి మార్గదర్శకాల ప్రకారం, 2002 ఓటర్ల జాబితాలో (చివరిసారి ఎస్ఐఆర్ జరిగినప్పుడు) తమ పేరు లేదా తమ తల్లిదండ్రుల పేరు ఉన్నట్లు నిరూపించుకుంటేనే వారు ఓటు హక్కుకు అర్హులు.

అయితే ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ అనే విభాగాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, సుమారు 60 లక్షల మందికి పైగా ఓటర్లకు తమ అర్హత నిరూపించుకోవాలని నోటీసులు పంపారు. వీరిలో 27 లక్షల మంది పేర్లను జాబితా నుంచి తొలగించారు.

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ 27 లక్షల మందిలో కనీసం 65 మందిని ఎన్నికల సంఘమే పోలింగ్ కేంద్రాలకు ప్రిసైడింగ్ అధికారులుగా నియమించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం నియమితులయ్యే ప్రిసైడింగ్ అధికారిని పోలింగ్ కేంద్రంలో ‘అత్యంత కీలకమైన అధికారి’గా ఎన్నికల సంఘం మాన్యువల్ పేర్కొంటుంది.

అయినప్పటికీ, ముర్షిదాబాద్‌కు చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు అక్తర్ అలీ వంటి వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. గత నాలుగు ఎన్నికల్లోనూ ప్రిసైడింగ్ అధికారిగా పనిచేసినట్లు అక్తర్ అలీ బీబీసీ బంగ్లాతో చెప్పారు. ఈసారి ఎన్నికల్లో మొదటి విడతలోనూ అదే బాధ్యత నిర్వర్తించినట్లు చెప్పారు.

తన తండ్రి పేరు 2002 ఓటర్ల జాబితాలో ఉన్నప్పటికీ, తనకు ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ నోటీసు వచ్చిందని అలీ బీబీసీకి తెలిపారు.

తన అర్హతను నిరూపించుకోవడానికి తండ్రి ఓటర్ కార్డుతో పాటు 1951 నాటి భూమి పత్రాలను సమర్పించినా, వివిధ పత్రాల్లో తండ్రి పేరు సరిపోలడం లేదనే కారణంతో ఓటర్ లిస్టు నంచి తన పేరును తొలగించినట్లు అలీ చెప్పారు.

“భారతీయ పౌరుడిగా ఓటు హక్కును కోల్పోవడం చాలా బాధ కలిగించింది” అని ఆయన అన్నారు.

ముర్షిదాబాద్‌కే చెందిన మరో ప్రిసైడింగ్ అధికారి మొహమ్మద్ మోసెలుద్దీన్ సువానీ కూడా ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.

తన తండ్రికి ఆరుగురు పిల్లలు ఉన్నట్లు రికార్డుల్లో ఉండటమే తన పేరు ‘విచారణ’లోకి వెళ్లడానికి కారణమని సువానీ బీబీసీ బంగ్లాతో చెప్పారు.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తికి ఆరుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే అది ‘లాజికల్ అనామలీ’గా పరిగణిస్తారు.

తన పదో తరగతి సర్టిఫికెట్ సహా పలు పత్రాలు సమర్పించినా, తనతో పాటు ఐదుగురు తోబుట్టువుల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు సువానీ చెప్పారు.

“ఇది వింతైన, బాధాకరమైన పరిస్థితి. నా ఓటు హక్కు మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియదు” అన్నారు సువానీ.

అలీ, సువానీ ఇద్దరూ సంషేర్‌గంజ్ నియోజకవర్గ ఓటర్లే. తమ పేర్ల తొలగింపుపై ట్రిబ్యునల్‌లో అప్పీల్ చేశారు. అయితే, ఇప్పటివరకు వారికి ఎటువంటి సమాధానం రాలేదు. ఓటు హక్కును పునరుద్ధరించాలని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ, జోక్యానికి నిరాకరించిన కోర్టు ట్రిబ్యునళ్లలోనే తమ పోరాటాన్ని కొనసాగించాలని సూచించింది.

పశ్చిమ బెంగాల్, ఎన్నికలు, ఎస్ఐఆర్

ఫొటో సోర్స్, Asian News International

సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా..

88 ఏళ్ల సుప్రబుద్ధా సేన్ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం కూడా సరిపోలేదు. భారత రాజ్యాంగ ఒరిజినల్ కాపీని డిజైన్ చేసి, చిత్రించిన ప్రసిద్ధ కళాకారుడు నందలాల్ బోస్ మనవడే ఈ సుప్రబుద్ధా సేన్.

ఎన్నికల సంఘం సుప్రబుద్ధా సేన్‌తో పాటు ఆయన భార్య పేరును కూడా ‘పెండింగ్’లో ఉంచి, వారి అర్హతను నిరూపించుకోవాలని కోరింది. తమ పేర్లను ఎందుకు తొలగించారో తమకు తెలియదని సేన్ బీబీసీ బంగ్లాకు తెలిపారు.

పాస్‌పోర్ట్, భూమి పత్రాలు, ఆధార్ కార్డూ సమర్పించినప్పటికీ, తన పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించిటనట్లు సేన్ తెలిపారు.

ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లగా, అప్పీలేట్ ట్రిబ్యునల్ ఈ కేసును ప్రాధాన్యతతో విచారించాలని ఆదేశించింది. సేన్, ఆయన భార్య పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చాలని ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది.

అయితే, ఏప్రిల్ 23వ తేదీ ఉదయం వారు బోల్పూర్ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రానికి ఓటు వేయడానికి వెళ్లినప్పుడు, జాబితాలో వారి పేర్లు కనిపించలేదు.

“జిల్లా యంత్రాంగం నుంచి లిఖితపూర్వక అనుమతి లేనిదే మమ్మల్ని ఓటు వేయనివ్వమని చెప్పారు. నేను ఆశ వదులుకున్నాను కానీ, నా పిల్లలు వదల్లేదు. చివరికి సాయంత్రం 4:30 గంటల సమయంలో నేను ఓటు వేశాను” అని సుప్రబుద్ధా సేన్‌ బీబీసీ బంగ్లాతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)