Home జాతీయ national telgu టీడీపీ vs వైసీపీ: ప్రత్యర్థుల భయంతో కొందరు ఊరొదిలిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, పల్నాడు గ్రామాల్లో...

టీడీపీ vs వైసీపీ: ప్రత్యర్థుల భయంతో కొందరు ఊరొదిలిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, పల్నాడు గ్రామాల్లో ఏం జరుగుతోంది?- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

17
0

SOURCE :- BBC NEWS

పాత కక్షలు, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

ఎన్నికలవేళ సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రధాన పార్టీల శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం, ఆ తర్వాత క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు ఏర్పడటం చూస్తుంటాం..

కానీ, ఆంధ్రప్రదేశ్‌‌లోని పల్నాడు జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాల్లో.. మరీముఖ్యంగా మాచవరం మండలంలోని పిన్నెల్లి లాంటి గ్రామాల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి.

ఎన్నికల ఫలితాలు రాగానే ఓడిపోయిన పార్టీల కార్యకర్తలు, అభిమానులు గ్రామాలు విడిచి వెళ్లిపోయే అసాధారణ స్థితి అక్కడ కొన్నేళ్లుగా రివాజుగా మారింది.

2019లో రాష్ట్రంలో వైఎస్సార్‌‌సీపీ అధికారంలోకి రాగానే టీడీపీకి చెందిన కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోగా, 2024లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ మద్దతుదారుల కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయాయి.

అసలు పల్నాడులో ఏం జరుగుతోంది? ఆ ఊళ్లో పరిస్థితులేంటి? స్థానికులు ఏం చెబుతున్నారు? పోలీసులు ఏమంటున్నారు? వంటి విషయాలపై బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఆంధ్రప్రదేశ్, పల్నాడు, ఫ్యాక్షన్, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

‘ఊళ్లోకి వచ్చాడనే చంపేశారు..’

2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి చెందిన కొన్ని కుటుంబాలు పిన్నెల్లి గ్రామం విడిచి వెళ్లిపోయాయి. వారిలో మందా సాల్మన్ కుటుంబం కూడా ఒకటి.

సాల్మన్‌ జనవరి 9వ తేదీన ఊరికి తిరిగొచ్చారు. ఆ మరుసటి రోజే.. అంటే జనవరి 10న ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడి అదే నెల 15న మరణించారు. దీంతో, పిన్నెల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

“2024లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే మా ఇంటిపై దాడి చేశారు. దాంతో కుటుంబమంతా బ్రాహ్మణపల్లికి వెళ్లిపోయి.. అక్కడే ఉంటున్నాం. పశువుల మేతకు అక్కడ ఇబ్బంది రావడంతో మూడు నెలల కిందట మా పాప, బాబు, నేను తిరిగి ఊరొచ్చి ఇక్కడే ఉంటున్నాం. సాల్మన్‌ మాత్రం రాలేదు.”

“నాకు ఒంట్లో బాలేదని కబురుపెడితే జనవరి 9వ తేదీ రాత్రి ఆయన పిన్నెల్లి వచ్చారు. మరుసటి రోజు ఉదయం 10 గంటల సమయంలో ఇంటి ముందు నిల్చుని ఉన్న ఆయనపై గ్రామానికి చెందిన పేతురు, మరికొందరు ప్రత్యర్థులు కలిసి దాడి చేశారు. ఊళ్లోకి రావొద్దంటే ఎందుకొచ్చావంటూ కర్రలతో కొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను గుంటూరు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించి జనవరి 15న చనిపోయారు” అని మంద కుమారి బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, పల్నాడు, ఫ్యాక్షన్, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

వ్యక్తిగత వివాదమంటున్న పోలీసులు, రాజకీయ హత్యేనంటున్న కుటుంబ సభ్యులు

సాల్మన్‌పై దాడి జరిగిన వెంటనే ప్రధాన నిందితుడు పేతురుతో పాటు మరో నిందితుడు కాంతారావును అరెస్టు చేసి రిమాండ్‌కి పంపినట్లు దాచేపల్లి సీఐ భాస్కర్‌ బీబీసీకి తెలిపారు.

ఇది రాజకీయ హత్య కాదని, వ్యక్తిగత వివాదాలతో జరిగిన హత్య అని సీఐ చెప్పారు.

అయితే, ఇది కచ్చితంగా రాజకీయ హత్యేనని సాల్మన్‌ కుమారుడు మంద భిక్షు బీబీసీతో అన్నారు.

మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన పేతురు కుటుంబ సభ్యులు బీబీసీతో మాట్లాడారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే తన భర్త పేతురుని సాల్మన్ తీవ్రంగా కొట్టారని, అందువల్ల ఊరు విడిచి వెళ్లాల్సి వచ్చిందని బీబీసీతో చెప్పారు పేతురు భార్య మరియమ్మ.

“జనవరి 10న మా ఆయన పొలం పనుల కోసం సాల్మన్‌ ఇంటిమీదుగా నడుచుకుంటూ వెళ్తుండగా, తనపై దాడి చేసేందుకు వస్తున్నాడేమోనని భయపడి సాల్మన్ ముందుగానే మా ఆయన మీద దాడి చేశాడు. తిరిగి మా ఆయన కర్రతో కొట్టేసరికి ఆయన తీవ్రంగా గాయపడి చనిపోయారే తప్ప హత్య చేయాలని మా ఆయన పొరపాటున కూడా అనుకోలేదు” అని మరియమ్మ చెబుతున్నారు.

ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ.. కక్షలు, కార్పణ్యాలు పేదల జీవితాలను ఎలా బలితీసుకుంటున్నాయో చెప్పేందుకు ఉదాహరణగా నిలుస్తోందీ ఘటన.

ఆంధ్రప్రదేశ్, పల్నాడు, ఫ్యాక్షన్, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

ఊళ్లో చాలా ఇళ్లకు తాళాలే..

అత్యంత సమస్యాత్మక గ్రామంగా గుర్తింపు పొందిన పిన్నెల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో, చాలా ఇళ్లకు తాళాలు వేసి కనిపించాయి.

ఇవన్నీ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లేనని అక్కడి స్థానికులు బీబీసీకి తెలిపారు.

2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఊళ్లోని ఎస్సీ కాలనీకి చెందిన దాదాపు 45 వైసీపీ కుటుంబాలు ఊరొదిలి వెళ్లిపోయాయని గ్రామస్థురాలు కోటేశ్వరమ్మ బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, పల్నాడు, ఫ్యాక్షన్, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

“వైసీపీ వారు ఉండటానికి వీల్లేదని దాడులు చేయడంతో ఊరు దాటిపోయి, చుట్టుపక్కల ఊళ్లల్లో కొంతమంది.. గుంటూరులో మరికొంతమంది.. అనుకూలంగా ఉన్నచోట బతుకుతున్నారు” అని కోటేశ్వరమ్మ చెప్పారు.

కేవలం తనలాంటి వృద్ధులు పింఛన్ల కోసం ఇక్కడే ఉంటున్నామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్, పల్నాడు, ఫ్యాక్షన్, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

‘వైసీపీ ఓడిపోగానే ఊరు విడిచి వచ్చేశాం’

2024లో ఎన్నికల ఫలితాల తర్వాత తాము సొంతిళ్లు ఉన్న పిన్నెల్లిని వదిలేసి, దూరంగా ఉన్న తుమ్మలచెరువులో ఇళ్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నట్లు వైసీపీ సానుభూతిపరులు కరీముల్లా, సైదావలి బీబీసీకి తెలిపారు.

“ఆ ఎలక్షన్‌ ఫలితాలు వచ్చిన రోజే ప్రత్యర్థి పార్టీల వాళ్లు మా ఇళ్ల మీదకి వచ్చారు. కనీసం ఆడవాళ్లను కూడా ఉండనివ్వలేదు. వాళ్లు అక్కడే ఉంటే మా ఆడవాళ్లతో దాడి చేస్తామని బెదిరించారు. దీంతో పిల్లాజెల్లా, పశువులతో సహా ఊరు వదిలేసి వచ్చి ఇక్కడ కూలీ పని చేసుకుని బతుకుతున్నాం” అని కరీముల్లా తెలిపారు.

“ఇప్పుడు మేం వెళ్లినా సాల్మన్‌ను చంపినట్టు చంపేస్తారు. ప్రాణం ఉంటే చాలు.. ఎక్కడో చోట బతకొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉంటున్నాం” అని బీబీసీతో సైదావలి అన్నారు.

ఆంధ్రప్రదేశ్, పల్నాడు, ఫ్యాక్షన్, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

‘2019లో వాళ్లూ ఇలానే దాడులు చేశారు’

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు తమను కూడా ఇలాగే వేధించారని, తాము కూడా ఊరు విడిచి వెళ్లిపోయామని టీడీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు బీబీసీతో అన్నారు.

టీడీపీ సానుభూతిపరుడు, పిన్నెల్లి గ్రామ మాజీ సర్పంచ్‌ షేక్‌ జానీ బాషా, టీడీపీ కార్యకర్త సుభానీ మాట్లాడుతూ, “2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే.. ఆ పార్టీ వాళ్లు పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని బలవంతంగా ఊరు దాటించారు. అప్పుడు దాదాపు 200పైగా కుటుంబాల వాళ్లం బయటకు వెళ్లి.. మళ్లీ 2024 ఎలక్షన్‌ కోడ్‌ వచ్చాకే తిరిగి పిన్నెల్లి వచ్చాం” అని బీబీసీతో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, పల్నాడు, ఫ్యాక్షన్, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

‘ఊరు ఆగమైపోయింది.. ’

“వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ వాళ్లపై దాడులు చేయడం, ఊరి నుంచి బయటకు పంపించారు. ఇప్పుడు వైసీపీ వాళ్లపై అదే మాదిరిగా దాడులు, బహిష్కరణలు జరుగుతున్నాయి” అని గ్రామానికి చెందిన వృద్ధుడు మోషా ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ప్రతీకార రాజకీయాలతో ఊరు ఆగమైపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

‘పోలీసులతోనే ఊరు దాటిస్తారు..’

పోలీసులే దగ్గరుండి ఊరు దాటిస్తారని, ఒకవేళ వెళ్లకపోతే బలవంతంగా పోలీసులే వచ్చి వెళ్లేలా చేస్తారని టీడీపీ, వైసీపీ శ్రేణులతో మాట్లాడినప్పుడు.. ఇరుపార్టీలవారూ బీబీసీతో చెప్పారు.

“మా అంతట మేం పోలేదు. 2019లో పోలీసులే మమ్మల్ని దగ్గరుండి బయటకు పంపించారు” అని టీడీపీ కార్యకర్త సుభానీ బీబీసీతో అన్నారు.

“2024లో కూడా పోలీసుల సమక్షంలోనే మేం బయటకు వచ్చాం” అని వైసీపీ కార్యకర్త సైదావలి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్, పల్నాడు, ఫ్యాక్షన్, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

మాకేం సంబంధం లేదు: పోలీసులు

ఇలా విపక్ష పార్టీల కార్యకర్తలు, అభిమానులు ఊరొదిలి వెళ్తున్న వైనాన్ని పోలీసుల వద్ద బీబీసీ ప్రస్తావించగా.. తమకేమీ సంబంధం లేదని పోలీసులు వ్యాఖ్యానించారు. అంతకుమించి మాట్లాడేందుకు వారు నిరాకరిస్తున్నారు.

దాదాపు 20 నెలలుగా వైసీపీ శ్రేణులు పిన్నెల్లి నుంచి వెళ్లిపోవడాన్ని దాచేపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌ వద్ద ప్రస్తావించగా, అలాంటి పరిస్థితులేవీ లేవని ఆయన కొట్టిపారేశారు.

ఎవరూ ఊరు విడిచి వెళ్లలేదని, జీవనోపాధి కోసం వెళ్లి ఉంటారే గానీ.. ఓ పార్టీని చూసి భయపడి వెళ్లి ఉండరని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదే విషయమై పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును కూడా బీబీసీ సంప్రదించింది. అయితే, ఆయన ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు.

ఆంధ్రప్రదేశ్, పల్నాడు, ఫ్యాక్షన్, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

‘పార్టీలకతీతంగా పోలీసులు వ్యవహరిస్తేనే..’

పోలీసులు పార్టీలకు అతీతంగా వ్యవహరిస్తేనే, తమ గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట పడుతుందని పల్నాడు వాసులు అంటున్నారు.

పిడుగురాళ్లకు చెందిన జర్నలిస్ట్ నరసింహారావు బీబీసీతో మాట్లాడుతూ, “ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వారు ప్రత్యర్థులపై దాడులు చేసే సంస్కృతిని అరికట్టి ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది” అని అన్నారు.

కానీ, పోలీస్ వ్యవస్థ ఆ మేరకు దృష్టిసారించిన సందర్భాలు కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

“ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుండడం వల్లే ప్రజలు భయభ్రాంతులకు గురై గ్రామాలు విడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికైనా పోలీసులు ఊళ్ల నుంచి వెళ్లిపోయిన వారిని వెనక్కి తీసుకురావడంలో చొరవ చూపించాలి” అని నరసింహారావు కోరుతున్నారు.

పిన్నెల్లి గ్రామంతో పాటు గురజాల నియోజకవర్గంలోని మరికొన్ని గ్రామాల్లో జనం ఊళ్లు విడిచిపోతున్న సంస్కృతిపై టీడీపీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో పాటు వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో బీబీసీ మాట్లాడింది.

ఆంధ్రప్రదేశ్, పల్నాడు, ఫ్యాక్షన్, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

నాడు పదుల్లో.. ఇప్పుడు వందల్లో: మాజీ ఎమ్మెల్యే కాసు

2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి చెందిన కుటుంబాలు ఊరొదిలి వెళ్లిన మాట వాస్తవేమనని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి అంగీకరించారు. అయితే అప్పట్లో పదుల సంఖ్యలోనే కుటుంబాలు వెళ్లాయని ఆయన బీబీసీతో అన్నారు.

కాకపోతే, వారిని తాము వెళ్లమనలేదనీ.. 2014–19 మధ్య టీడీపీ అండతో అరాచకాలు చేసిన వాళ్లే అలా వెళ్లిపోయారని ఆయన అన్నారు.

ఇప్పుడు వైసీపీకి చెందిన వందలమంది సామాన్య కార్యకర్తలను సైతం బలవంతంగా ఊరి నుంచి పంపించేస్తున్నారని, కాదని తిరిగొచ్చిన సాల్మన్‌ను దారుణంగా చంపేశారని కాసు ఆరోపించారు.

అసలు ఆ హత్యతోనే పల్నాడులో చట్టం, న్యాయం పరిస్థితి ఎలా ఉందో అందరికీ అర్ధమైందని కాసు వ్యాఖ్యానించారు.

“ఇలా ఎన్నాళ్లీ కక్షలు, కార్పణ్యాలు.. రేపు మేం(వైసీపీ) అధికారంలోకి వస్తే.. మళ్లీ ఇలానే అవుతుంది. ఎక్కడో చోట ముగింపు పలకాలి కదా. అందుకే రండి.. ఊళ్లో శాంతి కమిటీ వేద్దాం.. మీరు ఒక అడుగు ముందుకేయండి. నేను పది అడుగులు వేస్తాను. పిన్నెల్లితో పాటు అన్ని ఊళ్లలో రాజీలు చేద్దాం” అని కాసు మహేశ్ రెడ్డి బీబీసీ ద్వారా టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్, పల్నాడు, ఫ్యాక్షన్, రాజకీయాలు, టీడీపీ, వైసీపీ

అప్పుడు వందల్లో.. ఇప్పుడు నలుగురైదుగురే: ఎమ్మెల్యే యరపతినేని

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, వైసీపీ మద్దతుదారుల కుటుంబాలు ఊరొదిలి వెళ్లిన విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యే కూడా కాదనలేదు.

“వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి ఈ అరాచకం మొదలైంది. టీడీపీకి చెందిన 40 మందికి పైగా కాళ్లు చేతులు విరగ్గొట్టారు. దాదాపు 250 కుటుంబాల వారిని ఐదు సంవత్సరాలు బయటికి పంపించేశారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు’’ అని బీబీసీతో అన్నారు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.

అప్పట్లో రెచ్చిపోయిన నాలుగైదు కుటుంబాల వారే ఇప్పుడు స్వచ్ఛందంగా ఊరొదిలి వెళ్లిపోయారని శ్రీనివాసరావు అంటున్నారు.

“ఊరు నుంచి వెళ్లిన ఆ కుటుంబాల వాళ్లను రమ్మనండి. వారిని ఎవరూ ఏమనరు. వచ్చి ఎవరితో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండమనండి. నేను భరోసా ఇస్తున్నా” అని ఆయన అన్నారు.

శాంతి కమిటీల ప్రతిపాదనలపై స్పందిస్తూ, “శాంతి కమిటీలు వేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం” అని యరపతినేని అన్నారు.

టీడీపీ శ్రేణులకే తాను ఎమ్మెల్యేని కాదని, ఇకపై గొడవలు జరగకుండా.. ఫ్యాక్షన్‌ ఛాయలు కనిపించకుండా చూస్తానని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)