SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
25 ఫిబ్రవరి 2026, 12:11 IST
చదివే సమయం: 6 నిమిషాలు
అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ విధించిన సుంకాల (గ్లోబల్ టారిఫ్‌ల)ను అమెరికా సుప్రీం కోర్టు గత వారం కొట్టివేయడంతో భారత్ సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఊపిరి పీల్చుకుంటాయని భావించారు.
అయితే, సుప్రీం కోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా న్యాయమూర్తులపై వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు ట్రంప్.
ఇప్పుడు, అమెరికా సుప్రీం కోర్టు తీర్పును సాకుగా చూపుతూ వాణిజ్య ఒప్పందంపై పునరాలోచన చేయాలని భావిస్తున్న దేశాలను ఆయన హెచ్చరిస్తున్నారు.
ట్రంప్ సోమవారం తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాలో చేసిన ఒక పోస్ట్‌లో, ఆయా దేశాలు మరింత ఘోరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ బెదిరింపులకు దిగారు.
“సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అడ్డుపెట్టుకుని మాతో ఎవరైనా ‘గేమ్స్ ఆడాలని’ చూస్తే, ముఖ్యంగా అమెరికాను దశాబ్దాలుగా వంచిస్తున్న దేశాలు మరింత భారీ టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంగీకరించిన టారిఫ్ రేట్ల కంటే చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి” అని ట్రంప్ రాశారు.

భారత బృందం పర్యటన వాయిదా..
ఫిబ్రవరి 22న అమెరికన్ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్, బ్రిటిష్ వార్తా సంస్థ రాయిటర్స్ అందించిన సమాచారం ప్రకారం, భారత్ ఈవారం తన వాణిజ్య ప్రతినిధి బృందాన్ని అమెరికాకు పంపే ప్రణాళికలను వాయిదా వేసుకుంది.
ముఖ్యంగా అమెరికా సుప్రీం కోర్టు టారిఫ్‌లను రద్దు చేసిన నేపథ్యంలో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని, ఈ పర్యటనను వాయిదా వేయాలని భారత్ నిర్ణయించుకుందని బ్లూమ్‌బెర్గ్, రాయిటర్స్ పేర్కొన్నాయి.
“భారత వాణిజ్య మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం, ఇరుదేశాల అధికారుల మధ్య జరిగిన చర్చల అనంతరం ఈ పర్యటనను వాయిదా వేయాలని నిర్ణయించారు. అయితే, పర్యటనకు సంబంధించి కొత్త తేదీలను ఇంకా ఖరారు చేయలేదు” అని రాయిటర్స్ పేర్కొంది.
“ఒక తాత్కాలిక వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు చర్చల నిమిత్తం భారత ప్రతినిధి బృందం ఆదివారం బయలుదేరాల్సి ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా కొన్ని భారతీయ ఎగుమతులపై అమెరికా విధించిన 50 శాతం టారిఫ్‌ను తగ్గించే ఒక ముసాయిదాపై ఇరుదేశాలు గతంలో ఏకాభిప్రాయానికి వచ్చాయి” అని రాయిటర్స్ నివేదించింది.
అమెరికా టారిఫ్‌లను 18 శాతం వరకు తగ్గించాలని ప్రతిపాదించారు. దీనికి ప్రతిగా, భారత్ రాబోయే ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రతిపాదనలూ ఉన్నాయి.
గత వారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, వాషింగ్టన్ పర్యటనలో పెండింగ్ అంశాలన్నీ పరిష్కారమైతే ఈ తాత్కాలిక ఒప్పందం ఏప్రిల్ నెల నుంచి అమల్లోకి రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ట్రంప్ చేసిన కొత్త బెదిరింపులను భారత్‌కు వ్యతిరేకంగా కూడా నిపుణులు చూస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
‘ట్రూత్ సోషల్’ పోస్ట్‌ను ఎక్స్‌లో రీపోస్ట్ చేస్తూ, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ ఇలా రాశారు:
“భారత్‌తో జరిగిన ఫ్రేమ్‌వర్క్ డీల్‌పై సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన భారత్‌ను ప్రస్తావిస్తూ, ‘వంచన’ అనే పదాన్ని వాడారు. ఆయన అహంకారపూరిత ఆలోచనా విధానం ఒక తీవ్రమైన సమస్య.”
ట్రంప్ పోస్ట్‌పై అమెరికా విదేశాంగ, వాణిజ్య మంత్రిత్వ శాఖల మాజీ సలహాదారు ఇవాన్ ఏ ఫెయిజెన్‌బామ్ స్పందిస్తూ ఎక్స్‌లో ఇలా రాశారు:
- ఒంటారియోలో వచ్చిన ఒక టెలివిజన్ ప్రకటనలో రోనాల్డ్ రీగన్ మాటలను యథాతథంగా వాడినందుకు కోపంతో ట్రంప్ కెనడాపై టారిఫ్‌లు పెంచుతామని బెదిరించారు.
- స్విట్జర్లాండ్ అధ్యక్షుడి మాట్లాడే విధానం నచ్చలేదని ఆ దేశంపై టారిఫ్‌లు పెంచారు.
- గత వారం, కేవలం 24 గంటల వ్యవధిలోనే టారిఫ్‌లను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. దీనికోసం తన సొంత న్యాయశాఖ సుప్రీం కోర్టులో వ్యతిరేకించిన చట్టాన్నే ఆయన ఆశ్రయించారు.
- బ్రెజిల్‌లో తన రాజకీయ మిత్రుడిపై కేసు నడుస్తున్నందుకు కోపంతో ఆ దేశంపై ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్‌లు విధించారు. అలాగే, భారత్ రష్యా నుంచి చమురు కొంటోందని టారిఫ్ విధించారు. కానీ, భారత్ కంటే ఎక్కువ చమురు కొంటున్న చైనాపై అలాంటి ఆంక్షలేవీ విధించలేదు.
“ఇన్ని చేసినా, ఇతర దేశాలే టారిఫ్‌లతో ‘గేమ్స్’ ఆడుతున్నాయని ట్రంప్ భావించడం ఆశ్చర్యకరం” అని ఫెయిజెన్‌బామ్ రాశారు.
ఈ నెల ప్రారంభంలో అమెరికాతో కుదుర్చుకున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు భారత్ ఇప్పటివరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కేవలం ప్రస్తుత అనిశ్చితి వల్ల పర్యటనను మాత్రమే వాయిదా వేసింది.
ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు ప్రయోజనమేనా?
అమెరికా సుప్రీం కోర్టు తీర్పు తర్వాత భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తన వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటూనే, ట్రంప్ ప్రభుత్వంతో నేరుగా ఘర్షణ పడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ తీర్పుపై స్పందిస్తూ, ప్రస్తుతానికి తాము దీనిని ‘అధ్యయనం చేస్తున్నాం’ అని మాత్రమే పేర్కొంది.
- జయంత దాస్‌గుప్తా (WTOలో భారత మాజీ రాయబారి) బ్లూమ్‌బెర్గ్ టెలివిజన్‌కు చెందిన హస్లిండా అమిన్‌తో మాట్లాడుతూ, “అమెరికా మనసులో ఏముందో, వారు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో అర్థం చేసుకోవడానికి భారత్ వారితో నిరంతరం చర్చలు జరపాలి. పరిస్థితులు ఏ దిశగా వెళ్తాయనేది ఇంకా స్పష్టత లేదు” అని అన్నారు.
- మాధవీ అరోరా (ఎమ్కే గ్లోబల్ ఎకనామిస్ట్) మాట్లాడుతూ, “రష్యా చమురు కొనుగోలుకు సంబంధించిన టారిఫ్ ముప్పు ఇప్పుడు తొలగిపోయింది కాబట్టి, భారత్ తన వాణిజ్య ఒప్పందంపై పునరాలోచన చేయవచ్చు. చర్చలలో మనకు అనుకూలమైన షరతులను డిమాండ్ చేసే అవకాశం ఇప్పుడు భారత్‌కు దక్కింది” అని చెప్పారు.
సుప్రీం కోర్టు తీర్పు వచ్చినప్పటికీ, ట్రంప్ మాత్రం తన ఇష్టానుసారమే వ్యవహరిస్తానని చెబుతున్నారు. కోర్టు తీర్పును నేరుగా ధిక్కరించకుండానే, తనకున్న ఇతర పరిమిత అధికారాలను ఉపయోగించి కొత్త టారిఫ్‌లు విధించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు.
ఈ తీర్పులో ట్రంప్‌ను అమితంగా ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, కన్జర్వేటివ్ జడ్జిలు కూడా ఆయనకు మద్దతు ఇవ్వకపోవడం. స్వయంగా ట్రంప్ నియమించిన ఇద్దరు న్యాయమూర్తులు కూడా ఈ టారిఫ్‌లు ‘చట్టవిరుద్ధం’ అని తీర్పునిచ్చారు.
“సంవత్సరాలుగా కన్జర్వేటివ్ జడ్జిలను ట్రంప్ ‘విధేయులు’గా చిత్రీకరించారు. కానీ వారు చట్టానికి లోబడి తీర్పునివ్వడం, ట్రంప్ కార్యనిర్వాహక అధికారాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడం ఒక చారిత్రాత్మక పరిణామం” అని వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషించింది.
ఫొటో సోర్స్, Getty Images
భారత్ సన్నద్ధత..
కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ దావోస్‌లో మాట్లాడుతూ, సూపర్ పవర్ దేశాల రాజకీయాల నుంచి తట్టుకోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ పరస్పర ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు.
భారత్ కూడా బహుశా అదే చేస్తోంది. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి ఇప్పటికే పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంది.
ట్రంప్, ఆయన యంత్రాంగం భారత్‌పై ఎన్ని దూకుడు వ్యాఖ్యలు చేసినా, మోదీ ప్రభుత్వం మాత్రం చాలా సంయమనంతో, ఆచితూచి స్పందిస్తూ వచ్చింది.
అమెరికా సుప్రీం కోర్టు తీర్పు వల్ల చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలకు లబ్ధి చేకూరవచ్చు. ఎందుకంటే, ట్రంప్ విధించిన పాత టారిఫ్‌లు రద్దవడంతో ఎగుమతి వ్యయం తగ్గుతుంది.
- మోర్గాన్ స్టాన్లీ అంచనా: చైనా వస్తువులపై సగటు టారిఫ్ 32 శాతం నుంచి 24 శాతానికి, అలాగే ఆసియా దేశాల సగటు టారిఫ్ 20 శాతం నుంచి17 శాతానికి తగ్గే అవకాశం ఉంది.
- యూకేపై ప్రభావం: ట్రంప్ కొత్తగా ప్రకటించిన 15 శాతం టారిఫ్ బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు సవాల్‌గా మారింది. దీనివల్ల బ్రిటన్ ఎగుమతి వ్యయం సుమారు 4 బిలియన్ డాలర్లు పెరుగుతుందని, దాదాపు 40 వేల బ్రిటిష్ కంపెనీలు ప్రభావితమవుతాయని బ్రిటిష్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అంచనా వేసింది.
దౌత్యపరమైన చిక్కులు
వచ్చే నెలలో ట్రంప్ బీజింగ్ పర్యటనకు వెళ్లి షీ జిన్‌పింగ్‌తో చర్చలు జరపాల్సి ఉంది. తాజా కోర్టు తీర్పుతో చర్చల్లో ట్రంప్ పట్టు తగ్గే అవకాశం ఉంది.
అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ పాత ఒప్పందాలు కొనసాగుతాయని చెబుతున్నా, ఇతర దేశాలు మాత్రం దీన్ని నమ్మడం లేదు.
- యూరోపియన్ యూనియన్ (ఈయూ): ట్రంప్ విధానాలపై స్పష్టత వచ్చే వరకు వాణిజ్య ఒప్పందాల ధ్రువీకరణను నిలిపివేయాలని భావిస్తోంది.
- భారత్: అనిశ్చితి కారణంగా ఈవారం జరగాల్సిన చర్చలను వాయిదా వేసింది.
ఏది ఏమైనా, ప్రపంచ వాణిజ్య చర్చల్లో ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం (టారిఫ్) ఇప్పుడు బలహీనపడిందనేది స్పష్టమవుతోంది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



