SOURCE :- BBC NEWS

ఫొటో సోర్స్, Facebook/NCBN
1982 మార్చి 29, మధ్యాహ్నం 2.30 గంటలు. హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది.
సరిగ్గా, 43 ఏళ్ల తర్వాత.. ఎక్కడైతే పార్టీ ఆవిర్భవించిందో.. అదే గడ్డపై టీడీపీని నడిపించే నాయకుడే లేకుండా పోయారు.
అవును, ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు లేరు.
పార్టీ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉన్నా, పార్టీ ఉనికిని చూపించేలా కార్యకలాపాలు సాగిస్తున్న సందర్భం కనిపించడం లేదు.
2023 అక్టోబరు 30న తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాజీనామా తర్వాత కొత్త అధ్యక్షుడిని నియమించలేదు.
దాదాపు 18 నెలలుగా తెలుగుదేశంపార్టీకి తెలంగాణలో సారథి లేరు.
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ, తెలంగాణపై దృష్టి పెట్టిన పరిస్థితి కనిపించడం లేదు.
ఏపీలో ఎన్నికలు, అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలతో తెలంగాణపై ఫోకస్ తగ్గిన మాట వాస్తవమేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ బీబీసీతో చెప్పారు.
పార్టీ కార్యకలాపాలు తిరిగి విస్తృతం కానున్నాయని ఆయన అన్నారు.
టీడీపీ పొలిట్ బ్యూరోలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆయన ఒక్కరే.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ ఎలా మారిందంటే..
తెలంగాణ ఏర్పడ్డాక టీడీపీని రెండు రాష్ట్రాలకు రెండు శాఖలుగా విస్తరించారు చంద్రబాబు నాయడు.
2015లో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్.రమణ నియమితులయ్యారు. ఆయన 2021లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)లో చేరడంతో అధ్యక్ష పదవి ఖాళీ అయ్యింది.
ఆ తర్వాత బక్కని నర్సింహులు తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
2022 నవంబరులో నర్సింహులు స్థానంలో కాసాని జ్జానేశ్వర్ ముదిరాజ్‌ను పార్టీ అధ్యక్షుడిగా నియమించారు చంద్రబాబు.

ఫొటో సోర్స్, Getty Images
‘తమ్ముళ్లూ.. తిరిగి రండి’ అని పిలిచి…
కాసాని జ్జానేశ్వర్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత టీడీపీకి పట్టున్న ప్రాంతంగా భావించిన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది ఆ పార్టీ. ఆ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు.
”పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులంతా తిరిగి రావాలి. మంచి భవిష్యత్తు ఉంటుంది” అని ప్రకటించారు.
అయితే, అనూహ్య రీతిలో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది.
దీన్ని వ్యతిరేకిస్తూ కాసాని జ్జానేశ్వర్ తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
తర్వాత ఆయన 2023 నవంబరులో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇది జరిగి దాదాపు 18 నెలలు గడిచాయి.
తర్వాత ఏపీలో ఎన్నికలు జరిగాయి. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది.
అసెంబ్లీతో పాటే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు.
తెలంగాణలో తెలుగు దేశం పార్టీకి పైస్థాయిలో నాయకులు లేకపోయినా, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఎంతో కొంత బలంగానే ఉందని విశ్లేషించారు సీనియర్ జర్నలిస్టు వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి.
ఇటీవల భద్రాచలంలో ఐటీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో టీడీపీ గెలవడమే క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న పట్టుకు నిదర్శనమని చెప్పారాయన.

ఫొటో సోర్స్, facebook.com/KasaniGnaneshwarMudhiraj
అధ్యక్షుడి ఎంపికలో ఆలస్యం ఎందుకంటే..
ఏపీలో అధికారంలోకి వచ్చాక ప్రతి నెల రెండో శనివారం తెలంగాణలో పార్టీ నాయకులకు సమయం కేటాయిస్తానని నిరుడు ఆగస్టులో చంద్రబాబు హామీ ఇచ్చారు.
అయితే, చాలా సందర్భాల్లో ఆయన అందుబాటులో ఉండటం లేదని పార్టీ నాయకులు చెప్పారు.
”ఏపీలో ప్రభుత్వాన్ని నడపడం, మళ్లీ వచ్చే ఎన్నికల నాటికి బలంగా కొనసాగేలా చూడాలనే లక్ష్యంతో చంద్రబాబు తెలంగాణకు సమయం కేటాయించలేకపోతుండొచ్చు’’ అని ఈశ్వర్ రెడ్డి అన్నారు.
కొన్ని నెలలుగా తెలంగాణలో పార్టీ పరంగా కార్యకలాపాలేవీ నిర్వహించడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా గుర్తింపు ఉండి.. దాదాపు ఏడాది కాలంగా ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీని నడిపించే అధ్యక్షుడు లేకపోవడం టీడీపీ చరిత్రలో అరుదైన సందర్భంగా చెప్పవచ్చు.

ఫొటో సోర్స్, facebook.com/TDP.Official
అనుకోని కారణాలతో అధ్యక్ష ఎన్నిక ఆలస్యమవుతూ వస్తోందన్నారు అరవింద్ కుమార్ గౌడ్. మహానాడు తర్వాత తెలంగాణ అధ్యక్షుడి నియామకం ఉంటుందని, చంద్రబాబు నాయుడు చెప్పారని చెప్పారు.
కొన్ని నెలల కిందట హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి చంద్రబాబు నాయుడును కలిశారు.
పార్టీ పగ్గాలు అప్పగిస్తే, తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆ సమయంలో ప్రచారం జరిగింది.
అయితే అరవింద్ కుమార్ గౌడ్‌కు కానీ, తీగలకు కానీ ఇప్పటివరకు పార్టీ పగ్గాలు అప్పగించలేదు.

ఫొటో సోర్స్, FACEBOOK/TDP.OFFICIAL
తెలంగాణతో ముడిపడిన చారిత్రక అంశాలెన్నో..
తెలంగాణతో తెలుగుదేశం పార్టీకి చారిత్రకంగా ఎంతో అనుబంధం ఉంది. ఎన్నో చరిత్రాత్మక ఘట్టాలకు తెలంగాణ వేదిక.
1982లో పార్టీ పెట్టాక ఎన్టీఆర్ తొలి బహిరంగ సభను ఏప్రిల్ 11న హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించారు.
1982లో చైతన్యరథం ద్వారా ప్రచార యాత్ర మొదట తెలంగాణలోనే సాగింది.
1983 జనవరి 9న ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణం స్వీకారం చేశారు.
ప్రస్తుతానికి వస్తే, తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ బాగా దెబ్బతిందని చెప్పవచ్చు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికలలో టీడీపీ కొంత ప్రభావం చూపించింది. ఆ తర్వాత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేదని చెప్పాలి.
2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీ చేసింది. 15 అసెంబ్లీ, ఒక లోక్‌సభ (మల్కాజిగిరి) స్థానం దక్కించుకుంది.
ఆ తర్వాత కాలంలో రేవంత్ రెడ్డి సహా కీలక నేతలందరూ టీడీపీని వీడి ఇతర పార్టీల్లో చేరారు. దీంతో తెలంగాణలో పార్టీకి బలమైన నాయకత్వం లోటు పెరుగుతూ పోయింది.
2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒకే ఒక్క కార్పొరేటర్ స్థానాన్ని దక్కించుకుంది.
ఆ తర్వాత 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లు గెలుచుకుంది.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌తో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది.
ఆ తర్వాత 2020లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి సీను మారిపోయింది. అసలు ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది.
పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలబరి నుంచి తప్పుకుంది టీడీపీ.
అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగానే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయలేదని చెప్పారు అరవింద్ కుమార్ గౌడ్.
కచ్చితంగా మున్ముందు తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వస్తాయని, బీజేపీతో కలిసి ముందుకు సాగుతామని ఆయన బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, x.com/Aravindkumargo5/status
ఏపీ రాజకీయాల ప్రభావం
ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ క్యాడర్ దాదాపుగా నిస్తేజంగా మారింది.
పార్టీ నాయకులు.. ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి నుంచి మొదలుకుని మండల, గ్రామ స్థాయి వరకు నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారు పార్టీలు మారడంతో టీడీపీ ఒంటరిగా మారిందని చెప్పవచ్చు.
తెలంగాణలోనూ రాష్ట్ర కమిటీ, పార్లమెంట్ కమిటీ, నియోజకవర్గ కమిటీ, మండల లేదా డివిజన్ కమిటీ, గ్రామ లేదా వార్డు కమిటీ వ్యవస్థలు ఉన్నాయి.
ఈ పదవులన్నీ చాలావరకు ఖాళీగా ఉన్నాయి.
2019 నుంచి 2024 మధ్య ఏపీలో కూడా అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం తెలంగాణపై పడి పార్టీకి ఆర్థిక వనరులకు ఇబ్బంది ఎదురైందని టీడీపీలో సుదీర్ఘకాలం పని చేసిన హైదరాబాద్‌కు చెందిన నాయకుడు ఒకరు బీబీసీతో అన్నారు.
”అప్పటికే జీహెచ్ఎంసీలో కానీ, 2018 ఎన్నికల సమయంలో గానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదే సమయంలో ‘ఆంధ్ర పార్టీ’ అనే ముద్రను మా ప్రత్యర్ధి పార్టీల నాయకులు ఎక్కువగా ప్రచారం చేశారు” అని అన్నారాయన.
”నాయకులు వేరే పార్టీల్లోకి వెళ్లిపోవడంతో కేడర్‌లో నిర్లిప్తత ఏర్పడింది. జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడంతో తెలంగాణపై ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు” అని ఈశ్వర్ రెడ్డి అన్నారు.
చంద్రబాబు దృష్టి పెడితే తెలంగాణలో టీడీపీ మళ్లీ కొంతమేర పుంజుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)