Home జాతీయ national telgu ట్రంప్, ఆయన అధికారులే లక్ష్యమా? కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల ఘటన నిందితుడి టార్గెట్ ఏంటి?...

ట్రంప్, ఆయన అధికారులే లక్ష్యమా? కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల ఘటన నిందితుడి టార్గెట్ ఏంటి? అమెరికా అధికారులు ఏం చెబుతున్నారు?

16
0

SOURCE :- BBC NEWS

డోనల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా

ఫొటో సోర్స్, Reuters

వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన అనుమానిత షూటర్ లక్ష్యం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఆయన అధికారులు అయి ఉండొచ్చని అమెరికా తాత్కాలిక అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే చెప్పారు.

శనివారం వాషింగ్టన్ డీసీలోని హోటల్‌లో విందు కార్యక్రమం జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ చెక్‌పాయింట్‌కు సమీపంలో ఈ అనుమానిత షూటర్ కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు.

ఈ అనుమానితుడిని 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్‌గా అమెరికా మీడియా పేర్కొంది. ఈ ఘటన తర్వాత ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎన్‌బీసీ న్యూస్‌తో మాట్లాడిన బ్లాంచే.. ఈ అనుమానిత దుండగుడి ఉద్దేశ్యం ఏంటన్న దానిపై దర్యాప్తు సాగుతుందని చెప్పారు.

కానీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను ఈ అనుమానితుడు లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు.

వేదికపై నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించిన తర్వాత రిపోర్టర్లతో మాట్లాడిన ట్రంప్.. ” దీనికంటే ప్రమాదకరమైన వృత్తి మరొకటి ఉందంటే నేనసలు ఊహించలేను” అని అన్నారు.

కాల్పులు జరిగినప్పుడు హత్యాయత్న ఘటన నుంచి క్యాబినెట్ సభ్యులతో పాటు ప్రాణాలతో బయటపడ్డ ట్రంప్, చాలా నిర్భయంగా ఉన్నారని ఆదివారం ఓ ప్రకటనలో వైట్‌హౌస్ తెలిపింది.

ఎఫ్‌బీఐ నేర విభాగం, టెర్రరిజం టాస్క్ ఫోర్స్ ఈ ఘటనను దర్యాప్తు చేస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇది హృదయ విదారకర ఘటన అని వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ రెసిడెంట్ వీజియా జియాంగ్ తెలిపారు.

ఆదివారం ట్రంప్‌తో కలిసి డిన్నర్ చేసిన జియాంగ్.. వేల మంది అతిథులను రక్షించేందుకు సీక్రెట్ సర్వీసు వెంటనే చేపట్టిన చర్యలకు ధన్యవాదాలు తెలిపారు.

బోర్డు సమావేశమై, ఈ ఘటనపై ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తుందన్నారు. ఏదైనా తాజా సమాచారం తెలిస్తే, వెంటనే విడుదల చేస్తామన్నారు.

కొంత కాలంగా అనుమానితుడి హృదయంలో చెప్పలేనంత ద్వేషం దాగుందని, ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన కుటుంబానికి కూడా తెలుసని ట్రంప్ ఆదివారం ఫాక్స్ న్యూస్‌కు తెలిపారు.

అనుమానితుడి వద్ద ఒక ”మేనిఫెస్టో” కూడా ఉందన్నారు.

శనివారం స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.35కి, వాషింగ్టన్ హిల్టన్ హోటల్ ఫోయర్‌లో (ప్రవేశ మార్గంలో) తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. అదే సమయంలో, ఒక అంతస్తు కిందనున్న బాల్‌రూమ్‌లో వైట్‌హౌస్ అధికారులు విందు కార్యక్రమం జరుగుతోంది.

అధ్యక్షుడిని, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌ను, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను భద్రతా సిబ్బంది వెంటనే ఈ ప్రాంతం నుంచి బయటికి తీసుకొచ్చారు.

ట్రంప్‌ను బయటకు తీసుకెళ్లడానికి కొన్ని క్షణాల ముందు, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను సీక్రెట్ సర్వీసు ఏజెంట్లు బయటకు లాక్కెళ్లిన వీడియో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ కావడంతో.. ఇద్దర్నీ కాపాడిన సమయంలో తేడాను కొంతమంది యూజర్లు ప్రశ్నిస్తున్నారు.

ఆదివారం న్యూస్ ప్రోగ్రామ్ 60 మినిట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ… ”గది నుంచి నన్ను బయటకు తరలించడం సెక్యూరిటీ ఏజెంట్లకు అంత తేలిక కానివ్వలేదు” అని తెలిపారు.

”ఏం జరుగుతుందో నేను చూడాలనుకున్నాను. అప్పుడే, అదొక పెద్ద సమస్యగా మారిపోతుందని మేం గ్రహించాం” అని తెలిపారు.

ఒకానొక సమయంలో దాక్కోవాలని తనకు భద్రతా సిబ్బంది చెప్పారని, నేలపై కూర్చోండి అంటూ హెచ్చరించారని ట్రంప్ చెప్పారు.

భద్రతా సిబ్బంది సమయ స్ఫూర్తిని ట్రంప్ ప్రశంసించారు.

ట్రంప్

ఫొటో సోర్స్, Reuters

అనుమానిత దుండుగుడిపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా ఎదురు కాల్పులు జరిపి, అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు.

నిందితుడు తన గన్‌తోనే కాల్పులు జరిపి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు.

వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. నిందితుడి దగ్గర రెండు తుపాకులు, కత్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లోని అధికారులను లక్ష్యంగా చేసుకోవాలని నిందితుడు కోరుకున్నట్లు ఆయన రాసుకున్న లేఖల ద్వారా తెలిసిందని అమెరికా సీనియర్ అధికారులు సీబీఎస్‌ న్యూస్‌కు చెప్పారు. నిందితుడు నుంచి సేకరించిన ఈ లేఖలను ప్రస్తుతం ఇన్వెస్టిగేటర్లు పరిశీలిస్తున్నారు.

దాడికి ముందు ఆయన నుంచి ఈ లేఖలను పొందిన అలెన్ కుటుంబ సభ్యుల్లో ఒకరు, దీనిపై పోలీసులను అప్రమత్తం చేశారు.

కుటుంబ సభ్యులకు పంపిన లేఖలలో వైట్‌హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ పార్టీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

అయితే, దాడి చేయడానికి ముందు అనుమానితుడు తన కుటుంబ సభ్యులకు రాసిన లేఖలను, మేనిఫెస్టోగా చెబుతున్న దాన్ని బీబీసీ న్యూస్ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

ఈ ఘటనలో కాల్పులకు గురై గాయపడిన అధికారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

”ఆయన ధరించిన బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ పెను ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడింది” అని సీక్రెట్ సర్వీసెస్‌లో కమ్యూనికేషన్స్ చీఫ్ ఆంథోనీ గుగ్లియెల్మి బీబీసీకి చెప్పారు.

ఈ విందు కార్యక్రమానికి పలువురు బీబీసీ రిపోర్లర్లు కూడా హాజరయ్యారు. కాల్పుల శబ్దాలు విన్న తర్వాత ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి నెలకొందని వారు అన్నారు.

భారీ శబ్దాలను విన్నానని బీబీసీ చీఫ్ నార్త్ అమెరికా కరెస్పాండెంట్ గారీ ఓ’డోనోఘ్యూ’ చెప్పారు.

హెల్త్, హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్

ఫొటో సోర్స్, Getty Images

కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడానికి ముందు, కొద్దిసేపు ఆ గదిని మూసివేశారు. కార్యక్రమానికి హాజరైన వారిని బయటికి పంపించేశారు.

అనుమానితుడు లాస్ ఏంజెల్స్ నుంచి చికాగోకు ప్రయాణించి, ఆ తర్వాత వాషింగ్టన్ డీసీకి రైలులో చేరుకుని ఉండొచ్చని ఇన్వెస్టిగేటర్లు భావిస్తున్నట్లు బీబీసీ యూఎస్ పార్టనర్ సీబీఎస్ న్యూస్‌కు బ్లాంచే చెప్పారు.

లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, నిందితుడు అలెన్ 2017లో కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 2025లో కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ డొమింగ్యూజ్ హిల్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.

పార్ట్ టైమ్ టీచర్‌గా, సొంతంగా గేమ్ డెవలపర్‌గా పనిచేస్తున్నట్లు ఆ ప్రొఫైల్ ద్వారా తెలుస్తోంది.

ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు, కాలిఫోర్నియాలోని టోరెన్స్‌కు చెందిన 31 ఏళ్ల కోల్ థామస్ అలెన్‌గా గుర్తించినట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.

నిందితుడు ఈ కార్యక్రమం జరుగుతున్న హోటల్‌లోనే అతిథిగా ఉన్నాడని వాషింగ్టన్ డీసీ పోలీస్ చీఫ్ జెఫ్రీ డబ్ల్యూ కారోల్ అన్నారు. దర్యాప్తులో భాగంగా అతను బస చేసిన గదిని ప్రస్తుతం పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

హింసాత్మక నేరానికి పాల్పడటం, తుపాకీ వినియోగించడం వంటి పలు అభియోగాలను అలెన్‌పై నమోదు చేసే అవకాశం ఉంది.

థామస్ అలెన్

ఫొటో సోర్స్, LinkedIn

దాడి తర్వాత వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ప్రసంగించారు. పూర్తిగా ఫార్మల్ డ్రెస్‌లో బ్లాక్ టై ధరించి, జర్నలిస్టులతో నిండిన గదిలోకి వచ్చారు ట్రంప్. ఈ సమావేశంలో సీక్రెట్ సర్వీసును కొనియాడారు. ఈ గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ వారికి రుణపడి ఉంటారని అన్నారు.

అధ్యక్షుడిగా తన రెండు పదవీ కాలాల్లో మీడియాపై విరుచుకుపడినప్పటికీ.. ఈ దాడిని బాధ్యతాయుతంగా కవర్ చేశారంటూ వ్యాక్యానించిన ట్రంప్, మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు.

వైట్‌హౌస్‌లో కొత్తగా బాల్‌రూమ్ నిర్మించాలన్న తన వాదనను బలపర్చుకునేందుకు ఈ ఘటనను ఆయన ఉపయోగించుకున్నారు.

“ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మిలిటరీ టాప్ సీక్రెట్ బాల్‌రూమ్ ఉంటే ఇది జరిగి ఉండేది కాదు” అని ట్రూత్ సోషల్‌లో రాశారు.

ఈ వివాదాస్పదమైన ప్రాజెక్టు ఎన్నో లీగల్ సమస్యలను ఎదుర్కొంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)