SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Noel Parsons/Getty
రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ నిరుడు విడుదలై సూపర్ హిట్టైంది. తాజాగా విడుదలైన ధురంధర్ పార్ట్ -2 విషయంలో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
ధురంధర్ చిత్రంలో ఒక సన్నివేశంలో రెహమాన్ డకైత్ సోదరుడి పాత్ర రణ్‌వీర్ సింగ్‌ను “నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?” అని అడుగుతుంది.
రణ్‌వీర్ బదులిస్తూ “గరోదాబాద్, క్వెట్టా నుంచి వచ్చాను. నా పేరు హమ్జా అలీ మజారీ” అని చెబుతారు.
ఈ చిత్రంలో రణ్‌వీర్ పాకిస్తాన్ వెళ్లి, పాకిస్తానీగా జీవించే భారతీయ గూఢచారి పాత్ర పోషించారు. అయితే, నిజ జీవితంలో కూడా రణ్‌వీర్ సింగ్ కుటుంబానికి పాకిస్తాన్‌తో సంబంధం ఉంది.
దీని గురించి తెలుసుకోవాలంటే 1940ల్లోకి వెళ్లాలి. అప్పట్లో క్రిస్టియన్ బర్క్ కుటుంబం అవిభక్త భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలో నివసించేది. ఇప్పుడా ఊరు పాకిస్తాన్‌లో ఉంది.

ఫొటో సోర్స్, Noel Parsons
చాంద్ బర్క్‌కి ‘డాన్సింగ్ లిల్లీ ఆఫ్ పంజాబ్’ గా గుర్తింపు
శామ్యూల్ మార్టిన్ బర్క్ గురించి బీబీసీ ప్రతినిధి మొదలు పెట్టిన ప్రయాణం లండన్‌లో నివసిస్తున్న ఆయన కుమార్తె నోయెల్ పార్సన్స్ వద్దకు తీసుకెళ్లింది.
రణ్‌వీర్ అమ్మమ్మ సోదరుడైన శామ్యూల్ మార్టిన్ బర్క్, 1906లో పంజాబ్‌లోని నన్కానా సాహిబ్ సమీపంలో ఉన్న మార్టిన్‌పూర్‌లో పుట్టారు.
“దేశ విభజన సమయంలో ఎటు వెళ్లాలనే సందిగ్ధత మా నాన్నగారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆయన తన ఉద్యోగాన్ని, దేశాన్ని వదిలేసి బ్రిటన్ వెళ్లారు” అని నోయెల్ పార్సన్స్ బీబీసీతో చెప్పారు.
దేశ విభజన తర్వాత చాంద్ బర్క్ బొంబాయి వలస వెళ్లారు.
“చాంద్ బర్క్ హిందీ, పంజాబీ చిత్రాలలో సహ నటిగా పనిచేశారు. లాహోర్‌లో నిర్మించిన చిత్రాల్లో ఆమె నటించారు. ఆమె మంచి డాన్సర్ కావడంతో ‘పంజాబ్ డాన్సింగ్ లిల్లీ’ అని పిలిచేవారు’ అని సినిమాసీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు ఆశా బాత్రా వివరించారు.
భారతీయ సినిమా చరిత్ర, ముఖ్యంగా గతకాలపు కళాకారుల గురించి తెలియజేసే ఒక డాక్యుమెంటరీ ప్రాజెక్టే ‘సినిమాసి’.
ఫొటో సోర్స్, Noel Parsons
ఎటు వెళ్లాలనే గందరగోళం మధ్య..
రణ్‌వీర్ సింగ్ కుటుంబ మూలాలు అవిభక్త భారత్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల్లో ఉన్నాయి.
1946లో దేశ విభజనపై చర్చ జరుగుతున్నప్పుడు శామ్యూల్ మార్టిన్ బర్క్ పంజాబ్‌లోని మొదటి ఎన్నికల పిటిషన్ల కమిషన్‌కు చైర్మన్‌గా ఉన్నారు.
పాకిస్తాన్‌ను ఏర్పాటు చేయాలా వద్దా అనే విషయంపై ఆ సమయంలో తీవ్రమైన చర్చ జరిగింది. కమిషన్‌లో అన్ని రాజకీయ పార్టీల నాయకులు విభజనకు అనుకూలంగా ఉన్నారని నోయెల్ చెప్పారు.
“ఆ సమయంలో నేను తటస్థంగా ఉండటానికి ఉన్న ఏకైక మార్గం, విభజన తర్వాత భారత్ లేదా పాక్‌లో ప్రభుత్వ ఉద్యోగం చేసే ఆలోచన లేదని స్పష్టం చేయడమే. ముందస్తు పదవీ విరమణ అత్యంత గౌరవప్రదమైన ఆప్షన్ అనిపించింది. ఇండియన్ సివిల్ సర్వీస్ నుంచి ముందస్తు పదవీ విరమణ కోరిన మొదటి ఆసియావాసిని నేనే” అని శామ్యూల్ మార్టిన్ బర్టే తన ఆత్మకథ ‘ఎ లైఫ్ ఆఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్’లో రాశారు.
“దీని వల్ల ఉద్యోగం పోవడంతోపాటు ఇస్లామిక్ దేశంలో మైనార్టీ క్రిస్టియన్ సమాజంలో భాగమయ్యాను. బ్రిటీషర్ల పాలనలో ఇండియన్ సివిల్ సర్వీస్‌లో మేజిస్ట్రేట్‌గా ఉన్నాను” అని ఆయన అందులో పేర్కొన్నారు.
దేశ విభజన తర్వాత శామ్యూల్ మార్టిన్ కుటుంబంతో బ్రిటన్ వెళ్లిపోయారు. ఆయన తోబుట్టువులు కెనడాకు, చాంద్ బర్క్ బొంబాయి వచ్చారు.
ఫొటో సోర్స్, Noel Parsons
పాకిస్తాన్ వదిలి పెట్టాక పాక్ రాయబారి ఎలా అయ్యారు?
బ్రిటన్‌లో స్థిరపడిన శామ్యూల్ బ్రిటన్‌లో పాకిస్తాన్ రాయబారి ఎలా అయ్యారనేది మిస్టరీగా మిగిలిపోయింది.
దేశ విభజన తర్వాత పాక్ విదేశాంగమంత్రిగా ఉన్న జఫరుల్లా ఖాన్ శామ్యూల్‌కు మార్గదర్శిగా ఉండేవారని నోయెల్ పార్సన్స్ చెప్పారు.
శామ్యూల్ మార్టిన్ బ్రిటన్‌లో రాయబారిగా నియమితులై, అక్కడ పాక్ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
ఆయన సోదరి చాంద్ బర్క్ భారత్‌వచ్చి హిందీ చిత్రాల్లో నటించారు.
శామ్యూల్, చాంద్‌ల తండ్రి పేరు ఖైరుద్దీన్. ఆయన బర్క్ పేరుతో కవిత్వం రాసేవారని నోయెల్ చెప్పారు. తర్వాత ఆయన క్రైస్తవ మతంలోకి మారారు.
శామ్యూల్ బర్క్‌ను 2009లో మాజీ జర్నలిస్ట్ సజిద మోమిన్ కలిశారు.
“శ్యామ్యుల్ మార్టిన్‌కు క్రికెట్ ఆడటం అంటే ఇష్టం. దేశ విభజనకు ముందు మా నాన్న ఆడిన క్రికెట్ మ్యాచ్‌లో పాటియాలా మహరాజాను అవుట్ చేశారు. మహరాజా ఔట్ అని చెప్పేందుకు అంపైర్ భయపడ్డారు. అయితే శామ్యూల్ మార్టిన్ అంపైర్‌ను సవాల్ చేశారు. అయినప్పటికీ అంపైర్ తన నిర్ణయం మార్చుకోలేదు. దేశ విభజన సమయంలో శామ్యూల్.. అలీ జిన్నా, లియాఖత్ అలీ ఖాన్‌తో సన్నిహితంగా పని చేశారు” అని నోయెల్ తనతో చెప్పినట్లు సజిద వివరించారు.
ఫొటో సోర్స్, Film Heritage Foundation
చాంద్ బర్క్‌కు అవకాశమిచ్చిన రాజ్‌కపూర్
రణ్‌వీర్ సింగ్ అమ్మమ్మ చాంద్ బర్క్ గురించి తెలుసా అని నోయెల్‌ను ఫోన్‌లో అడిగినప్పుడు, ఆమె నవ్వుతూ “ఎందుకు తెలియదు? ఆమె నా అత్త కదా” అని అన్నారు.
దేశ విభజన తర్వాత చాంద్ చాలా ఏళ్లపాటు చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. అయితే రాజ్ కపూర్ ఆమెను తిరిగి తీసుకువచ్చారని ఆశా బాత్రా చెప్పారు.
బూట్ పాలిష్ సినిమాలో ఇద్దరు అనాథ పిల్లల పట్ల క్రూరంగా వ్యవహరించే మహిళ పాత్ర ఉంది. చాంద్ బర్క్ ఆ పాత్రలో నటించారు.
ఆమె సుందర్ సింగ్ భవ్నానీని పెళ్లి చేసుకున్నారు. ఆమె మనవడే హీరో రణ్‌వీర్ సింగ్.
ఫొటో సోర్స్, DHURANDHAR THE REVENGE
బర్క్ కుటుంబం, రణ్‌వీర్ సింగ్
2009లో తాను శామ్యూల్ మార్టిన్ బర్క్‌ను కలిశానని సజిద చెప్పారు. అప్పుడు ఆయన 103వ పుట్టిన రోజు చేసుకుంటున్నారని, భారత్ నుంచి అనేక మంది ఐఏఎస్‌లు ఆయనకు అభినందనలు తెలిపినట్లు ఆమె చెప్పారు.
బర్క్ కుటుంబంలో శామ్యూల్ మార్టిన్ మేజిస్ట్రేట్‌గా, పాకిస్తాన్ నుంచి 11 దేశాల్లో రాయబారిగా పని చేస్తే, ఆయన సోదరి చాంద్ బర్క్ రాజ్‌కపూర్, నర్గీస్, నిమ్మీ, ప్రదీప్ కుమార్, ప్రాణ్, మనోజ్ కుమార్‌లతో కలిసి సినిమాల్లో నటించారు.
రోజులు గడిచాయి. కుటుంబంలో తర్వాతి తరాలు వచ్చాయి. ఆ కుటుంబానికి చెందిన రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ హీరో అయ్యారు.
బ్రిటన్‌లో నివసిస్తున్న శామ్యూల్ మార్టిన్ బర్క్ కుమార్తె నోయెల్‌ను రణ్‌వీర్ సింగ్ గురించి తెలుసా? అని అడిగితే “తెలుసు. ఎప్పుడూ మాట్లాడుకోలేదు” అని నోయెల్ చెప్పారు.
కొన్నిసార్లు, వేర్వేరు దేశాల్లో నివసించడం వల్ల ఒకే కుటుంబానికి చెందిన వారు కూడా ఒకరికొకరు దూరమవుతారు.
ధురంధర్ పార్ట్ 2కు ఆదరణ లభిస్తోంది. ఇందులో కథ, నటన ప్రశంసలు అందుకున్నప్పటికీ ఇదొక “ప్రాపగాండా ఫిల్మ్” అనే విమర్శలు ఉన్నాయి.
విమర్శల సంగతి ఎలా ఉన్నా ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు బాగానే ఉన్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



