Home జాతీయ national telgu డాకూ మాన్‌సింగ్: గోవాను విముక్తం చేస్తానన్న ఈ బందిపోటు కథ ఏంటి, నాలుగు రాష్ట్రాల పోలీసులను...

డాకూ మాన్‌సింగ్: గోవాను విముక్తం చేస్తానన్న ఈ బందిపోటు కథ ఏంటి, నాలుగు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి చివరకు ఎలా చనిపోయారు?

5
0

SOURCE :- BBC NEWS

మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, Social Media

మధ్యప్రదేశ్‌లోని భిండ్ పట్టణం గురించి ఒక ఫేమస్ కథ ఉంది. ఒకసారి అక్కడ తీవ్రమైన కరువు సంభవించింది. భిండ్‌కు దగ్గరలోని రామ్‌పుర్‌లో పంటలన్నీ ఎండిపోయాయి.

అకస్మాత్తుగా ఒకరోజు ఎనిమిది ఎడ్ల బండ్లు ఆ గ్రామంలోకి వచ్చి ఆగాయి. ఆ బండ్ల నిండా గోధుమ బస్తాలున్నాయి. ఆ బండి నడిపే వ్యక్తి వాటిని రామ్‌పుర్ ప్రజల దగ్గరకు తీసుకెళ్లి ‘మాన్ సింగ్ తరఫున ఇస్తున్నాం’ అని మాత్రమే చెప్పారు.

ఈ విషయాన్ని ‘టేల్స్ ఆఫ్ మాన్ సింగ్, కింగ్ ఆఫ్ ఇండియన్ డెకాయిట్స్’ అనే పుస్తకంలో కెన్నెథ్ అండర్సన్ పేర్కొన్నారు.

”ఆ సమయంలో భారత ప్రభుత్వం మాన్ సింగ్ తలపై 15వేల రూపాయల రివార్డు ప్రకటించింది. ఆయన్ను చంపినా, సజీవంగా పట్టుకున్నా ఈ అవార్డు దక్కుతుంది. దాదాపు 200 హత్యానేరాల్లో మాన్‌సింగ్ నిందితుడు. ఆయనపై లెక్కకు మించిన దోపిడీ కేసులున్నాయి. అయినప్పటికీ ఆయన్ను పట్టుకోలేకపోయారు. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు” అని అండర్సన్ రాశారు.

ఎండ్ల బండ్లను నడిపే వ్యక్తులను పోలీసులు అనేక రకాలుగా ప్రశ్నించారు.

”ఒకవారం కిందట వారి దగ్గరకు ఓ వ్యక్తి వచ్చారు. దాదాపు 64 కిలోమీటర్ల దూరంలోని రైల్వేస్టేషన్‌కు వెళ్లాలని వారికి ఆ వ్యక్తి సూచించారు. రామ్‌పుర్‌కు పంపేందుకు ఒక గూడ్స్ రైలు కంపార్ట్‌మెంట్‌లో ధాన్యపు బస్తాలు పెట్టి ఉన్నాయని తెలిపారు. ఒక్కో ఎడ్లబండికి 20 రూపాయలు చొప్పున మొత్తం 160 రూపాయలను వారికి ఆ వ్యక్తి చెల్లించారు.

‘‘ఎడ్ల బండి నడిపే వారి చెవిలో ఆ వ్యక్తి మాన్‌‌ సింగ్ అని గుసగుసగా చెప్పారు. వారంలోపు చెప్పిన పని పూర్తి చేయకపోతే తర్వాతి వారంలో మొదటి రోజు మీరు సూర్యుణ్ని చూడలేరని కూడా ఆ వ్యక్తి హెచ్చరించారు. దీంతో ఆయన చెప్పినట్టు ఆరో రోజున వాటిని ఎడ్లబండి నడిపే వ్యక్తి రామ్‌పుర్‌కు చేరవేశారని పోలీసుల విచారణలో వెల్లడయింది” అని కెన్నెథ్ రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, Rupa Publications

టైమ్ మ్యాగజీన్‌లో మాన్ సింగ్‌పై వార్త

ఒక బందిపోటు మరణంపై అంతర్జాతీయ మ్యాగజీన్‌లో వార్త రావడం చాలా అరుదుగా జరిగే సంఘటన.

”దిల్లీకి దక్షిణంగా ఉన్న నాలుగు రాష్ట్రాల్లో బందిపోటు మాన్ సింగ్‌కు లభించినంత గౌరవం ఎవరికీ దక్కలేదు. ఆయన మనవడి పెళ్లి విందుకు చాలా మంది రాజులు, భూస్వాములు హాజరయ్యారు” అని ‘ఇండియా: డెడ్ మాన్’ అనే శీర్షికతో 1955 సెప్టెంబరు 5న ప్రచురించిన ఆర్టికల్‌లో టైమ్ మ్యాగజీన్ రాసింది.

మాన్ సింగ్‌కు ఎలాంటి వ్యక్తిగత లోపాలు లేవని ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొరేనా క్రైమ్ ఎంక్వయిరీ కమిటీ కూడా 1952లో తన రిపోర్టులో తెలిపింది.

అలాగని మధ్య భారత పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసులను విస్మరించలేం. 27 ఏళ్లలో మాన్ సింగ్ వందలాది హత్యలకు, వేలాది దోపిడీలకు పాల్పడ్డారని పోలీసు రికార్డుల్లో ఉంది.

‘‘మాన్ సింగ్‌ను గౌరవించడమే కాకుండా, ఆయనంటే సాధారణ ప్రజల మనసుల్లో భయం కూడా ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. రాబిన్ హుడ్‌లాగే ఒకప్పుడు మాన్ సింగ్ గౌరవప్రదమైన వ్యక్తి. కానీ ఆయనకు జరిగిన అన్యాయం ఆయన్ను తిరుగుబాటుదారుణ్ని చేసింది” అని టైమ్ మ్యాగజీన్ తన ఆర్టికల్‌లో రాసింది.

మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, Getty Images

నాలుగు రాష్ట్రాల పోలీసుల సెర్చ్ ఆపరేషన్

15 ఏళ్లుగా 8వేల చదరపు మైళ్ల ప్రాంతంలో నాలుగు రాష్ట్రాలకు చెందిన 1700 మంది పోలీసులు మాన్‌సింగ్‌ కోసం వెతికేవారని చెబుతారు. 80 ఎన్‌కౌంటర్లు జరిగినా, ఆయన పోలీసులకు చిక్కలేదు.

మాన్‌ సింగ్‌ను పట్టుకునేందుకు పోలీసులు కోటిన్నర రూపాయలు వెచ్చించారని చెబుతారు. అప్పట్లో ఇది చాలా పెద్ద మొత్తం.

”మాన్ సింగ్ గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకునేవారు. తనను పట్టుకోవడానికి ప్రయత్నించే ఇన్‌ఫార్మర్లను, పోలీసులను మాన్ సింగ్ ఎలా చంపేవారో చెప్పుకునేవారు. బాగా డబ్బున్న వ్యక్తులనే ఆయన కిడ్నాప్ చేసేవారు. స్కూల్ భవనం నిర్మించేందుకు ఆయన భూస్వాముల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు” అని మొరేనా క్రైమ్ ఎంక్వయిరీ కమిటీ తన రిపోర్టులో పేర్కొంది.

”మాన్ సింగ్ మద్యం సేవించరని, ఆయన శాకాహారని చెబుతారు. ఆయన దైవ చింతన ఎక్కువగా ఉన్న వ్యక్తి. సూర్యోదయానికంటే ముందే నదిలో స్నానం చేస్తారు. వెంటనే కాళీ మాత గుడికి వెళ్లి పూజలు జరుపుతారు. సంపన్నులను దోచుకోవడం ద్వారా వచ్చిన డబ్బుతో ఆయన అనేక ఆలయాలు నిర్మించారు” అని కెన్నెథ్ అండర్సన్ రాశారు.

పలు ఆలయాల్లో తన పేరుతో మాన్ సింగ్ ఇత్తడి గంటలు ఏర్పాటుచేశారు. బటేశ్వరనాథ్ ఆలయంలో జరిగే మతపరమైన వేడుకల్లో మాన్ సింగ్ ఎప్పుడూ పాల్గొనేవారు. పోలీసులకు ఈ విషయం తెలిసి ఒకసారి అన్నివైపుల నుంచి ఆలయాన్ని చుట్టుముట్టారు. అయినా, వాళ్ల కళ్లుగప్పి మాన్ సింగ్ ఆలయానికి వచ్చారు.

మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, Sheikh Mukhta

సినిమాల్లో కనిపించే బందిపోటులా…

ఆగ్రాకు దగ్గరలోని రాఠౌర్ ఖేడా గ్రామంలో 1890లో మాన్ సింగ్ పుట్టారు. ఆయన తండ్రి పేరు బిహారీ సింగ్. గ్రామపెద్ద. సంపన్న కుటుంబానికి చెందిన వారు. ఆయన ఇద్దరు కొడుకులు నవాబ్ సింగ్, మాన్ సింగ్‌.

మాన్ సింగ్‌కు చాలా చిన్న వయసులోనే తండ్రి వివాహం జరిపించారు. నలుగురు కొడుకులు పుట్టారు. జశ్వంత్ సింగ్, సుబేదార్ సింగ్, తహసీల్దార్ సింగ్, ధూమన్ సింగ్. ఆయనకు రాణి అనే ఓ కూతురు కూడా ఉన్నారు.

24 ఏళ్ల వయసుకే మాన్ సింగ్ గ్రామపెద్దగా ఎన్నికయ్యారు. ఆగ్రా జిల్లా బోర్డులోనూ సభ్యులయ్యారు. గడ్డం, ఎత్తుగా, గంభీరంగా ఉండే శరీరతత్వం, అందరితో కలిసిపోయే మనస్తత్వంతో యువకునిగా ఉన్నప్పటి నుంచే మాన్ సింగ్‌ ప్రత్యేక గుర్తింపు పొందారు.

మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, ANI

‘దోపిడీపై తప్పుడు నివేదిక’

ఒక భూమి విషయంలో తల్ఫీ రామ్ అనే వ్యక్తితో మాన్ సింగ్ తండ్రి బిహారీ సింగ్‌కు వివాదం ఏర్పడింది. ఆ సమయానికి మాన్ సింగ్ అన్న నవాబ్ సింగ్ కుటుంబాన్ని విడిచిపెట్టి అడవుల్లో ఉంటున్నారు.

అకస్మాత్తుగా గ్రామంలో ఓ దోపిడీ జరిగింది. బందిపోట్లు ఆ గ్రామంలోని వడ్డీవ్యాపారి ఇంటిపై దాడి చేసి, ఆయన్ను పొడిచి చంపారు.

‘‘ఈ దోపిడీలో మాన్ సింగ్ అన్న నవాబ్ సింగ్‌ ప్రమేయం ఉందని తల్ఫీ రామ్ పోలీసులకు తప్పుడు సమాచారమిచ్చి కేసు నమోదు చేయించారు. నవాబ్ సింగ్‌కు తండ్రి ఆశ్రయమిచ్చారని తెలిపారు. వడ్డీ వ్యాపారి తన స్నేహితుడు కావడం వల్లే ఆయన ఇంట్లో దోపిడీకి పాల్పడ్డరాని తల్ఫీ రామ్ ఆరోపించారు. నవాబ్ సింగ్ సోదరుడు మాన్ సింగ్‌కు ఈ దోపిడీ గురించి తెలుసని, ఆయన కూడా దీనికి సహకరించారని ఆ రిపోర్టులో తల్ఫీ రామ్ ఆరోపించారు” అని కెన్నెథ్ అండర్సన్ రాశారు.

ఈ ఘటనను తన కుటుంబానికి జరిగిన అవమానంగా బిహారీ సింగ్ భావించారు. తల్ఫీ రామ్‌కు గుణపాఠం నేర్పించాలని బిహారీ సింగ్, మాన్ సింగ్ నిర్ణయించుకున్నారు. మాన్ సింగ్ తన నలుగురు కొడుకులతో కలిసి అడవుల్లోకి వెళ్లి నవాబ్ సింగ్‌ను కలుసుకున్నారు.

మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, Getty Images

పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మాన్ సింగ్ కొడుకు జశ్వంత్ సింగ్ మృతి

ఒక రాత్రి మాన్ సింగ్ తన సహచరులతో కలిసి తల్ఫీ రామ్ ఇంటిపై దాడి చేశారు. మాన్ సింగ్ దాడి నుంచి తల్ఫీ రామ్ తప్పించుకున్నారు. కానీ ఆయన అనుచరుల్లో చాలామంది చనిపోయారు.

ఈ కేసులో పోలీసులు మాన్ సింగ్‌ను అరెస్టు చేశారు. కానీ ఆయన అన్న నవాబ్ సింగ్, మాన్ సింగ్ పెద్ద కొడుకు జశ్వంత్ సింగ్, మేనల్లుడు దర్శన్ సింగ్ తప్పించుకున్నారు.

ఒక రోజు నవాబ్ సింగ్, జశ్వంత్, దర్శన్‌తో కలిసి తండ్రి ఇంట్లో ఉండగా తల్ఫీ రామ్ తన అనుచరులు కొందరితో కలిసి ఆ ఇంటిపై దాడి చేశారు.

” ఆ సమయంలో తల్ఫీ రామ్ తెలివిగా పోలీసుల సాయం కూడా తీసుకున్నారు. పోలీసులు ఆయుధాలతో అక్కడకు చేరుకోగానే తల్ఫీ రామ్ అక్కడినుంచి మాయమైపోయారు. నవాబ్ సింగ్, ఆయనతో పాటు ఉన్న ఇద్దరు దూకుడుగా వ్యవహరించి పోలీసులపై కాల్పులు ప్రారంభించారు. పోలీసులు వారిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జశ్వంత్ సింగ్, దర్శన్‌‌లను పోలీసులు చంపేశారు. నవాబ్ సింగ్‌ను అరెస్టు చేశారు. విచారణ తర్వాత నవాబ్ సింగ్‌కు జీవిత ఖైదు పడింది” అని కెన్నెథ్ అండర్సన్ రాశారు.

మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, ANI

ప్రతీకారం తీర్చుకున్న మాన్ సింగ్

అప్పటికే పదేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న మాన్ సింగ్ ప్రతీకారంతో రగిలిపోయారు. సత్ప్రవర్తన కారణంగా ప్రభుత్వం 1938లో జైలు నుంచి మాన్ సింగ్‌ను విడుదల చేసింది.

1940 జూలై 4న మాన్ సింగ్ తన ముగ్గురు కొడుకులు, తనకు విశ్వసనీయమైన వ్యక్తి రూపతో కలసి తనకు శత్రువులైన తల్ఫీ రామ్, ఖేమ్ సింగ్ ఇళ్లపై దాడి చేశారు. ఇద్దరు మహిళలను మినహా తల్ఫీ రామ్ కుటుంబంలోని మిగిలినవారందరనీ చంపేశారు.

ఈ ఘటన తర్వాత బందిపోటుగా మాన్ సింగ్ జీవితం మొదలైంది. తర్వాత 15 ఏళ్లలో ఆయన భారత్‌లో అతిపెద్ద బందిపోటుగా మారారు.

మధ్య భారతంలోని ప్రాంతాల్లో ఆయన్ను ‘దస్యు సమ్రాట్‌(బందిపోటు చక్రవర్తి) అని పిలుచుకునేవారు.ఆయన గ్యాంగులో ముగ్గురు కొడుకులు సుబేదార్ సింగ్, తహసీల్దార్ సింగ్, ధూమన్ సింగ్‌లతోపాటు చర్నా, లోఖన్ సింగ్, అమృత్‌లాల్, రూప ఉండేవారు.

మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, Getty Images

మాన్ సింగ్‌ను నాయకుడిగా గుర్తించిన చిన్నస్థాయి బందిపోట్లు

పేదలను, అణగారిన వర్గాలను మాన్ సింగ్ వేధించరని స్థానిక పోలీసులు చెప్పేవారు. భూస్వాములు, సంపన్న వ్యాపారవేత్తలు, వడ్డీ వ్యాపారులను ఆయన లక్ష్యంగా చేసుకునేవారు.

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రభుత్వం అనేక మంది నేరస్థులను, దోషులను జైలు నుంచి విడుదల చేసింది. ఆ సమయంలో మాన్ సింగ్ అన్న నవాబ్ సింగ్ కూడా జైలు నుంచి విడుదలయ్యారు.

జైలు నుంచి విడుదలయిన వెంటనే నవాబ్ సింగ్ తన పాత గ్రామానికి వెళ్లారు. ఓ తుపాకీ తెచ్చుకుని, తల్ఫీ రామ్ కుటుంబంలో ఇద్దరు బంధువులను హతమార్చారు. ఆ తర్వాత అడవుల్లోకి వెళ్లి తన సోదరుడు మాన్ సింగ్‌తో కలిసిపోయారు.

చంబల్ ఏరియాలో మాన్ సింగ్ ఆధిపత్యం పెరగడంతో ప్రభుత్వం మాన్ సింగ్‌ను బంధించేందుకు సైన్యాన్ని పంపింది.

ఆ ప్రాంతంలోని చిన్న చిన్న బందిపోట్లు మాన్ సింగ్‌ను తమ నాయకుడిగా గుర్తించడంతోపాటు, వారి ఆదాయంలో 10 నుంచి 25శాతం ఆయనకు ఇచ్చేవారు.

దీనివల్ల మాన్ సింగ్ సంపద పెరగడమే కాక, ఆ ప్రాంతంలో ఆయన ఆధిపత్యం కూడా పెరిగింది.

మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, Getty Images

మాన్ సింగ్‌కోసం రంగంలోకి దిగిన సైన్యం

మాన్ సింగ్ గ్యాంగ్‌లో ముఖ్యుడైన చర్నా, తన భార్యను చూడడానికి గ్రామానికి వెళ్తున్నారని 1951లో పోలీసు డిటెక్టివ్‌కి సమాచారమందింది. చర్నాను పట్టుకునేందుకు పోలీసులు వల పన్నారు.

ఈ విషయం తెలియని చర్నా, ఆయన అనుచరులు కొందరు గ్రామంలోకి వెళ్లారు. ఇంట్లోకి అడుగుపెట్టేదాకా పోలీసులు వేచి చూశారు. ఆ తర్వాత 60 మంది పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. బందిపోట్లు ఇంటి పైఅంతస్తు నుంచి పోలీసులపై కాల్పులు జరపడం ప్రారంభించారు.

24 గంటల పాటు పోలీసులకు, బందిపోట్లకు మధ్య కాల్పులు జరిగాయి. సాయం కోసం పోలీసులు 400మందికి పైగా సైన్యాన్ని పిలిపించుకున్నారు.

”తర్వాత మూడు రోజుల పాటు 15 మంది బందిపోట్లను 460 మంది పోలీసులు చుట్టుముట్టారు. డోగ్రా రెజిమెంట్ ఆర్మీని కూడా రంగంలోకి దించారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి బందిపోట్ల ఇళ్లపై రెండు ఫిరంగులను ప్రయోగించారు. మొత్తం భవనం ధ్వంసమయింది. పోలీసులు లోపలకి ప్రవేశించారు. 15 మంది బందిపోట్ల మృతదేహాలు లోపల కనిపించాయి. కానీ చర్నా తప్పించుకోగలిగారు’’ అని కెన్నెథ్ అండర్సన్ రాశారు.

మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, Getty Images

మాన్ సింగ్ వ్యక్తిగత సమస్యలు

కానీ రెండేళ్ల తర్వాత 10గంటల పాటు జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్ నుంచి చర్నా తప్పించుకోలేకపోయారు. కాల్పులు ఆగిపోయిన తర్వాత చర్నాతో పాటు ఆయన తొమ్మిదిమంది అనుచరుల మృతదేహాలను గుర్తించారు.

మాన్ సింగ్‌కు చర్నా సన్నిహితుడు, ధైర్యవంతుడైన సహచరుడే కాదు. గొప్పగా వ్యూహాలు రచించే వ్యక్తి కూడా.

ఎప్పుడు ఎక్కడ దాడి చేయాలో, ఎక్కడ చేయకూడదో అంచనావేయడంలో చర్నా నిపుణుడని చెబుతారు.

తర్వాత మాన్ సింగ్ వ్యక్తిగత సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

”మాన్ సింగ్ తన కుమార్తెను తన గ్యాంగ్ సభ్యుడైన లఖాన్ సింగ్‌కు ఇచ్చి పెళ్లిచేశారు. కానీ ఆమె భర్తతో కాకుండా మాన్ సింగ్ గ్యాంగ్‌లోని మరో వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ విషయంపై ఎంతో బాధపడిన మాన్ సింగ్ కూతురి ప్రియుణ్ని కాల్చి చంపారు. తర్వాత మాన్ సింగ్ అల్లుడు కూడా గ్యాంగ్ విడిచి పెట్టి వెళ్లిపోయారు” అని కెన్నెథ్ అండర్సన్ రాశారు.

”చివరి రోజుల్లో మాన్ సింగ్‌కు విశ్రాంతి, మనశ్శాంతి, ఇల్లు అవసరమయ్యాయి. తాను కావాలని బందిపోటుగా, హంతకుడిగా మారలేదని తెలియజేస్తూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. విధి, పరిస్థితులు తనను ఇలా మార్చాయి అని అందులో పేర్కొన్నారు” అని కెన్నెథ్ తన పుస్తకంలో రాశారు.

నిజమైన భారతీయునిగా తాను గోవా వెళ్లి, విదేశీ పాలన నుంచి గోవాకు స్వేచ్ఛ కల్పించాలని, పోర్చుగీసువారిని సముద్రంలో కలిపేయాలని ఆకాంక్షిస్తున్నట్టు మాన్ సింగ్ తన లేఖలో పేర్కొన్నారని అండర్సన్ రాశారు.

మాన్ సింగ్ లేఖకు ప్రభుత్వం స్పందించలేదు. ఇది మాన్ సింగ్‌ను, ఆయన అనుచరులను తీవ్ర నిరాశకు గురిచేసింది.

మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, Getty Images

గూర్ఖా సైనికుల బృందం ఏర్పాటు

మాన్ సింగ్ అనుచరులు ఒక్కొక్కరుగా అరెస్టవుతున్నారు. గాయాలపాలవుతున్నారు. లేదా ఎన్‌కౌంటర్లలో చనిపోతున్నారు. చివరకు ఆయన వెంట 18మంది బందిపోట్లు మాత్రమే మిగిలి ఉన్నారు. వారిలో ఆయన అన్న నవాబ్ సింగ్, ఆయన రెండో కొడుకు సుబేదార్ సింగ్, రూప కూడా ఉన్నారు.

ఏడాదిలోగా మాన్ సింగ్‌ను పట్టుకోలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని మధ్య భారత్ హోంమంత్రి నరసింహరావు దీక్షిత్ 1954 నవంబరులో చెప్పారు.

ఇందుకోసం ఆయన గూర్ఖా సైనికుల ప్రత్యేక కంపెనీ ఏర్పాటుచేశారు.

పోలీసులను తప్పుదోవ పట్టించడానికి మాన్ సింగ్ గ్రామంలో తనలా కనిపించే వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తర్వాత అనారోగ్యంతో మాన్ సింగ్ అకస్మాత్తుగా చనిపోయారని, ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయని ఒక వదంతి వ్యాపించింది.

కానీ కొన్ని రోజుల తర్వాత మాన్ సింగ్ మళ్లీ దోపిడీలకు పాల్పడడం ప్రారంభించారు. పోలీసులు, ప్రత్యేకంగా ఏర్పాటైన గూర్ఖా కంపెనీ జవాన్లు ఆయన కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

మాన్ సింగ్, బందిపోటు, గ్వాలియర్, గోవా

ఫొటో సోర్స్, Getty Images

మాన్ సింగ్ మృతి

మాన్‌ సింగ్ భిండ్ చేరుకున్నారు. కువారీ నది దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నదికి వరదలొచ్చాయి. దీంతో మాన్ సింగ్ నది దాటలేకపోయారు. తర్వాత ఆయన అక్కడి నుంచి బీజాపూర్ గ్రామానికి చేరుకున్నారు.

జమాదార్ భన్వార్ సింగ్ నేతృత్వంలో గూర్ఖా ప్లాటూన్ ఆయన్ను వెంబడించింది. ఎన్‌కౌంటర్ మొదలయింది. రెండు వేల రౌండ్ల బుల్లెట్లు కాల్చారు. మాన్ సింగ్ జీవితం ముగిసిపోయింది. అతిపెద్ద బందిపోటు ఒంటి నిండా బుల్లెట్లతో నేలపై పడిపోయారు.

తండ్రి శరీరానికి మరిన్ని బుల్లెట్లు తగలకుండా కాపాడేందుకు ఆయన కొడుకు సుబేదార్ సింగ్ ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో సుబేదార్ సింగ్‌ కూడా గాయపడి చనిపోయారు.

మాన్ సింగ్ అన్న నవాబ్ సింగ్‌ను సహచరులు రక్షించగలిగారు.

మాన్ సింగ్, గ్వాలియర్, మధ్యప్రదేశ్,

ఫొటో సోర్స్, OfficialPageBSF/Facebook

మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించని ప్రభుత్వం

హోం మంత్రి దీక్షిత్ తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం రాలేదు. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, హోం మంత్రి గోవింద్ వల్లభ్ పంత్, కాంగ్రెస్ అధ్యక్షులు యూఎన్ డేబర్‌కు వెంటనే టెలిగ్రామ్ ద్వారా సమాచారమందించారు.

”ఒకరి మరణం చూసి సంతోషించడం మంచి విషయం కాదు. మాన్ సింగ్ చనిపోయారు. మాన్ సింగ్ చేతిలో హింసకు గురయిన వారికి ఇప్పుడు ఉపశమనం కలుగుతుంది” అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ సంపూర్ణానంద్ వ్యాఖ్యానించారు.

మాన్ సింగ్, ఆయన కొడుకు మృతదేహాలను మంచాలకు కట్టి భిండ్‌కు తరలించారు. ఆ మంచాలను నిలబెట్టారు. దీంతో ప్రజలు వారిని చూసేందుకు వీలు కలిగింది.

మాన్ సింగ్ మృతదేహాన్ని చూసేందుకు దాదాపు 40వేల మంది ప్రజలు వచ్చారు. ఆయన ఎలా ఉంటాడో చూడాలన్న ఉత్సుకతో కొందరు వచ్చారు. కొందరు మాన్ సింగ్ మరణించడంపై సంతోషం వ్యక్తంచేయగా, చాలామంది కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు.

తర్వాత మాన్ సింగ్ మృతదేహాన్ని అంతక్రియల కోసం గ్వాలియర్‌కు తరలించారు. మాన్ సింగ్ భార్య, కుమారుడు తహసీల్దార్ సింగ్ అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తమకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.

”ఆయన గుజర్ అయినప్పటికీ బ్రాహ్మణ కులానికి చెందిన రూపకు, ఠాకూర్ కులస్తుడైన లఖన్‌కు తన గ్యాంగులో ప్రత్యేక స్థానం కల్పించడం మాన్ సింగ్ వ్యక్తిత్వంలోని మ్యాజిక్. మాన్ సింగ్‌కు వయసు మీద పడే కొద్దీ ఆయనతో ఉన్న అనుచరులు ఒక్కొక్కరు ఆయన్ను విడిచిపెట్టి సొంత గ్యాంగులు ఏర్పాటు చేసుకున్నారు. మాన్ సింగ్ చనిపోయారు. కానీ బందిపోటు సమస్య ముగిసిపోలేదు” అని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కేఎఫ్ రుస్తమ్‌జీ తన పుస్తకం ‘ది బ్రిటిష్, ది బండిట్స్ అండ్ ద బోర్డర్‌మెన్’ అనే పుస్తకంలో రాశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)