Home జాతీయ national telgu ‘కోచ్ సాబ్, మీ ముఖంపై నవ్వు బావుంటుంది’, ధోనీ నుంచి షోయబ్ అఖ్తర్ వరకు గంభీర్‌...

‘కోచ్ సాబ్, మీ ముఖంపై నవ్వు బావుంటుంది’, ధోనీ నుంచి షోయబ్ అఖ్తర్ వరకు గంభీర్‌ గురించి ఏమన్నారంటే..

11
0

SOURCE :- BBC NEWS

ఇండియా, టీ ట్వంటీ వరల్డ్ కప్, గౌతమ్ గంభీర్, ధోనీ, సంజూ శాంసన్

ఫొటో సోర్స్, Matt Roberts-ICC/ICC via Getty Images

2 గంటలు క్రితం

చదివే సమయం: 7 నిమిషాలు

“కోచ్ సాబ్, మీ ముఖంపై నవ్వు బావుంటుంది. గాంభీర్యం, చిరునవ్వు కిల్లర్ కాంబినేషన్. ఇట్స్ గ్రేట్, ఎంజాయ్ ఫ్రెండ్స్.”

భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ తన ఇన్‌స్టా పోస్టులో ఇలా రాశారు.

అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియడంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజీలాండ్‌‌‌పై 96 పరుగుల తేడాతో విజయం సాధించి, వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

ఈ మ్యాచ్ అనంతరం ధోనీ ఇన్‌స్టాలో గంభీర్ గురించి పోస్ట్ చేశారు.

అయితే, ఇండియన్ క్రికెట్‌లో గంభీర్ – ధోనీ మధ్య సంబంధాల గురించి తరచూ చర్చ జరుగుతుంటుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ధోనీని గంభీర్ అనేకసార్లు ప్రశంసించాడు. అలాగే, ధోనీకి వ్యతిరేకంగానూ కొన్ని కామెంట్లు చేశాడు. అందులో జట్టు విజయాలకు క్రెడిట్ వ్యవహారం కూడా ఉంది.

భారత జట్టు 2011లో ప్రపంచ క్రికెట్ కప్ గెలిచింది. ఈ జట్టులో గంభీర్ సభ్యుడు.

ఆ జట్టుకు ధోనీ కెప్టెన్‌. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించాడు ధోనీ.

అదే మ్యాచ్‌లో గంభీర్ 97 పరుగులు చేశాడు.

“భారత్‌లో హీరో కల్చర్ ఎక్కువ. ఏదైనా విజయం సాధిస్తే, ఆ క్రెడిట్ మొత్తం ఒక్క ఆటగాడిదే కాదు.”

“2011 ప్రపంచ క్రికెట్ కప్‌ గెలుపు ఏ ఒక్క ఆటగాడిదీ కాదు, అది జట్టు విజయం” అని గౌతమ్ గంభీర్ చాలాసార్లు అన్నాడు.

వీరిద్దరి గురించి చర్చ వచ్చిన ప్రతిసారీ, ఈ వ్యాఖ్యలు ప్రస్తావనకు వస్తాయి.

ఇండియా, టీ ట్వంటీ వరల్డ్ కప్, గౌతమ్ గంభీర్, ధోనీ, సంజూ శాంసన్

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images

‘వ్యక్తులకు కాదు, జట్టుకు ప్రాధాన్యం ఇవ్వాలి’

“ఇది కేవలం దేవుడి దయ వల్ల వచ్చింది కాదు. 140 కోట్ల మంది ఆశీస్సుల ఫలితం. ప్రతీ ఆటగాడు ప్రపంచ చాంపియన్” అని అందులో రాశారు.

గంభీర్‌ భారత జట్టు కోచ్‌ అయిన తర్వాత కూడా తరచుగా టీమ్ స్పిరిట్ గురించి మాట్లాడుతున్నారు.

ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన గౌతమ్ గంభీర్, “భారత జట్టు విషయంలో నా ఫిలాసఫీ ఏంటంటే, వ్యక్తిగత మైలురాళ్లు ముఖ్యం కాదు. ట్రోఫీ గెలవడమే ముఖ్యం. వ్యక్తిగత మైలురాళ్ల గురించి మనం చాలాకాలంగా మాట్లాడుకుంటున్నాం. కానీ, నేను అక్కడ ఉన్నంత కాలం అలాంటి వాటి గురించి మేం మాట్లాడకుండా ఉండేలా ప్రయత్నిస్తా” అని చెప్పారు.

టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయం ఈ ఫిలాసఫీతోనే ముడిపడి ఉంది.

కొందరు ఆటగాళ్లు విఫలమైనప్పటికీ.. వారిపై నమ్మకం ఉంచి, వారికి అవకాశాలు ఇచ్చినందుకు క్రీడా నిపుణులు గంభీర్‌ను అభినందిస్తున్నారు.

ఇండియా, టీ ట్వంటీ వరల్డ్ కప్, గౌతం గంభీర్, ధోనీ, సంజూ శాంసన్

ఫొటో సోర్స్, Punit PARANJPE / AFP via Getty Images

సంజూ శాంసన్ ప్రత్యక్ష ఉదాహరణ

గతంలో విమర్శలు ఎదుర్కొన్న గంభీర్ వ్యూహాలను ఇప్పుడు మాస్టర్ స్ట్రోక్స్ అని పిలుస్తున్నారు.

జట్టులో ఆల్‌ రౌండర్లు, పార్ట్ టైమర్ల మీద ఎక్కువగా ఆధారపడటం, బ్యాటింగ్‌ చేసేటప్పుడు లెఫ్ట్ – రైట్ హ్యాండ్ కాంబినేషన్ వంటి విషయాల్లో గంభీర్‌పై విమర్శలు వచ్చేవి.

అయితే, ఇవే జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాయి.

హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వంటి ఆటగాళ్లు కీలక సందర్భాల్లో జట్టుకు అండగా నిలిచారు.

జట్టులో అభిషేక్ శర్మ, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ ఎడమచేతి వాటం ఆటగాళ్లు. భారత జట్టు కప్ గెలవడంలో వీరు ప్రముఖపాత్ర పోషించారు.

సంజూ శాంసన్‌పై గంభీర్ చూపిన నమ్మకానికి ఫలితమేంటో నేడు అందరికీ తెలుస్తోంది.

ఇండియా, టీ ట్వంటీ వరల్డ్ కప్, గౌతం గంభీర్, ధోనీ, సంజూ శాంసన్

ఫొటో సోర్స్, FAROOQ NAEEM/AFP via Getty Images

భారత జట్టు కప్ గెలిచిన తర్వాత, పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఒక టీవీ షోలో మాట్లాడుతూ “వారి పాలసీ, వారి సిస్టమ్, వారి ప్రతిభ గెలిచాయి” అని అన్నాడు.

“ఆటగాళ్లు విఫలమైనా జట్టు నుంచి తొలగించలేదు. మెరిట్ ఆధారంగా రిస్క్ తీసుకున్నారు. అందుకు ఉదాహరణ సంజూ శాంసన్. అభిషేక్ శర్మ చిన్నపిల్లాడు. ఇంకా పరిణతి అవసరం. అతను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కానీ, అతన్ని కూడా తప్పించలేదు” అని అఖ్తర్ అన్నాడు.

సెమీస్‌లో ఇంగ్లండ్‌పై భారత్ గెలిచిన తర్వాత షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ, “గౌతమ్ గంభీర్ పోరాడి సంజూ శాంసన్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నాడు” అని చెప్పాడు.

అభిషేక్ శర్మ టోర్నీ తొలి మ్యాచ్ నుంచి మొదలుపెట్టి వరుసగా మూడుసార్లు డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ, అతని ట్రాక్ రికార్డు చూపించి జట్టులో కొనసాగేలా చేశాడు.

ఫైనల్‌లో అభిషేక్ కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు.

మ్యాచ్ ముగిసిన తర్వాత అభిషేక్ శర్మ మాట్లాడుతూ “నాపై నాకే నమ్మకం సన్నగిల్లినప్పుడు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నాపై నమ్మకం ఉంచారు” అని చెప్పాడు.

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది భారత జట్టుపై ప్రశంసలు కురిపించాడు.

“టోర్నీ అంతటా టీమిండియా గొప్పగా ఆడింది. వారు ఈ గెలుపుకు అర్హులు. జట్టు మొత్తం బలంగా ఉంది. వాళ్లు ఎవరితోనైనా ఆడగలరు. చాలాకాలం తర్వాత సంజూను ఓపెనర్‌గా దించారు. అతను చాలా బాగా ఆడాడు” అని అన్నాడు.

“ఈ ఘనత అంతా భారత జట్టులో ఆటగాళ్ల మైండ్‌సెట్‌దే. ఇండియా 2024 టీ20 ప్రపంచకప్ గెలిచింది. తర్వాత చాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. ఆసియా కప్ గెలిచింది. ఇప్పుడు మళ్లీ టీ20 ప్రపంచ కప్ గెలిచింది. ఇది వాళ్ల వ్యవస్థ సాధించిన విజయం” అని పాకిస్తాన్ ఆటగాడు మొహమ్మద్ హఫీజ్ ఒక షోలో చెప్పాడు.

ఇండియా, టీ ట్వంటీ వరల్డ్ కప్, గౌతం గంభీర్, ధోనీ, సంజూ శాంసన్

ఫొటో సోర్స్, Alex Davidson-ICC/ICC via Getty Images

విమర్శలను ఎదుర్కొని..

టీం ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ ప్రయాణం అంత సులభంగా సాగలేదు.

2024లో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ నెగ్గిన తర్వాత గంభీర్‌కు కోచ్ పగ్గాలు దక్కాయి.

2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నాడు. ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు మంచి విజయాలు సాధించడంతో, దాన్ని కొనసాగించడంలో గంభీర్‌పై ఒత్తిడి పెరిగింది.

మోదీ స్టేడియంలో భారత జట్టు సాధించిన విజయానికి రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌కు భాగస్వామ్యం ఉందని గంభీర్ చెప్పాడు.

జట్టు ప్రస్తుతం సాధించిన విజయానికి వాళ్లిద్దరూ పునాది వేశారని అన్నాడు.

వీవీఎస్ లక్ష్మణ్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు హెడ్‌గా ఉన్నాడు.

గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి రోజుల్లో జట్టు పరాజయాల్ని ఎదుర్కొంది.

ఇండియా, టీ ట్వంటీ వరల్డ్ కప్, గౌతం గంభీర్, ధోనీ, సంజూ శాంసన్

ఫొటో సోర్స్, Santanu Banik/Speed Media/Icon Sportswire via Getty Images

గంభీర్ కోచ్ అయిన తర్వాత, 2024లో న్యూజీలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. న్యూజీలాండ్ భారత్‌ను 3-0 తేడాతో వైట్‌వాష్ చేసింది.

అదే ఏడాది బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ భారత్ 1-3 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

2024లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ 2-0తో ఓటమి పాలైంది.

అలాగే, టీ20 ప్రపంచ కప్‌కు ముందు న్యూజీలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 1-2 తేడాతో భారత్ ఓడిపోయింది.

2025లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కోల్పోయింది.

అయితే, అదే సమయంలో టీ20 మ్యాచ్‌లలో టీమిండియా ప్రదర్శన బావుంది. కొన్ని సిరీస్‌లతో పాటు ఆసియా కప్‌ గెలుచుకుంది.

వరుస ఓటముల తర్వాత, గంభీర్ జట్టు నిర్వహణ తీరుపై విమర్శలు వచ్చాయి.

గౌతమ్ గంభీర్‌కు జట్టుకు బహిరంగంగా ప్రాతినిధ్యం వహించే నైపుణ్యాలు లేవని అతను ప్రెస్ కాన్ఫరెన్సులకు దూరంగా ఉండాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ 2024లో అన్నారు.

గంభీర్‌ను ఇష్టపడటం కొంచెం కష్టమని, అతని దూకుడు వైఖరి 2026 తర్వాత అతను ప్రధాన కోచ్‌గా కొనసాగడానికి ఆటంకంగా మారుతుందని ఇంగ్లండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ స్టీవ్ హార్మిసన్ టాక్ స్పోర్ట్ క్రికెట్ యూట్యూబ్ చానల్‌తో చెప్పారు.

ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి గంభీర్ గెలిచాడు. గెలుపు అన్నీ మర్చిపోయేలా చేస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)