SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
యుద్ధం అంటే అంతే. ఎక్కడ యుద్ధం జరుగుతున్నా ప్రపంచమంతటా దాని ప్రభావం ఏదో రూపంలో పడుతుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం అంటే మన వంట ఇంట్లోకీ చొచ్చుకొచ్చేస్తుంది.
డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు మండిపోతాయి. పరిస్థితులు ముదిరితే అసలు అవి దొరకడమే గగనమవుతాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
వంట గ్యాస్ ధరలు పెరగడమే కాదు.. సిలిండర్ల కొరత కూడా పెరుగుతోందన్న వార్తలు గుబులు పుట్టిస్తున్నాయి. ఇల్లయినా హోటలయినా గ్యాస్ ఉంటేనే వంటలు, వడ్డించడాలు. లేదంటే తంటాలే. ఈ పరిస్థితుల్లో ప్రత్నామ్నాయ వంట వ్యవస్థల కోసం చూడక తప్పదు.
పట్టణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిలు, కిరోసిన్ స్టవ్‌లు, బొగ్గుల కుంపటి వంటివి దాదాపు మాయమయ్యాయి. నేటి తరం చాలా మంది వాటిని చూసికూడా ఉండరు. కానీ పల్లెసీమల్లో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో మైక్రో-ఓవెన్, ఇండక్షన్ స్టవ్.. వంటి ఆధునిక ప్రత్యామ్నాయాలూ ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో గాబరా పడకుండా ఎలాంటి ప్రత్యామ్నాయ పొయ్యిలు ఉపయోగించవచ్చు, వాటి ఇంధనాలు ఏమిటో చూద్దాం.
ఇలాంటి సంక్షోభం తలెత్తితే ఎదుర్కోవడానికి హైబ్రీడ్ వంట వ్యవస్థలను ఎలా సిద్ధం చేసుకోవాలో కూడా పరిశీలిద్దాం.

1. ఇండక్షన్ కుక్‌టాప్
ఇండక్షన్ కుక్‌టాప్‌లు పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ స్టవ్‌కు ప్రధాన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. కరెంటుతో పనిచేసే ఈ స్టవ్‌లు మంటతో కాకుండా అయస్కాంత శక్తితో పాత్రను నేరుగా వేడి చేస్తాయి. దీంతో పాత్రలు త్వరగా వేడెక్కుతాయి. కరెంట్ వృథా తక్కువ. పప్పు ఉడికించడానికి, పాలు మరిగించడానికి, కూరలు తదితర వంటలకు ఇవి చాలా బాగా పనిచేస్తాయి.
లాభాలు: వంట వేగంగా పూర్తవుతుంది. మంట లేకపోవడం వల్ల ఇది సురక్షితమైనది కూడా. దీనిని శుభ్రం చేయడం కూడా సులభం.
లోపాలు: ఈ స్టవ్ వాడాలంటే ప్రత్యేకంగా తయారుచేసిన ఇండక్షన్ బేస్ పాత్రలు కావాలి. అలాగే విద్యుత్ లేకపోతే పనిచేయదు.
ఎక్కడ దొరుకుతుంది: ఎలక్ట్రానిక్ ఉపకరణాల దుకాణాలు, కిచెన్ అప్లయెన్సెస్ స్టోర్లు, ఆన్‌లైన్ మార్కెట్లలో సులభంగా లభిస్తాయి.
ఫొటో సోర్స్, Getty Images
2. ఇన్‌ఫ్రారెడ్ ఎలక్ట్రిక్ స్టవ్
ఇన్‌ఫ్రారెడ్ స్టవ్ బయటకు ఇండక్షన్ స్టవ్ లాగే కనిపిస్తుంది కానీ పనిచేసే విధానం భిన్నం. ఇది అడుగున ఉండే ఇన్‌ఫ్రారెడ్ కాయిల్స్ ద్వారా వేడిని ఉత్పత్తి చేసి పాత్రను వేడెక్కేలా చేస్తుంది. ఇది కూడా కరెంట్‌తోనే పనిచేస్తుంది. అన్ని రకాల పాత్రలతోనూ దీనిపై వంట చేసుకోవచ్చు.
లాభాలు: ఎలక్ట్రిక్ పవర్‌తో పనిచేస్తుంది. స్టీల్, అల్యూమినియం, గ్లాస్ వంటి అన్ని పాత్రలతో వాడుకోవచ్చు.
లోపాలు: స్టవ్ పై భాగం బాగా వేడెక్కిపోతుంది. ఇండక్షన్ కుక్‌టాప్‌తో పోలిస్తే విద్యుత్ వినియోగం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
ఎక్కడ దొరుకుతుంది: ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల షాపులు, కిచెన్ అప్లయన్సెస్ దుకాణాలు.
ఫొటో సోర్స్, Getty Images
3. కాయిల్ స్టవ్
ఎలక్ట్రిక్ హాట్ ప్లేట్. దీనినే కాయిల్ స్టవ్ అంటారు. చాలా చవకైన వంట పరికరం. విద్యుత్‌తో పనిచేస్తుంది. దీని లోపల ఉండే కాయిల్ విద్యుత్‌తో వేడెక్కి పాత్రను వేడి చేస్తుంది.
లాభాలు: దాదాపు అన్ని రకాల పాత్రలతో వాడుకోవచ్చు. ధర తక్కువ.
లోపాలు: ఇది వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది.
ఎక్కడ దొరుకుతుంది: హార్డ్‌వేర్ షాపులు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల దుకాణాలు, ఆన్‌లైన్ మార్కెట్లు.
ఫొటో సోర్స్, Getty Images
4. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్
విద్యుత్‌తో పనిచేసే రైస్ కుక్కర్లు చాలా కాలంగా ఉపయోగంలో ఉన్నాయి. చాలా ఇళ్లలో ఇవి వాడుతున్నారు. అన్నం, పప్పు, కూరలు, సూప్ వంటి వంటలు చాలా సులభంగా చేయవచ్చు. వంటకు అవసరమైన పదార్థాలు పాత్రలో ఉంచి, నీళ్లు పోసి ఆన్ చేస్తే ఈ కుక్కరే వంటను పూర్తి చేసేస్తుంది.
లాభాలు: సౌకర్యవంతం, విద్యుత్ వినియోగం తక్కువ, పర్యవేక్షణ అవసరం తక్కువ.
లోపాలు: దీనిమీద వేపుడు కూరలు చేయలేం. రోటీలు, పూరీలు, చపాతీలు చేయడం కూడా వీలుకాదు.
ఎక్కడ దొరుకుతుంది: ఎలక్ట్రానిక్ ఉపకరణాల షాపులు, సూపర్ మార్కెట్లు, ఆన్‌లైన్ స్టోర్లు.
ఫొటో సోర్స్, Getty Images
5. మైక్రోవేవ్ ఓవెన్
మైక్రోవేవ్ ఓవెన్ ఎక్కువగా వంటకాలను వేడి చేయడానికి, ఆవిరితో చేసే వంటలకు ఉపయోగపడుతుంది. నీటి అణువులను వేడి చేసి ఆహారాన్ని త్వరగా వేడి చేస్తుంది. కానీ స్టవ్ మీద లాగా వంటలు చేయడానికి ఉపయోగపడదు.
లాభాలు: వంటలను చాలా వేగంగా వేడి చేస్తుంది. కూరగాయలను ఆవిరితో వండడానికి చాలా మంచిది.
లోపాలు: వేపుడు వంటలు, దోశలు, చపాతీలు వంటివి చేయడం సాధ్యం కాదు.
ఎక్కడ దొరుకుతుంది: ఎలక్ట్రానిక్ ఉపకరణాల దుకాణాలు, ఆన్‌లైన్ మార్కెట్లు.
ఫొటో సోర్స్, Getty Images
6. సోలార్ కుక్కర్
సోలార్ కుక్కర్లు సూర్యకాంతిని ఉపయోగించి వంట చేస్తాయి. సోలార్ ప్యానళ్లు సూర్యరశ్మిని ఒక పాత్రపై కేంద్రీకరించిలా చేసి వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఆహారాన్ని పాత్రలో పెట్టి సోలార్ కుక్కర్‌లో ఉంచి నేరుగా సూర్యకాంతిలో పెడితే చాలు.
లాభాలు: సోలార్ కుక్కర్‌కు ఇంధనం అవసరం లేదు. పర్యావరణానికి అనుకూలం.
లోపాలు: వంటకు ఎక్కువ సమయం పడుతుంది. మబ్బులు పట్టినపుడు కానీ, రాత్రి సమయంలో కానీ ఉపయోగించలేము.
ఎక్కడ దొరుకుతుంది: ఆన్‌లైన్ స్టోర్లు, గ్రీన్ ఎనర్జీ సంస్థలు
ఫొటో సోర్స్, Getty Images
7. కిరోసిన్ స్టవ్
ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ స్టవ్‌లు ఎంత మామూలుగా ఉండేవో.. వీటికి ముందు కిరోసిన్ స్టవ్‌లను అంత సర్వసాధారణంగా దాదాపు అన్ని ఇళ్లలో ఉపయోగించేవారు. కిరోసిన్‌ను రేషన్ షాపుల ద్వారా కూడా సరఫరా చేసేవారు.
స్టవ్‌లో కిరోసిన్ నింపి మంట వెలిగించి గ్యాస్ స్టవ్‌లాగే వంట చేస్తారు.
లాభాలు: కిరోసిన్ సులభంగా లభిస్తుంది. మంట బలంగా ఉంటుంది.
లోపాలు: పొగ ఇబ్బందిపెడుతుంది. కిరోసిన్ మండే వాసన అసౌకర్యంగా ఉంటుంది. పాత్రలపై మసి పేరుకుంటుంది. శుభ్రం చేయడానికి కష్టపడాలి.
ఎక్కడ దొరుకుతుంది: హార్డ్‌వేర్ షాపులు, గ్రామీణ మార్కెట్లు.
ఫొటో సోర్స్, Getty Images
8. బయోగ్యాస్ స్టవ్
బయోగ్యాస్ అంటే పశువుల పేడ, కిచెన్ వ్యర్థాలు వంటి జీవ పదార్థాలను కుళ్ళించి, దానితో ఉత్పత్తి చేసే మీథేన్ గ్యాస్. వ్యర్థాలను బయోగ్యాస్ ప్లాంట్‌లో వేసి ఉత్పత్తి అయిన గ్యాస్‌ను స్టవ్‌కు పంపిస్తారు.
లాభాలు: చౌకైన ఇంధనం, పర్యావరణానికి మేలు, వ్యర్థాలను ఎరువుగా కూడా వాడొచ్చు.
లోపాలు: స్థలం కావాలి. రోజూ వ్యర్థ పదార్థాలు అవసరం.
ఎక్కడ దొరుకుతుంది: పునరుత్పాదక శక్తి సంస్థలు, గ్రామీణ అభివృద్ధి సంస్థలు.
9. బ్యూటేన్ కార్ట్రిడ్జ్ స్టవ్
చిన్న గ్యాస్ కార్ట్రిడ్జ్‌లతో పనిచేసే పోర్టబుల్ స్టవ్ ఇది. కార్ట్రిడ్జ్‌ను స్టవ్‌లో పెట్టి వెలిగిస్తే గ్యాస్ మంటతో వంట చేయవచ్చు.
లాభాలు: దీనిని సాధారణంగా పర్యటనలకు వెళ్లేటపుడు వెంట తీసుకెళుతుంటారు. గ్యాస్ స్టవ్‌లాగే వంట చేయవచ్చు.
లోపాలు: బ్యూటేన్ కార్ట్రిడ్జ్‌ల ఖరీదు కొంచెం ఎక్కువగా ఉంటాయి.
ఎక్కడ దొరుకుతుంది: క్యాంపింగ్ సామగ్రి దుకాణాలు, ఆన్‌లైన్ మార్కెట్లు.
ఫొటో సోర్స్, Getty Images
10. బయోమాస్ పెల్లెట్ స్టవ్
వ్యవసాయ వ్యర్థాలతో తయారు చేసిన చిన్న పెల్లెట్లను ఇంధనంగా ఉపయోగించే స్టవ్ ఇది. పెల్లెట్లను స్టవ్‌లో వేసి వెలిగించగా వచ్చే మంటతో వంట చేసుకోవచ్చు.
లాభాలు: సంప్రదాయ కట్టెల పొయ్యిల కంటే పొగ తక్కువగా వస్తుంది.
లోపాలు: పెల్లెట్లు అన్ని ప్రాంతాల్లో సులభంగా దొరకకపోవచ్చు.
ఎక్కడ దొరుకుతుంది: వ్యవసాయ పరికరాల సరఫరాదారులు, పునరుత్పాదక శక్తి సంస్థలు.
11. రాకెట్ స్టవ్
ఇది చిన్న కట్టెలతో ఎక్కువ వేడి ఇవ్వగలిగేలా రూపొందించిన ప్రత్యేక స్టవ్. కట్టెలను స్టవ్‌లో వేసి వెలిగించి, ఆ మంటతో వంట చేస్తారు.
లాభాలు: తక్కువ ఇంధనంతో ఎక్కువ వేడి. కట్టెలు సులభంగా దొరుకుతాయి
లోపాలు: సాధారణంగా ఇంటి బయట వంటకు ఉపయోగిస్తారు.
ఎక్కడ దొరుకుతుంది: రూరల్ టెక్నాలజీ సంస్థలు లేదా DIY విధానంలో తయారు చేసుకోవచ్చు.
ఫొటో సోర్స్, Getty Images
12. బొగ్గుల స్టవ్
బొగ్గు లేదా చార్కోల్‌ను కాల్చి వంట చేసే సంప్రదాయ పద్ధతి. స్టవ్‌లో బొగ్గు వేసి వెలిగించి పాత్రను పైభాగంలో ఉంచి వంట చేస్తారు.
లాభాలు: బొగ్గు సులభంగా దొరుకుతుంది. వేడి స్థిరంగా ఉంటుంది.
లోపాలు: పొగ ఇబ్బందికరంగా ఉంటుంది. ఆనారోగ్యాన్ని కలిగించే కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి అవుతుంది.
ఎక్కడ దొరుకుతుంది: గ్రామీణ మార్కెట్లు, హార్డ్‌వేర్ దుకాణాలు
ఉత్తమ పరిష్కారం… హైబ్రిడ్ కిచెన్
పట్టణ ప్రాంతాల్లో సాధారణంగా విద్యుత్ ఆధారిత పరికరాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్, మైక్రోవేవ్ వంటి పరికరాలతో ఎక్కువ వంట పనులు చేయవచ్చు.
గ్రామాల్లో స్థానికంగా లభించే ఇంధనాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. బయోగ్యాస్, పెల్లెట్ స్టవ్‌లు, రాకెట్ స్టవ్‌లు వంటి పరికరాలను వినియోగించడం సులభం.
ప్రస్తుత పరిస్థితుల్లో హైబ్రిడ్ కిచెన్‌ను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమ పరిష్కారం. అంటే వివిధ రకాల వంట పరికరాలను కలిపి వాడడం ద్వారా.. ఏదైనా ఒక ఇంధనం లేకపోయినా వంటకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు.
ఉదాహరణకు గ్యాస్ స్టవ్‌తో పాటు ఇండక్షన్ స్టవ్ లేదా ఎలక్ట్రిక్ కుక్కర్‌ను కలిపి ఉపయోగిస్తే ఒక ఇంధనం అందుబాటులో లేకపోయినా వంట ఆగదు. ఎల్‌పీజీ స్టవ్‌ను అట్లు, చపాతీలు, వేపుళ్లకు ఉపయోగించొచ్చు. కూరలు చేయడానికి ఇండక్షన్ కుక్‌టాప్ వాడొచ్చు. అన్నం, పప్పులు ఉడికించడానికి ఎలక్ట్రిక్ కుక్కర్లు వాడొచ్చు. దీనివల్ల ఇంధనాన్ని, సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు.
అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే, బయోగ్యాస్ లేదా బయోమాస్ (పెల్లెట్లు, కట్టెలు వంటివి) స్టవ్‌లను బ్యాకప్ పెట్టుకోవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



