SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Martina Charnell
ఉత్తర స్పెయిన్‌లో గుర్తించిన అసాధారణమైన చిన్న ఎముకలను సుదీర్ఘంగా అధ్యయనం చేసిన తరువాత సుదీర్ఘ అధ్యయనం తర్వాత అవి ఒక చిన్న, కోడి పరిమాణంలో ఉన్న డైనోసార్‌వని తేల్చారు.
దీనికి ఫోస్కేయా పెలెన్‌డొనుమ్ అని పేరు పెట్టారు.
ఇది 12.5 కోట్ల ఏళ్ల క్రితం భూమి మీద సంచరించి ఉండవచ్చని, ఆర్నిథోపాడ్స్ అనే అంతరించిపోయిన మొక్కలను తినే డైనోసార్ల సమూహానికి చెందినదని భావిస్తున్నారు. ఈ డైనోసార్ ఆకారం చిన్నగా ఉన్నప్పటికీ, పుర్రె ఊహించని విధంగా పరిణామం చెందిందని పరిశోధనలో తేలింది.
“దాని శరీర నిర్మాణం చాలా విచిత్రంగా ఉంది. చెట్లు ఎలా పరిణామక్రమం చెందాయో కూడా దాని ద్వారా తెలుసుకోవచ్చు” అని స్పెయిన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ లా లగువానాలో శిలాజ శాస్త్రవేత్త పెనిలోప్ క్రుజాడొ కాబల్లెరొ చెప్పారు.

ఫొటో సోర్స్, Dieudonné et al. 2026
అర్జంటీనాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ రియో నెగ్రోకు చెందిన శిలాజ శాస్త్రవేత్త పౌల్ ఎమైల్ డ్యూడిన్ నాయకత్వంలోని అంతర్జాతీయ బృందం కనుక్కున్న శిలాజాలు ఐదు వేర్వేరు జీవులకు చెందినవని వారి పరిశోధన చెబుతోంది. డ్యూడిన్ 2013 నుంచి దీని మీద పని చేస్తున్నారు.
“ఈ ఆవిష్కరణణలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇంకా మేము కనుక్కోవాల్సిన శిలాజాలు చాలా ఉన్నాయి. అవి కూడా చిన్న సైజు డైనోసార్లకు చెందినవి” అని డ్యూడిన్ బీబీసీతో చెప్పారు.
“చిన్న సైజు డైనోసార్లు మనం ఇంతకు ముందు అనుకున్న దాని కంటే వైవిధ్యంగా ఉండేవి. మనకు తెలిసిన పెద్ద డైనోసార్లు పరిణామ క్రమంలో భాగంగా కాలక్రమంలో చిన్న డైనోసార్ల నుంచి వచ్చి ఉండవచ్చు” అని ఆయన అన్నారు.
శిలాజ గుర్తింపులో కష్టాలు
చిన్న డైనోసార్ల ఎముకలు చాలా పెళుసుగా ఉంటాయి. వాటిని గుర్తించడం కష్టం. దురదృష్టత్తువశాత్తూ చిన్న శిలాజాలు తేలిగ్గా విచ్చిన్నం అవుతాయి. కొన్ని ఎముకల అవక్షేపాలు కనిపించకుండా పోతాయి” అని డ్యూడిన్ అన్నారు.
ఈ డైనోసార్ అసాధారణంగా చాలా చిన్నగా ఉందని ఈ అధ్యయనానికి సహ రచయిత, బ్రెజిల్‌లోని వ్రిజే యూనివర్సిటీ బ్రస్సెల్‌కు చెందిన పాలియోంటాలజిస్టు కొయెన్ స్టెయిన్ చెప్పారు.
ఇది 30 సెంటిమీటర్ల ఎత్తు, 60 సెంటిమీటర్ల పొడవుతో ఉందని భావిస్తున్నారు. దీని సైజుని ఒక కోడితో పోల్చవచ్చు.
“ఇప్పటి వరకు కనుక్కున్న వాటిని బట్టి చూస్తే ఐరోపా ఖండంలోనే అతి చిన్న వాటిలో ఇది ఒకటి, బహుశా ఇదే అతి చిన్నది కావచ్చు అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అతి చిన్న డైనోసార్లతో ఇది పోటీ పడగలదు” అని స్టెయిన్ బీబీసీతో చెప్పారు.
ఫొటో సోర్స్, Dieudonné et al. 2026
శిలాజాల పరిమాణం చిన్నగా ఉండటం, ఈ డైనోసార్లు కూడా చిన్నవిగా ఉండవచ్చని సూచిస్తోంది. అయితే లోతుగా పరిశీలించినప్పుడు మరో విషయం తెలిసింది.
అందులో ఒకటి పెద్దది అని స్టెయిన్ వివరించారు. అవి చిన్నతనంలో నాలుగు కాళ్ల మీద నడిచేవని, పెద్దయ్యాక రెండు కాళ్ల మీద నడిచినట్లు ఆయన తెలిపారు.
ఫోస్కేయాను అత్యంత పురాతనమైన ర్యాబ్డో డోంటోమార్ఫ్‌గా పిలిచేవారు. ఇది ఆర్నిథోపాడ్లలో ఒక సమూహం
ర్యాబ్డో డోంటోమార్ఫ్‌లు మొదటి నుంచే చాలా చిన్నవిగా ఉండేవి. దీని వల్ల అవి పెద్ద జంతువుల వేటకు అందకుండా ఉండేవని డ్యూడిన్ వివరించారు.
“చిన్నగా ఉండటం వల్ల ఎక్కువ దూరం పరిగెత్తడం సాధ్యం కాదు. అందు వల్ల అవి త్వరగా దాక్కునేందుకు స్థలాన్ని వెతుక్కుంటాయి” అని ఆయన చెప్పారు.
దశాబ్ధాల అన్వేషణ ఫలితం
ఇందులో ఎక్కువ శిలాజాలను 1998లో కనుక్కున్నారు. తదుపరి సంవత్సరాలలో మరి కొన్నింటిని అదే ప్రాంతంలో గుర్తించారు.
ఈ ప్రదేశాన్ని మొదట గుర్తించి అవశేషాలను సేకరించిన వ్యక్తి ఫిడేల్ టోర్సిడా ఫెర్నాండెజ్. ఆయన ఉత్తర స్పెయిన్‌లోని సలాస్ డి లాస్ ఇన్సాంటెస్‌లోని డైనోసార్ మ్యూజియంలో ఉద్యోగి.
“ఈ ఎముకలు చాలా అసాధారణమైనవి, ప్రత్యేకమైనవని మాకు ముందు నుంచి తెలుసు. ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉన్నాయి” అని టోర్సిడా చెప్పారు.
ఫొటో సోర్స్, Paul-Emile Dieudonné
కాంతికి సమానమైన అర్థాన్నిచ్చే ఫురాతన గ్రీకు పదం ఫోస్ నుంచి ఫోస్కేయా అనే పేరు పెట్టినట్లు పరిశోధకులు చెప్పారు. ఆర్నిథోపాడ్ డైనోసార్లు ఎలా పరిణామం చెందాయో తెలుసుకోవడానికి ఈ పదం సరైనదని వారి అభిప్రాయం.
“చిన్న పరిమాణం, పరిణామ సరళతను సూచించలేదు” అని శిలాజ శాస్త్రవేత్త మార్కోస్ బెసెర్రా అంటున్నారు
ఫోస్కేయా దంతాల అమరిక కూడా విలక్షణంగా ఉంది. దాని ముందు పళ్లు మధ్యలో ఒక త్రిశూలంలా ముందుకు పొడుచుకుని ఉండేవి” అని డ్యూడెన్ పేర్కొన్నారు.
దాని దంతాల అమరిక విచిత్రంగా ఉండటంతో పాటు పుర్రె ఆకృతి కూడా విచిత్రంగా ఉందని స్టెయిన్ చెప్పారు. దీనిని డైనోసార్ల పరిణామ క్రమానికి ఉదాహరణగా చూడవచ్చని అన్నారు.
ఫొటో సోర్స్, Paul-Emile Dieudonné
పుర్రె
ఈ శిలాజాలు విగాజీట్ ఆర్నిథోపాడ్ అనే డైనోసార్లకు చెందినవని 2016లో ప్రచురించిన పరిశోధన తెలిపింది. అయితే దానిని అధికారికంగా గుర్తించడానికి తగినంత సమాచారం అందుబాటులో లేదు.
అయితే తాజా పరిశోధనలో దీనికి సంబంధించి పురోగతి సాధించారు. అందులో పుర్రె శకలాలతో సహా కపాలానికి చెందిన కొత్త భాగాలను గుర్తించారు. దీని వల్ల విగాజీట్ ఆర్నిథోపాడ్ డైనోసార్లను అధికారికంగా గుర్తించడంతో పాటు వాటికి ఫోస్కియా పెలెండోనమ్ అనే పేరు పెట్టారు.
“సాధారణంగా జీవులలో మనకు అత్యధిక సమాచారం ఇచ్చే భాగం పుర్రె. నమలడం, దృష్టి, శరీర సమతుల్యత గురించి ఈ శరీర భాగం మనకు చెబుతుంది” అని డ్యూడిన్ వివరించారు.
దీని గురించి ఆయన మాట్లాడుతూ “జంతువులు అవి నివసించే పరిసరాల్లో వాటి అవసరాలకు అనుగుణంగా తల ఆకారం సులభంగా మారుతుంది. అందువల్ల ఈ పుర్రె ఎముకలు ఎంత చిన్నవిగా, ముక్కలుగా ఉన్నప్పటికీ అవి ఆ జంతువు జీవన విధానం గురించి మనకు సమాచారం అందిస్తాయి” అని చెప్పారు.
“లక్షల సంవత్సరాల క్రితం మారుతున్న వాతారవణ పరిస్థితుల మధ్య అవి ఎలా జీవించాయి, ఎలా మరణించాయి, పరిణామక్రమంలో ఎలా మారిపోయాయి అనే విషయాలను అవగాహన చేసుకోవడానికి వీటన్నింటినీ నమోదు చేయడం చాలా ముఖ్యం” అని డ్యూడిన్ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



