Home జాతీయ national telgu ‘నేను 40 నిమిషాలు చనిపోయాను’.. ఆ ‘మరణం’ తరువాత నా జీవితాన్ని ఎలా మార్చుకున్నానంటే

‘నేను 40 నిమిషాలు చనిపోయాను’.. ఆ ‘మరణం’ తరువాత నా జీవితాన్ని ఎలా మార్చుకున్నానంటే

8
0

SOURCE :- BBC NEWS

పాట్రిక్ చార్‌న్లీ

పాట్రిక్ చాన్లీ జీవితంలో అనూహ్యమైన సంఘటన జరిగింది. ఆయనో పేరున్న కార్పొరేట్ లాయర్. కొద్దిసేపు పనిచేయకపోయినా, సమయాన్ని వృథా చేసినట్లు భావిస్తూ రేయింబవళ్లు తీరికలేకుండా పనిచేసేవారు.

కానీ, 2021లో కరోనా మహమ్మారి సమయంలో విశ్రాంతి లేకుండా గంటల కొద్ది పనిచేయడంతో 39 ఏళ్లకే ఆయన కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యారు.

పాట్రిక్ చూడటానికి చాలా ఫిట్‌గా ఉంటారు. ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా.

ఒక రోజు సాయంత్రం సోఫాలో కూర్చుని సాసేజ్, చిప్స్ తింటున్నప్పుడు ఆయన ఒక్కసారిగా స్పృహ తప్పి కిందపడిపోయారు.

వంశపార్యపరంగా వచ్చిన అనారోగ్య పరిస్థితితో ఆయన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది.

పాట్రిక్ 40 నిమిషాల పాటు క్లినికల్లీ డెడ్‌ (వైద్య పరిభాషలో మరణించిన స్థితి) అయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భర్తను బతికించుకోవడం కోసం ఆయన భార్య సీపీఆర్ చేస్తూనే ఉన్నారు. తొమ్మిది, ఏడేళ్ల వయసున్న ఆయన కూతురు, కొడుకు వెంటనే సాయం కోసం పరుగెత్తారు.

వైద్యులు ఉపయోగించే డీఫిబ్రిలేషన్ పరికరంతో (కార్డియాక్ అరెస్ట్ వల్ల ఆగిన ఆయన గుండెను కొట్టుకునేలా చేసేందుకు) చేసిన ప్రయత్నాలనీ విఫలమయ్యాయి.

తన ప్రాణాలు పోతున్న సమయంలో లైఫ్-సేవింగ్ కోసం ఆఖరి ప్రయత్నంగా వైద్యులు అడ్రినలిన్ షాట్స్‌ను ఇచ్చినట్లు పాట్రిక్ తెలిపారు.

”వారు నాకు షాక్ ఇస్తూనే ఉన్నారు” అని చెప్పారు. పాట్రిక్ చనిపోయారేమోనని ఆయన భార్యకు అనిపించింది.

కానీ, ఒక్కసారిగా ఆయన గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది.

వారం రోజుల పాటు కోమాలో ఉండి, కళ్లు తెరిచిన పాట్రిక్ ఆ తర్వాత పూర్తిగా మారిపోయారు. బ్రెయిన్‌కు అయిన గాయం వల్ల ఆయన కంటి చూపు, జ్ఞాపకశక్తి ప్రభావితమైంది. గతంలో తనకున్న శక్తిని కోల్పోయారు.

గతంలో మాదిరిగా పనిచేస్తూ జీవించడం సాధ్యకకపోయినా.. ఇది తనకు జీవితంలో బంధాలకు ఎక్కువ సమయం కేటాయించేలా చేసిందని పాట్రిక్ చెబుతున్నారు.

పాత జీవితానికి తిరిగి వెళ్లే అవకాశం వచ్చినా తాను మారనని స్పష్టంచేశారు పాట్రిక్.

పాట్రిక్

ఫొటో సోర్స్, Patrick Charnley

‘అంధుడిగా కోమాలో నుంచి బయటకు వచ్చాను’

ప్రస్తుత పరిస్థితిని అంగీకరించేందుకు.. సాగిన తన ప్రయాణం అత్యంత బాధాకరంగా గడిచిందని పాట్రిక్ చెప్పారు.

”నేను కోమాలో నుంచి అంధుడిగా మేల్కొన్నాను” అని పాట్రిక్ కళ్లు తెరిచిన క్షణాలను గుర్తుచేసుకున్నారు.

”వీటిని నేను అనుభవించాను. కానీ, నిజంగా వాటిని అంగీకరించలేకపోయాను” అని తెలిపారు.

కంటిచూపును కోల్పోవడంతో ఆయన వివిధ భ్రమలకు గురయ్యారు. దీన్నే చార్లెస్ బోనెట్ సిండ్రోమ్ అంటారు.

అకస్మాత్తుగా కంటి చూపు కోల్పోయినప్పుడు, విజువల్ డేటాను మెదడు ఈ భ్రమలతో భర్తీ చేసుకుంటుంది.

వీటిల్లో కొన్ని భయానకంగా ఉన్నప్పటికీ, కొన్ని ఉన్నతంగా, అద్భుతంగా ఉన్నాయని చెప్పారు.

దానిలో ఒకటి.. ఓపెన్ హార్ట్ సర్జరీ తర్వాత.. ఒక అమెరికా నర్స్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు భావించారు.

కానీ, ఈ భ్రమలు తనకు ప్రశాంతతను కూడా ఇచ్చాయని చెప్పారు.

ఎవరో తనను ఆల్ఫ్స్ పర్వతాల్లోని శానిటోరియానికి తీసుకెళ్లారని, అప్పుడు పక్క గది వద్ద నర్సులు మాట్లాడుతుండగా.. తాను చుట్టూ ఉన్న మంచు పర్వతాలను చూస్తూ గడిపినట్లు అనిపించిందన్నారు.

ఈ అనుభవం తనకొక అందమైన భద్రత భావాన్ని కల్పించిందని చెప్పారు.

పాట్రిక్ కోల్పోయిన చూపును క్రమంగా తిరిగి పొందినప్పుడు.. తనకు కలిగిన కంటి చూపు సమస్యలు బ్రెయిన్‌కు అయిన గాయం వల్ల అని వైద్యులు గుర్తించారు.

తన కంటిచూపు పాక్షికంగా దెబ్బతింది. కాగ్నిటివ్ పరీక్షల్లో మెమరీ, ప్రాసెసింగ్ స్పీడు తగ్గింది.

కోమాలో నుంచి బయటపడిన తర్వాతతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి బాగా మెరుగైనప్పటికీ, ఏదైనా విషయాన్ని వెంటనే గుర్తుంచుకునేందుకు కొన్నిసార్లు చాలా కష్టపడుతున్నారు పాట్రిక్.

అయితే, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతనే తన గాయాల వల్ల కలిగిన ప్రభావాలు పాట్రిక్‌కు పూర్తిగా అర్థమయ్యాయి.

పాట్రిక్

ఫొటో సోర్స్, Patrick Charnley

‘అర్థవంతమైన జీవితం గడుపుతున్నా’

తీవ్ర అలసటను ఆయన ఎదుర్కొన్నారు. దీంతో తన ఎనర్జీని చాలా పరిమిత స్థాయిలో వాడుకోవాల్సి వచ్చింది.

”నేనెప్పుడూ రీఫ్రెష్‌గా లేవలేదు. ప్రతిరోజూ తీవ్ర అలసటతోనే లేచాను. రోజులు గడుస్తున్న కొద్దీ ఇది మరింత తీవ్రంగా మారింది” అని వివరించారు పాట్రిక్.

దానికి అలవాటు పడేందుకు మానసికంగా ఎన్నో మార్పులు చేసుకున్నారు.

కోలుకున్న తర్వాత తొలుత దేన్నీ లెక్కచేయలేదని గుర్తించారు. ఇది డిప్రెషన్ కాదు. ఇదొక న్యూరోలాజికల్ సిండ్రోమ్. కచ్చితమైన కారణం లేకుండా ఏదో బతికేస్తున్నట్లు అనిపించేదని పాట్రిక్ వర్ణించారు.

అయితే, థెరపీ, మెడికేషన్‌లు కోల్పోయిన తన ప్రేరణ తిరిగి పొందేలా సహకరించాయి. అయితే, కోల్పోయిన జీవితం గురించి చెప్పి, తన భారాన్ని దించేసుకోవాలని సైకాలజిస్ట్ ఆయన్ను ప్రోత్సహించారు.

ఇప్పటికీ, తాను ప్రస్తుత క్షణంలో జీవించడాన్ని కోల్పోతున్నట్లు పాట్రిక్ తెలిపారు.

ప్రజలు ఆశించే సమాజంలో జీవిస్తూ తన వయసు వారితో ఇమడలేక, పిల్లలతో చురుకుగా ఆడుకోలేక ఇబ్బందులు పడుతున్నట్లు పాట్రిక్ వివరించారు.

తన భార్య విషయంలో కూడా పశ్చాత్తాపం చెందుతున్నారు పాట్రిక్. ”నిజమేంటంటే.. ఆమె నా సర్వస్వం” అని అంగీకరించారు.

”నేను చాలా చాలా వృద్ధుడినయ్యాక ఎలా అయితే జీవిస్తానో అలానే బతుకుతున్నా” అని చెప్పారు.

ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ, చాలా విషయాల్లో తాను ఈ జీవితాన్నే ఎంచుకుంటానని పాట్రిక్ తెలిపారు.

పాట్రిక్ తన వృత్తిపరమైన జీవితాన్ని రచయితగా మార్చుకున్నారు. తన జీవితాన్ని ఆస్వాదించేందుకు ఇప్పుడు ఆయనకు మరింత సమయం దొరికిందని చెబుతున్నారు.

”ఇప్పుడు మెల్లగా నా జీవితం గడుపుతున్నా. ఇష్టపూర్వకంగా తీసుకున్నది కాదు, ఇదే తప్పనిసరిగా గడపాల్సిన జీవితం. నిజంగా దీన్ని అభినందిస్తున్నా. గతంలో కంటే ఇప్పుడు చాలా విషయాల్లో వాటి అందాన్ని చూడగలుగుతున్నా. మెల్లగా మరింత అర్థవంతమైన జీవితం గడుపుతున్నట్లు అనిపిస్తుంది. నా దృక్పథం ప్రాథమికంగా మారింది. బతికున్నందుకు చాలా కృతజ్ఞతగా భావిస్తున్నా” అని పాట్రిక్ అన్నారు.

కుటుంబంతో పాట్రిక్ బంధం మరింత ఉన్నతంగా మారింది.

”గతంలో కంటే చాలా బలంగా మా బంధం మారిందనుకుంటున్నా. జరిగిన దానివల్ల మా మధ్య బంధం మరింత పెరిగింది” అని పేర్కొన్నారు.

”నాకు ఎప్పుడూ నా కుటుంబమే అత్యంత ముఖ్యమైన విషయం. కానీ, ఇప్పుడు వారికోసం మరింత ఎక్కువ సమయం కేటాయించుకోగలుగుతున్నా” అని అన్నారు.

పాట్రిక్‌కు ఎదురైన ఈ ప్రత్యేక పరిస్థితి వల్ల, తలామునకలయ్యే రోజువారీ పని ఒత్తిడి నుంచి ఆయన కాస్త బ్రేక్ తీసుకోగలుగుతున్నారు.

”నేను నా జీవితంలో చాలా బిజీగా ఉంటానని చాలామంది అనుకుంటారు. ఏం జరిగిందో నేను మార్చలేను. అన్ని చేయలేకపోతున్నప్పటికీ, ఇప్పుడు నా జీవితాన్ని నేను ఇష్టపడుతున్నా. స్కూల్ నుంచి పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో ఉండటం నాకిప్పుడు ఇష్టం. ఒకపని అయిన వెంటనే మరో పని వెంట పరిగెత్తడం నాకిప్పుడు ఇష్టం లేదు” అని పాట్రిక్ వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)