SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Valentina Sinis
4 గంటలు క్రితం
చదివే సమయం: 6 నిమిషాలు
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరాక్‌లో స్థావరాలు ఏర్పరచుకున్న ఇరానీ కుర్దిష్ సాయుధ బలగాలు త్వరలో సరిహద్దు దాటి ఇస్లామిక్ రిపబ్లిక్‌తో యుద్ధంలోకి దిగచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి.
దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ ఇప్పటికే కొన్ని కుర్ద్ సాయుధ తిరుగుబాటు బలగాలపై దాడులు ప్రారంభించింది. ఆ దాడుల్లో ఒక బాలిస్టిక్ క్షిపణి ధాటికి ఒక సాయుధుడు మరణించినట్లు సమాచారం.
అయితే మార్చి 7న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, కుర్ద్ దళాలు ఇరాన్ భూభాగంలో యుద్ధంలో పాల్గొనడం తనకు ఇష్టం లేదని అన్నారు.
ఈ కుర్దిష్ సాయుధ తిరుగుబాటు దళాలలో ఒక ప్రత్యేక మహిళా సైన్యం కూడా ఉంది.
ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఇరాక్ ఉత్తర ప్రాంతంలో పని చేస్తున్న ఈ దళాన్ని కలిసేందుకు బీబీసీకి అరుదైన అవకాశం లభించింది.

ఇరాక్ ఉత్తర భాగంలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న లోతైన గుహలు, భూగర్భ సొరంగాలలో ఈ కుర్ద్ సాయుధుల స్థావరాలు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న అనేకమంది కుర్తిస్తాన్ ఫ్రీలైఫ్ పార్టీ ( పార్టియా జియానా ఆజాదీ ఏ కుర్దిస్తానే-పీజేఏకే) సభ్యులు.
ఈ స్థావరాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి పొందడం సులభం కాదు. బీబీసీ బృందానికి అనుమతి లభించేందుకు అనేక రోజులు చర్చలు జరపాల్సి వచ్చింది.
అక్కడికి ఒక మహిళా ఫోటోగ్రాఫర్‌కి మాత్రమే అనుమతించారు. ఆమె పదిరోజుల పాటు వారితో కలిసి సమయం గడిపి వారి జీవితాన్ని దగ్గరిగా పరిశీలించారు.
ఈ ప్రాంతం కుర్దిస్తాన్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో భాగం. ఇక్కడ ఈ సాయుధులు ఒక రహస్య కమ్యూనికేషన్ వ్యవస్థను నిర్వహిస్తూ, అధికారిక వ్యవస్థలకు దూరంగా జీవిస్తున్నారు.
గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్‌లోని పలు కుర్ద్ తిరుగుబాటు బలగాలు సరిహద్దు దాటి ఇరాక్ పర్వతాల్లో స్థిరపడ్డాయి. అక్కడి నుంచి వారు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
ఇరాన్ గూఢచార సంస్థలు, ఇరాక్‌లోని షియా మిత్ర బలగాలు, అలాగే తుర్కియే సైన్యం నుంచి తప్పించుకోవడానికి వారు ఈ ప్రాంతాల్లో రహస్యంగా జీవిస్తున్నారు.
ఇటీవల ఉత్తర ఇరాక్‌లో ఉన్న ప్రధాన ఇరానీ కుర్దిష్ బలగాలు ఒక కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ వారి నాయకులతో నేరుగా మాట్లాడి యుద్ధంలో చేరాలని కోరినట్లు ఊహాగానాలు కూడా వినిపించాయి.
మార్చి 5న ట్రంప్ రాయిటర్స్‌కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్వ్యూలో, కుర్దిష్ దళాలు ఇరాన్‌లోకి దాడి చేస్తే అది మంచిదేనని వ్యాఖ్యానించారు.
“వారు అలా చేయాలనుకుంటే అది అద్భుతమైన నిర్ణయమని నేను అనుకుంటున్నా” అని ఆయన అన్నారు.
కానీ, కొద్ది రోజుల తర్వాత మీడియాతో మాట్లాడినప్పుడు ఆయన తన అభిప్రాయాన్ని కొంత మార్చుకున్నారు. “ఈ యుద్ధాన్ని మరింత క్లిష్టం చేయాలని మేము కోరుకోవడం లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రాంతంలో పనిచేసే కుర్దిష్ బలగాల్లో ఒకటి ఫ్రీ లైఫ్ పార్టీ ఆఫ్ కుర్దిస్తాన్. ఈ సంస్థకు చెందిన మహిళా రక్షణ దళం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.
21 ఏళ్ల ఆర్యెన్ అనే యువతి ఈ దళంలో సభ్యురాలు. “నా కుటుంబం కోసం, అలాగే ఎన్నో సంవత్సరాలుగా అణచివేతను ఎదుర్కొంటున్న కుర్ద్ ప్రజల కోసం నేను పోరాడుతున్నా” అని ఆమె అన్నారు.
ఇరాన్‌లో కుర్ద్ ప్రజలు వివక్షను ఎదుర్కొంటున్నారనీ, ఈ పరిస్థితుల్లో ఆయుధాలు పట్టుకోవడంతప్ప తనకు మరో మార్గం లేదని ఆమె చెప్పారు. రెండు సంవత్సరాల కిందటే ఆర్యెన్ ఈ సంస్థలో చేరారు.
రహస్య స్థావరాలు
ఫొటో సోర్స్, Valentina Sinis
సరిహద్దుల్లో ఉన్న గుహలు ఈ మహిళా సాయుధులకు సురక్షిత స్థావరాలు. వీటిలో ఆహారం, నగదు, ఆయుధాలు నిల్వ ఉంచుతారు.
సంస్థలో ఎంతమంది సాయుధులు ఉన్నారన్నది రహస్యం. అయితే అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభానికి ముందే ఈ స్థావరంలో సుమారు 60 మంది సభ్యులు ఉండగా అందులో ఎక్కువమంది మహిళలే.
శిక్షణలో వారికి సైనిక వ్యాయామాలు, సైద్ధాంతిక బోధనలు, స్నైపర్, డ్రోన్ వినియోగంపై ప్రత్యేకంగా మెలకువలు నేర్పుతున్నారు. ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో సరిహద్దు వైపు పంపేందుకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.
40 ఏళ్ల గెలావేజ్ ఎవ్రిన్ ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా నాయకుల్లో ఒకరు. 20 ఏళ్ల వయసులో, ఇరాన్ నగరం ఉర్మియాలో చదువుకుంటున్న ఆమె తన చదువును వదిలేసి ఈ దళంలో చేరారు.
తర్వాత ఆమె సంస్థ ప్రతినిధిగా కూడా పనిచేశారు.
“ఈ యుద్ధం వస్తుందని మేము ఎప్పుడో ఊహించాం” అని ఆమె బీబీసీతో అన్నారు.
గత ఇరవై సంవత్సరాలుగా ఆమె ఈ పర్వతాల్లోనే జీవిస్తున్నారు. కుటుంబ సభ్యులను చూసి చాలా సంవత్సరాలు గడిచిపోయాయని ఆమె చెబుతున్నారు.
2022లో ఇరాన్‌లో మహిళా ఆధ్వర్యంలో ప్రారంభమైన నిరసన ఉద్యమాలు ఇప్పటికే ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వాన్ని బలహీనపరిచాయి.
ఈ నిరసనలకు కారణం 22 ఏళ్ల కుర్దిష్ యువతి మహాసా అమీనీ మరణం. హిజాబ్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో ఆమెను ఇరాన్ పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీలో ఆమె మరణించారు. ఈ మరణం ఇరాన్ వ్యాప్తంగా భారీ ఆందోళనలకు దారితీసింది.
ఈ ఉద్యమం పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ, అనేకమంది యువతులను ఇది ప్రభావితం చేసింది.
ఫొటో సోర్స్, Valentina Sinis
‘వేరే మార్గం లేదు’
18 ఏళ్ల బిగెన్ అనే యువతి ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. పాఠశాలలో హిజాబ్ ధరించకుండా నిరసన వ్యక్తం చేసారు. తరువాత ఆమె కుర్ద్ సాయుధ దళంలో చేరారు.
“మహిళలకు చాలా తక్కువ ఆప్షన్లు ఉంటాయి. గృహ హింస, సామాజిక నియంత్రణలను భరించాలి లేదా విప్లవం ద్వారా మనల్ని మనమే రక్షించుకోవాలి” అని ఆమె అన్నారు.
డెంటిస్ట్‌గా పనిచేసిన డెలాల్ అనే మహిళ, 23 ఏళ్ల వయసులో గెరిల్లా దళ సభ్యురాలిగా మారారు.
“రాబోయే తరాల కుర్దులకు స్వేచ్ఛాయుతమైన భవిష్యత్తును అందించేందుకే నా పోరాటం. గత 200 సంవత్సరాలుగా కుర్దులు అణచివేత, హింసను ఎదుర్కొంటున్నారు” అని ఆమె చెబుతున్నారు.
పీజేఏకే సంస్థ 2004లో ఏర్పడింది. దీనికి తుర్కియేలోని కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే)తో సంబంధాలు ఉన్నట్లు భావిస్తారు.
తుర్కియే, ఇరాన్ రెండు దేశాల ప్రభుత్వాలు ఈ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి.
ఉగ్రవాద సంస్థ పీజేఏకే కార్యకలాపాలను తాము నిరంతరం గమనిస్తున్నామని తుర్కియే రక్షణ శాఖ తెలిపింది. ఈ సంస్థ జాతి ఆధారిత వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ, ప్రాంతంలోని శాంతికి, స్థిరత్వానికి ముప్పు కలిగిస్తోందని తుర్కియే ఆరోపిస్తోంది.
ఫొటో సోర్స్, Valentina Sinis
అంతర్యుద్ధ భయాలు
ముందున్న సవాళ్ల తీవ్రతను కుర్దు సాయుధ దళాల సభ్యులు గుర్తించగలుగుతున్నారు. ముఖ్యంగా, ఇస్లామిక్ రిపబ్లిక్‌కు చెందిన బలమైన సాయుధ దళాలతో నేరుగా పోరాడే పరిస్థితి కూడా ఎదురయ్యే అవకాశముందని వారు భావిస్తున్నారు.
“మేము అంతర్గత యుద్ధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావద్దని ఆశిస్తున్నాం. ప్రస్తుత పాలకుల పతనానికి దారితీసేలా యుద్ధాన్ని మలిచేందుకు మేము చేయగలిగిన ప్రతిదీ చేయాలి. లేదంటే ఈ యుద్ధం భవిష్యత్తులో మావైపుకు మళ్లి, మాలో మేమే యుద్ధం చేయాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు” అని బీబీసీతో అన్నారు ఎవ్రిన్.
ఈ యుద్ధం తర్వాత ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యానికి ఇరాన్ ఆదర్శంగా నిలవాలని ఆ దేశంలోని ప్రతిపక్ష శక్తులు ఆశిస్తున్నాయి. జాతీయవాదులు ప్రాబల్యం సాధిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇరాన్‌లో సుమారు 9 కోట్ల జనాభాలో దాదాపు 10 శాతం మంది కుర్ద్ తెగకు చెందినవారే. దశాబ్దాలుగా తాము ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి రాజకీయ అణచివేత, వివక్షను ఎదుర్కొంటున్నామని వారు ఆరోపిస్తున్నారు.
గత కొంతకాలంగా ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఇరానీ కుర్దిష్ బలగాలపై తెహ్రాన్ ప్రభుత్వం దాడులను తీవ్రతరం చేసింది.
తమ సాయుధులు ఇరాన్ సరిహద్దు దాటి లోపలికి వెళ్లలేదని పీజేఏకే దళాల నేతలు చెబుతున్నారు.
కానీ, ఇప్పటికే తమ సాయుధ దళాలు ఇరాన్ భూభాగంలో ఉన్నాయని, సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాయని పీజేఏకే పేర్కొంది.
“రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయనే విషయం ఆధారంగా మా సైనిక పాత్రను నిర్ణయిస్తాం” అని ఒక నాయకుడు బీబీసీకి తెలిపారు.
ఫొటో సోర్స్, Valentina Sinis
భవిష్యత్తు కార్యచరణపై అనిశ్చితి
మహిళా రక్షణ దళాలకు చెందిన సాయుధులు ఆశించే “స్వేచ్ఛ” చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక లక్ష్యం
డెలాల్ ఇప్పటికే శిక్షణ స్థావరాలను వదిలి సరిహద్దుకు సమీప ప్రాంతానికి చేరుకున్నారు. కుర్దిష్ దళాలు నిజంగా ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో చేరితే, ఆ పోరాటం ఎంతకాలం కొనసాగుతుందో లేదా దాని ఫలితం ఏమవుతుందో ఇప్పుడే చెప్పడం అసాధ్యం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



