SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Eastern Naval Command
భారత నౌకాదళంలో మరో అత్యాధునిక అస్త్రం చేరనుంది. స్టెల్త్ యుద్ధనౌక తారాగిరి ఏప్రిల్ 3న అధికారికంగా నౌకా దళంలోకి ప్రవేశిస్తుంది.
స్వదేశీ సాంకేతికత, తక్కువ రాడార్ గుర్తింపు, బహుముఖ యుద్ధ సామర్థ్యం – ఈ మూడు లక్షణాలు తారాగిరిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.
అధునాతన టెక్నాలజీ నీలగిరి శ్రేణి స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ తారాగిరి అధికారికంగా నౌకాదళ సేవల్లో చేరేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 3న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖలో కమిషనింగ్ చేస్తారు.
భారత్ సంపూర్ణ స్వదేశీ నౌకాదళ శక్తిగా ఎదగాలన్న ప్రయాణంలో ఇది బలమైన ముందడుగుగా తూర్పు నౌకదళం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ యుద్ధ నౌకకు సంబంధించి తూర్పు నౌకదళం విడుదల చేసిన వివరాలు ఏంటి?
ప్రాజెక్ట్ 17ఏ క్లాస్‌లో నాలుగో యుద్ధ నౌక తారాగిరి. దాదాపు 6,670 టన్నుల బరువుతో ‘మేకిన్ ఇండియా’ ఆత్మను, స్వదేశీ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని ప్రతిబింబించే ప్రతిష్ఠాత్మక నిర్మాణమిది. మజగావ్ డాక్ షిప్‌బిల్డింగ్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించిన మూడో నౌక ఇది.
కంబైన్డ్ డీజిల్ లేదా గ్యాస్ (సీవోడీవోజీ) ప్లాంట్‌తో నడిచే తారాగిరి.. అధిక వేగం, అత్యధిక కాలం (హై-స్పీడ్, హై-ఎండ్యూరెన్స్) ప్రయాణించే శక్తితో నౌకా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. విభిన్న సముద్ర కార్యకలాపాలకు అనువుగా దీనిని రూపొందించారు. ప్రపంచ స్థాయి ఆయుధ వ్యవస్థలను ఈ యుద్ధ నౌకలో సమీకరించారు.
ఈ నౌకలో 75 శాతానికిపైగా స్వదేశీ పరికరాల వినియోగంలో 200కు పైగా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) పాలుపంచుకున్నాయని, వేలాది మందికి ఉపాధి లభించిందని రక్షణ రంగ అధికారులు తెలిపారు.

ఇందులో సూపర్‌సోనిక్ వేగం కలిగిన బ్రహ్మోస్ వంటి ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే క్షిపణులు, మధ్యస్థ స్థాయి ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే క్షిపణులు (ఎంఆర్‌ఎ్‌సఏఎం), ఒకేసారి పలు లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయగల మల్టీ ఫంక్షన్ రాడార్‌లు కలిగి ఉండటం దీని ప్రత్యేకతలు.
యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ఏఎస్‌డబ్ల్యూ) వ్యవస్థ ఉంది.
ఇవన్నీ అత్యాధునిక కంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా సమన్వయపరిచారు. దీనివల్ల సిబ్బంది అత్యంత కచ్చితత్వంతో శత్రు నౌకల కదలికలకు, ముప్పులకు ప్రతిస్పందించగలరు.
తారాగిరిలో యుద్ధ సమయంలో అవసరమైన ప్రధాన వ్యవస్థలన్నింటినీ ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థల వల్ల గగనతలం, సముద్ర ఉపరితలం, సముద్ర గర్భం… ఈ మూడు స్థాయిల్లోనూ ఒకేసారి ప్రతిస్పందించగలదు.

తారాగిరి ఎందుకు ప్రత్యేకం?
ఐఎన్ఎస్ తారాగిరి ప్రధాన ప్రత్యేకత దాని స్టెల్త్ డిజైనే. అంటే, శత్రు రాడార్‌కు ఇది సాధారణ యుద్ధనౌక కంటే తక్కువగా కనిపిస్తుంది. శత్రు రాడార్ తరంగాలు నౌకను తాకి తిరిగి బలంగా వెనక్కి వెళ్లకుండా, పక్కకు చెదిరిపోయేలా రూపకల్పన చేశారు. అందువల్ల యుద్ధ సమయంలో శత్రువుకు ముందుగా కనిపించకుండా దాడి చేసే సామర్థ్యం దీనికి లభిస్తుంది.
ఈ నౌక పేరు పశ్చిమ కనుమల్లోని తారాగిరి నుంచి తీసుకున్నారు. భారత నౌకాదళంలో పర్వతాలు, నదులు, చారిత్రక ప్రదేశాల పేర్లు యుద్ధనౌకలకు పెట్టడం సంప్రదాయం.
తారాగిరి యుద్ధ నౌకలో శత్రు జలాంతర్గాములపైకి దాడి చేయగల యుద్ధ సామగ్రి ఉంటాయి. శత్రు దాడులను సిబ్బంది క్షణాల్లో తిప్పికొట్టేలా అత్యాధునిక కంబాట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా అన్ని ఆయుధ వ్యవస్థలను సమన్వయం చేశారు.
మునుపటి డిజైన్ల కన్నా ఎంతో ఆధునికంగా రూపొందించిన ఈ యుద్ధనౌక.. శత్రు రాడార్లకు చిక్కకుండా ప్రత్యర్థులపై దాడి చేయగలదు. భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ కార్యక్రమానికి, స్వదేశీ నౌకాశ్రయాల అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలకు ఇది ప్రతిరూపమని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది.
“భారత నౌకాదళం ప్రస్తుతం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన ప్రభావాన్ని పెంచుకుంటున్న సమయంలో, తారాగిరి వంటి యుద్ధనౌకల చేరికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సముద్ర భద్రతలో స్వదేశీ సామర్థ్యాన్ని మరింత బలపరిచే అడుగుగా దీనిని భావించవచ్చు” అని భారత నౌకదళంలోని సబ్ మెరైన్స్‌లో పనిచేసి రిటైరైన కృష్ణమూర్తి బీబీసీతో అన్నారు.

‘ఇది యుద్ధనౌక మాత్రమే కాదు.. ’
కేవలం యుద్ధ నౌకగానే కాకుండా, ఆధునిక దౌత్య అవసరాలైన దేశాల మధ్య సంబంధాలు, సముద్ర భద్రత, సంయుక్త విన్యాసాలు, శక్తి ప్రదర్శనలతో పాటు అత్యవసర మానవతా సహాయక చర్యలకు కూడా ఉపయోగించేలా తారాగిరిని రూపొందించారు.
తీవ్రమైన యుద్ధ చర్యల నుంచి మానవతా సహాయం వరకు విభిన్న బాధ్యతలకు ఇది అనువుగా ఉంటుందని ఐఎన్ఎస్ తిర్, ఐఎన్ఎస్ దక్షక్, ఐఎన్ఎస్ రాజ్‌పుత్ యుద్ధ నౌకల్లోని కమ్యూనికేషన్ విభాగంలో సిగ్నల్ మ్యాన్‌గా పని చేసి రిటైరైన పి.సుందరరావు బీబీసీతో అన్నారు.
“తారాగిరి భారత నౌకాదళాన్ని మరింత శక్తివంతంగా మార్చడమే కాకుండా, దేశ సముద్ర సరిహద్దుల రక్షణలో బలంగా నిలవనుంది. ఏ తీరప్రాంత దేశానికైనా రక్షణ రంగంలో యుద్ధ నౌకలే ప్రధాన బలం” అని సుందరరావు చెప్పారు.
“భారతీయులే రూపకల్పన చేసి, భారతీయులే నిర్మించి, భారతీయులే నడిపే నౌకలతో భారత నౌకాదళం విశ్వసనీయంగా, ఆత్మనిర్భర్ శక్తిగా ఎదుగుతోంది. అభివృద్ధి చెందిన, సమృద్ధమైన భారత సముద్ర సరిహద్దులను కాపాడే శక్తిగా తారాగిరి సిద్ధమైంది. పెరుగుతున్న భారత సముద్రాధిపత్యానికి ప్రతీకగా, నీలి సరిహద్దుల ఇనుప కవచంగా ఇది ఉంటుంది” అని భారత నౌకదళం పేర్కొంది.

శత్రువులకు చిక్కని 7 యుద్ధ నౌకలు..
శత్రుదేశ రాడార్లకు చిక్కని సామర్థ్యం కలిగిన ఏడు యుద్ధనౌకలను తయారు చేయాలని భారత నౌకాదళం ‘ప్రాజెక్ట్ 17ఏ’ ప్రారంభించింది. ప్రాజెక్ట్ 17ఏ అనేది పాత శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్ (Shivalik-class frigate) తరగతికి ఆధునిక వెర్షన్. శివాలిక్ స్టెల్త్ ఫ్రిగేట్ అంటే శత్రువుకు సులభంగా కనిపించకుండా, అనేక రకాల యుద్ధ చర్యలు చేయగల ఆధునిక యుద్ధనౌక.
ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 7 స్టెల్త్ ఫ్రిగేట్‌లు నిర్మిస్తున్నారు.
నీలగిరి శ్రేణిలో అత్యంత అధునాతన 7 గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్లను నిర్మించే ఒక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఇది.
ఐఎన్ఎస్ నీలగిరి, హిమగిరి, ఉదయగిరి, దునాగిరి, తారాగిరి, వింధ్యాగిరి, మహేంద్రగిరి ఉన్నాయి. నీలగిరి, ఉదయగిరి, తారాగిరి, మహేంద్రగిరి యుద్ధ నౌకలను ఎండీఎల్ తయారు చేస్తోంది. హిమగిరి, దునాగిరి, వింధ్యాగిరిలను కోల్‌కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్‌ఎస్‌ఈ) నిర్మిస్తోంది.
వీటి కోసం 75 శాతం భారతీయ పరికరాలు, మెటీరియల్‌నే ఉపయోగిస్తున్నారు. ఈ నౌకలను 2019 నుంచి 2023 మధ్య ప్రారంభించారు. 2024-2027 మధ్య పూర్తి స్థాయిలో నౌకదళంలోకి ప్రవేశించనున్నాయి. అందులో భాగంగా ఈ ఏప్రిల్‌లో ఐఎన్ఎస్ తారాగిరి చేరనుంది.
ఇక గతేడాది ఆగస్టులోనే ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ హిమగిరి అనే రెండు యుద్ధ నౌకలను విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో నౌకదళంలో చేర్చారు. ఐఎన్ఎస్ ఉదయగిరి భారత నౌకదళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన 100వ నౌక.

స్టెల్త్ ఫ్రిగేట్ తారాగిరి అంటే…
ఫ్రిగేట్ యుద్ధ నౌకలు మూడు స్థాయిల్లో పని చేయగలవు.
- సముద్రంపై శత్రు నౌకలపై దాడి
- గగనతలంలో క్షిపణులు లేదా యుద్ధవిమానాలను ఎదుర్కోవడం
- నీటి అడుగున జలాంతర్గాములను గుర్తించి ప్రతిదాడి చేయడం
అంటే ఒకే నౌకలో మల్టీ రోల్ కంబాట్ కేపబిలిటీ (multi-role combat capability) ఉంటుంది.
శత్రువుకి సులభంగా కనిపించకుండా.. అంటే రాడార్, ఇన్‌ఫ్రారెడ్, శబ్దం ద్వారా గుర్తించడం కష్టంగా ఉండేలా తారాగిరిని డిజైన్ చేశారు. ఫ్రిగేట్ అంటే మధ్యస్థ పరిమాణంలో ఉండే యుద్ధనౌక.

ఇది సముద్రంలో గస్తీ కాయడం, శత్రు నౌకలను ఎదుర్కోవడం, జలాంతర్గాములను గుర్తించడం, గగనతలదాడుల నుంచి రక్షణ కల్పించడం, అంటే ఒకే నౌకలో అనేక పనులు చేసే ఆల్ రౌండర్ యుద్ధనౌక.
యుద్ధ నౌకను గుర్తించేందుకు శత్రు దేశాలు పంపే రాడార్ తరంగాలు నౌకను తాకి తిరిగి వెళ్లకుండా ప్రత్యేక మెటీరియల్ వాడటంతో పాటు అందుకు అనుకూలంగా ఇంజిన్ వేడి, శబ్దం తగ్గించి.. నౌక ఆకారాన్ని కోణాలుగా డిజైన్ చేస్తారు. అంటే, సముద్రంలో పెద్ద నౌకే అయినా… శత్రువుకు చిన్నగా కనిపించే విధంగా దీని డిజైన్ ఉంటుంది.
“స్టెల్త్ అంటే శత్రు రాడార్‌కు తక్కువగా కనిపించడం. స్టెల్త్ ఫ్రిగేట్ అంటే కనిపించకుండా, అవసరమైతే క్షిపణులతో దాడి చేసే తెలివైన యుద్ధ నౌక” అని పి. సుందరరావు బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



