Home జాతీయ national telgu ఖమేనీ మృతి: ధృవీకరించిన ఇరాన్ మీడియా, అక్కడి ప్రజలు ఏమంటున్నారు?

ఖమేనీ మృతి: ధృవీకరించిన ఇరాన్ మీడియా, అక్కడి ప్రజలు ఏమంటున్నారు?

7
0

SOURCE :- BBC NEWS

అయతొల్లా అలీ ఖమేనీ

ఫొటో సోర్స్, Getty Images

1 మార్చి 2026, 05:34 IST

అప్‌డేట్ అయ్యింది 3 గంటలు క్రితం

చదివే సమయం: 3 నిమిషాలు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందినట్టు ఇరాన్ మీడియా తెలిపింది. ఇరాన్ 40రోజులపాటు సంతాప దినాలు పాటిస్తుందని ఓ టీవీ ప్రజెంటర్ కన్నీటిపర్యంతమవుతూ చెప్పారు.

ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, అల్లుడు మరణించినట్లు అధికార మీడియా తెలిపింది. ఖమేనీ కోడళ్ళలో కూడా ఒకరు చనిపోయారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ అనుబంధంగా ఉండే ఫార్స్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

ఆయతొల్లా అలీ ఖమేనీ శనివారం తెల్లవారు జామున తన కార్యాలయంలో విధి నిర్వహణలో ఉండగా చనిపోయారని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది.

ఉపగ్రహ చిత్రాల ఆధారంగా, ఖమేనీ తెహ్రాన్ కార్యాలయ సముదాయమైన ‘లీడర్‌షిప్ హౌస్’లోని పలు భాగాలు గణనీయంగా దెబ్బతిన్నట్లు బీబీసీ వెరిఫై ఇప్పటికే నిర్థరించింది.

ఖమేనీ కార్యాలయంలోనే చనిపోవడం ద్వారా ఖమేనీ దాక్కున్నారనే వార్తలు కేవలం ”శత్రువుల మానసిక యుద్ధంలో భాగమని” నిరూపితమైందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్‌కు అనుబంధంగా ఉన్న తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ చెప్పింది.

మరోపక్క అమెరికాస్థావరాలు, ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ ప్రకటించింది. ‘‘కొద్ది క్షణాల్లో ఆక్రమిత భూభాగాలు, అమెరికా ఉగ్రవాద స్థావరాలపై ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ సాయుధ దళాల చరిత్రలోనే అత్యంత భయానకమైన దాడి జరగనుంది’’ అని తెలిపింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
శాటిలైట్ చిత్రాలు

ఫొటో సోర్స్, Airbus

‘‘ఇది శుభవార్త’’

ఖమేనీ మృతి గురించి ఏమనుకుంటున్నారని బీబీసీ పర్షియన్ సీనియర్ రిపోర్టర్ హబీబియాజాద్ కొందరిని ప్రశ్నించారు.

‘‘నేనిది నమ్మలేకపోతున్నా. ఇలాంటి శుభవార్త విన్నప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు’’ అన్నారు.

‘‘రాత్రంతా నిద్రపోలేదు. ఖమేనీ లేకుండా నా రోజును మొదలుపెట్టేందుకు ఎదురుచూస్తున్నా. ఇక ఇప్పుడు మధ్యప్రాచ్యం మంచి ప్రదేశంగా మారుతుందని భావిస్తున్నా’’ అని ఒకరు చెప్పారు. ‘‘అసలు ప్రపంచమే మంచి ప్రదేశంగా’’ మారుతుందన్నారు.

అంతకుముందు తెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.

‘ఇరానీయులకు, అమెరికన్లకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల ప్రజలకు ‘న్యాయం దక్కిందని’ ఆయన ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.

బాంబు దాడులు కొనసాగుతాయని, “ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి దక్కించుకోవడానికి ఇదే అతిపెద్ద అవకాశం” అన్నారు ట్రంప్.

అలాగే, చాలావరకు ఇరాన్ దళాలు ‘ఇకపై పోరాడాలనుకోవడం లేదు’ అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

బీబీసీ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ లైస్ డౌసెట్ చెప్పినదాని ప్రకారం, ఈ రోజు ఉదయం నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ పరిస్థితిపై అనేక రకాల వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి దాడుల్లోనే ఆయన నివాసాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమైంది.

శాటిలైట్ చిత్రాలు ఆయన నివాస సముదాయం తీవ్రంగా దెబ్బతిన్నట్లు చూపించాయి. దీనిపై ఇరాన్.. ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తొలుత తెలిపింది. ఆ తర్వాత, 86 ఏళ్ల సుప్రీం లీడర్ ప్రభుత్వ టెలివిజన్‌లో ప్రసంగిస్తారని వార్తలు వచ్చాయి, కానీ అవేవీ జరగలేదు.

ఇక లేరు: నెతన్యాహు

సాయంత్రానికి, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు టెలివిజన్ ప్రసంగంలో సుప్రీం లీడర్ ఇక ‘లేరు’ అన్నారు – అయితే ఖమేనీ ‘మరణించారు’ అని ఆయన నేరుగా చెప్పలేదు.

కానీ, పేరు వెల్లడించని అధికారులను ఉటంకిస్తూ ఇజ్రాయెల్, అమెరికా మీడియాలో వస్తున్న వరుస కథనాలు, ఇవి నిజమన్నట్లు చూపిస్తున్నాయి.

మరోవైపు, ఇరాన్ అధికారులు ఈ వార్తలను నిరంతరం ఖండిస్తూ వస్తున్నారు.

ఇరాన్ స్టేట్ టెలివిజన్ ప్రజెంటర్ ఒకరు ఖమేనీ పేరు ప్రస్తావించకుండానే.. “శత్రువుల మైండ్ గేమ్స్ “ను నమ్మవద్దని ఇరాన్ ప్రజలకు సూచించారు.

అయితే, డోనల్డ్ ట్రంప్ చేసిన తాజా సోషల్ మీడియా పోస్ట్‌ను విస్మరించడం కష్టమే.

ఇరాన్ అధికారులు ఒక నిర్ణీత అధికారిక లాంఛనాలతో ఈ ప్రకటన చేయడానికి సిద్ధమవుతూ ఉండవచ్చు. మరోవైపు, ఇరాన్ ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ ఇప్పటికే సమావేశమై ఉండవచ్చు లేదా అందుకు సిద్ధమవుతూ ఉండవచ్చు – కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే బాధ్యత వీరిపైనే ఉంటుంది.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)