SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Getty Images
2019 ఫిబ్రవరి 14….
పుల్వామాలో జమ్మూ- శ్రీనగర్ హైవే మీద కేంద్ర బలగాల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది చనిపోయారు.
ఈ దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జైషే మొహమ్మద్ ప్రధాన కార్యాలయం పాకిస్తాన్‌లో ఉంది. అయితే పాకిస్తాన్ ఆ ఆరోపణను తిరస్కరించింది.
ఈ దాడిలో 80 కిలోల ఆర్డీఎక్స్‌తో పాటు 300 కేజీల ఇతర పేలుడు పదార్ధాలు ఉపయోగించారు. ఈ సంఘటనపై 12 మంది ఎన్ఐఏ సభ్యుల బృందం దర్యాప్తు చేసింది.
సీఆర్‌పీఎఫ్ బలగాల మీద దాడి జరిగిన 12 రోజుల తర్వాత, ప్రతిస్పందనగా బాలాకోట్‌లో వైమానిక దాడులు చేసినట్లు భారత్ తెలిపింది. తాము జైషే మొహమ్మద్ శిక్షణ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.
ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మౌలానా మసూద్ అజర్, జైషే మొహమ్మద్ పాత్ర మరోసారి చర్చల్లోకి వచ్చింది.
భారత సైన్యం ఇటీవల జైషే మొహమ్మద్ ప్రధాన స్థావరం మీద దాడులు చేసింది. ఇందులో తన కుటుంబ సభ్యులు, బంధువులు చనిపోయారని మసూద్ అజర్ ప్రకటించారు.


ఫొటో సోర్స్, Getty Images
హుజి, హర్కత్- ఉల్- అన్సార్ నుంచి జైషే మొహమ్మద్ వరకు
జైషే మొహమ్మద్‌ను 2000 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అయితే దాని చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఇంకాస్త వెనక్కి వెళ్లాలి.
అఫ్గానిస్తాన్‌లో రష్యన్లకు వ్యతిరేకంగా ‘సాయుధ పవిత్ర యుద్ధం (జిహాద్) చేసేందుకు’ అంటూ కరాచీలోని బినోరియా టౌన్ మసీదుకు చెందిన విద్యార్థి ఇర్షాద్ అహ్మద్, 1979లో హర్కత్- ఉల్- జిహాద్ అల్ ఇస్లామీ( హుజీ) అనే సంస్థను ఏర్పాటు చేశారు.
1984లో హుజీ విడిపోయింది. హర్కత్- ఉల్- ముజాహిదీన్ అనే పేరుతో హుజీ సంస్థ పష్తూన్ కమాండర్ ఫజలుర్ రెహమాన్ ఖలీల్ మరో సంస్థను ఏర్పాటు చేశారు. 9ఏళ్ల తర్వాత 1993లో హుజీ, హర్కత్- ఉల్ ముజాహిదీన్ కలిసిపోయి హర్కత్- ఉల్- అన్సార్‌గా ఏర్పడ్డాయి.
ఈ కలయికలో మసూద్ అజర్ కీలక పాత్ర పోషించాడు. ఈ రెండు సంస్థలు నాలుగేళ్లు కలిసి పని చేశాయి.
అరబ్- అఫ్గాన్లతో సంబంధాల కారణంగా హర్కత్- ఉల్-అన్సార్‌ను 1997లో అమెరికా నిషేధించింది. అయితే ఏడాది తర్వాత అది నిషేధాన్ని తప్పించుకునేందుకు జమాత్- ఉల్- అన్సార్‌గా ఏర్పడింది. ఈ సంస్థను అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నిషేధించారు.
1994లో మసూద్ అజర్‌ను కశ్మీర్‌లో అరెస్ట్ చేసినప్పుడు హిజ్బుల్ ముజాహిదీన్‌లో సభ్యుడు.

ఫొటో సోర్స్, Getty Images
2000లో జైషే మొహమ్మద్ ఏర్పాటు
1999 డిసెంబర్‌లో భారత్ విమానాన్ని కాందహార్‌కు హైజాక్ చేసి, మసూద్ అజర్‌ను జైలు నుంచి విడుదలకు డిమాండ్ చేయడంతో భారత్ ఆయన్ను రిలీజ్ చేసింది. మసూద్ అజర్ అఫ్గానిస్తాన్ వెళ్లి అక్కడ ముల్లా ఒమర్, ఒసామా బిన్ లాడెన్‌ను కలిసినట్లు భారత నిఘా వర్గాల అధికారులు భావించేవారు. అయితే దీన్ని ఎవరూ నిర్ధరించలేదు.
“జైలు నుంచి విడుదలైన తర్వాత, హిజ్బుల్ ముజాహిదీన్ చీలిపోవడం మసూద్ అజర్‌కు నచ్చలేదు. చివరకు 2000 ఫిబ్రవరి 4న కరాచీలోని “మస్జిద్-ఇ-ఫలా” లో (ఈ మాటకు మొహమ్మద్ ప్రవక్త సైన్యం అని అర్థం) జైషే మొహమ్మద్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అజర్ ప్రకటించారు.
దీనికి ప్రధాన కారణం కశ్మీర్‌లో జిహాద్ విషయంలో హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ మౌలానా ఫజలుర్ రెహమాన్ ఖలీల్‌తో మౌలానా మసూద్ అజర్‌కు సిద్ధాంతపరమైన విభేదాలు రావడమే” అని ‘జైషే మొహమ్మద్ మ్యాపింగ్ మిలిటెంట్స్ ప్రొఫైల్’ అనే పేరుతో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ సెక్యూరిటీ అండ్ కో ఆపరేషన్ రాసిన కథనం వివరించింది.
ఈ ప్రకటనతో నాలుగింట మూడొంతుల మంది హిజ్బుల్ ముజాహిదీన్ సభ్యులు జైషే మొహమ్మద్‌లో చేరారు.

ఫొటో సోర్స్, Getty Images
లష్కరేకు ప్రతిగా జైషే ఏర్పాటు
‘‘మసూద్ అజర్‌ను భారత్ విడుదల చేసిన తర్వాత కొత్త సంస్థకు నిధులు వసూలు చేసేందుకు పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ ఆయనను “సెలబ్రిటీ” గా మార్చింది’’ అని 2022 ఏప్రిల్ 12న దక్కన్ హెరాల్డ్ ప్రచురించిన కథనం పేర్కొంది.
‘‘మసూద్ పాకిస్తాన్ అంతటా పర్యటిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. 2000లో కరాచీలో చేసిన ఓ ప్రసంగంలో “జిహాద్ కోసం పెళ్లి చేసుకోండి. జిహాద్ కోసం పిల్లల్ని కనండి. అమెరికా, భారత్ అరాచకాలను అంతం చేసే జిహాద్ కోసం డబ్బులు సంపాదించండి” అని చెప్పినట్లు ఈ కథనంలో ఉంది.
“జైలు నుంచి విడుదలైన తర్వాత బహిరంగ సభల్లో మసూద్‌ను ‘హీరో’గా పరిచయం చేసేవారు” అని అమెరికన్ రక్షణరంగ విశ్లేషకుడు బ్రూస్ రీడెల్ 2016 జనవరి 5న ది డైలీ బీస్ట్‌కు రాసిన కథనంలో పేర్కొన్నారు.
జైషే మొహమ్మద్ ఏర్పడిన కొన్ని రోజులకే శక్తివంతంగా ఎదిగింది. ఉన్నత స్థాయిలో సిఫార్సు ఉంటేనే అందులో సభ్యత్వం లభిస్తుందని చెప్పేవారు.
యువకుల్ని జైషే మొహమ్మద్‌లో చేర్చేందుకు ఐఎస్ఐ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని భారతీయ నిఘా విభాగం అధికారులు చెప్పారు.
“లష్కరే తోయిబాకు ప్రతిగా జైషేను ఏర్పాటు చేశారు” అని 2019 ఫిబ్రవరి 22న ‘జైషే ఈజ్ ఐఎస్ఐస్ స్టార్టప్’ అనే పేరుతో ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ జాయింట్ డైరెక్టర్ అవినాష్ మోహానే ఇండియాటుడేకు రాసిన కథనంలో తెలిపారు.
“కశ్మీర్‌లో నియంత్రణ, సమతుల్యత కొనసాగించడానికి, ఏ సంస్థకు ఈ ప్రాంతంపై గుత్తాధిపత్యం లేకుండా, ఒకే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీద ఆధారపడే పరిస్థితుల్ని తగ్గించుకోవడానికి అనేక టెర్రరిస్టు ఆర్గనైజేషన్లను సృష్టించడం ఐఎస్ఐ వ్యూహం” అని ఉగ్రవాదం, భారత విదేశాంగ విధానం మీద అనేక పుస్తకాలు రాసిన అభినవ్ పాండ్యా తన ‘ఇన్‌సైడ్ ద టెర్రిఫైయింగ్ వరల్డ్ ఆఫ్ జైషే మొహమ్మద్’ అనే పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, HarperCollins
కశ్మీర్‌లో మసూద్ అజర్ అరెస్ట్
మసూద్ అజర్ పాకిస్తాన్‌లోని బహావల్‌పుర్‌లో 1968 జులై 10న జన్మించారు.
1994 జనవరి 29న ఆయన ఢాకా మీదుగా భారత్ చేరుకున్నట్లు హరీందర్ బవేజా 2019 మార్చ్ 15న హిందుస్థాన్ టైమ్స్‌కు రాసిన ‘‘మసూద్ అజర్: ఇన్‌సైడ్ ద మైండ్ ఆఫ్ గ్లోబల్ టెర్రర్ మర్చంట్’’ అనే కథనంలో తెలిపారు.
భారత్ వచ్చేందుకు ఆయన పోర్చుగీస్ పాస్‌పోర్ట్ ఉపయోగించారు. అందులో ఆయన పేరు ‘వలి ఆదం ఇసా’ అని ఉంది.
ఫిబ్రవరి 9న మసూద్ శ్రీనగర్ నుంచి అనంతనాగ్ వెళుతుండగా కారు ఆగిపోయింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తుండగా భద్రతా బలగాలు ఆటోను ఆపాయి.
“ఆ సమయంలో మసూద్‌తో పాటు ప్రయాణిస్తున్న హర్కత్- ఉల్ అన్సార్ సెక్షన్ కమాండర్ ఫరూక్ భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపి తప్పించుకుని పారిపోయాడు. అప్పుడే మసూద్‌తో పాటు సజ్జాద్ అఫ్గానినీ అరెస్ట్ చేశారు” అని హరీందర్ బవేజా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
సొరంగం గుండా పారిపోయే ప్రయత్నం విఫలం
మసూద్‌ను కశ్మీర్‌లోని అనేక జైళ్లలో పెట్టారు. ఒకసారి జైలు నుంచి సొరంగం ద్వారా తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఆయన సొరంగంలో ఇరుక్కుపోయారు.
“మసూద్ అజర్‌ను సొరంగం నుంచి బయటకు తీసిన తర్వాత భద్రతా సిబ్బంది అతని శరీరాకృతిని ఎగతాళి చేస్తూ అలాంటి కమాండో తరహా ఆపరేషన్లు నీకు పనికి రావని చెప్పారు. ఈసారి కొంచెం వెడల్పాటి సొరంగం తవ్వు లేదా నీ బరువు తగ్గించుకో అని అన్నారు. దీనికి సమాధానంగా మసూద్ అజర్ ‘ఈసారి నాకు సొరంగం అవసరం లేదు’ ” అని చెప్పినట్లు ప్రవీణ్ స్వామి 2003 డిసెంబర్ 5న ఫ్రంట్‌లైన్ పత్రికలో ప్రచురితమైన ‘ది కాందహార్ ప్లాట్’ అనే కథనంలో రాశారు. ప్రవీణ్ స్వామి పలు పత్రికలు, మేగజైన్లకు నేషనల్ సెక్యూరిటీ ఎడిటర్‌గా పని చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
ఐఎస్ఐకి “వ్యూహాత్మక ఆస్తి”
మసూద్ అజర్‌ను కొంతకాలం తీహార్ జైల్లో ఉంచారు. అక్కడ ప్రముఖ నేరస్థుడు చార్లెస్ శోభరాజ్‌తో పరిచయం పెంచుకున్నారు.
ఐఎస్ఐకి మసూద్ అనివార్యమైన వ్యక్తిగా మారాడు. “అజర్ పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐకి వ్యూహాత్మక శక్తి. అనేకమంది టెర్రరిస్టులు చనిపోయినా వాళ్లు పట్టించుకోరు, కానీ మసూద్ చావును తట్టుకోలేరు’’ అని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఏర్పాటు చేసిన ఆర్‌వీ రాజు తనతో చెప్పినట్లు అభినవ్ పాండ్యా రాశారు.
“తుపాకులు పట్టుకుని చంపుతూ, చచ్చేలా యువకుల్ని ప్రోత్సహించే ఒక వ్యక్తి వాళ్లకు కావాలి. మిగతా టెర్రరిస్టులంతా వారి దృష్టిలో చచ్చినా బతికినా ఒకటే. కానీ మసూద్ మత ప్రచారకుడు. మిగతా టెర్రరిస్టులకు అతనికి మధ్య తేడా ఇదే” అని అభినవ్ పాండ్యా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ మీద భారీ దాడికి మసూద్‌పై ఒత్తిడి
జైషే ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత ఇండియన్ పార్లమెంట్ మీద దాడి జరిగింది. దీనికి తమదే బాధ్యత అని జైషే ప్రకటించుకుంది.
ఈ దాడిలో 9 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. అయితే దాడి జరిగిన సమయం, పార్లమెంట్ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకోవడంతో ఇది చాలా పెద్ద దాడిగా భావించారు. ఇది ప్రజాస్వామ్యం మీద దాడి అని భారత ప్రభుత్వం ప్రకటించింది.
“మసూద్‌ను ఐఎస్ఐ విడుదల చేయించింది. అతనిని ఒక విజేతగా పాకిస్తాన్ అంతటా తిప్పారు. అతనికి జైషే మొహమ్మద్ ఏర్పాటు చేయడానికి అవసరమైన మనుషులు, డబ్బులు, శిక్షణ, ఆయుధాలు అన్నీ ఇచ్చారు. ఇందుకు ప్రతిఫలంగా మసూద్ కూడా ఏదో ఒకటి చేయాలని భావించారు. ఐఎస్ఐ కోరుకున్నట్లుగానే మసూద్ పార్లమెంట్ మీద దాడి చేయించారు. ఆ సమయంలో ఐఎస్ఐకి ఇది చాలా అవసరం” అని పార్లమెంట్ మీద దాడిని విశ్లేషిస్తూ ‘రా’ (రీసర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) మాజీ చీఫ్ ఏఎస్ దులత్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
జమ్మూ కశ్మీర్‌లో అనేక దాడుల వెనుక జైషే హస్తం
2000 ఏప్రిల్ 20న కశ్మీర్‌లోని ప్రధాన మిలటరీ యూనిట్ బాదామిబాగ్‌లో ఉన్న చినార్ కోర్ హెడ్‌క్వార్టర్స్‌లోకి జైషేకు చెందిన ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్ధాలు నింపిన కారును నడపడంతో పేలుడు సంభవించి నలుగురు సైనికులు చనిపోయారు.
దీని తర్వాత 2001 అక్టోబర్‌లో జైషే ఆత్మాహుతి దళ సభ్యుడు, బ్రిటన్‌కు చెందిన మొహమ్మద్ బిలాల్ జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ మీద దాడి చేసిన ఘటనలో 38 మంది మరణించారు.
“ముషారఫ్‌ను హత్య చేసేందుకు మసూద్ తన మనుషులను పంపించాడు. అయితే దీని తర్వాత అతను ప్రభుత్వంతో ఘర్షణను పక్కన పెట్టాడు. లాల్ మసీద్ కేసు నుంచి దూరంగా ఉన్నాడు. మిగతా జిహాదీ సంస్థలు యాధృచ్చికంగా వ్యక్తుల్ని ఎంచుకుని వారిని సైనిక శిక్షణ కోసం పంపేవి. జైషే మొహమ్మద్ ఈ విధానాన్ని మార్చింది. ముందుగా తాము ఎంపిక చేసుకున్న వ్యక్తులకు సిద్ధాంతపరంగా శిక్షణ ఇచ్చేవారు. తర్వాత సైనిక శిక్షణ ఇచ్చి యుద్ధానికి పంపేవారు” అని ‘ది డిప్లోమాట్’ పత్రికకు రాసిన “జైషే మొహమ్మద్ అండర్ ద హుడ్” అనే కథనంలో అయేషా సిద్దికా తెలిపారు

ఫొటో సోర్స్, Getty Images
భారత్ వ్యతిరేక వాతావరణం సృష్టించేందుకే మసూద్‌ను విడుదల చేయించారా?
జైషే మొహమ్మద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి తీర్మానం ఆమోదించింది. అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ కూడా 2002 జనవరిలో జైషే మొహమ్మద్‌పై నిషేధం విధించింది.
“నిషేధం విధించినప్పటికీ, ఖుద్దామ్ ఉల్ ఇస్లామ్‌తో పాటు వివిధ పేర్లతో జైషే తన కార్యకలాపాలను కొనసాగించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతించింది” అని ‘హ్యాండ్ బుక్ ఆఫ్ టెర్రరిజం ఇన్ ద ఏసియా పసిఫిక్’ అనే పుస్తకంలో రోహన్ గునర్తానా, స్టెఫానియా క్యామ్‌లు రాశారు.
తర్వాత, ఖుద్దామ్ ఉల్ ఇస్లామ్ సంస్థ అనేక ఆత్మాహుతి దాడులకు పాల్పడటంతో 2003 నవంబర్‌లో దానిపైనా నిషేధం విధించారు.
“జైషే మొహమ్మద్‌లో అబ్దుల్ జబ్బార్, ఉమర్ ఫారుఖ్, అబ్దుల్లా షా మంజర్ లాంటి టాప్ కమాండర్లు మసూద్ అజర్‌తో సైద్ధాంతిక విభేదాలు వల్ల 2002లో సంస్థను వదిలేశారు. జమాత్ ఉల్ ఫుర్కాన్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసుకున్నారు” అని ‘రైజ్ ఆఫ్ జైషే మొహమ్మద్ ఇన్ కశ్మీర్ వ్యాలీ’ అనే కథనంలో రామానంద్ గర్గే, సీడీ సహాయ్ రాశారు.
“2003 డిసెంబర్ 14, 25 తేదీలలో జైషేకు చెందిన వ్యక్తులు పర్వేజ్ ముషారఫ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారు. మొదటి దాడిలో ఎవరూ చనిపోలేదు. అయితే రెండో దాడిలో 14 మంది గాయపడ్డారు. ముషారఫ్‌ను హత్య చేసేందుకు మరో రెండు ప్రయత్నాలు కూడా జరిగాయి” అని వారు ఆ కథనంలో తెలిపారు.
ఈ విషయాన్ని పర్వేజ్ ముషారఫ్ తన ఆత్మకథ “ఇన్ ద లైన్ ఆఫ్ ఫైర్”లో ప్రస్తావించారు.
మసూద్ అజర్ మీద చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తేవడంతో మసూద్‌ను హౌస్ అరెస్ట్‌లో ఉంచింది పాకిస్తాన్ ప్రభుత్వం.
2014 ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన కదలికల మీద నిషేధాన్ని ఎత్తి వేసిన పాకిస్తాన్ ప్రభుత్వం ముజఫరాబాద్‌లో వేలమందిని ఉద్దేశించి ప్రసంగించేందుకు అనుమతించింది.
“అఫ్జల్ గురును ఉరి తీసినందుకు భారత్‌ను దోషిగా నిలబెట్టడమే మసూద్ పని. పార్లమెంట్ మీద దాడిలో జైషేకు సాయం చేసినందుకు అఫ్జల్ గురును ఉరి తీశారు. ఈ విషయంలో ముషారఫ్‌ను కూడా వదల్లేదు మసూద్ .
‘ముషారఫ్ పాకిస్తాన్‌ను అమెరికా చేతిలో కీలుబొమ్మగా మార్చారు. అఫ్గానిస్తాన్‌లో అమాయక ప్రజలను ఊచకోత కోసేందుకు అమెరికా అక్కడ తన సైన్యాల్ని మోహరించింది’ అని విమర్శించినట్లు ఖలీద్ అహ్మద్ తన పుస్తకం ‘స్లీప్ వాకింగ్ టు సరెండర్ డీలింగ్ విత్ పాకిస్తాన్’ అనే పుస్తకంలో రాశారు.

జైషే మీద మసూద్ కుటుంబ ప్రభావం
జైషే మొహమ్మద్ మీద మసూద్ కుటుంబ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అనేక కథనాలు వెలువడ్డాయి. జైషేలో తాము అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు మసూద్ సోదరుడు, బావ మరిది తరచు చెప్పుకున్నట్లు మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
మే 7 రాత్రి భారత్ జరిపిన వైమానిక దాడుల్లో తన కుటుంబ సభ్యులు అనేక మంది చనిపోయారని మసూద్ అజర్ జారీ చేసిన ప్రకటనలో చెప్పారు. అయితే కుటుంబంలో ఎవరు చనిపోయారనే విషయం మాత్రం వెల్లడించలేదు.
2000-2019 మధ్య జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 87 ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఇందులో 130 మంది పౌరులు, 239 మంది భద్రత సిబ్బంది,143 మంది టెర్రరిస్టులు చనిపోయినట్లు ‘సౌత్ ఏషియన్ టెర్రరిజం పోర్టల్’లో జమ్మూ కశ్మీర్ ప్రచురించిన గణాంకాలు చెబుతున్నాయి.
87 దాడుల్లో జైషే మొహమ్మద్ 12 దాడులు చేసింది. ఈ 12 దాడుల్లో 31 మంది పౌరులు, 99 మంది సైనికులు, 30 మంది టెర్రరిస్టులు చనిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
4 నుంచి 6 నెలల కఠోర శిక్షణ
“కశ్మీర్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతర తీవ్రవాద సంస్థలతో పోలిస్తే జైషే తీవ్రవాదులు పెద్దగా బయటకు కనిపించరు. గుర్తింపు బయటకు రాకుండా ఉండేందుకు కొద్ది మంది మాత్రమే ఉంటారు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌తో పోలిస్తే ప్రతీ జిల్లాలోనూ జైషే తీవ్రవాదుల సంఖ్య తక్కువగా ఉంటుంది” అని అభినవ్ పాండ్యా తన పుస్తకంలో రాశారు.
“వాళ్లకు కశ్మీరీ భాష మాట్లాడటంలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తైన తర్వాత ప్రాక్టీస్ కోసం వారికి పది రౌండ్ల బుల్లెట్లు, ఏకే 47 తుపాకీ, ఐదు రౌండ్ల పికా గన్, ఏడు రౌండ్ల బులెట్లతో పిస్టల్, రెండు గ్రనేడ్లు ఇస్తారు” అని 2016లో పోలీసులు అదుపులోకి తీసుకున్న జైషే తీవ్రవాది అబ్దుల్ రెహమాన్ ముఘల్ పోలీసులకు చెప్పినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఫొటో సోర్స్, Getty Images
నిఘా వర్గాల రక్షణ
నిఘా సంస్థలు ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ప్రకారం ‘ జైషే 25 ఏళ్ల లోపు వాళ్లను, పెద్దగా చదువు లేని వాళ్లను తమ సంస్థలో నియమించుకుంటుంది’.
“మదర్సాల్లో చదువుకుంటున్న వారిని వాళ్లు నియమించారు. మదర్సా నుంచి 4 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఇల్లు ఉన్నవారినే ఎంచుకుంటారు. మదర్సాల్లో చదువుకునే పిల్లలకు తల్లిదండ్రుల్ని కలిసేందుకు అనుమతి ఉండదు. బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు. వారికి చిన్నప్పటి నుంచి జిహాద్ గురించి బోధిస్తారు” అని అభినవ్ పాండ్యా తన పుస్తకంలో రాశారు.
నిషేధం ఉన్నప్పటికీ జైషే మొహమ్మద్‌కు పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు రక్షణ లభించింది. దీనికి గల కారణాల గురించి 2019 మార్చ్ 13న ‘ది డిప్లోమాట్’ పత్రికకు రాసిన కథనంలో అయేషా సిద్ధికా వివరించారు.
“నిఘా వర్గాల అండదండలు ఉండటంతో పాకిస్తాన్‌లో ఏర్పడిన ప్రతి ప్రభుత్వం జైషేను నియంత్రించడంలో విఫలమైంది” అని ఆమె పేర్కొన్నారు.
“మేము ఈ సంస్థలను కనీసం తాకనైనా తాకలేము. ఎందుకంటే అవి వేర్వేరు ప్రాంతాల నుంచి పని చేస్తాయి. పాకిస్తాన్ నిఘా వర్గాలతో మసూద్ అజర్‌కున్న సంబంధాల దృష్ట్యా అతనిపై చర్యలు తీసుకోవడం ఎవరికైనా కష్టమే” అని పాకిస్తాన్ మాజీ హోంమంత్రి రానా సనావుల్లా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)