Home జాతీయ national telgu కూతుళ్ల కాళ్లు, చేతులు కట్టేసి రాత్రంతా ఇనుప రాడ్డుకు వేలాడదీసిన కన్నతండ్రి, రోదిస్తున్న తల్లి.. అసలేం...

కూతుళ్ల కాళ్లు, చేతులు కట్టేసి రాత్రంతా ఇనుప రాడ్డుకు వేలాడదీసిన కన్నతండ్రి, రోదిస్తున్న తల్లి.. అసలేం జరిగింది?

6
0

SOURCE :- BBC NEWS

మహారాష్ట్ర, రాణి యమ్‌గర్

4 గంటలు క్రితం

చదివే సమయం: 5 నిమిషాలు

(హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని అంశాలు మిమ్మల్ని కలచివేయొచ్చు)

దొంగతనం అనుమానంతో కన్నతండ్రే కూతురిని తాడుతో కట్టేసి, వేలాడదీయడంతో ఆ బాలిక మరణించిన దిగ్భ్రాంతికర ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఈ కేసులో 51 ఏళ్ల నిందితుడు దాదు హైబత్ యమ్‌గర్‌ను అట్పాడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా తీవ్ర కలకలం రేగింది.

మహారాష్ట్రలోని సంగ్లి జిల్లా, అట్పాడి తాలుకాలోని బాన్‌పురిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ అమ్మాయిలు తరచూ దొంగతనాలకు పాల్పడేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దాదు యమ్‌గర్ కూతుళ్లు రితూజ, అనూజ పక్కింట్లో డబ్బులు దొంగతనం చేసినట్లు చెప్పారు.

తండ్రి దాదు యమ్‌గర్‌కు ఈ విషయం తెలిసింది. ఆ తర్వాత, యమ్‌గర్ కోపంతో తన ఇద్దరి కూతుళ్ల కాళ్లు, చేతులు కట్టేసి.. రాత్రంతా ఇంట్లోని ఇనుప కమ్మీకి (రాడ్‌కు) వేలాడదీశారు.

రాత్రంతా ఆ ఇద్దరు అమ్మాయిలు అలానే ఉన్నారు. దీంతో, ఇద్దరిలో ఒకరు దురదృష్టవశాత్తూ మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా మారింది.

ఈ ఘటన తర్వాత అట్పాడి పోలీసులు దాదు యమ్‌గర్‌ను అరెస్ట్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలేం జరిగింది?

దాదు యమ్‌గర్ బాన్‌పురి గ్రామంలోని యమ్‌గర్ కాలనీలో ఉంటున్నారు. కూలీగా పనిచేస్తారు. ఆయనకు ఐదుగురు పిల్లలు, నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు.

వారిలో అనూజకు 11 ఏళ్లు, రితూజకు 9 ఏళ్లు. యమ్‌గర్ కాలనీలోని జిల్లా పరిషత్ స్కూల్‌లో చదువుకుంటున్నారు.

అనూజ ఐదో తరగతి, రితూజ నాలుగో తరగతి చదువుతున్నారు.

ఈ ఇద్దరూ తుంటరి పనులకు అలవాటుపడి, గత కొన్ని నెలల నుంచి స్కూల్‌లో, ఇంట్లో, ఇతర చోట్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు.

బుధవారం (మార్చి 25న) ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనూజ, రితూజ తమ పక్కింట్లో డబ్బులు దొంగతనం చేశారు.

ఆ కుటుంబం, దొంగతనం విషయాన్ని రితూజ, అనూజ తల్లిదండ్రులకు చెప్పింది. ఆ అమ్మాయిల తండ్రి దాదు యమ్‌గర్ సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాక ఆయనకు కూడా ఈ విషయం తెలిసింది.

దొంగతనం గురించి తెలియగానే.. కోపంలో తాళ్లతో పిల్లలిద్దరి కాళ్లు, చేతులు కట్టేసి, ఇంటి పైకప్పుకి ఉన్న ఇనుప రాడ్‌కు వేలాడదీశారు.

నిందితుడు దాదు యమ్‌గర్

దాదు యమ్‌గర్ భార్య, ఆయన తల్లి, తండ్రి కూడా దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, తీవ్ర ఆగ్రహానికి గురైన దాదు యమ్‌గర్, మధ్యలో ఎవరైనా జోక్యం చేసుకుంటే వారందరినీ చంపేస్తానని బెదిరించారు.

ఈ ఇద్దరూ రాత్రంతా వేలాడుతూనే ఉన్నారు. వారు బాగా ఏడ్చారు. వారికి దాహం వేసింది. ఆ తర్వాత వారికి రెండుసార్లు దాదు యమ్‌గర్ మంచినీళ్లు ఇచ్చారు. కానీ, వారిని కిందకి మాత్రం దించలేదు.

ఉదయం అమ్మాయిలను కిందకి దించి, ఆస్పత్రికి తీసుకెళ్లారు.

పండర్పూర్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా రితూజ అంబులెన్స్‌లోనే మరణించగా.. అనూజ పరిస్థితి విషమంగా ఉంది. ఆమె ప్రస్తుతం అట్పాడిలో చికిత్స పొందుతోంది.

మహారాష్ట్ర

కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారు?

బాలికల తల్లి రాణి యమ్‌గర్ చెప్పిన వివరాల ప్రకారం, ”మా పిల్లలు దొంగతనం చేశారు. ఇలానే దొంగతనాలు చేసేవారు. స్కూల్‌లో, మరో చోట ఇలా చిన్నచిన్న దొంగతనాలు చేసేవారు. దీనివల్ల, వాళ్ల నాన్నకు బాగా కోపం వచ్చింది. తాగి ఉన్నారు. ఆవేశంలో అమ్మాయిల చేతులు, కాళ్లు కట్టేసి, వేలాడదీశారు” అని చెప్పారు.

”ఆ రోజు, మా పిల్లలు పక్కింట్లో డబ్బులు దొంగతనం చేశారు. దొంగతనం చేసిన డబ్బుల్లో రూ.500 ఖర్చు పెట్టారు. వారి వద్ద రూ.1,450 దొరికాయి. ఆ డబ్బులను వారు పక్కింటివాళ్లకు తిరిగి ఇచ్చేశారు” అని తెలిపారు.

“రాత్రంతా ఇనుప రాడ్‌కు వేలాడుతూనే ఉన్నారు. ఉదయం వారిని కిందకి దించగా.. అనూజ మాత్రమే మాట్లాడింది, రితూజ మాట్లాడలేకపోతోంది.”

”నీళ్లిచ్చి, వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాం. వాళ్ల నాన్నను అడ్డుకునేందుకు ప్రయత్నించాం. కానీ, ఆయనకు మాపై కోపం వచ్చింది. దగ్గరకు రానీయలేదు. కూతుళ్లు దొంగతనం చేశారని ఆయనకు బాగా కోపం వచ్చింది.” అని రాణి చెప్పారు.

పిల్లల్ని తాళ్లతో కట్టేసి వేలాడదీసినప్పుడు తాను ఇంట్లో లేనని పిల్లల తాతయ్య కోర్టుకు చెప్పారు.

దాదు యమ్‌గర్ గురువారం (మార్చి 26న) ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి బయటికి వెళ్లిపోగానే.. వేలాడదీసిన పిల్లల్ని కిందకి దించారు.

ఇద్దరికీ తాగడానికి నీళ్లు ఇచ్చినప్పుడు, రితూజ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అనూజ అపస్మారక స్థితిలో ఉంది.

ఇద్దరినీ పండర్పూర్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అంబులెన్స్‌లో పండర్పూర్‌కు తీసుకెళ్తుండగా, రితూజ మార్గం మధ్యలోనే మరణించిందని వారు తెలిపారు.

ఈ ఘటన తర్వాత.. అనూజ అపస్మారక స్థితిలో ఉండటంతో ఆమెను అట్పాడి ఆస్పత్రిలో చేర్చారు.

అట్పాడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనూజకు స్పృహ వచ్చింది. ఏం జరిగిందో మొత్తం ఆమె డాక్టర్లకు చెప్పింది. ఆ తర్వాతనే అట్పాడి పోలీసులకు ఈ సంఘటన గురించి తెలిసింది.

అట్పాడి పోలీసులు బాన్‌పురి వెళ్లి ఈ సంఘటన గురించి విచారించారు. ఆ సమయంలో, రితూజ మృతదేహం అక్కడే ఉంది. ఆ తర్వాత రితూజ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. దాదు యమ్‌గర్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

“ఆ అమ్మాయిలు దొంగతనాలు చేసేవారు, అందువల్ల, ‘మీరు ఆడపిల్లలను ఎలా పెంచుతున్నారు?’ అంటూ జనం మమ్మల్ని తిట్టేవారు. రాత్రిపూట కూడా వాళ్లు ఇంటికి వచ్చేవారు కాదు, బయటే పడుకునే వారు. ఎవరిదైనా డబ్బు దొంగిలిస్తే, వాటితో ఏవైనా వస్తువులు కొనుక్కునేవారు. కొన్నిసార్లు ఒకరి కోసం ఒకరు వాచ్‌లు తెచ్చుకునేవారు, మరికొన్నిసార్లు తినడానికి ఏవైనా తెచ్చుకునేవారు” అని ఆ అమ్మాయిల నాన్నమ్మ చెప్పారు.

”ఆ రోజు కూడా దొంగతనం కారణంగానే అది జరిగింది. మేం వచ్చి ఆపడానికి ప్రయత్నించినప్పుడు, ‘ఎవరైనా అడ్డు వస్తే చంపేస్తాను’ అని బెదిరించాడు. దాంతో మేమంతా గమ్మున ఉండిపోయాం. రాత్రంతా పిల్లలు మమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు. వాళ్ల నాన్నను కూడా పిలిచారు. రెండుసార్లు వారికి మంచినీళ్లు ఇచ్చాడు” అని తెలిపారు.

మహారాష్ట్ర, బాన్‌పురి

పోలీసులు ఏం చెబుతున్నారు?

అట్పాడి పోలీస్ ఇన్‌స్పెక్టర్ వినయ్ బాహిర్ దీని గురించి సమాచారం అందించారు.

”చనిపోయిన రితూజ అనే అమ్మాయి చనిపోయినట్లు మాకు సమాచారం అందింది. తదుపరి విచారణలో, అట్పాడి తాలూకాలోని బాన్‌పురికి చెందిన దాదు హైబత్ యమ్‌గర్, కుటుంబ కారణాలతో తన ఇద్దరు కూతుళ్లు అనూజ (11 సంవత్సరాలు), రితూజ (9 సంవత్సరాలు) చేతులు, కాళ్లు కట్టేసి వేలాడదీసినట్లు తెలిసింది” అని తెలిపారు.

”అనూజ పరిస్థితి విషమంగా ఉంది. అట్పాడిలో చికిత్స పొందుతోంది. ఆమెపై హత్యాయత్నం జరగడంతో, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కాళ్లు, చేతులు కట్టేసి వేలాడదీయడంతో.. రితూజ మృతి చెందింది. ఆమె మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి, బంధువులకు అప్పజెప్పాం. నిందితుడిపై కేసు దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు” అని చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)