Home LATEST NEWS telugu తాజా వార్తలు కన్నడం తమిళం నుంచి పుట్టిందా, కమల్ హాసన్ వ్యాఖ్యల అంతరార్థం ఏంటి?

కన్నడం తమిళం నుంచి పుట్టిందా, కమల్ హాసన్ వ్యాఖ్యల అంతరార్థం ఏంటి?

9
0

SOURCE :- BBC NEWS

కర్ణాటక, తమిళనాడు, కమల్ హాసన్ థగ్ లైఫ్

ఫొటో సోర్స్, Getty Images

  • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 4 జూన్ 2025

కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే, ఏ భాష…ఏ భాష నుంచి వచ్చిందో చెప్పడం కష్టమని భాషావేత్తలు అభిప్రాయపడుతున్నారు.

కమల్ హాసన్ హీరోగా రూపొందిన ‘థగ్ లైఫ్’ సినిమా ఆడియో విడుదల చెన్నైలో జరిగింది. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

“రాజ్‌కుమార్ కుటుంబం నా కుటుంబం లాంటిది. అందుకే ఆయన ఇక్కడికి వచ్చారు. అందుకే నా ప్రసంగం ప్రారంభించినప్పుడు, ‘ఉయిరే ఉరవే తమిళే’ అని ప్రారంభించాను. కన్నడ తమిళం నుంచి పుట్టింది. మీరు కూడా దానితో ఏకీభవిస్తారు” అని శివరాజ్‌కుమార్ గురించి మాట్లాడుతూ కమల్ హాసన్ అన్నారు. కమల్ మాటలకు శివరాజ్‌కుమార్ చిన్నగా నవ్వారు.

అయితే, కన్నడ భాష పుట్టుకపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్య కర్ణాటకలో తీవ్ర అలజడి సృష్టించింది. కర్ణాటక ముఖ్యమంత్రి నుంచి కన్నడ సంస్థల వరకు దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమైంది. అయినా, తన మాటలు వెనక్కి తీసుకోబోనని కమల్ అన్నారు.

ఈ వివాదం వల్ల ‘థగ్ లైఫ్’ జూన్ 5న కర్ణాటకలో విడుదల కావడం లేదు.

ద్రావిడ భాషలు తమిళం నుంచి పుట్టుకొచ్చాయన్న వాదన కొత్తది కాదు. చాలా కాలం నుంచి తమిళ జాతీయవాదులు ఈ ఆలోచనను ముందుకు తెస్తున్నారు. అయితే, ద్రావిడ భాషా కుటుంబంలోని ఇతర భాషలవాళ్లు దీనిని ఒప్పుకోవడం లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
కర్ణాటక, తమిళనాడు, కమల్ హాసన్ థగ్ లైఫ్

ఫొటో సోర్స్, Getty Images

ద్రావిడ భాషలకు తమిళం మాతృభాషా లేక సోదర భాషా?

ద్రావిడ భాషల సమగ్ర తులనాత్మక అధ్యయనాన్ని చేపట్టిన మొదటి వ్యక్తి 19వ శతాబ్దపు భాషావేత్త రాబర్ట్ కాల్డ్‌వెల్.

ఆయన రాసిన ‘ఎ కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ది ద్రవిడియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఫ్యామిలీ ఆఫ్ లాంగ్వేజెస్’ అనే పుస్తకం ద్రావిడ భాషా కుటుంబలోని భాషలను క్రమపద్ధతిలో పోల్చి కొన్నివిషయాలు తెలియజేసింది.

“తమిళంతో సహా ద్రావిడ భాషలు ఇండో-ఆర్యన్ భాషల నుంచి ఉద్భవించలేదు. అవి ద్రావిడ అనే ప్రత్యేక భాషా కుటుంబానికి చెందినవి” అని కాల్డ్‌వెల్ ప్రతిపాదించారు.

ద్రావిడ భాషలు ప్రోటో-ద్రవిడియన్ అనే భాష నుంచి పుట్టాయని, తమిళానికి ఈ ప్రోటో-ద్రవిడియన్ భాషతో మరింత దగ్గరి సంబంధం ఉందని కాల్డ్‌వెల్ గుర్తించారు.

కర్ణాటక, తమిళనాడు, కమల్ హాసన్ థగ్ లైఫ్

ఫొటో సోర్స్, Getty Images

అన్ని భాషలకూ తమిళం మూలమనే వాదన

అయితే, 20వ శతాబ్దం మధ్యలో దేవానియా భావనార్ వంటి వ్యక్తులు తమిళం ద్రావిడ భాషలకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని అన్ని భాషలకు మాతృభాష అనే వాదనను ముందుకు తెచ్చారు. అప్పటి నుంచి కొన్ని పార్టీలు ఈ వాదనను నిరంతరం ముందుకు తెస్తున్నాయి. అయితే, భాషా పరిశోధకులు మాత్రం దీనిపై ఆచితూచి మాట్లాడుతున్నారు.

ద్రావిడ భాషలలో తమిళం అతి పురాతనమైనదని, దానికి ప్రత్యేకమైన సాహిత్యం ఉందని వారు అంగీకరిస్తున్నప్పటికీ, ఒకభాష నుంచి మరొకటి ఉద్భవించిందన్నవాదనను వారు అంగీకరించరు.

“పురాతన దక్షిణ ద్రావిడ భాషలు క్రీస్తుపూర్వం 8 నుంచి 6 వ శతాబ్దాల మధ్య అటూఇటూ మారడం మొదలయింది ” అని చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన భారత సంతతి భాషావేత్త కమిల్ స్లాపిల్, ద్రావిడ భాషల మూలాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు.

క్రీస్తుపూర్వం 4, 3 శతాబ్దాల మధ్య తమిళం సాహిత్య భాషగా స్థిరపడటం ప్రారంభించిందని ద్రావిడ భాషల చరిత్రకారులు అంగీకరిస్తున్నారు.

“తమిళం, కన్నడ వేర్వేరు భాషలుగా మారే చివరి దశలో, ప్రాచీన తమిళ సాహిత్యం ప్రారంభ దశల్లో, వ్యాకరణవేత్తలు పద్య రూపాన్ని తయారుచేయడంపై దృష్టి సారించారు” అని కమిల్ తన పుస్తకం ‘ది స్మైల్ ఆఫ్ మురుగన్‌’ లో పేర్కొన్నారు.

కర్ణాటక, తమిళనాడు, కమల్ హాసన్, థగ్ లైఫ్

ఫొటో సోర్స్, Getty Images

‘తమిళంతో కన్నడకు దగ్గరి పోలిక’

ఆయన పుస్తకంలో “తమిళం, కన్నడ వేర్వేరు భాషలుగా రూపొందే ప్రక్రియలో చివరి దశలో ఉన్నాయి’ అనే పదబంధం మాత్రమే కన్నడ తమిళం నుంచి ఉద్భవించిందన్న భావనను సూచిస్తుంది. తమిళం కాకుండా, తెలుగు, మలయాళం, కన్నడ వంటి ఇతర ముఖ్యమైన ద్రావిడ భాషల తొలినాటి సాహిత్యాలు వేరే భాషలోని సాహిత్యానికి కాపీలు లేదా వాటి నమూనాలో రూపొందాయని ఆయన అన్నారు.

ఆర్. నరసింహాచార్య రాసిన “హిస్టరీ ఆఫ్ కన్నడ లాంగ్వేజ్” పుస్తకంలో కన్నడ భాష మూలం గురించి ఏమీ ప్రస్తావించలేదు. అయితే, కన్నడ భాష తమిళంతో దగ్గరి సంబంధం కలిగి ఉందని మాత్రం అందులో ఉంటుంది.

“కన్నడానికి తమిళంతో దగ్గరి సంబంధం ఉంది. వ్యాకరణపరంగా, రెండు భాషల మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. తెలుగుకు, కన్నడకు మధ్య అంత పోలికలుండవు” అని ఆర్. నరసింహాచార్య చెప్పారు.

ఇతర ద్రావిడ భాషలు ప్రోటో-ద్రవిడియన్ లాంగ్వేజ్ నుంచి పుట్టాయన్న వాదన ఉందని, తమిళం ఆ ప్రోటో-ద్రవిడ భాషకు దగ్గరగా ఉన్న భాష అని నేషనల్ ఫోక్లోర్ సపోర్ట్ సెంటర్ డైరెక్టర్ ఎం.డి. ముత్తు కుమారసామి అన్నారు.

కర్ణాటక, తమిళనాడు, కమల్ హాసన్, థగ్ లైఫ్

ఫొటో సోర్స్, NimmaShivanna/X

ద్రావిడ భాషల మూలం ఏదంటే…

“కంపారిజన్ ఆఫ్ ది ద్రవిడియన్ లాంగ్వేజెస్” అనే పుస్తకాన్ని రాసిన రాబర్ట్ కాల్డ్‌వెల్ ఇతర భాషలు తమిళం నుంచి ఉద్భవించాయని వాదించలేదు. దానికి బదులుగా ఆయన ప్రోటో-ద్రవిడియన్ భాష అనే భావనను ప్రతిపాదించారు. ఆ ప్రోటో-ద్రవిడియన్ భాషకు తమిళం దగ్గరగా ఉన్న భాష అని ఆయన అన్నారు.

“అన్ని ద్రావిడ భాషలను సోదర భాషలుగా ఆయన అభివర్ణించారు. ఆయన తర్వాత వచ్చిన భాషా శాస్త్రవేత్తలు ఈ ప్రోటో-ద్రవిడ భాషలను ఉత్తర ప్రోటో-ద్రవిడ, దక్షిణ ప్రోటో-ద్రవిడతో సహా అనేక రకాలుగా విభజించారు” అని ఎం.డి. ముత్తుకుమారసామి వివరించారు.

“ఒక ద్రావిడ మూల నిఘంటువు సంకలనం చేశారు. ఈ మూల నిఘంటువులోని చాలా పదాలు తమిళంలో ఉన్నాయి. అయితే గద్యం కన్నడలో 10వ శతాబ్దంలోనే ప్రారంభమయింది” అని ఆయన చెప్పారు.

“ఇప్పుడు తలెత్తే ప్రశ్న ఏంటంటే కన్నడ, తమిళ భాషల మధ్య సంబంధం ఏమిటన్నది. అది సోదర భాషని అందరూ అంగీకరిస్తారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సోదర భాష తల్లి భాషలాగానే సీనియర్” అని ఆయన అన్నారు.

కర్ణాటక, తమిళనాడు, కమల్ హాసన్ థగ్ లైఫ్

ఫొటో సోర్స్, Getty Images

‘ఏదీ తల్లి భాష కాదు’

తమిళం నుంచి ఇతర ద్రావిడ భాషలు ఉద్భవించాయని చెప్పడం సరైనది కాదని రచయిత, ప్రొఫెసర్ పెరుమాళ్ మురుగన్ అన్నారు.

“మిగతా భాషలన్నీ అసలు ద్రావిడ భాష నుంచి శాఖలుగా విడిపోయి ఉండొచ్చనే భాషావేత్త అభిప్రాయాన్ని నేను కూడా అంగీకరిస్తున్నాను. అసలు ద్రావిడ భాష ఎక్కడ అని వారు అడుగుతారు. మీరు ఒక రాయిని పగలగొడితే, అది అనేక ముక్కలుగా విరిగిపోతుంది. అసలు రాయి ఎక్కడ అని మీరు అడగలేరు” అని దీనిపై రాసిన ఓ వ్యాసంలో పెరుమాళ్ మురుగన్ అభిప్రాయపడ్డారు.

“భాష విషయంలో కూడా అంతే. ఇతర ద్రావిడ భాషల్లో అసలు ద్రావిడ భాషలోని కొన్ని అంశాలున్నాయి. అవి తమిళంలో లేవు. కాబట్టి, వాటిని సోదర భాషలు అని పిలవడం కరెక్ట్. ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణంలో, ఈ ‘తల్లి-బిడ్డ సంబంధం’ గురించి నొక్కి చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. మీ భాష మా భాష నుంచి పుట్టిందని ఇతరులకు చెప్పడం ఒక విధంగా ఆధిపత్య భావనను కనబరుస్తుంది” అని ఆయన విశ్లేషించారు.

కర్ణాటక, తమిళనాడు, కమల్ హాసన్ థగ్ లైఫ్

‘కన్నడ, తమిళం రెండింటి మూలం అదే’

తమిళనాడులోని చాలా మంది భాషావేత్తలు ఈ వివాదం నుంచి దూరంగా ఉన్నారు. ఊహించినట్టుగానే, కన్నడ భాషావేత్తలు ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

“కన్నడం తమిళం నుంచి ఉద్భవించిందనేది పూర్తిగా అపోహ. తమిళం, కన్నడ సోదర భాషలు. పాత భాష నుంచి ఉద్భవించిన భాషలు. కన్నడ మూల-ద్రావిడ భాష నుండి ఉద్భవించింది..తమిళం నుంచి కాదు” అని పెరుమాల్ మురుగన్ చెప్పారు.

ఎందుకంటే ఈ రెండు భాషల్లోనూ ప్రోటో-ద్రవిడ భాషలోని పదాలు ఒకే విధంగా ఉంటాయి. “ఉదాహరణకు, కన్నడలో, చెవిని సూచించడానికి ‘కివి’ అని అంటాము. తమిళంలో ‘షేవి’ అని అంటారు. ఈ రెండు పదాలు ఒకే ప్రోటో-ద్రవిడ భాష నుంచి ఉద్భవించిన రెండు వేర్వేరు శబ్దాలు. కాబట్టి, తమిళం నుంచి కన్నడ పుట్టిందని చెప్పడం పూర్తిగా తప్పు” అని కన్నడ భాషాభివృద్ధి మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్.జి. సిద్ధరామయ్య అన్నారు.

ద్రావిడ భాషలను దక్షిణ ద్రావిడ భాషలు, దక్షిణ మధ్య ద్రావిడ భాషలు, మధ్య ద్రావిడ భాషలు, ఉత్తర ద్రావిడ భాషలుగా విభజించారు.

దక్షిణ ద్రావిడ భాషలలో తమిళం, కన్నడ, మలయాళం, ఇరుళ, కొడవ, తోడ, కోట, పటాక, కొరక, తుళు ఉన్నాయి.

దక్షిణ మధ్య ద్రావిడ భాషా సమూహంలో తెలుగు, గోండి, కుయి, కువి, కోయ వంటి భాషలున్నాయి. మధ్య ద్రావిడ భాషా సమూహంలో కొలామి, ధ్రువ, ఒల్లారి, నైకి వంటివి ఉన్నాయి. ఉత్తర ద్రావిడ భాషా సమూహంలో కురుక్, మాల్డో, బ్రాహుయి వంటి భాషలున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS