Home జాతీయ national telgu కొబ్బరి నీళ్లతో హ్యాంగోవర్ దిగుతుందా? కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయా?

కొబ్బరి నీళ్లతో హ్యాంగోవర్ దిగుతుందా? కిడ్నీల్లో రాళ్లు కరుగుతాయా?

6
0

SOURCE :- BBC NEWS

కొబ్బరి నీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

ఫొటో సోర్స్, Getty Images

వేసవిలో డీహైడ్రేషన్‌ లేదా వేడి వల్ల తలెత్తే ప్రతీ ఇబ్బందికి కొబ్బరి నీళ్లను ఒక పరిష్కారంగా చూస్తుంటారు.

ఒంట్లో వేడి తగ్గుతుందని, దాహం తీరుతుందని, నీరసం తగ్గుతుందని అందరూ కొబ్బరి నీళ్లను తాగుతుంటారు.

అంతేకాదు, కొబ్బరి నీళ్లు తాగితే హ్యాంగోవర్ తగ్గుతుందని, కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయని, డయాబెటిస్ ఉన్నవాళ్లకు రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుందని కూడా అంటుంటారు. మరి ఇందులో నిజమెంత? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

వీటితో పాటు కొబ్బరి నీళ్లను తాగడం వల్ల కలిగే ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

కొబ్బరి నీళ్లలో ఏమేం ఉంటాయి?

ఆకుపచ్చగా ఉండే లేత కొబ్బరి కాయలో ఎక్కువ నీళ్లు ఉంటాయి. పండించే నేలను బట్టి, రకాన్ని బట్టి కొబ్బరి కాయల్లోని నీళ్ల రుచిలో కాస్త మార్పులు ఉంటాయి.

ఒక 100 మి.లీ. కొబ్బరి నీటిలో 18 కేలరీలు, 0.2 గ్రాముల ప్రోటీన్, 0 ఫ్యాట్, 4.5 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 4.1 గ్రాముల చక్కెర, 165 మి. గ్రాముల పొటాషియం ఉంటుందని అసోసియేషన్ ఫర్ న్యూట్రిషన్‌కు చెందిన పోషకాహార నిపుణురాలు జో విలియమ్స్ తెలిపారు.

అలాగే ఎలక్ట్రోలైట్లు, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉండే కొబ్బరి నీరు ఒక అద్భుతమైన పానీయమని సెలెబ్రిటీ న్యూట్రిషనిస్ట్ పూజ మఖీజా చెప్పినట్లు వోగ్ వెబ్‌సైట్ పేర్కొంది.

ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరంలోని కణాలను రక్షించే యాంటీ ఆక్సిడెంట్లు కొబ్బరి నీళ్లలో అనేకం ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.

కొబ్బరి నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఖనిజాల గని

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని ఎన్‌ఐహెచ్ పేర్కొంది.

ఎన్‌ఐహెచ్ వెబ్‌సైట్ పేర్కొన్న వివరాల ప్రకారం గుండె ఆరోగ్యం, అస్థిపంజరం, కండరాల పనితీరుతో సహా శరీరం అంతటా కీలకంగా వ్యవహరించే ఈ ఖనిజాలను మనలో చాలా మంది సరిపడినంత పొందలేరు.

చాలా స్పోర్ట్స్ డ్రింకుల్లో ఉన్నట్లే, కొబ్బరి నీరులో కూడా అదే స్థాయిలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత ఉంటుందని కొందరు నమ్ముతారని జో విలియమ్స్ చెప్పారు.

అవకాడో, అరటిపండు, బంగాళాదుంపల్లో సగటున ఉండే పొటాషియంతో పోలిస్తే, 100 మిల్లీ లీటర్ల కొబ్బరి నీరుతో లభించే పొటాషియం పరిమాణం మరీ ఎక్కువ కాదని గుర్తుంచుకోవాలి.

పొటాషియం సమృద్ధిగా ఉండి కొబ్బరి నీళ్ల కంటే చౌకగా, సులభంగా దొరికే ఆహారాలు చాలా ఉన్నాయని జో విలియమ్స్ అన్నారు.

కొబ్బరి నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు

శరీరం ప్రోటీన్లను తయారు చేసుకోవడంలో సహాయపడే ఎల్-అర్జినిన్ అనే అమైనో యాసిడ్, లేత కొబ్బరి నీళ్లలో ఉంటుందని ఫార్మాస్యూటికల్ రీసర్చ్ ఇంటర్నేషనల్ జర్నల్ పేర్కొంది.

ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా నిరోధించడంలో ఈ అమైనో యాసిడ్ సహాయపడుతుంది.

రక్తపోటును తగ్గించడానికి, శారీరక కారణాలతో ఏర్పడే అంగస్తంభన సమస్యకు చికిత్సగా ఎల్-అర్జినిన్ ఉపయోగపడుతుందని మయో క్లినిక్ వెబ్‌సైట్ పేర్కొంది.

జంతువులపై చేసిన పరిశోధన ప్రకారం, కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న రెండు సమ్మేళనాలు ఉన్నట్లు గుర్తించారు. కొబ్బరి నీటిలోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుందని రిపోర్టులు సూచిస్తున్నాయి.

కొబ్బరి నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుందా?

డయాబెటిక్ ఎలుకలపై చేసిన పరిశోధనలో కొబ్బరి నీళ్లు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలని పెంచి గ్లైకోహిమోగ్లోబిన్‌ను తగ్గించాయని ఫార్మాస్యూటికల్ రీసర్చ్ ఇంటర్నేషనల్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కొబ్బరినీళ్లు సహాయపడతాయని జంతువులపై చేసిన పరిశోధనలో తేలినట్లు ఎన్‌ఐహెచ్ తెలిపింది.

అలాగే డయాబెటిస్‌తో సంబంధమున్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కలిగే హానికారక ప్రభావాలను తగ్గిస్తుందని పేర్కొంది.

ఈ నీళ్లలోని మెగ్నీషియం మరిన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా మెగ్నీషియం సహాయపడుతుంది. అయితే, అవకాడో, అరటిపండ్లలో కూడా మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది.

కొబ్బరి నీళ్లను ఉపయోగించి జంతువులపై చేసిన పరిశోధనల్లో ఆశావహ ఫలితాలు కనిపించినప్పటికీ, మానవుల్లో ఈ ప్రభావాల గురించి సరైన అంచనాకు రావడానికి మరింత పరిశోధన అవసరమని జో విలియమ్స్ అన్నారు.

కొబ్బరి నీరు.

ఫొటో సోర్స్, Getty Images

కిడ్నీలో రాళ్లకు ఔషధం

కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే శరీరానికి సరిపడినంత ద్రవాహారాన్ని అందించాలి.

కాల్షియం, ఆక్సలేట్ వంటి సమ్మేళనాలు కలిసిపోయి గట్టిగా స్పటికంలా, రాళ్లలా ఏర్పడినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు వచ్చాయని అంటుంటారు.

అయితే, కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కిడ్నీల్లో ఏర్పడిన రాళ్ల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా అవి కిడ్నీలకు, మూత్రనాళాలకు అంటుకోకుండా నివారిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని హెల్త్ లైన్ వెబ్‌సైట్ పేర్కొంది.

కొబ్బరి నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

వ్యాయామానికి ముందు తాగితే,

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అథ్లెట్ల పెర్ఫార్మెన్స్, సామర్థ్యం మెరుగవుతాయని చెబుతారు.

ఎందుకంటే ఇందులో సోడియం, పొటాషియంలతో పాటు గ్లూకోజ్ రూపంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి శక్తిని అందిస్తాయి. కమర్షియల్ స్పోర్ట్స్ డ్రింకుల్లోనూ సోడియం, పొటాషియం ప్రధానంగా ఉంటాయి.

వ్యాయామం చేయడానికి ముందు కొబ్బరి నీళ్లు తాగితే, అధిక వేడి వాతావరణంలోనూ వ్యాయామం చేయగల సామర్థ్యం మెరుగవుతుందని ఒక అధ్యయనం సూచించింది.

వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లు తాగితే కార్బోహైడ్రేట్-ఎలక్ట్రోలైట్ స్పోర్ట్స్ డ్రింక్ తరహాలోనే శరీరం తిరిగి హైడ్రేట్ అవుతుందని మరో అధ్యయనంలో తేలింది.

కొబ్బరి నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

హ్యాంగోవర్ తగ్గుతుందా?

ఆల్కహాల్ తీసుకున్నాక హ్యాంగోవర్ రావడం సాధారణమే. ఆల్కహాల్ తాగిన తర్వాత రక్తంలోని టాక్సిన్లను కాలేయం తొలగించకపోవడం వల్ల, డీహైడ్రేట్ కావడం వల్ల తలనొప్పి, నీరసం, వికారం వంటి లక్షణాలు కనబడతాయి. దీన్నే హ్యాంగోవర్ అంటారు.

తక్షణమే హైడ్రేట్ కావడానికి అత్యంత సులభమైన, ఆరోగ్యమైన విధానం కొబ్బరి నీళ్లను తాగడమని ఫుడ్ డార్జీ సహ వ్యవస్థాపకుడు, న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సిద్ధాంత్ భార్గవను ఉటంకిస్తూ వోగ్ వెబ్‌సైట్ పేర్కొంది.

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఈ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పిని తగ్గించడంలో పొటాషియం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్ వంటివి టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయానికి సహాయపడతాయి. మాంగనీస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేషన్ (మంట) లక్షణాలు ఉంటాయి. హ్యాంగోవర్ లక్షణాల చికిత్సలో ఇది ప్రయోజనకరం.

అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత లోపించినప్పుడు కూడా తలనొప్పి, నీరసం, వికారం వంటివి కలుగుతాయి. అప్పుడు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కాస్త కోలుకున్న అనుభూతి కలుగుతుంది.

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల హ్యాంగోవర్ లక్షణాలు తక్షణమే నయం కావని, కానీ శరీరం వెంటనే హైడ్రేట్ కావడం వల్ల శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కొబ్బరి నీళ్లు తాగితే హ్యాంగోవర్ దిగిపోతుందని చెప్పడానికి సరిపడినంత శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ, అందులో సమృద్ధిగా ఉండే ఎలక్ట్రోలైట్ల కారణంగా, శరీరాన్ని రీహైడ్రేట్ చేయడం కోసం కొబ్బరి నీళ్లను ఒక మార్గంగా ఎంచుకుంటారు.

కొబ్బరి నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

కొబ్బరి నీళ్లు అందరూ తాగొచ్చా?

‘‘చాలామందికి కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు. కానీ, మూత్రపిండాలు పనిచేయనివారికి, పొటాషియం పరిమితంగా తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మూత్రపిండాలు ఉన్నవారు హైడ్రేషన్ కోసం తరచుగా కొబ్బరి నీళ్లు తాగడం మంచిది కాదు.’’ అని పోషకాహార నిపుణురాలు జో విలియమ్స్ సూచించారు.

ప్రి డయాబెటిక్, డయాబెటిక్ కండిషన్‌లో ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవాలి.

కొబ్బరి నీళ్లతో అలర్జీలు రావడం చాలా అరుదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)