Home జాతీయ national telgu ట్రంప్ కీలక ప్రకటన… రెండు వారాల కాల్పుల విరమణ

ట్రంప్ కీలక ప్రకటన… రెండు వారాల కాల్పుల విరమణ

15
0

SOURCE :- BBC NEWS

ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, EPA/Shutterstock

3 గంటలు క్రితం

చదివే సమయం: 3 నిమిషాలు

హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల రాకపోకలకు ఇరాన్ అంగీకరిస్తే ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణ ఉంటుందని డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో సాగిన చర్చల అనంతరం ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

ఇరాన్‌పై బాంబు దాడులు, ఇతర అన్ని రకాల దాడులను రెండు వారాల పాటు నిలిపివేయడానికి నేను అంగీకరిస్తున్నాను అని ట్రంప్ చెప్పారు.

‘హార్ముజ్ జలసంధిని తక్షణమే, సురక్షిత రీతిలో పూర్తిగా తెరవడానికి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంగీకరిస్తేనే’ తాను ఈ రెండు వారాల కాల్పుల విరమణకు కట్టుబడి ఉంటానని ట్రంప్ స్పష్టం చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

పాకిస్తాన్ ప్రస్తావన..

ఇరాన్‌తో కుదిరిన ఈ షరతులతో కూడిన కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి తాను పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో చర్చలు జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు.

దీంతో పాటు ఆయన తన ట్రూత్ సోషల్‌లో చేసిన ఓ పోస్ట్‌లో.. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పేరునూ ప్రస్తావించారు.

తాము విధించిన డెడ్‌లైన్ ముగిసిన తరువాత చేయబోయే విధ్వంసకర దాడులను నిలిపివేయాల్సిందిగా షరీఫ్, మునీర్‌లు తనను కోరినట్లు ట్రంప్ వెల్లడించారు.

ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, IRINN

ట్రంప్ వెనక్కి తగ్గారు: ఇరాన్ మీడియా

డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌ అనంతరం ఇరాన్ ప్రభుత్వ మీడియా దీనికి సంబంధించి కథనాలు ప్రసారం చేసింది.

యుద్ధాన్ని ముగించడానికి ఇరాన్ షరతులను అంగీకరిస్తూ ట్రంప్ రెండు వారాల కాల్పుల విరమణను ప్రకటించారని వెల్లడించింది.

ఇరాన్ వ్యతిరేక వాదనల నుంచి ట్రంప్ అవమానకరంగా వెనక్కి తగ్గారు అని ఆ మీడియాతో తన కథనాల్లో పేర్కొంది.

ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

ఇరాన్ ప్రభుత్వ మీడియా కథనం ప్రకారం పది పాయింట్ల ప్రణాళిక

  • ఇరాక్, లెబనాన్, యెమెన్‌లపై జరుగుతున్న యుద్ధాన్ని పూర్తిగా నిలిపేయాలి.
  • ఎలాంటి కాలపరిమితి లేకుండా ఇరాన్‌పై యుద్ధాన్ని పూర్తిగా, శాశ్వతంగా నిలిపివేయాలి.
  • ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ఘర్షణలకు ముగింపు పలకాలి.
  • హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం
  • హార్ముజ్ జలసంధిలో నౌకాయానానికి స్వేచ్ఛ, భద్రత ఉండేలా నిబంధనలు, ప్రోటోకాల్ ఏర్పాటుచేయాలి.
  • ఇరాన్ పునర్నిర్మాణ ఖర్చుల కోసం పూర్తి నష్టపరిహారం అందించాలి.
  • ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేతలో పూర్తి నిబద్ధత పాటించాలి.
  • ఇరాన్ నిధులు, ఆస్తులపై ఉన్న జప్తును అమెరికా తొలగించాలి.
  • అణ్వాయుధాలు పొందడానికి ప్రయత్నించబోమని హామీ
  • పై నిబంధనలు అన్నీ ఆమోదించిన వెంటనే అన్ని ప్రాంతాల్లో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలి.
ఇరాన్, అమెరికా, ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

కాల్పుల విరమణకు, హార్ముజ్ జలసంధి తెరవడానికి ఇరాన్ అంగీకారం

ఇరాన్‌పై దాడులు ఆపితే కాల్పుల విరమణకు ఇరాన్ అంగీకరిస్తుందని ఆ దేశ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు.

రెండు వారాలపాటు హార్ముజ్ జలసంధి మీదుగా నౌకల సురక్షిత ప్రయాణానికి అవకాశం ఉందన్నారు.

ఇరాన్ సాయుధ బలగాల సమన్వయం, సాంకేతిక పరిమితులను పరిగణనలోకి తీసుకుని ఇది అమలవుతుందని ఆయన తెలిపారు.

ఇస్లామాబాద్‌లో అమెరికాతో చర్చలు జరుగుతాయని ఇరాన్ సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది.

మరోవైపు కాల్పుల విరమణ తక్షణమే అమల్లోకి వస్తుందని చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు.

‘‘ఇస్తామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, అమెరికా, దాని మిత్రపక్షాలు లెబనాన్ సహా ప్రతిచోటా తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయని నేను ప్రకటిస్తున్నా’’ అని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.

‘‘అన్ని వివాదాల తుది పరిష్కారం కోసం మరిన్ని చర్చలు జరిపేందుకు ప్రతినిధి బృందాలను ఏప్రిల్ 10న ఇస్లామాబాద్‌కు రావాల్సిందిగా ఆయన ఆహ్వానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)