SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP via Getty Images
ఈశాన్య భారతాన్ని దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతున్న ఇరుకైన, సన్నని కారిడారే “చికెన్ నెక్” లేదా సిలిగురి కారిడార్. ఈ ప్రాంతంలో సొరంగ మార్గాలు(టన్నెల్స్) నిర్మించి, రైల్వే ట్రాక్‌లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలను భారత్ దాదాపుగా ఖరారు చేసింది.
అలాగే, అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద కూడా పొడవైన సొరంగ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లా, తీన్ మైల్ హాట్ నుంచి సిలిగురికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగాపాణి వరకు.. దాదాపు 36 కిలోమీటర్ల మేర ఈ భూగర్భ రైల్వే ట్రాక్‌లు నిర్మించనున్నారు.
నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి కపింజల్ కిశోర్ శర్మ మాట్లాడుతూ, ప్రాజెక్ట్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధమైందని, అయితే తుది అనుమతులు రావాల్సి ఉందన్నారు.
పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్టు గురించి మీడియాతో మాట్లాడారు. దీనిని బట్టి, ఈ ప్రాజెక్టుకు త్వరలోనే ఆమోదముద్ర పడొచ్చని భావిస్తున్నారు.

భౌగోళికంగా, వ్యూహాత్మకపరంగా ఈ చికెన్ నెక్ ప్రాంతం భారత్‌కు చాలా కీలకం. ఈ కారిడార్ సగటు వెడల్పు 20 కిలోమీటర్లు మాత్రమే. దీనికి బంగ్లాదేశ్, ఉత్తరాన చైనా, పశ్చిమాన నేపాల్ సరిహద్దులుగా ఉన్నాయి.
ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న ఏకైక లింక్ ఈ కారిడార్ మాత్రమే. ప్రయాణికుల రాకపోకలు, వస్తువుల రవాణా, సైనిక పరికరాలు, భద్రతా దళాల తరలింపు ఈ కారిడార్ ద్వారానే జరుగుతాయి.
సొరంగం ద్వారా ప్రతిపాదించిన ఈ రైల్వే మార్గంలో ప్రయాణికుల రాకపోకలు కూడా భాగమైనప్పటికీ, వ్యూహాత్మకంగా ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమని నిపుణులు అంటున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన, ఫిబ్రవరి 14న జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మరో ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా, అస్సాంలో బ్రహ్మపుత్ర నది కింద 16 కిలోమీటర్ల మేర రైళ్ల, వాహనాల రాకపోకలకు అనువుగా సొరంగ మార్గం నిర్మించనున్నారు.
ఫొటో సోర్స్, NF Railways
‘కనిపించని’ రైల్వే లైన్
దేశంలోని చాలా నగరాల్లో ప్రస్తుతం భూగర్భ రైలు, లేదా మెట్రో రైలుమార్గాలు ఉన్నాయి. అయితే, ఇవి చాలావరకూ నగరాల్లో ప్రజారవాణా వ్యవస్థల కింద మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
కానీ, చికెన్ నెక్ కారిడార్‌లో ప్రతిపాదించిన ఈ సొరంగ రైల్వే మార్గం పూర్తిగా గ్రామీణ ప్రాంతాల మీదుగా వెళ్తుంది. మూడు అంతర్జాతీయ బోర్డర్లకు సమీపంలో, పొడవైన సొరంగాల ద్వారా రైల్వే ట్రాక్‌లు ఏర్పాటవుతాయని రైల్వే నిపుణులు అంటున్నారు.
భారతీయ రైల్వే మునుపెన్నడూ ఇలాంటి ప్రాజెక్టును చేపట్టలేదు. ఈ ప్రాజెక్టును నార్త్‌ఈస్టర్స్ ఫ్రాంటియర్ రైల్వేస్(ఎన్ఎఫ్‌ఆర్) పర్యవేక్షణలో చేపట్టనున్నారు.
ఎన్ఎఫ్‌ఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్‌వో) కపింజల్ కిశోర్ శర్మ మాట్లాడుతూ, “ఈ రైల్వే లైన్ ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని తీన్ మైల్ హాట్ నుంచి ప్రారంభమై, సిలిగురికి సమీపంలోని రంగాపాణి మీదుగా బాగ్డోగ్రాకు వెళ్తుంది. ఈ భూగర్భ రైల్వే లైన్ కోసం రెండు సొరంగాలు నిర్మితమవుతాయి, మొత్తం పొడవు 35.76 కిలోమీటర్లు” అని అన్నారు.
ఈ ప్రతిపాదిత రైల్వే లైన్ బంగ్లాదేశ్ బోర్డర్‌కు సమీపంలో భారత సైన్యం ఏర్పాటు చేస్తున్న మూడు కొత్త సైనిక స్థావరాల్లో(మిలిటరీ బేస్‌లు), రెండింటికి అతి సమీపం నుంచి వెళ్తుండడం గమనార్హం.
వీటిలో ఒకటి బిహార్‌లోని కిషన్‌గంజ్, మరోటి పశ్చిమ బెంగాల్‌లోని చోప్రా. అస్సాంలోని ధుబ్రిలో మూడో సైనిక స్థావరం ఏర్పాటు చేస్తున్నారు.
ఫొటో సోర్స్, @AshwiniVaishnaw
అలాగే, ప్రస్తుతమున్న రెండు ట్రాక్‌ల రైల్వే లైన్‌ను నాలుగు ట్రాక్‌ల లైన్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నారు.
“వ్యూహాత్మకంగా ఎంతో సున్నితమైన సిలిగురి కారిడార్ ద్వారా రాకపోకలను మరింత సురక్షితంగా మార్చడమే కాకుండా, ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగేలా భూగర్భ రైల్వే లైన్‌కు ప్లాన్ చేశారు. దేశంలోని మిగిలిన ప్రాంతాలను, ఈశాన్య రాష్ట్రాల రాజధానులను కలిపే ఏకైక మార్గం ఈ కారిడార్” అని కపింజల్ కిశోర్ శర్మ వివరించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా, టన్నెలింగ్ యంత్రాల ద్వారా సమాంతరంగా రెండు సొరంగాలు నిర్మించనున్నారు. ఆధునిక సాంకేతికత, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థతో ఈ సొరంగాలు నిర్మాణం కానున్నాయి.
“నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దులకు ఈ సొరంగ మార్గం చాలా దగ్గరగా ఉంటుంది. ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, లేదా భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు ఈ రైల్వే లైన్ చాలా కీలకమవుతుంది” అని శర్మ తెలిపారు.
“ఇది సైన్యాన్ని, మిలిటరీ పరికరాలను బోర్డర్‌కు సురక్షితంగా తరలించేందుకు మాత్రమే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయ సామగ్రిని తరలించేందుకు కూడా ఉపయోగపడుతుంది. బాగ్డోగ్రా ఎయిర్‌పోర్టుకు సమీపం నుంచే ఈ రైల్వే లైన్ వెళ్తుంది. అలాగే, భారత సైన్యానికి చెందిన 33వ కాప్స్ ప్రధాన కార్యాలయం, బెంగ్డుబి సైనిక స్థావరం కూడా దీనికి సమీపంలోనే ఉంటాయి. తద్వారా, రైల్వేను వాయురవాణాతో అనుసంధానం చేసేందుకు కూడా ఈ రైల్వే లైన్ ఉపయోగకరం” అన్నారాయన.
“ఈ ప్రాజెక్టుకు 12 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. అయితే, ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిన తర్వాతే, దీని తుది వ్యయం తెలుస్తుంది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టుకు త్వరలోనే ఆమోదం లభించే అవకాశముంది” అని కిశోర్ శర్మ వెల్లడించారు.
ఫొటో సోర్స్, PRAKASH SINGH/AFP via Getty Images
సైనిక రవాణా పరంగా కీలకమా?
మిలిటరీ పరికరాల రవాణా, భద్రతా బలగాల తరలింపు మాత్రమే కాకుండా సాధారణ రైళ్లు కూడా ఈ రైల్వే లైన్‌లో రాకపోకలు సాగిస్తాయని ఎన్‌ఎఫ్ఆర్ సీపీఆర్వో కిశోర్ శర్మ బీబీసీ బంగ్లాతో అన్నారు.
భద్రతా బలగాల తరలింపు, మిలిటరీ పరికరాల రవాణాలో ఈ సొరంగ రైల్వే లైన్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఆయన పదేపదే ప్రస్తావించారు.
ఈ చికెన్ నెక్ కారిడార్ భారత్‌కు వ్యూహాత్మకంగా ఎప్పుడూ కీలకమేనని నిపుణులు చెబుతున్నారు.
భారత సైన్యానికి చెందిన రిటైర్డ్ బ్రిగేడియర్ ప్రబీర్ సన్యాల్ మాట్లాడుతూ, “ఏదైనా ఆకస్మిక దాడి జరిగితే ఎలా ఎదుర్కోవాలి? భూటాన్ మీదుగా సిలిగురి కారిడార్ లేదా చికెన్ నెక్‌పై చైనా దాడి చేస్తే ఏం చేయాలి? ఈ మధ్య బంగ్లాదేశ్‌కు చెందిన చాలామంది కూడా చికెన్ నెక్‌ను ఆక్రమించుకుంటామంటూ బెదిరిస్తున్నారు కదా” అని ఆయన అన్నారు.
ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు సన్యాల్.
“ఇప్పుడు చెబుతున్న ఈ భూగర్భ రైల్వే లైన్ ప్రాజెక్టును కనీసం 20 ఏళ్ల కిందటే నిర్మించి ఉండాల్సింది. శత్రువులు మిసైల్స్‌తో దాడి చేసినా, దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాల రైల్ కనెక్టివిటీ దెబ్బతినకుండా ఇది సాయపడుతుంది. ఈ సొరంగాల గోడలు చాలా మందపాటి కాంక్రీట్‌తో నిర్మితమవుతాయి” అని ఆయన అన్నారు.
ఫొటో సోర్స్, @RailMinIndia
వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు ప్రతీమ్ రంజన్ బసు మాట్లాడుతూ, “ఈ మధ్యకాలంలో, భారత్‌లో ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించేప్పుడు సైనిక రవాణాను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అవసరమైతే, సైనికులు కనీసం 30 రోజులు ఈ సొరంగాల్లో ఉండగలిగేలా, వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా మారేలా ఈ సొరంగాల నిర్మాణం చేపడుతున్నారు” అని అన్నారు.
“ఇప్పటికే విద్యుత్ లైన్లు, రవాణా మార్గాలు, ఇంటర్నెట్ కేబుల్స్, ఆయిల్ గ్యాస్ పైప్‌లైన్లు ఈ చికెన్ నెక్‌లోంచి వెళ్తున్నాయి. అందువల్ల, భూ ఉపరితలంపై కొత్త రైల్వే లైన్ నిర్మాణం కష్టం. దీనికితోడు, ఇది జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం కూడా.”
“భూగర్భ రైల్వే లైన్ సురక్షితమైనది. ఏదైనా దాడి జరిగినా, ఇబ్బందులు ఎదురైనా ట్రాఫిక్ నిరంతరాయంగా సాగుతుంది. చికెన్ నెక్ కారిడార్ వ్యూహాత్మకంగా ఎప్పుడూ కీలకమే” అని బసు వివరించారు.
ఫొటో సోర్స్, David Talukdar/NurPhoto via Getty Images
బ్రహ్మపుత్ర నది కింద కూడా సొరంగం
ఫిబ్రవరి 14న జరిగిన సమావేశంలో, అస్సాంలోని బ్రహ్మపుత్ర నది కింద 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మించాలని ఎకనామిక్ ఎఫైర్స్ క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా, రెండు సమాంతరమైన నాలుగు లైన్ల సొరంగ మార్గాలను నిర్మించనున్నారు.
ఇందులో ఒకటి రైళ్ల రాకపోకలకు కాగా, మరో మార్గంలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఈ రైల్వే లైన్ గోహ్‌పూర్, నుమాలిగఢ్‌ను అనుసంధానిస్తుంది.
ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, నుమాలిగఢ్ నుంచి గోహ్‌పూర్ మధ్య 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆరు గంటల సమయం పడుతోంది.
ఆ ప్రకటన ప్రకారం, ఇది దేశంలో మొట్టమొదటి భూగర్భ రైలు, రోడ్డు సొరంగ మార్గంగా నిలవడంతోపాటు ప్రపంచంలోనే మొదటిది కానుంది.
ఈ సొరంగం ప్రాజెక్ట్ మొత్తం పొడవు 33.7 కిలోమీటర్లు కాగా, అందులో 16.79 కిలోమీటర్లు బ్రహ్మపుత్ర నది కిందుగా వెళ్తుంది.
ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే, వ్యహాత్మకంగానే కాకుండా ప్రాంతీయ ఆర్థిక ప్రయోజనాలపరంగానూ ఈ మార్గం కీలకం కానుంది.
అలాగే, ఈ ప్రాజెక్టు ద్వారా అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌పోర్టు, అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇటానగర్ ఎయిర్‌పోర్టు మధ్య కనెక్టివిటీ కూడా ఏర్పడుతుంది.
చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న తేజ్‌పూర్ వైమానిక స్థావరం వ్యూహాత్మకంగా చాలా కీలకం. భారత్ ఇక్కడ తన సుఖోయ్ యుద్ధ విమానాల శ్రేణిని ఉంచింది.
ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం తేజ్‌పూర్ ఎయిర్‌బేస్ విస్తరణ కోసం 383 ఎకరాల భూసేకరణకు ప్రకటన చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



