SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
”అమ్మానాన్న విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు నాకు కేవలం 12 ఏళ్లే. ఇంట్లో ఏం జరిగేదో నాకసలు అర్థం కాకపోయేది. అమ్మ నా సంరక్షణ బాధ్యతలు చూసుకునేది. నాన్న ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చి నన్ను చూసేవాడు. కానీ, క్రమంగా ఈ పదిహేను రోజులు నెల, ఆ తర్వాత కొన్ని నెలలకు, ఏడాదికి మారాయి, ఎందుకలా అన్నది నాకు తెలియదు”
”నాన్నకు నేను చాలా క్లోజ్. ఏం చేస్తానన్నాఆయన అడ్డుకునేవారు కాదు. ప్రతిరోజూ నాన్న ఇంటికి వచ్చే వరకు వేచి చూసేదాన్ని. కానీ, ఆయన రావడం మానేశారు. అమ్మానాన్న తీసుకున్న ఈ నిర్ణయం నా జీవితం మొత్తాన్ని మార్చేసింది”
‘‘అమ్మ బాగా ఏడవడం చూసేదాన్ని. నా బాల్యం, ఆనందం అంతా అయిపోయినట్టనిపించేది.ఇంట్లో ఎప్పుడూ విచారం రాజ్యమేలుతుండేది’’
”ఇప్పుడు నా వయసు 33 ఏళ్లు. నాకు ఇద్దరు పిల్లలు. పిల్లల ముందు భార్తతో గొడవ పడకుండా ప్రయత్నిస్తుంటాను. ఇలాంటి గొడవలు పిల్లలకు ఎంత బాధ కలిగిస్తాయో నాకు తెలుసు’’
ఈ విషయాలను మాతో పంచుకుంటూ కోమల్ (పేరు మార్చాం) తన చిన్ననాటి రోజుల్లోకి జారుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నప్పుడల్లా ఈ రోజుకూ ఆమె ఎంతో బాధ అనుభవిస్తుంటారు.

తానే స్వయంగా విడాకుల బాధ అనుభవించిన మహిళతో మేం మాట్లాడాం. ఆమెకు ఒక బిడ్డ ఉన్నారు.
” నా ఏడేళ్ల కూతురు, అంత చిన్నవయసులోనే మానసికంగా ఇంత బలంగా ఎప్పుడు మారిందో నాకు తెలియదు’’ అని ఆమె బీబీసీకి చెప్పారు.
”మేం విడిపోయినప్పుడు తను నా కడుపులో ఉంది. కూతురు పుట్టాక ఆయన ఒక్కసారి మాత్రమే కూతురిని చూడటానికి వచ్చారు. ఆ తర్వాత, మేం కోర్టులోనో, మా మా విడాకుల విషయంపై చర్చించడానికి బంధులందరూ వచ్చినప్పుడో మాత్రమే కలుసుకునేవాళ్లం. అప్పుడే నేను ఆయన్ను చూసేదాన్ని”
”తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. నేను ఏడవడం నా కూతురు మాత్రమే చూసేది. ఈరోజు తనకు నాన్న అనే పదానికి అర్థమే తెలియదు. ఎందుకంటే తను వాళ్ల నాన్నను ఎప్పుడూ చూడలేదు. నాన్న లేకుండా బతకడం నేర్చుకుంది. జీవితంలో మా అమ్మాయి ఏం కోల్పోయిందో నాకు తెలుసు’’ అని ఆ మహిళ చెప్పారు.
”ఆయన నాపై చేయి చేసుకునేవారు. విడిపోవాలనే నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా భావిస్తాను. నన్ను వాళ్ల నాన్న కొట్టడం చూసి ఉంటే బహుశా ఆమె జీవితం చాలా దారుణంగా ఉండేది”
ఫొటో సోర్స్, Getty Images
మన చుట్టూ ఇలాంటి చాలా కేసులు ఉంటాయి. విడాకులనేవి కేవలం ఆ జంటకు మాత్రమే కాదు, వారి పిల్లలకు, కుటుంబాలకు కూడా బాధాకరం.
ఇటీవల ఓ జంట విడిపోయే వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. తల్లిదండ్రులు విడిపోయినప్పుడు, బిడ్డ సంరక్షణ బాధ్యతలను తల్లికి అప్పజెప్పారు.కానీ, ఆ బిడ్డ తన తండ్రిని విడిచిపెట్టేందుకు నిరాకరించాడు. తన తండ్రి చేతుల్లో బాగా ఏడుస్తున్నట్లు ఆ వీడియోలో కనిపించింది.
ఈ వీడియో బయటికి వచ్చిన తర్వాత, తల్లిదండ్రులు విడిపోయినప్పుడు పిల్లలపై పడే ప్రభావం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు లేదా విడిపోయినప్పుడు పిల్లల మానసిక స్థితిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, పిల్లలకు కౌన్సెలింగ్ ఎంత అవసరం? ఈ ప్రభావం వారి జీవితాంతం ఉంటుందా? అనే విషయాలను నిపుణుల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.
అయితే, భారతీయ సమాజంలో విడాకులను ఇప్పటికీ ఓ సామాజిక అగౌరవంగా చూస్తున్నారా? సమాజంలో ఏమైనా మార్పులు వచ్చాయా? అనే విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.
పిల్లల సంరక్షణ బాధ్యతలను నిర్వహించేటప్పుడు ఎటువంటి నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవాలో తెలుసుకుందాం..
ఫొటో సోర్స్, Getty Images
పిల్లల మానసిక ఆరోగ్యంపై చూపే ప్రభావమెంత?
‘రోడ్డుమ్యాప్ టూ మేనేజింగ్ డైవర్స్’ అనే పుస్తకాన్ని రాసిన డాక్టర్ సుచిత్ర దల్వితో మేం మాట్లాడాం. పలు ఎన్‌జీఓలతో కలిసి ఆమె పనిచేస్తున్నారు.
విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్న కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇస్తుంటారు సుచిత్ర దల్వి.
విడాకులకు ముందు కుటుంబపరిస్థితులు, విడాకుల తరువాత పరిస్థితులను అంగీకరించే పద్ధతి, పిల్లలు ఎలా స్పందిస్తారనే విషయాలు ఇందులో కీలకపాత్ర పోషిస్తాయని డాక్టర్ సుచిత్ర భావిస్తున్నారు.
”ఒకవేళ పరిస్థితులు చాలా దారుణంగా ఉండి, తల్లిదండ్రుల మధ్య వేధింపులతో కూడిన సంబంధం ఉంటే.. ఆ పిల్లలు అప్పటికే చాలా బాధను అనుభవిస్తారు. విడాకుల తర్వాత, వారి జీవితం మెరుగైన దిశగా వెళ్లచ్చు” అని తెలిపారు.
”కానీ, పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులతో ఒకే రకమైన అనుబంధాన్ని కలిగి ఉంటే, ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేరు. అప్పుడు ఇద్దరిలో ఎవరిని విడిచి ఉండాలన్నది వారికి కష్టంగా మారుతుంది. ఎవరితో ఎక్కువ అనుబంధం ఉంటుందో, కొన్నిసార్లు వారికే సంరక్షణా బాధ్యతలు దక్కవు. ఇదంతా భరించడం పిల్లలకు చాలా కష్టంగా ఉంటుంది” అని డాక్టర్ సుచిత్ర అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఎలాంటి ప్రభావం పడుతుంది?
- విడాకులలాంటి పరిస్థితుల్లో, కొన్నిసార్లు పిల్లలు సమాజం నుంచి తమకు తాము ఏకాకులైపోతారు . ఇతరులతో కలిసినప్పుడు అసౌకర్యంగా భావిస్తారు.
- ఆత్మ విశ్వాసం బాగా దెబ్బతింటుంది. ఇతరులతో పోలిస్తే తాను తక్కువ అనే నూన్యత భావానికి గురవుతారు.
- కొన్నిసార్లు పిల్లలే దీనికి కారణమనే అపరాధ భావంతో ఉంటారు.
- ఇతరులతో మాట్లాడకుండా తప్పించుకుంటారు. లేదంటే ఎక్కువగా మాట్లాడతారు
- ఇలాంటి పిల్లలు ఏదైనా బంధంలోకి అడుగుపెడితే అసౌకర్యంగా ఉంటారు
- ఈ మానసిక గాయం వారి జీవితంలో భాగమవుతుంది.
- ఈ భావోద్వేగాలను పిల్లలు తమ జీవితాంతం భరిస్తారు. మానసికంగా అలసిపోయినట్లు భావిస్తారు.
- ఇది వారి చదువులపై ప్రభావం చూపుతుంది. స్కూల్‌లో చదువులపై శ్రద్ధ పెట్టలేరు.
కౌన్సెలింగ్ ఎంత ముఖ్యం?
తల్లిదండ్రుల విడాకులు పిల్లలపై బాగా ప్రభావం చూపుతాయని సీఎంసీ లూధియానాలోని సైకియాట్రీ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ పల్లవి అభిలాష చెప్పారు.
తమ వద్దకు వచ్చే చాలా మంది పిల్లల్లో కనిపించే లక్షణాలను వివరించారు.
- అపోజిషనల్ డెఫియంట్ డిజార్డర్ (ఓడీడీ) (ఎప్పుడూ చిరాకు,కక్ష సాధింపు ధోరణి, వాదించే ధోరణి )
- కాండక్ట్ డిజార్డర్ (సీడీ) (ఇతరులపై శారీరకంగా దాడి చేయడం, మోసగించడం, నిబంధనలను ఉల్లంఘించడం)
- ప్రమాదకర శృంగార ధోరణి (ఆర్‌ఎస్‌బీ) (అసురక్షిత శృంగారం, ఒకరికి మించిన వ్యక్తులతో శృంగారం, ఇతర అంశాల ప్రభావంతో శృంగారానికి పాల్పడటం)
- ఆల్కాహాల్ లేదా డ్రగ్స్ వైపు మొగ్గు చూపడం
- యాంగ్జైటీ, గుండె దడ, ఊపిరి అందకపోవడం
- పానిక్ అటాక్
- న్యూరోటిక్ డిజార్డర్
ఫొటో సోర్స్, Getty Images
ఇలాంటి పిల్లలు ఎప్పుడూ కోపాన్ని ప్రదర్శిస్తుంటారని, పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటారని డాక్టర్ పల్లవి అభిలాష చెప్పారు. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక రోజుల్లో వారి బాధ మరింత పెరుగుతుందని అన్నారు.
ఇతర పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ఆడుకుంటూ, నవ్వుతూ ఉండటం చూసినప్పుడు వీరు తీవ్రమైన అసౌకర్యానికి లోనవుతారని డాక్టర్ పల్లవి అభిలాష తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో తరచూ అబ్బాయిలు, అమ్మాయిలు భిన్నంగా ప్రవర్తిస్తుంటారని వారు చెప్పారు. అమ్మాయిలు బాగా అర్థం చేసుకుంటారని తెలిపారు.
పరిస్థితిని అర్థం చేసుకుని, సర్దుకుపోతుంటారు. ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు.
ఇదే సమయంలో అబ్బాయిలు కోపాన్ని ప్రదర్శిస్తుంటారు.
సమాజం తమని జడ్జ్ చేస్తుందని పిల్లలు భయపడతారని, అందుకే వారు సమాజం నుంచి దూరంగా వెళ్తుంటారని నిపుణులు చెబుతున్నారు.
ఇతరులతో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్లు, గేమ్‌లు లేదా పుస్తకాలతో తమను తాము బిజీగా ఉంచుకుంటారని తెలిపారు.
ఇలాంటి పరిస్థితులో కౌన్సెలింగ్ చాలా కీలకమని డాక్టర్ పల్లవి చెప్పారు. మందులతో ఈ మానసిక ఒత్తిడిని, కుంగుబాటును తగ్గించవచ్చన్నారు.
మనసు విప్పి మాట్లాడటం వల్ల, ప్రతిదాన్ని నయం చేయచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు, స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యుల ప్రవర్తన చాలా ముఖ్యమన్నారు డాక్టర్ పల్లవి.
భారతీయ సమాజం ఇంకా విడాకులను మనస్ఫూర్తిగా స్వీకరించడం ప్రారంభించలేదని డాక్టర్ సుచిత్రా దల్వి అంటున్నారు.
సమాజం మారుతోందని వారు నమ్ముతారు కానీ ఇంకా చాలా మార్పు అవసరమని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో కచ్చితంగా కొంత మార్పును చూస్తున్నాం, కానీ అది పూర్తిగా లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని అంటున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



