Home జాతీయ national telgu తమిళనాడు: అభయారణ్యాలలో దూసుకువచ్చే రైళ్ల నుంచి ఏనుగులను ఎలా కాపాడుతున్నారంటే…

తమిళనాడు: అభయారణ్యాలలో దూసుకువచ్చే రైళ్ల నుంచి ఏనుగులను ఎలా కాపాడుతున్నారంటే…

13
0

SOURCE :- BBC NEWS

రైల్వే ట్రాక్స్ పై ఏనుగులు

ఫొటో సోర్స్, Getty Images/BBC

కోయంబత్తూరు అభయారణ్యంలో రైల్వే ట్రాక్స్ సమీపంలోకి ఏనుగులు రాకుండా నిరోధించడానికి ఏఐ సాంకేతికత, మానవరహిత డ్రోన్ కెమెరాలు, నిఘా డ్రోన్లను ఉపయోగించే ఓ కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు.

ఈ డ్రోన్లు 24గంటలూ రెండు రైల్వే ట్రాక్‌లను పర్యవేక్షిస్తుంటాయని, ట్రాక్ సమీపంలోకి ఏనుగులు వస్తే, సైరన్ మోగించి అవి వెనక్కి మళ్లేలా చేస్తాయని బీబీసీ పరిశోధనలో వెల్లడైంది.

దేశంలో 2010 నుంచి 2024 మధ్యన రైళ్లు ఢీకొని 186 ఏనుగులు మృతి చెందినట్లు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. ఈ శాఖతోపాటు రైల్వే మంత్రిత్వ శాఖ, తమిళనాడు అటవీ విభాగం సంయుక్తంగా జరిపిన అధ్యయనం 77 రైల్వే లైన్లపై వన్యప్రాణుల మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది.

ఈ అధ్యయనంలో పలు నిర్మాణాత్మక మార్పులను, సవరణలను కూడా ప్రతిపాదించారు. తమిళనాడు-కేరళ సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతాల్లోని రెండు రైల్వే లైన్లపై రైళ్లు ఢీకొనడంతో పెద్ద సంఖ్యలో ఏనుగులు మరణించినట్టు ఈ అధ్యయనం గుర్తించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తమిళనాడు సరిహద్దులోని ఎత్తిమడై రైల్వే స్టేషన్, కేరళ సరిహద్దులోని వాలయార్ రైల్వే స్టేషన్ మధ్య 7 కిలోమీటర్ల దూరంలో రెండు రైల్వే లైన్లు (ఏ,బీ) ఉన్నాయని అటవీ శాఖ పేర్కొంది. ఈ రెండు రైల్వే లైన్లు మదుక్కరాయ్ ,చోళక్కరాయ్ అభయారణ్యాన్ని మూడు భాగాలుగా విభజిస్తాయి.

అటవీ అధికారులు బీబీసీతో మాట్లాడుతూ 2008 నుంచి 2021 మధ్య జరిగిన ఆరు రైలు ప్రమాదాల్లో 11 ఏనుగులు మరణించాయన్నారు.

ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో అటవీ , రైల్వే శాఖల మధ్య చర్చలు జరిగినట్లు తెలిపారు. రైళ్లు ఢీకొని ఏనుగులు చనిపోకుండా రైల్వే, అటవీ శాఖ సంయుక్తంగా పలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

రైళ్లు, ఏనుగులు, తమిళనాడు

తమిళనాడులో సహాయక చర్యలు

తమిళనాడు అడవుల్లో రైల్వే ట్రాక్‌ల వెంబడి పెద్ద ఎత్తున ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. ఒక వైపు నుంచి మరో వైపునకు ఏనుగులు జాగ్రత్తగా వెళ్లేందుకు ట్రాక్‌ల కింద రెండు అండర్‌పాస్‌లను రైల్వే శాఖ నిర్మించింది.

రైల్వే ట్రాక్‌ల దగ్గరకు ఏనుగులు వచ్చినప్పుడు, సెర్చ్ లైట్లు, ఫైర్ క్రాకర్స్ ద్వారా అవి పక్కకు మళ్లేలా చేసేందుకు ట్రాక్ వాచర్స్‌ను నియమించారు.

ఈ ప్రయత్నం కూడా కొంతమేర విజయం సాధించింది. అయితే, రైళ్లు దగ్గరకు వచ్చినప్పుడు ఏనుగులను గుర్తించి తరిమికొట్టడానికి 7 కిలోమీటర్ల దూరంలోని ఈ రెండు రైల్వే లైన్లలో సిబ్బందిని నియమించడంలో ఆచరణాత్మక ఇబ్బందులు ఉన్నాయి.

ఏనుగులను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీని వాడాలని 2023లో తమిళనాడు అటవీ విభాగం భావించింది. ఇందుకోసం వలియార్‌కు సమీపంలోని నవక్కరాయ్ అటవీ ప్రాంతంలో ఏఐ కంట్రోల్ సెంటర్‌ ఏర్పాటు చేసింది.

ఏఐ కంట్రోల్ సెంటర్

ఏఐ కంట్రోల్ సెంటర్ ఎలా పనిచేస్తుంది?

ఏ, బీ మార్గాలలో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు. ఇవి చీకట్లో కూడా ఏనుగులను వాటి శరీర ఉష్ణోగ్రత బట్టి గుర్తిస్తాయి.

ఈ కెమెరాలను ఏఐ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానిస్తారు. ప్రతి కెమెరాను 24 గంటల పాటు ఇద్దరు వ్యక్తులు పర్యవేక్షిస్తుంటారు.

”ఎప్పుడైనా ఏనుగులు రైల్వే ట్రాక్‌లకు దగ్గరగా వస్తే, ఏఐ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న అలారం మోగుతుంది. ఏఐ టెక్నాలజీ వెంటనే ఆ మార్గానికి ఏనుగులు ఎంత దూరంలో ఉన్నాయో గుర్తిస్తుంది. ఆటోమేటిక్‌గా రైల్వే విభాగానికి ఒక సందేశాన్ని పంపుతుంది” అని ఏఐ కంట్రోల్ సెంటర్‌లో పనిచేసే ఉద్యోగి సంతోష్ బీబీసీతో చెప్పారు.

”స్టేషన్ మేనేజర్ వెంటనే లోకో పైలట్‌కు ఆ విషయం తెలియజేస్తారు. ఆ నిర్దిష్ట ప్రాంతంలో రైలును ఆపడమో లేదా చాలా తక్కువ వేగంలో రైలును నడపడమో చేస్తారు. ఈ సమాచారాన్ని తమిళనాడు అటవీ విభాగానికి చెందిన అధికారికి కూడా పంపిస్తారు. ఈ రెండు మార్గాల్లో 25 ట్రాక్ వాచర్లను మోహరించారు” అని తెలిపారు.

”ఈ సెంటర్ 2024 ఫిబ్రవరి నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది. అప్పటి నుంచి తమిళనాడు అటవీ విభాగం, రైల్వే విభాగం కలిసి చేసిన ప్రయత్నంలో ఏనుగులు ఈ రెండు రైల్వే లైన్లను దాటుతున్నప్పుడు రైళ్లు ఢీకొనకుండా చేయడం వల్ల 8,750 ప్రమాదాలను నిరోధించారు” అని చెప్పారు.

”రైల్వే విభాగం సహకారం చాలా గణనీయమైంది. 2021 వరకు, ఒక్కరోజులోనే రైలు ప్రమాదంలో మూడు ఏనుగులు మరణించేవి. అప్పుడు ఆ ప్రాంతంలో సూపర్‌ఫాస్ట్ రైళ్లు గంటకు 100 నుంచి 120 కి.మీలు, సరుకు రవాణా రైళ్లు గంటకు 60 నుంచి 70 కి.మీల వేగంతో నడిచేవి. ఆ తర్వాత సూపర్‌ఫాస్ట్ వేగాన్ని గంటకు 40 నుంచి 45 కి.మీలకు, సరుకు రవాణా రైళ్ల వేగాన్ని గంటకు 25 నుంచి 30 కి.మీలకు తగ్గించారు” అని అటవీ విభాగానికి చెందిన టెక్నికల్ అసిస్టెంట్, కంట్రోల్ సెంటర్‌కు చెందిన నిర్వహణ మేనేజర్ నిత్యానందం తెలిపారు.

తమిళనాడు అటవీ శాఖ కార్యదర్శి సుప్రియ సాహు దీని గురించి పూర్తి సమాచారాన్ని తన సోషల్ మీడియా పేజీలో నిరంతరం పోస్టు చేస్తున్నారు. దీనిలో, ఈ సెంటర్ పనిచేయడం ప్రారంభించినప్పటి నుంచి, రైలు ఢీకొట్టి ఏ ఒక్క ఏనుగు కూడా ప్రమాదానికి గురి కాలేదని తెలిపారు.

ఏనుగులు

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN/AFP via Getty Images

పర్యవేక్షణ ఎలా?

రైల్వే ట్రాక్‌లకు దగ్గరగా వచ్చే ఏనుగులను పక్కకు వెళ్లేలా లేదా వాటిని ఆపేలా చేసేందుకు ఇదే ఏఐ టెక్నాలజీని వాడుతూ కొత్త ప్రాజెక్టును తమిళనాడు అటవీ విభాగం అమల్లోకి తెచ్చింది.

తమిళనాడు ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలో తమిళనాడు అన్‌మాన్డ్ ఏరియల్ వెహికిల్స్ కార్పొరేషన్ (టీఎన్‌యూఏవీటీసీ) సహకారంతో తమిళనాడు అటవీ విభాగం రూ.8.3 కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది.

ప్రైవేట్ కంపెనీ సాయంతో అన్‌మాన్డ్ ఏరియల్ వెహికిల్స్ కార్పొరేషన్ 3 టెథర్డ్ డ్రోన్లు, 3 నిఘా డ్రోన్లను ఈ ప్రాజెక్టు కోసం అభివృద్ధి చేసింది.

నవక్కరాయ్‌లో ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తోన్న ఏఐ కంట్రోల్ సెంటర్‌కు సమీపంలో మరో కంట్రోల్ రూమ్‌ను దీనికోసం ఏర్పాటు చేశారు. ఈ రెండు రైల్వే లైన్లను పర్యవేక్షించేందుకు పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో మూడు ప్రదేశాల్లో కొత్తగా వాచ్ టవర్లను కూడా నిర్మించారు.

ఈ మూడు ప్రాంతాల నుంచి కేబుల్స్ ద్వారా విద్యుత్‌కు అనుసంధానమయ్యే ఈ మూడు డ్రోన్లు 100 నుంచి 150 మీటర్ల ఎత్తులో రోజుకు 24 గంటలు వారంలో ఏడు రోజుల పాటు ఎగురుతాయి. ఒకవేళ కరెంట్ పోతే, ఆరు గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా జనరేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.

ఏఐ సెంటర్

ఏఐ టెక్నాలజీతో నడిచే డ్రోన్లకు అమర్చిన కెమెరాలు కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించిన కనెక్టెడ్ ల్యాప్‌టాప్‌లలో పరిసర ప్రాంతాలను, రెండు రైల్వే ట్రాక్‌లను, అటవీ ప్రాంతాలను చూపిస్తాయి. ఈ కెమెరాలు థర్మల్ విధానంలో రాత్రిపూట చిత్రాలను కూడా కచ్చితంగా చూపుతాయి.

”ఈ రకమైన డ్రోన్ మోటార్ నేరుగా విద్యుత్‌తో నడుస్తుంది. అది వేడెక్కదు. జీపీఎస్‌ను కలిగి ఉంటుంది. కచ్చితమైన భౌగోళిక సమాచారం దీని వద్ద ఉంటుంది. భారీ వర్షాల సమయంలో కూడా ఈ డ్రోన్‌ను నడపవచ్చు. భారీ ఈదురుగాలులు, వర్షాలు వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ఆపరేట్ చేయలేం” అని టీఎన్‌యూఏవీటీసీకి చెందిన డ్రోన్ ఇంజనీర్ బాలమురుగన్ చెప్పారు.

”దీనిలో అమర్చిన జూమ్ కెమెరా 180 డిగ్రీల్లో తిరుగుతుంటుంది. వీడియో కంట్రోల్ యూనిట్‌లో రికార్డు అయిన ఫుటేజీ నేరుగా ల్యాప్‌టాప్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు వస్తుంది. ఇలా అన్ని డ్రోన్లకు చెందిన సమాచారాన్ని కంట్రోల్ రూమ్‌లో రికార్డు చేస్తాం” అని తెలిపారు.

”ఈ డ్రోన్ ఒక ప్రదేశం నుంచి 2.5 కి.మీల పొడవైన రైల్వే ట్రాక్‌ను పర్యవేక్షిస్తుంది. రైల్వే ట్రాక్‌ను పర్యవేక్షించడం మాత్రమే కాక, ప్రజలు తరచూ వచ్చే ప్రాంతాల్లో ఏనుగుల కదలికలను ట్రాక్ చేయచ్చు” అని చెప్పారు.

రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా ఉండే 100 మీటర్ల ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా వర్గీకరించారు. 200 నుంచి 300 మీటర్ల ప్రాంతాన్ని ఆరెంజ్ జోన్‌గా వర్గీకరించారు.

టెథర్డ్ డ్రోన్లతో పాటు బ్యాక్టరీతో నడిచే డ్రోన్లను కూడా ఏనుగుల కదలికలను గుర్తించేందుకు వాడుతున్నారు.

అండర్‌పాస్

డ్రోన్లతో ఏనుగులను ఎలా తరిమికొడతారంటే..

”రైల్వే ట్రాక్‌లకు సమీపంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఏఐ కెమెరాలు ఏనుగులు చాలా దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే వాటిని గుర్తించి, ఏఐ కంట్రోల్ సెంటర్‌కు చెబుతాయి. కానీ, కేబుల్‌తో అనుసంధానమైన ఈ డ్రోన్లు రైల్వే ట్రాక్‌లను పర్యవేక్షిస్తూ.. 200 మీటర్ల దూరంలో ఏనుగులు ఉన్నప్పుడే వీటిని గుర్తించి, డ్రోన్ కంట్రోల్ రూమ్‌కి, ఏఐ కంట్రోల్ సెంటర్‌కి తెలియజేస్తాయి” అని డ్రోన్ పైలట్ షెర్పిన్ చెప్పారు.

”మేం ఒకవేళ ఏనుగు గుర్తిస్తే, ఏ దిశగా అది వెళ్తుందో మేం గుర్తిస్తాం. రైల్వే ట్రాక్‌లకు ఎంత దూరంలో ఉందో చూస్తాం. వెంటనే నిఘా డ్రోన్లను పంపించి, సైరన్ శబ్దాలను మోగిస్తాం లేదా తేనెటీగల వస్తున్న శబ్దాలు చేయిస్తాం. అలా ఏనుగును అడవిదారికి మళ్లిస్తాం” అని షెర్పిన్ తెలిపారు.

ఏఐ కంట్రోల్ సెంటర్ 2024 నుంచి రైల్వేకు, తమిళనాడు అటవీ విభాగానికి సమాచారాన్ని అందిస్తోంది. రైలు కదలికలను నియంత్రిస్తోంది. ట్రాక్ వాచర్ల ద్వారా ఏనుగులను తరిమికొట్టే కార్యక్రమం చేపడుతున్నారు. దీనిలో చాలా ఇబ్బందులు, ప్రమాదాలు ఉన్నట్లు ట్రాక్ వాచర్లు అంగీకరిస్తున్నారు.

తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని గూదలూరు అటవీ అభయారణ్యం, కోయంబత్తూరులోని కొన్ని ఇతర ప్రాంతాలలో ఏనుగులు-మనుషుల మధ్య సంఘర్షణ సర్వసాధారణంగా ఉంటుంది.

కోయంబత్తూరు జిల్లా అటవీ అధికారి వెంకటేశ్ ప్రభు సమాచారం ప్రకారం.. రైళ్లు ఢీకొట్టకుండా ఏనుగులను కాపాడేందుకు డ్రోన్లను, ఏఐ టెక్నాలజీని కలిపి ఒక ప్రాజెక్టును చేపట్టడం ఇదే తొలిసారి.

”రైళ్లు ఏనుగులను ఢీకొట్టే ప్రమాదాలు ఎక్కువగా రాత్రిపూటే జరుగుతున్నాయి. ఈ ఏఐ టెక్నాలజీ రాత్రిపూట కూడా థర్మల్ చిత్రాల ద్వారా ఏనుగుల కదలికలను గుర్తిస్తుండటంతో.. ట్రాక్ వాచర్లకు రైల్వే అండర్‌పాస్‌ల ద్వారా ఏనుగులను ట్రాక్ చేయడం సులభతరం అయింది. ఇప్పుడు మా పని మరింత సమగ్రంగా మారింది. డ్రోన్లను వాడుతూ శబ్దాలు చేయడం ద్వారా ఏనుగులను తరిమి కొట్టవచ్చు” అని డీఎఫ్ఓ వెంకటేశ్ ప్రభు చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)