Home జాతీయ national telgu చరిత్రను మలుపు తిప్పాలనుకున్నారు.. మోసపోయి పరువు పోగొట్టుకున్నారు

చరిత్రను మలుపు తిప్పాలనుకున్నారు.. మోసపోయి పరువు పోగొట్టుకున్నారు

6
0

SOURCE :- BBC NEWS

హిట్లర్

ఫొటో సోర్స్, Getty Images

జర్మన్ మ్యాగజీన్ స్టెర్న్, బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది సండే టైమ్స్’ 1983 ఏప్రిల్‌లో ఒక ప్రకటన చేశాయి. 20వ శతాబ్దంలోనే అతిపెద్ద చారిత్రక ఆవిష్కరణ చేసినట్లు అవి క్లెయిమ్ చేసుకున్నాయి.

కానీ, వారు క్లెయిమ్ చేసుకున్న ఆ అతిపెద్ద ఆవిష్కరణ చరిత్రలో అతిపెద్ద మోసాలలో ఒకటిగా నిలిచిపోయింది.

ఈ మొత్తం వ్యవహారం పెద్దమొత్తంలో డబ్బును కోల్పోవడానికి దారితీయడంతో పాటు కొందరు ప్రముఖులు అపఖ్యాతి పాలవడానికీ కారణమైంది.

ఇప్పటివరకు తెలియని అడాల్ఫ్ హిట్లర్ వ్యక్తిగత డైరీల్లోని వివరాలంటూ 1983 ఏప్రిల్ 25న స్టెర్న్ మ్యాగజీన్ ఒక పెద్ద కథనాన్ని ప్రచురించింది.

ఆ డైరీల గురించి వివరించడానికి అదే రోజు జర్మనీలోని హాంబర్గ్‌లో విలేఖరుల సమావేశం నిర్వహించింది స్టెర్న్. ఈ సమావేశం ప్రపంచవ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో నిలిచింది, కానీ వారు అనుకున్నట్లు కాదు.

ఈ ఘటనకు మూడు రోజుల ముందు.. ఈ డైరీలు నిజమైనవని పూర్తిగా నమ్ముతున్నట్లు స్టెర్న్ లండన్ ఎడిటర్ పీటర్ విక్‌మన్ బీబీసీకి చెప్పారు.

“ప్రారంభంలో మాకూ సందేహాలుండేవి. కానీ వాటిని పరిశీలించడానికి ఒక గ్రాఫాలజిస్ట్ (చేతిరాత నిపుణులు) మా దగ్గర ఉన్నారు. ప్రొఫెసర్ ట్రెవర్-రోపర్ వంటి చరిత్రకారులు ఉన్నారు. వారందరూ అవి నిజమైనవని నమ్మారు” అని విక్‌మన్ అన్నారు.

1932-45 కాలం నాటి ఘటనలను తెలియజేసే చేతిరాత డైరీలవి. ఆ కాలంలో హిట్లర్ అధికారంలో ఉన్నారు.

“మొత్తం 60 డైరీలు ఉన్నాయి” అని విక్‌మన్ బీబీసీ ఇంటర్వ్యూలో అన్నారు.

“అవి స్కూల్ నోట్‌బుక్‌లా కనిపిస్తాయి కానీ, గట్టి కవర్లతో ఉంటాయి. బయటి వైపు వాటికి స్వస్తిక, డేగ బొమ్మతో సీళ్లు ఉంటాయి. లోపల, హిట్లర్ గజిబిజి, పాత-కాలపు గోతిక్ చేతిరాత ఉంది” అని విక్‌మన్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
హిట్లర్ వివరాలు

డైరీలో ఆశ్చర్యకర విషయాలు

హిట్లర్ గురించి అప్పటివరకు ప్రజలకు తెలిసిన విషయాలను ఈ డైరీలు మార్చగలవని స్టెర్న్ భావించింది.

అయితే, ఈ డైరీలు హిట్లర్‌లోని ఆశ్చర్యకరమైన, మరింత వ్యక్తిగత వివరాలను వెల్లడించాయి.

కడుపు సమస్యలు, దుర్వాసన, ఆయన గర్ల్‌ఫ్రెండ్ ఎవాబ్రాన్ ఒలింపిక్ టిక్కెట్లకు ఒత్తిడిచేయడం, స్టాలిన్‌కు పుట్టినరోజు సందేశం వంటి వివిధ విషయాలను ఈ డైరీలు వెల్లడించాయి.

ఆశ్చర్యకరంగా, హిట్లర్‌కు హోలోకాస్ట్ గురించి సమాచారం లేదని కూడా ఈ డైరీలు సూచించాయి.

ఈ డైరీలను స్టెర్న్ రిపోర్టర్ గెర్డ్ హైడెమాన్ కనుగొన్నట్లు చెప్పారు. నాజీ విషయాల పట్ల ఆయనకు మక్కువ ఉండేది. చాలా సంవత్సరాల క్రితం, నాజీ నాయకుడు హెర్మాన్ గోరింగ్‌కు చెందిన పాత పడవను కొని, మరమ్మతులు చేయించారు హైడెమాన్.

గోరింగ్ కూతురితో కూడా ఆయనకు పరిచయం ఉంది. ఆమె అతన్ని నాజీ కాలం నాటి వ్యక్తులకు పరిచయం చేశారు. ఈ పరిచయాల ద్వారానే డైరీలను గుర్తించినట్లు హైడెమాన్ పేర్కొన్నారు.

హిట్లర్ డైరీలు

ఫొటో సోర్స్, Alamy

డైరీల కోసం డీల్స్

యుద్ధ సమయంలో కూలిపోయిన ఒక విమానంలో ఈ డైరీలు ఉన్నాయని హైడెమాన్ చెప్పారు. ప్రమాదం తర్వాత డైరీలను భద్రపరిచారని హైడెమాన్ చెప్పారు.

తూర్పు జర్మనీలోని ఒక కలెక్టర్ ఆధీనంలో ఉన్నాయని.. ఆయన వాటిని విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తూ… విక్రేత, స్టెర్న్‌ కంపెనీకి మధ్యవర్తిగా హైడెమాన్ వ్యవహరించారు.

ఈ డైరీల సమాచారాన్ని రహస్యంగా ఉంచడానికి, వారు తనిఖీ కోసం నిపుణులకు కొన్ని పేజీలను మాత్రమే చూపించారు. ఈ డైరీల కోసం అప్పట్లోనే 93 లక్షల డాయిష్‌ మార్క్‌లు చెల్లించి కొనుగోలు చేసి స్విట్జర్లాండ్‌లో ఉంచారు. డాయిష్ మార్క్ అనేది 2002 వరకు జర్మనీలో చెల్లుబాటులో ఉన్న కరెన్సీ.

ఈ డైరీలను పరిశీలించిన మొదటి చరిత్రకారుడు ప్రొఫెసర్ హ్యూ ట్రెవర్-రోపర్, ఆయనను లార్డ్ డాక్రే ఆఫ్ గ్లాంటన్ అని కూడా పిలుస్తారు. ఆయన 1947లో ‘ది లాస్ట్ డేస్ ఆఫ్ హిట్లర్’ అనే పుస్తకం రాశారు, అది ఆయనకు చాలా పేరు తెచ్చింది.

దీంతో, ఆయనను హిట్లర్‌ విషయాలు తెలిసిన వ్యక్తిగా పరిగణించారు. ఆయన ‘ది టైమ్స్‌’ వార్తాపత్రికకు డైరెక్టర్ కూడా.

దీనిని ‘ది సండే టైమ్స్‌’తో పాటు అంతకు రెండేళ్ల ముందు రూపర్ట్ మర్డోక్ కొనుగోలు చేశారు.

మొదట, లార్డ్ డాక్రే ఈ డైరీలపై సందేహం వ్యక్తంచేశారు. కానీ వాటిని చూడటానికి స్విట్జర్లాండ్‌కు వెళ్లిన తర్వాత, ఆ ‘కథ’ను నమ్మారు.

డైరీలు రెండో ప్రపంచ యుద్దానికి ముందు నాటివని రసాయన పరీక్షలు తేల్చాయని ఆయనకు చెప్పారు.

అక్కడ 60 నోట్‌బుక్‌లు, వందలాది హిట్లర్ డ్రాయింగ్‌లు, పెయింటింగ్‌లు, పత్రాలు ఉండటంతో లార్డ్ డాక్రే కూడా నమ్మేశారు.

అంతేకాదు, టైమ్స్ ఎడిటర్ చార్లెస్ డగ్లస్-హోమ్ కూడా డైరీల విశ్వసనీయతను బలపరిచారు. డైరీలలో చేతిరాతలు, 300 వరకు డ్రాయింగ్‌లు, చిత్రాలు, వ్యక్తిగత పత్రాలు, హిట్లర్ పార్టీ కార్డులు ఉన్నాయని.. అవన్నీ నకిలీగా తయారుచేయడం కష్టమని ఆయన 1983 ఏప్రిల్ 22న బీబీసీతో చెప్పారు.

డైరీలు నిజమైనవని, వాటి కారణంగా చరిత్రను తిరిగి రాయవలసి రావొచ్చని చెబుతూ ‘ది టైమ్స్‌’లో ఒక వ్యాసం కూడా రాశారు లార్డ్ డాక్రే . డైరీల గురించి వార్తలు వ్యాపించడంతో వివిధ మీడియా కంపెనీలు వాటిని ప్రచురించే హక్కుల కోసం పోటీపడ్డాయి. ‘ది సండే టైమ్స్’ యజమాని రూపర్ట్ మర్డోక్ ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి స్వయంగా జ్యూరిచ్‌కు వెళ్లారు. డైరీలను ప్రచురించడానికి ఒప్పందాలు కుదిరాయి. కానీ, ది సండే టైమ్స్ సిబ్బంది సహా ప్రజలు డైరీలు నిజమైనవి కావేమో అని సందేహించారు.

డైరీలలోని సంతకం హిట్లర్‌ది కాదని చార్లెస్ హామిల్టన్ బీబీసీతో చెప్పారు.

ఎలా బయటపడింది?

అనుమానాలు పెరుగుతున్నప్పటికీ, మర్డోక్ ఆ డైరీలు నిజమైనవేనని నమ్మారు. ది సండే టైమ్స్ ఎడిటర్ ఫ్రాంక్ గైల్స్ అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ఆ కథనాన్ని “వరల్డ్ ఎక్స్‌క్లూజివ్” శీర్షికతో ప్రచురించాలని మర్డోక్ పట్టుబట్టారు.

ఎందుకంటే హిట్లర్ డైరీ గురించి చెప్పడానికి మరుసటి రోజు స్టెర్న్ విలేకరుల సమావేశం షెడ్యూల్ చేసింది.

దీంతో, డైరీలను మరోసారి తనిఖీ చేయడానికి లార్డ్ డాక్రేను పిలిచారు గైల్స్. అయితే, డాక్రే ఒక్కసారిగా అభిప్రాయం మార్చుకున్నారు. ఆ డైరీలు నిజమైనవని ఇక నమ్మబోనని స్పష్టంచేశారు డాక్రే.

”డాక్రే మాటలు విన్న వార్తాపత్రిక ఎగ్జిక్యూటివ్స్ తలలు పట్టుకున్నారు. పెద్ద తప్పు చేశామని వారికి అర్థమైంది” అని జర్నలిస్ట్ ఫిలిప్ నైట్లీ ఆ రోజు జరిగిన ఘటనను గుర్తుచేసుకున్నారు.

పత్రిక మొదటి పేజీని మార్చడానికి ఇంకా సమయం ఉంది. ఆ సమయంలో మర్డోక్‌కు ఎడిటర్ గైల్స్ ఫోన్ చేశారు. డాక్రే వ్యాఖ్యలను మర్చిపోవాలని, కథనం పబ్లిష్ చేసేయండని ఆయన గైల్స్‌కు చెప్పారని నైట్లీ తెలిపారు.

మరుసటిరోజు స్టెర్న్ విలేకరుల సమావేశం జరిగింది. అప్పటికే పరిస్థితులు మారాయి. ఆ డైరీలను హిట్లరే రాశారని 100 శాతం ఖచ్చితంగా నమ్ముతున్నట్లు స్టెర్న్ ఎడిటర్-ఇన్-చీఫ్ పీటర్ కోచ్ అన్నారు.

అయితే, గతంలో డైరీలను సమర్ధించిన చరిత్రకారుడు లార్డ్ డాక్రే, వాటి గురించి తనకు ఖచ్చితంగా తెలియదని చెప్పేశారు. నిర్ణయం తీసుకోవడానికి తొందరపడ్డానని డాక్రే అంగీకరించారు. డాక్రే వ్యాఖ్యలకు స్టెర్న్ సిబ్బంది విస్తుపోయారు.

గందరగోళంగా జరిగిన విలేకరుల సమావేశం తర్వాత రోజు అమెరికాకు చెందిన ఆటోగ్రాఫ్స్ డీలర్ చార్లెస్ హామిల్టన్ బీబీసీ బ్రేక్‌ఫాస్ట్‌తో మాట్లాడుతూ, డైరీలు నకిలీవని తనకు అప్పుడే తెలుసన్నారు. డైరీలను ఎప్పుడైతే చూశానో అప్పుడే పసిగట్టినట్లు ఆయన చెప్పారు.

హిట్లర్‌కు సంబంధించిన నకిలీ పత్రాలు కొనాలంటూ తరచుగా ఎవరో ఒకరు తన దగ్గరికి వస్తారని, డైరీలలోని సంతకం హిట్లర్‌ది కాదని హామిల్టన్ స్పష్టంచేశారు. త్వరలోనే అందరూ సత్యాన్ని గ్రహిస్తారని, ఇది చరిత్రలో అతిపెద్ద మోసాలలో ఒకటిగా నిలిచిపోతుందని హామిల్టన్ అభిప్రాయపడ్డారు.

అయితే, తర్వాత హామిల్టన్ చెప్పిందే జరిగింది. రెండు వారాల్లోనే ఫోరెన్సిక్ పరీక్షలు ఆ డైరీలు నకిలీవని తేల్చాయి. హామిల్టన్ చెప్పినట్లుగానే హిట్లర్ సంతకం నకిలీది. అసలు రెండో ప్రపంచ యుద్ధానికి ముందువరకు ఆ డైరీ కాగితం, అందులో వాడిన సిరా, జిగురు తయారుకాలేదని పరీక్షలు తేల్చాయి.

ఇక డైరీలు తప్పులతో నిండి ఉన్నాయి. అందులో ఆధునిక పదబంధాలు, తప్పుడు వాస్తవాలు, ఆ సమయంలో హిట్లర్‌కు తెలియని విషయాలను కూడా ప్రస్తావించాయి. దీంతో, ది సండే టైమ్స్ డైరీలను ప్రచురించడం ఆపివేసి, క్షమాపణలు కూడా చెప్పింది. స్టెర్న్ కూడా మోసపోయామని అంగీకరించి, బహిరంగ క్షమాపణలు చెప్పింది.

హిట్లర్ డైరీలపై కథనాలు

ఫొటో సోర్స్, Alamy

పెరిగిన పత్రిక సర్క్యులేషన్

ఆ తర్వాత హైడెమాన్ ఆ డైరీలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పేశారు. తూర్పు జర్మన్‌కు చెందిన కొన్రాడ్ కుజౌ ఆ డైరీలను స్వయంగా రాశారని హైడెమాన్ చెప్పారు.

కుజౌ ప్రతిభావంతుడైన ఆర్టిస్ట్. ‘హిట్లర్: స్పీచెస్ అండ్ ప్రోక్లమేషన్స్’ అనే పుస్తకం నుంచి కుజౌ కాపీ కొట్టారు. ఆ నకిలీ డైరీలను హిట్లర్‌విగా నమ్మించడానికి, కొన్ని నకిలీ విషయాలను పొందుపరిచారు కుజౌ. నోట్‌బుక్‌లు పాతవిగా కనిపించేలా చేయడానికి, ఆయన వాటిపై టీ పోసి, డెస్క్‌పై బాదారు.

మొదట్లో ఈ నకిలీ డైరీలు నిజమైనవిగా అనిపించడానికి సహాయపడింది ఏమిటంటే, కుజౌ చాలావరకు నాజీకి సంబంధించిన నకిలీ పత్రాలను తయారుచేశారు, వాటిలో కొన్ని అప్పటికే నిజమైనవిగా అంగీకరించారు.

కాబట్టి స్టెర్న్ డైరీల వాస్తవికత కోసం నిపుణులకు పంపినప్పుడు, వారు తెలియకుండానే కుజౌ నకిలీలను ఇతర నకిలీలతో పోల్చారు. కానీ, అవి కూడా కుజౌ తయారు చేసినవే.

చివరికి, కుజౌను అరెస్టు చేశారు పోలీసులు. ఆయన తన తప్పును అంగీకరించారు. దానిని నిరూపించడానికి హిట్లర్ చేతిరాత శైలిలో తన ఒప్పుకోలు(కన్ఫెషన్)ను కూడా రాశారు కుజౌ. ఆయన మోసం, ఫోర్జరీకి పాల్పడినట్లు 1985లో కోర్టు తేల్చింది. కుజౌకు నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు.

అంతేకాదు, డబ్బు కోసం డైరీ ధరలను పెంచి మోసం చేసిన హైడెమాన్‌ను కూడా దోషిగా నిర్ధరించి, 4 సంవత్సరాల 8 నెలల జైలు శిక్ష విధించింది కోర్టు.

ఈ కుంభకోణం తర్వాత, చరిత్రకారుడైన లార్డ్ డాక్రే ఖ్యాతి తీవ్రంగా దెబ్బతింది. స్టెర్న్ ఎడిటర్ పీటర్ కౌచ్, మరొక స్టెర్న్ ఎడిటర్ తమ ఉద్యోగాలను కోల్పోయారు. ది సండే టైమ్స్ ఎడిటర్‌గా ఫ్రాంక్ గైల్స్‌ను తొలగించారు.

మర్డోక్ కూడా ఈ కథనాన్ని ప్రచురించడం “ఒక పెద్ద తప్పు” అని 2012 లెవ్సన్ ఎంక్వైరీలో అంగీకరించారు.

“నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను. నా జీవితాంతం అది భరించాల్సి ఉంటుంది” అని అన్నారు మర్డోక్.

అయితే, ఈ నకిలీ కథనం వార్తాపత్రిక అమ్మకాలను పెంచింది. డైరీలు నకిలీవి అయితే స్టెర్న్ మొత్తం డబ్బును తిరిగి చెల్లించాలని మర్డోక్ ఒక నిబంధనను ఒప్పందంలో రాశారు. దీంతో ఈ కుంభకోణం నుంచి లాభమే పొందారు మర్డోక్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)