Home జాతీయ national telgu ‘ నెతన్యాహు బతికి ఉంటే వదిలే ప్రసక్తే లేదు’ అంటూ ఇరాన్ హెచ్చరించిన తరువాత నెతన్యాహు...

‘ నెతన్యాహు బతికి ఉంటే వదిలే ప్రసక్తే లేదు’ అంటూ ఇరాన్ హెచ్చరించిన తరువాత నెతన్యాహు వీడియో విడుదల

13
0

SOURCE :- BBC NEWS

ఇజ్రాయెల్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతిపై వార్తలు, ఇరాన్

ఫొటో సోర్స్, Getty Images

16 మార్చి 2026, 12:05 IST

చదివే సమయం: 5 నిమిషాలు

“ఒకవేళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బతికే ఉంటే, ఆయనను వెంబడించి మరీ హతమారుస్తాం” అని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) ఇటీవల హెచ్చరించింది. నెతన్యాహును ‘చిన్నారుల హంతకుడి’గానూ వర్ణించింది.

‘ఇర్నా’ ఓ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.

మరోవైపు, దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం తన సోషల్ మీడియా పోస్టులో “నెతన్యాహు సజీవంగా ఉన్నా, లేకపోయినా మాకు అప్రస్తుతం. మినాబ్‌కు చెందిన ఒక సామాన్య బాలిక తలవెంట్రుక కూడా ఆయన పూర్తి ఉనికి కంటే ఎంతో విలువైనది” అని రాసుకొచ్చింది.

ఇంతకీ, “ఒకవేళ బెంజమిన్ నెతన్యాహు బతికే ఉంటే” అని ఐఆర్‌జీసీ ఎందుకు అన్నది? అసలు ఆయన బతికున్నారా లేదా అనే సందేహాలు, పుకార్లు ఎక్కడ మొదలయ్యాయి?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఇజ్రాయెల్, ఇరాన్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతిపై వార్తలు

ఫొటో సోర్స్, @netanyahu

నెతన్యాహు మరణించారనే వార్తలను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే కొట్టిపారేసింది.

ఆ వీడియోలో నెతన్యాహు కాఫీ తాగుతూ, తన రెండు చేతులను ఒక్కొక్కటిగా కెమెరా ముందు చూపిస్తూ కనిపించారు.

తన రెండు చేతులకు ఉన్న ఐదేసి వేళ్లనూ స్పష్టంగా చూపించారాయన.

ఇజ్రాయెల్, ఇరాన్, ప్రధాని నెతన్యాహు మృతిపై వార్తలు

ఫొటో సోర్స్, Getty Images

ఐఆర్‌జీసీ ఏం చెప్పింది?

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంలో, ‘మినాబ్’లోని ఒక బాలికల పాఠశాలపై దాడి జరిగిందని ఇరాన్ అధికారులు తెలిపారు.

ఈ దాడిలో విద్యార్థినులు, పాఠశాల సిబ్బందితో కలిపి 160 మందికి పైగా మరణించారని పేర్కొంది.

ఈ ఘటనతో ఇరాన్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

బాలికల అంత్యక్రియల్లో జనం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

“జియోనిస్ట్ నేరస్థుడైన ప్రధానమంత్రి అజ్ఞాతంలోకి వెళ్లడమో లేదా ఆక్రమిత ప్రాంతాల నుంచి తన కుటుంబంతో పారిపోయే అవకాశమో ఉంది. ఇది జియోనిస్టుల సంక్షోభాన్ని, వారి అస్థిర స్థితిని తెలియజేస్తోంది” అని ఐఆర్‌జీసీ చెప్పినట్లు ఇర్నా రిపోర్ట్ చేసింది.

“ఒకవేళ ఆ పిల్లల హంతకుడు సజీవంగా ఉంటే, మేం పూర్తి శక్తితో ఆయన్ను వెంబడించి మరీ హతమారుస్తాం” అని హెచ్చరించినట్లు తెలిపింది.

నెతన్యాహు మరణించారనే వార్తలను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఖండించిన తర్వాత, ఐఆర్‌జీసీ నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి.

ఇటు ఇజ్రాయెల్‌లోని తమ లక్ష్యాలతో పాటు, అటు అక్కడి మూడు అమెరికా సైనిక స్థావరాలపై 52 సార్లు దాడులు చేశామని, ఆ దాడుల్లో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయని ఐఆర్‌జీసీ తెలిపింది.

ఇరానియన్ పాఠశాల దాడి, మినాబ్

ఫొటో సోర్స్, Getty Images

మృతి వార్తలు ఎలా మొదలయ్యాయి?

ఇరాన్ దాడుల అనంతరం, మార్చి 13న నెతన్యాహు ‘ఎక్స్’ ఖాతా నుంచి ఒక వీడియో విడుదలైంది. అయితే, ఆ వీడియో ‘ఏఐ’ (కృత్రిమ మేధ) ద్వారా సృష్టించిందని, నెతన్యాహు అప్పటికే మరణించారని పలువురు నెటిజన్లు ఆరోపించారు.

కానీ ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం కొట్టిపారేసింది. తుర్కియే ప్రభుత్వ వార్తాసంస్థ ‘అనాడోలు’ ప్రశ్నకు స్పందిస్తూ, నెతన్యాహు సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేసింది.

“నెతన్యాహు ఆరోగ్యానికి సంబంధించి ఏదో దాచే ప్రయత్నం జరుగుతోంది” అని అమెరికా రాజకీయ విశ్లేషకురాలు క్యాండిస్ ఓవెన్స్ అభిప్రాయపడ్డారు.

ఈ అంశంపై అధికారులు నోరు విప్పకుండా, వారిపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించారు

“అమెరికా ప్రభుత్వం ఈ విషయంలో వాస్తవాలను నేరుగా వెల్లడించాలి కానీ, దీనిపై స్పందించవద్దని అధికారులకు ఆదేశాలందాయి. అసలు అక్కడేం జరుగుతోంది, ఇప్పటికే ఈ వ్యవహారంలో ఎన్నో అబద్ధాలు ప్రచారంలో లేవా?” అని ఎక్స్ లో ప్రశ్నించారు ఓవెన్స్.

ఇజ్రాయెల్, ఇరాన్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతిపై వార్తలు

ఫొటో సోర్స్, Getty Images

బెంజమిన్ నెతన్యాహు మరణించారంటూ వస్తున్న పుకార్ల నేపథ్యంలో ఆయన కుమారుడు యాయీర్ నెతన్యాహు ‘ఎక్స్’ ఖాతా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నెతన్యాహు కుమారుడు యాయీర్ సోషల్ మీడియా కార్యకలాపాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని హిందుస్థాన్ టైమ్స్ కథనం తెలిపింది.

మార్చి 9వ తేదీ తర్వాత ఆయన ఎలాంటి పోస్టులు చేయకపోవడంతో.. నెతన్యాహు కుటుంబంలో ఏదో ‘విషాదకర ఘటన’ జరిగి ఉండవచ్చని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ‘ఎక్స్’కు చెందిన ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ ఈ ప్రచారాన్ని తోసిపుచ్చింది.

నెతన్యాహు ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో నిజమైనదేనని, అందులో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేసింది.

వీడియోలో ఆయనకు ఆరు వేళ్లు ఉన్నట్లు కనిపించడం కేవలం ‘దృశ్య భ్రమ’ మాత్రమేనని తెలిపింది.

ఇజ్రాయెల్, ఇరాన్, ప్రధాని నెతన్యాహు మృతిపై వార్తలు, నెతన్యాహు కొడుకు యాయీర్

ఫొటో సోర్స్, @YairNetanyahu

మరోవైపు, నెతన్యాహుకు సంబంధించిన ఒక సందేశం పోస్ట్ అయిన వెంటనే డిలీట్ కావడం అనుమానాలకు ఆజ్యం పోసిందని ‘ద సండే గార్డియన్’ తెలిపింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో.. ఇరాన్‌తో జరుగుతున్న ఘర్షణల్లో నెతన్యాహుకు ఏమైనా హాని జరిగిందా? అని నెటిజన్లలో చర్చ మొదలైంది.

“వీడియోలోని ఒక ఫ్రేమ్‌ను అతి దగ్గరగా గమనించినప్పుడు, చేతి కదలికలు, కెమెరా యాంగిల్స్ వల్ల ఒక్కోసారి అదనపు వేలు ఉన్నట్లు వింతగా కనిపిస్తుందని, అది కేవలం దృశ్య ప్రభావం మాత్రమేనని నిపుణులు స్పష్టంచేశారు” అని ద సండే గార్డియన్ తెలిపింది.

ఇజ్రాయెల్, ఇరాన్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతిపై వార్తలు

ఫొటో సోర్స్, Getty Images

నెతన్యాహు ఎక్కడ ఉన్నారు?

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో తప్పుడు సమాచారం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారని ‘ద సండే గార్డియన్’ కథనం తెలిపింది.

ముఖ్యంగా రాజకీయ నాయకులు, సైనిక పరిణామాల గురించి ప్రజలు తక్షణ సమాచారం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఇటువంటి పుకార్లు ఎక్కువగా వస్తుంటాయి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తాయి. యూజర్లు ఆ వార్తల వాస్తవికతను గమనించకుండానే ఇతరులకు పంపుతుంటారు.

మరోవైపు, నెతన్యాహు మరణించారనే వార్తలు ఎంత వేగంగా వ్యాపించినప్పటికీ, ఆయన అదృశ్యమయ్యారని గానీ లేదా ఇజ్రాయెల్ వదిలి వెళ్లారని గానీ చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

సోషల్ మీడియాలో ఇటీవల విడుదలైన వీడియోలు, అధికారిక ప్రకటనలు చూస్తే ఇజ్రాయెల్ ప్రధాని నిరంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా, ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త సైనిక కార్యకలాపాలకు సంబంధించిన కీలక చర్చల్లో పాల్గొంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)