SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, AFP via Getty Images
లోక్‌సభ ప్రస్తుత సమావేశాల్లో మార్చి 13న ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (హక్కుల పరిరక్షణ) సవరణ బిల్లు – 2026ను ప్రవేశపెట్టారు.
ఈ సవరణలో ట్రాన్స్‌జెండర్ పర్సన్ గుర్తింపు నిర్వచనాన్ని మార్చాలని ప్రతిపాదించారు.
ఇందులో ‘జెండర్ సెల్ఫ్-ఐడెంటిఫికేషన్’ (స్వీయ గుర్తింపు)కు చోటు కల్పించలేదు.
2019 చట్టాన్ని అమలు చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అందుకే ఈ సవరణ అవసరమైందని ప్రభుత్వం చెబుతోంది. అందుకే, చట్టంలోని ప్రయోజనాలు నిజంగా అవసరమైన వారికి మాత్రమే అందేలా, ట్రాన్స్‌జెండర్ పర్సన్ నిర్వచనాన్ని పునఃపరిశీలిస్తున్నామని తెలిపింది.
సవరణ బిల్లు వచ్చిన తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన కొన్ని వర్గాల్లో అసహనం వ్యక్తమవుతోంది.
ఈ సవరణ ట్రాన్స్‌జెండర్ పర్సన్ గుర్తింపును ప్రమాదంలో పడేస్తుందని ఆ వర్గానికి చెందిన కొందరు పేర్కొంటున్నారు. అలాగే ఈ బిల్లు ట్రాన్స్ గుర్తింపును నేరపూరిత కోణంలో చూస్తోందని వారు ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ హక్కులు, చట్టం
భారతదేశంలో ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ గుర్తింపు, హక్కులకు సంబంధించిన చట్టాల చరిత్ర మరీ పాతది కాదు. మొదటగా 2014లో, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) కేసులో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ హక్కులను గుర్తించింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ.. పౌరులు తమ జెండర్ గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కును కల్పించింది. అంతేకాకుండా, కోర్టు వారికి ‘థర్డ్ జెండర్’ హోదాను ఇచ్చింది.
అదే సమయంలో, ట్రాన్స్‌జెండర్ పర్సన్లను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలుగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. విద్య, ఉపాధి, ఆరోగ్య సేవల్లో వారికి తగిన సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.
ఈ తీర్పు తర్వాత ట్రాన్స్ హక్కుల కోసం చట్టం చేయడానికి ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది. 2019లో ఆమోదించిన ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ (హక్కుల పరిరక్షణ) బిల్లు’లో ట్రాన్స్‌జెండర్ పర్సన్ నిర్వచనాన్ని చట్టబద్ధంగా ఖరారు చేశారు. దాని ప్రకారం, ట్రాన్స్‌జెండర్ పర్సన్ పరిధిలోకి అనేక రకాల వ్యక్తులు వస్తారు.
ఇందులో పుట్టినప్పుడు కేటాయించిన లింగ గుర్తింపు కంటే భిన్నమైన జెండర్ గుర్తింపు కలిగిన వారు కూడా ఉన్నారు. ఈ నిర్వచనంలో ట్రాన్స్‌జెండర్ పురుషులు, మహిళలు ఇద్దరూ ఉన్నారు. దీని కోసం ఒక వ్యక్తి తప్పనిసరిగా లింగ మార్పిడి వైద్య ప్రక్రియ చేయించుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఈ నిర్వచనం పరిధిలోకి జెండర్ క్వీర్, ఇంటర్‌సెక్స్ వ్యక్తులతో పాటు ‘కిన్నెర’, ‘హిజ్రా’, ‘అరవాణి’, ‘జోగత’ వంటి సామాజిక-సాంస్కృతిక గుర్తింపు ఉన్న వర్గాలు కూడా వస్తాయి.
2019 చట్టం స్వీయ జెండర్ గుర్తింపును నిర్ణయించుకునే హక్కును ఇచ్చింది. కానీ, ట్రాన్స్‌జెండర్ గుర్తింపు కోసం జిల్లా మెజిస్ట్రేట్ నుంచి ధృవీకరణ పత్రం పొందే ప్రక్రియను కూడా చేర్చింది. ఆ సమయంలో చాలా మంది ట్రాన్స్‌జెండర్ హక్కుల కార్యకర్తలు ఈ ప్రక్రియను విమర్శించారు. ఈ నిబంధన ‘నాల్సా’ తీర్పు ద్వారా లభించిన ‘స్వీయ గుర్తింపు హక్కు’కు విరుద్ధంగా ఉందని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం విధానాలను రూపొందించడానికి జాతీయ ట్రాన్స్‌జెండర్ కౌన్సిల్‌ను కూడా ఏర్పాటుచేశారు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
సవరణ వెనుక ప్రభుత్వ ఉద్దేశం
మరోవైపు, జీవసంబంధమైన కారణాల వల్ల సామాజిక వివక్షను ఎదుర్కొనే వారికి మాత్రమే సహాయం చేయడం ప్రస్తుత సవరణ బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లు చివరి భాగంలో ప్రభుత్వం దీని ఉద్దేశం, కారణాలను వివరించింది.
2019 చట్టంలో ఇచ్చిన ట్రాన్స్‌జెండర్ పర్సన్ నిర్వచనం అస్పష్టంగా ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగా నిజమైన అవసరమున్న వారికి సహాయం అందించడం ప్రభుత్వానికి కష్టతరమవుతోంది. నిర్వచనం స్పష్టంగా లేకపోవడం వల్ల పోలీస్, కోర్టు, పర్సనల్ లా కి సంబంధించిన నిబంధనలను అమలు చేయడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కొన్ని నేరాల దృష్ట్యా ఈ సవరణను తీసుకువచ్చినట్లు కూడా ప్రభుత్వం పేర్కొంది.
“పెద్దలను, పిల్లలను అపహరించి, వారికి తీవ్రమైన శారీరక హాని కలిగిస్తున్నారు. అంతేకాకుండా, వారిని వివిధ రకాలుగా ఒత్తిడి చేసి బలవంతంగా ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్’ గుర్తింపును స్వీకరించేలా చేస్తున్నారు. తరచుగా ఇదంతా భిక్షాటన వంటి పనుల ద్వారా వారిని ఆర్థికంగా దోపిడీ చేయడానికి జరుగుతోంది” అని ప్రభుత్వం వాదిస్తోంది.
అయితే, దీనిపై ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిల్లులో ఉపయోగించిన భాష మొత్తం తమ సమాజాన్ని అనుమానితులుగా, నేరస్థులుగా చిత్రీకరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఎవరిని ట్రాన్స్‌జెండర్‌గా పరిగణిస్తారు?
కొత్త చట్టంలో ట్రాన్స్‌జెండర్ పర్సన్ నిర్వచనాన్ని పరిమితం చేశారు. అంతేకాకుండా, 2019 చట్టంలోని ఆర్టికల్ 4(2)ను తొలగించాలని ఈ సవరణ ప్రతిపాదించింది. ఈ ఆర్టికల్‌లో జెండర్ ‘స్వీయ గుర్తింపు’ హక్కు గురించి ప్రస్తావన ఉండేది.
కొత్త నిర్వచనం ప్రకారం, ‘కిన్నెర’, ‘హిజ్రా’, ‘అరవాణి’ లేదా ‘జోగత’ వంటి సామాజిక-సాంస్కృతిక గుర్తింపు ఉన్న వర్గాలకు చెందిన వారిని మాత్రమే ట్రాన్స్‌జెండర్లుగా పరిగణిస్తారు.
వీరితో పాటు ‘ఇంటర్‌సెక్స్’ వ్యక్తులను కూడా ఈ నిర్వచనంలో చేర్చారు. ‘ఇంటర్‌సెక్స్’ అంటే, ఎవరి శారీరక లక్షణాలు (లైంగిక అవయవాలు, క్రోమోజోమ్‌లు లేదా హార్మోన్లు వంటివి) పుట్టినప్పుడు సాధారణ పురుషుడు లేదా స్త్రీ కంటే భిన్నంగా ఉంటాయో వారు.
బలవంతంగా ట్రాన్స్‌జెండర్ పర్సన్లుగా మార్పిడి చేసిన పిల్లలు, వ్యక్తులను కూడా ఇందులో చేర్చారు. ఈ నిర్వచనం 2019 చట్టంతో పోలిస్తే ట్రాన్స్‌జెండర్ గుర్తింపును పరిమితం చేస్తుంది. ఇందులో ‘స్వీయ గుర్తింపు’ కలిగిన ట్రాన్స్‌జెండర్ పర్సన్లు ఉండరు. ఇది ఒక పెద్ద సవరణ.
ట్రాన్స్‌జెండర్ గుర్తింపు కార్డు
2019 చట్టం ప్రకారం, ఎవరైనా నేరుగా జిల్లా కలెక్టర్ నుంచి తన ట్రాన్స్‌జెండర్ పర్సన్ గుర్తింపు కార్డును పొందవచ్చు.
ప్రతిపాదిత సవరణ ప్రకారం, దీని కోసం ముందుగా మెడికల్ సూపరింటెండెంట్ లేదా సి.ఎం.ఓ నుంచి మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్‌తో జిల్లా మెజిస్ట్రేట్‌కి దరఖాస్తు చేసుకోవాలి.
ధ్రువీకరణ సంతృప్తికరంగా పూర్తయిన తర్వాతే జిల్లా మేజిస్ట్రేట్ ట్రాన్స్‌జెండర్ పర్సన్ గుర్తింపు కార్డును జారీ చేస్తారు.
అదేవిధంగా, జెండర్ మార్పిడికి సంబంధించిన సర్జరీ వివరాలను ఇకపై ఆసుపత్రి యాజమాన్యం నేరుగా జిల్లా మెజిస్ట్రేట్‌కి తెలియజేయాల్సి ఉంటుంది.

ట్రాన్స్‌జెండర్ సమాజం ఏమంటోంది?
సవరణ బిల్లు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది, బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దిల్లీ, ముంబయి, పుణె, హైదరాబాద్ వంటి వివిధ నగరాల్లో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే సోమవారం సాయంత్రం దిల్లీలోని ‘ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్స్’లో ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ ఈ సవరణకు వ్యతిరేకంగా విలేఖరుల సమావేశంలో తమ గళాన్ని వినిపించారు. సవరణను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సవరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో గొంతు వినిపించాలని పలువురు ఎంపీలను కోరినట్లు వారు తెలిపారు. అంతేకాకుండా, అక్కడ నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి, సవరణ బిల్లు కాపీలను దగ్ధం చేశారు.
విలేఖరుల సమావేశంలో యువ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ మాట్లాడుతూ,ఈ బిల్లు రాకతో చాలామంది భయాందోళనకు గురవుతున్నారని, తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఈ సవరణ తమ ఉనికిని ప్రమాదంలో పడేస్తుందని, ఇది నేరుగా తమ గోప్యత హక్కుపై దాడి అని వారు వాపోతున్నారు.
“మా కమ్యూనిటీకి సంబంధించిన చట్టాలు చేసే ముందు మాతో మాట్లాడమని మేం మంత్రులను కోరుతూనే ఉన్నాం. కానీ, ప్రభుత్వం మాతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదు” అని రీసెర్చర్ కృశాను మీడియాతో అన్నారు.
ఈ సవరణ భారతదేశంలో ట్రాన్స్ హక్కులను 200 ఏళ్లు వెనక్కి నెడుతుందని కృశాను బీబీసీ హిందీతో చెప్పారు.
“ఈ సవరణ మా హక్కులను పరిమితం చేస్తుంది. ఒక వ్యక్తికి తన గుర్తింపు, శరీరంపై నిర్ణయం తీసుకునే హక్కు ఉండాలి. ఈ సవరణ తర్వాత అది ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్తుంది” అని ట్రాన్స్‌జెండర్ కార్యకర్త రీతు అన్నారు.
ఈ సవరణ సుప్రీంకోర్టు ‘నల్సా తీర్పు’ స్ఫూర్తికి విరుద్ధమని, ట్రాన్స్ గుర్తింపును వర్గీకరిస్తుందని ఈ కార్యకర్తలు అంటున్నారు. కమ్యూనిటీ విషయంలో వాడిన భాషను కూడా విమర్శించారు.
“ఈ భాష ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్’ను గుర్తుచేస్తోంది. ఆ చట్టం ప్రకారం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సహా పలు వర్గాలను ‘పుట్టుకతోనే నేరస్థులు’గా ప్రకటించి, వారిపై నిరంతర నిఘా, సామాజిక బహిష్కరణను రుద్దారు” అని తెలిపారు.
చట్టంలో కొత్త సవరణ ప్రతిపాదనను తీసుకురాకముందు భారతీయ ట్రాన్స్‌జెండర్ కౌన్సిల్ సలహాను కూడా తీసుకోలేదని ట్రాన్స్ ప్రతినిధులు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నారు.
సవరణ బిల్లులోని శిక్షలు ఎంత అస్పష్టంగా ఉన్నాయంటే, ఒకరికొకరు సహాయం చేసుకునే ట్రాన్స్ వ్యక్తులను కూడా ప్రభుత్వం నేరస్థులుగా ప్రకటించవచ్చని న్యాయవాది రాఘవి శుక్లా బీబీసీ హిందీ వద్ద ఆరోపించారు.
“ట్రాన్స్‌జెండర్ వ్యక్తులు ఇతరులను బలవంతంగా ట్రాన్స్‌జెండర్లుగా మారుస్తారని ఈ బిల్లులో చెప్పే ప్రయత్నం జరిగింది. అంతేకాకుండా, మమ్మల్ని అలవాటు పడిన నేరస్థులుగా చిత్రీకరించారు” అని రాఘవి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



