SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో ఉండే స్వాతి, చిన్నప్పుడు తన ఆంటీ తెల్లటి యూనిఫాంలో ఆస్పత్రికి వెళ్లడం చూసినప్పుడల్లా.. తనకు కూడా ఏదో ఒక రోజు అలా ప్రజలకు సేవచేసే అవకాశం వస్తుందేమో చూద్దాం అని అనుకునేవారు.
ఆమె డాక్టర్ కాలేకపోయినా మరో మార్గం ఎంచుకున్నారు. ఎలాంటిదంటే.. వాళ్లు లేకుండా ఏ డాక్టరూ, ఏ ఆస్పత్రీ, ఏ ఆపరేషన్ థియేటరూ పూర్తి స్థాయిలో పనిచేయలేదు. అదే నర్సింగ్.
స్వాతి ప్రస్తుతం ఓ మల్టీనేషనల్ ఐటీ కంపెనీకి చెందిన కార్పొరేట్ క్లినిక్‌లో పనిచేస్తున్నారు.
దేశంలో ప్రస్తుతం 39 లక్షల మంది నర్సులు ఉన్నారు. వినడానికి ఈ సంఖ్య కాస్త పెద్దదిగా అనిపించినా, 140 కోట్ల మంది జనాభాతో పోల్చి చూస్తే చాలా తక్కువే.
నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు, ప్రముఖ గుండెవైద్య నిపుణులు డాక్టర్ దేవీప్రసాద్ శెట్టి చెప్పిన వివరాల ప్రకారం, అమెరికా, యూరప్‌లో ఒక్కో వైద్యుడికి నలుగురు నుంచి ఐదుగురు నర్సులు చొప్పున ఉంటారు. భారత్ కూడా ఆ ప్రమాణాల స్థాయికి చేరాలంటే దాదాపుగా మరో 20 లక్షల మంది నర్సులు అవసరం.
అయితే, నర్సింగ్ అనేది కేవలం ఒక ఉద్యోగమా? భవిష్యత్తులో ఎదుగుదలకు అవకాశముందా? ఇంటర్ తర్వాత మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటే మంచిది? అది మంచి కెరీర్‌ను అందిస్తుందా? వంటి విషయాలు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
నర్సింగ్‌లో ఏయే కోర్సులు ఉంటాయి?
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ(అటానమస్ బాడీ) అయిన ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్(ఐఎన్‌సీ) దేశంలో నర్సింగ్ విద్యను పర్యవేక్షిస్తుంది.
బీఎస్సీ నర్సింగ్‌తో పాటు నర్సు అయ్యేందుకు అత్యంత ఆదరణ పొందిన మరో కోర్సు జీఎన్‌ఎం. అంటే, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ.
దీనితో పాటు ఏఎన్ఎం, అంటే ఆక్సిలరీ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సు కూడా ఉంది. అయితే, ఇది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఉద్దేశించిన కోర్సు.
దిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో (ఎయిమ్స్) నర్సింగ్ ఆఫీసర్‌గా ఉన్న కనిష్క్ యాదవ్ దీని గురించి వివరిస్తూ, “సాధారణంగా, ఏఎన్‌ఎం అనేది స్వల్పకాలిక కోర్సు. ప్రసూతి సేవలు, శిశు సంరక్షణ, టీకాలు, ప్రాథమిక చికిత్స వంటి అంశాలతో పాటు గ్రామీణ , లేదా కమ్యూనిటీ వైద్య సేవల గురించి ప్రధానంగా ఉంటుంది” అని అన్నారు.
“ఇక జీఎన్ఎం, లేదా బీఎస్సీ నర్సింగ్ వివరణాత్మక కోర్సు. జీఎన్ఎం మూడేళ్ల కోర్సు కాగా, బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల కోర్సు. ఈ రెండు కోర్సులు చేసిన వారు ఇంటర్న్‌షిప్‌లు కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ కోర్సులు చేసిన పట్టభద్రులు పూర్తిగా సన్నద్ధమవుతారు.”
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సమాచారం ప్రకారం, ఏఎన్ఎం కోర్సు చేయాలనుకునేవారు ఇంటర్‌లో ఏ గ్రూపు చదివినా ఉత్తీర్ణులైతే చాలు. అదే జీఎన్ఎం కోర్సు చేయాలనుకునే వారికి సైన్స్ గ్రూపులో కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి.
వయోపరిమితి 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉండాలి.
బీఎస్సీ నర్సింగ్‌కు కూడా ఇదే వయోపరిమితి నిబంధన వర్తిస్తుంది.
అలాగే, ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్, కోర్/ఇంగ్లిష్ ఎలెక్టివ్‌లో కనీసం 45 మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని ఆస్పత్రులు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ద్వారా నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్స్ ఇస్తున్నాయని కనిష్క్ యాదవ్ తెలిపారు.
అయితే, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశానికి ఆయా ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ కళాశాలల్లో ఏడాదికి ఫీజు లక్ష రూపాయల వరకూ ఉంటుంది, ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు కాలేజీని బట్టి మారొచ్చు.

నర్సింగ్ వృత్తిని ఎంచుకోవడం బెటర్ ఆప్షనేనా?
కొద్దిరోజుల కిందట ప్రభుత్వం, దేశంలో ఆరోగ్య రంగంలో ఉన్న సిబ్బందికి సంబంధించిన డేటాను విడుదల చేసింది. దేశంలో ప్రతి వెయ్యి మంది రోగులకు కేవలం ఇద్దరు నర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ఆ డేటా పేర్కొంది.
దేశంలో 5,310 సంస్థలు నర్సింగ్ విద్యను అందిస్తున్నాయి. అందులో 806 ప్రభుత్వ సంస్థలు.
ప్రతియేటా 3.82 లక్షల మంది నర్సింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు.
దేశంలో దాదాపుగా 1,20,000 బీఎస్సీ నర్సింగ్ సీట్లు అందుబాటులో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అదనంగా జీఎన్ఎం, ఎంఎస్సీ నర్సింగ్, పీహెచ్‌డీ వంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి.
అయితే, వేరే ప్రయత్నాల్లో విఫలమైన విద్యార్థులు నర్సింగ్ కోర్సుల్లో చేరుతుంటారని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు.. ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి కోర్సుల్లో అడ్మిషన్స్ లభించని వారు నర్సింగ్ ఎంచుకుంటున్నారు.
నర్సింగ్‌లో ఉన్న అపార అవకాశాల గురించి కనిష్క్ యాదవ్ వివరించారు. “ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి ఏటా వేల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉంటున్నాయి. కానీ, ఇన్నాళ్లూ నర్సు వృత్తిని చాలా తేలికగా పరిగణించారు. కరోనా తర్వాత పరిస్థితి మారినప్పటికీ, నర్సింగ్ ఏమీ తక్కువ స్థాయి వృత్తి కాదని అవగాహన కల్పించాల్సిన అవసరముంది. నర్సులు లేని ఆస్పత్రిని, నర్సింగ్ హోమ్‌ను ఒక్కసారి ఊహించుకోండి. వాళ్లు లేకుండా అవి పనిచేయగలవా?”
“విద్యార్థులకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల పోటీ కూడా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, ఉపాధ్యాయ పోస్టులకైతే లక్షలాది దరఖాస్తులు వస్తాయి. కానీ నర్సింగ్‌లో అలా జరగదు. ఎందుకంటే, అంతమంది అభ్యర్థులు ఉండరు కాబట్టి” అని ఆయన అంటున్నారు.

జీతం ఎంత ఉంటుంది, ఎదుగుదలకు ఉన్న అవకాశాలేంటి?
మీరు ఏఎన్ఎం, జీఎన్ఎం, లేదా బీఎస్సీ నర్సింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే, నిపుణులు అందుకు కొన్ని నైపుణ్య సూచనలు చేస్తున్నారు.
స్వాతి బీబీసీతో మాట్లాడుతూ, “ఈ వృత్తికి అవసరమైన అతి ముఖ్యమైన విషయం కమ్యూనికేషన్. అంటే, రోగి అయినా లేదా డాక్టరైనా.. ఇద్దరితోనూ విషయాలు స్పష్టంగా చెప్పాలి. సానుభూతి చూపాలి.. తద్వారా రోగి బాధను, నొప్పిని అర్థం చేసుకోగలుగుతాం. సహనం అవసరం.. ఎక్కువ గంటల పాటు విధులు నిర్వర్తించాల్సి రావొచ్చు. అలాగే, రకరకాల మనుషులతో వ్యవహరించాల్సి ఉంటుంది. నాయకత్వం అవసరం.. ఎందుకంటే అనూహ్య పరిస్థితులు ఎదురైనప్పుడు తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది” అని అన్నారు.
కెరీర్‌లో ఎదుగుదల గురించి కనిష్క్ యాదవ్ మాట్లాడుతూ, “బీఎస్సీ నర్సింగ్ చేసేవారు బోధన వైపు కూడా వెళ్లొచ్చు. అయితే, ఇప్పుడు చాలామంది ఎమ్మెస్సీ నర్సింగ్, పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు. కాబట్టి, బీఎస్సీ నర్సింగ్ చేసినవారు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మంచి స్థానాలకు చేరుకోవచ్చు” అని అన్నారు.
మరి, నర్సింగ్‌లో సంపాదన ఎలా ఉంటుందనే ప్రశ్నకు బదులిస్తూ.. ఉద్యోగం చేసే ప్రదేశం, సంస్థలపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.
“కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రిలో ఉద్యోగం వస్తే, ప్రారంభ వేతనం రూ.80 వేల వరకూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని ఆస్పత్రుల్లో కాస్త తక్కువగా ఉండొచ్చు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆ ఆస్పత్రి స్థాయిని బట్టి ఉంటుంది. సాధారణంగా, ప్రారంభ వేతనం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ ఇస్తున్నారు” అని కనిష్క్ యాదవ్ చెప్పారు.
“దాదాపు 6,50,000 మంది భారతీయ నర్సులు విదేశాల్లో పనిచేస్తున్నారని ఆయన అన్నారు. అంటే, నర్సింగ్ డిగ్రీ పొందిన వారెవరైనా ఏ దేశం వెళ్లైనా అక్కడి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని క్లినిక్‌లు, స్కూళ్లు, ఆర్మీ, డీఆర్‌డీవో, ఇస్రో వంటి సంస్థలు నర్సులకు మంచి వేతనాలు ఇస్తున్నాయి” అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



