Home జాతీయ national telgu ఏపీ: ప్రసూతి సెలవుల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత, ఎవరెవరికి వర్తిస్తుందంటే..

ఏపీ: ప్రసూతి సెలవుల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత, ఎవరెవరికి వర్తిస్తుందంటే..

5
0

SOURCE :- BBC NEWS

మహిళలు, మహిళల ఆరోగ్యం, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రభుత్వ మహిళా ఉద్యోగులందరికీ ప్రసూతి సెలవులను పెంచుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులను వినియోగించుకునేందుకు ఇప్పటివరకు ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసింది.

పదిహేనేళ్ల కిందట అప్పటి ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 120 నుంచి 180 రోజులకి పెంచుతూ ఉత్తర్వులిచ్చింది. అయితే, ఇద్దరు పిల్లల వరకే ఇది వర్తిస్తుందని నిబంధనల్లో పేర్కొంది. దీంతో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న ఉద్యోగులకు 12 వారాలే ప్రసూతి సెలవులు ఇస్తూ వచ్చారు.

తాజాగా, ఏపీ ప్రభుత్వం ఆ నిబంధనను ఎత్తివేసింది. ఎంతమంది పిల్లలను కన్నా 180 రోజుల ప్రసూతి సెలవులను పొందవచ్చని పేర్కొంది.

ఈ మేరకు మే 5న ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌కుమార్‌ పేరిట జీవో ఎంఎస్‌ నంబర్‌ 152 విడుదలైంది.

ఈ నిర్ణయంతో పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా, ప్రతీ మహిళా ఉద్యోగికి 180 రోజుల ప్రసూతి సెలవులు వర్తించనున్నాయి.

అయితే, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు కూడా ఈ ప్రసూతి సెలవులు వర్తించేలా చర్యలు చేపట్టాలని, లేదంటే చట్టం రూపొందించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ప్రసూతి సెలవులు

కొత్తగా చేరిన వారికి కూడా..

కొత్తగా చేరిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రొబేషన్‌ పీరియడ్‌లో కూడా మాతృత్వ సెలవులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని గెజిట్‌ రిలీజ్‌ చేసింది.

‘ఇద్దరు పిల్లల వరకే ప్రసూతి సెలవుల నిబంధనను తొలగించాం, ఇది ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు శుభవార్త’ అని ఏపీ గిరిజన మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బీబీసీతో చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నా 26 వారాల ప్రసూతి సెలవులను వర్తింపజేస్తామని ఈ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. కుటుంబ వృద్ధిని ప్రోత్సహించడంతో పాటు జనాభా సమతుల్యతను పరిష్కరించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

కాగా, ప్రసూతి సెలవుల పెంపుపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శైలజాకుమారి, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నాగసాయి బీబీసీ వద్ద హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి సంధ్యారాణి

ఫొటో సోర్స్, X/GSandhyarani_

రాష్ట్ర జనాభా పెరగాలని, ఆ మేరకు సంతానోత్పత్తిని పెంచాలని చంద్రబాబు పదేపదే పిలుపునిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏపీలో సంతానోత్పత్తి రేటును 1.5 శాతం నుంచి 2.1 శాతానికి పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఎక్కువమంది పిల్లలను కనే వారికి ప్రోత్సాహకాలు అమలు చేస్తామని సీఎం ప్రకటించారు.

అలాగే, ఒక కుటుంబంలో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు చదువుకుంటున్నా అందరికీ ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

అంతేకాకుండా, ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తూ ఇది వరకు చేసిన చట్టంలో మార్పులను తీసుకొచ్చింది ప్రభుత్వం.

ఉద్యోగులు

ఫొటో సోర్స్, Getty Images

‘మరి ప్రైవేట్ మహిళా ఉద్యోగుల మాటేమిటి?’

ఇక ప్రైవేట్ మహిళా ఉద్యోగుల విషయానికి వస్తే.. ఈ జీవో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వరిస్తుంది. మరి, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల మాటేమిటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ది మెటర్నిటీ బెనిఫిట్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ 2017’ ప్రకారం.. ఉద్యోగాలు చేసే మహిళలకు రెండో సంతానం వరకు ప్రసూతి సెలవులు 26 వారాలు, మూడో సంతానం నుంచి 12 వారాలు తీసుకునేందుకు అర్హులు.

”ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఎంతమంది పిల్లలనే నిబంధన లేకుండా 26 వారాల పాటు సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం సంతోషకరం.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ప్రభుత్వంతోపాటు ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి కూడా వర్తిస్తాయి. కానీ, ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కేవలం సర్కారు ఉద్యోగులకు మాత్రమే వర్తింపజేస్తోంది.

మరి ఏపీలోని ప్రైవేటు సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల మాటేమిటి? వారికి కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలి, లేదంటే చట్టం రూపొందించాలి” అని ప్రగతి శీల మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి బీబీసీతో అన్నారు.

”మామూలుగానే కొన్ని ప్రైవేటు కంపెనీలు ప్రసూతి సెలవు ఇవ్వడం లేదు. ఆ సమయంలో ఆఫీస్‌కి రావొద్దని చెప్పి జీతాలివ్వడం లేదు. అలాంటి సమస్యలపై కూడా దృష్టి పెడితే అందరికీ మేలు జరుగుతుంది” అని లక్ష్మి అన్నారు.

జనాభా

సంతానోత్పత్తి రేటు 1.8 కంటే తక్కువైతే ఆ దేశ, ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపడంతో పాటు రాజకీయపరంగానూ నష్టం చేకూరుస్తుందని ముంబయిలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ (ఐఐపీఎస్‌)కి చెందిన ప్రొఫెసర్‌ గోలి శ్రీనివాస్‌ ఇటీవల బీబీసీతో అన్నారు.

జనాభా సంఖ్యను బట్టే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఉంటుందని, ఆ సంఖ్య తగ్గితే రాజకీయ బలం తగ్గిపోతుందన్నారు శ్రీనివాస్.

ఇదే విషయమై సీనియర్ జర్నలిస్ట్ దారా గోపీ బీబీసీతో మాట్లాడుతూ, “జనాభా పెరిగితే ఎంపీ సీట్లు పెరగడం వంటి పొలిటికల్‌ బెనిఫిట్స్‌ సరే.. మరి ప్రజలకు ఏం బెనిఫిట్స్‌ వస్తాయి, ఆర్థికంగా బలపడిన వాళ్లు ఎంతమంది పిల్లల్ని కన్నా చక్కగా చూసుకునే సామర్థ్యం వారికి ఉంటుంది.

కానీ, సామాన్య ప్రజలకు ఇద్దరికి మించి పిల్లలు ఉంటే వాళ్ల జీవన ప్రమాణాలు పడిపోతాయి. వీటన్నింటి గురించి కూడా పాలకులు ఆలోచించాలి” అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)