SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, ANI
కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి రాజీనామా చేయాలంటూ ఇటీవల ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
“ఎప్‌స్టీన్ ఫైల్స్”లో హర్దీప్ సింగ్ పేరుందని, దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆయనకు సంబంధాలున్నాయని ఆరోపించారు.
అమెరికా న్యాయ శాఖ ఇటీవల భారీ ఎత్తున ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేసింది.
హర్దీప్ సింగ్ పురి, జెఫ్రీ ఎప్‌స్టీన్ 2014, 2015 మధ్య అనేక ఈమెయిల్ సంభాషణలు జరిపినట్లు ఆ పత్రాలలో ఉంది.
ఎప్‌స్టీన్ నేర కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని హర్దీప్ సింగ్ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో, ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను విశ్లేషించిన బీబీసీ.. అందులో అభ్యంతరకరంగా ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించింది.
ఆ ఈమెయిల్స్‌లో రాసిన కొన్ని విషయాలను ఇక్కడ అందించేందుకు ప్రయత్నించాం, అవి వారి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో వెల్లడిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
‘ఏదైనా సలహా ఇస్తారా?’
రీడ్ హాఫ్‌మన్ ఒక అమెరికన్ ఇంటర్నెట్ ఎంటర్‌ప్రెన్యూర్, లింక్డ్ఇన్ సహ వ్యవస్థాపకుడు. హర్దీప్ సింగ్ పురికి జెఫ్రీ ఎప్‌స్టీన్ పంపిన ఒక ఈమెయిల్‌లో “… నేను టెర్జేతో మాట్లాడాను. రీడ్ హాఫ్‌మన్ భారత్ రావడానికి సిద్ధంగా ఉన్నారు” అని రాశారు.
ఎప్‌స్టీన్ పంపిన ఈమెయిల్‌కు ప్రతిస్పందనగా, హర్దీప్ సింగ్ “రీడ్ హాఫ్‌మన్‌కు సాదర స్వాగతం పలికేందుకు/అవసరమైన సాయం చేసేందుకు సంతోషిస్తాను” అని మెయిల్ చేశారు.
హర్దీప్ సింగ్ పురిని ఎప్‌స్టీన్ ఈమెయిల్‌లో రీడ్ హాఫ్‌మన్‌కు పరిచయం చేస్తూ, “రీడ్, హర్దీప్ భారత్‌లో మీ సహాయకులు” అని రాశారు.
ఈ ఈమెయిల్‌కు సెప్టెంబర్ 24న రీడ్ హాఫ్‌మన్ రిప్లై ఇస్తూ, “హర్దీప్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. జెఫ్రీకి మనుషులను ఎంచుకోవడంలో గొప్ప అభిరుచి ఉంది (నా గురించి కాదు)” అని రాశారు.
ఆ ఈమెయిల్‌కు సెప్టెంబర్ 25, 2014న హర్దీప్ సింగ్ రిప్లై ఇస్తూ “మనుషులను అంచనా వేయడంలో జెఫ్రీ సిద్ధహస్తులు. అందులో ఆయన చాతుర్యం (మనుషులను గుర్తించడం, అర్థం చేసుకునే సామర్థ్యం) ఇంకా బావుంటుంది అని రాశారు.
“మీరు రీడ్‌ను కలిశారా?” అని హర్దీప్ సింగ్ పురిని ఎప్‌స్టీన్ అడిగారు.
దీనికి అక్టోబర్ 4న, హర్దీప్ సింగ్ రిప్లై ఇస్తూ “నేను మధ్యాహ్నం ఓ మీటింగ్ కోసం ఎస్ఎఫ్ (శాన్ ఫ్రాన్సిస్కో)లో ఉన్నాను. మై ఫ్రెండ్, మీరు అన్నీ జరిగేలా చేస్తారు” అని రాశారు.
దీనికి అక్టోబర్ 4న ఎప్‌స్టీన్ జవాబు ఇస్తూ “సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధిత వ్యక్తులను, సోషల్ నెట్‌వర్కింగ్ గురువులను కలవడానికి ఆయన భారత్ వెళ్లడానికి మీరు ఏర్పాట్లు చేస్తారని ఆయనకు చెప్పండి” అని రాశారు.
ఫొటో సోర్స్, Getty Images
వీసా ఏర్పాట్లు
అక్టోబర్ 11, 2014:
హాఫ్‌మన్‌కు పంపిన ఒక ఈమెయిల్‌లో “హర్దీప్ మీకు ఉపయోగకరంగా అనిపించారా?” అని ఎప్‌స్టీన్ అడిగారు.
దీనికి 2014 అక్టోబర్ 12న, రీడ్ హాఫ్‌మన్ రిప్లై ఇస్తూ “కష్టసాధ్యం” అని తెలిపారు.
అక్టోబర్ 24, 2014:
హర్దీప్ సింగ్ పురికి ఎప్‌స్టీన్ పంపిన ఒక ఈమెయిల్‌లో “హర్దీప్, నాకు ఒక సహాయం కావాలి. భారతదేశంలో ఒక వివాహానికి హాజరు కావడానికి నా అసిస్టెంట్‌కు తక్షణమే వీసా అవసరం. దౌత్య కార్యాలయంలో ఆమె మాట్లాడటానికి ఎవరైనా ఉన్నారా?” అని తెలిపారు.
దీనికి ప్రతిస్పందనగా, హర్దీప్ సింగ్ అక్టోబర్ 24న రిటైర్డ్ రాయబారి ప్రమోద్ బజాజ్‌కు ఒక ఈమెయిల్‌లో “ప్రమోద్, మీరు దీన్ని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయగలిగితే నేను కృతజ్ఞుడై ఉంటాను. దరఖాస్తుదారు మిమ్మల్ని నేరుగా సంప్రదించాలని రిక్వెస్ట్ చేస్తాను”
“జెఫ్రీ, ఇప్పుడు నాతో పనిచేస్తున్న అంబాసిడర్ బజాజ్ దానిని ఏర్పాటు చేస్తారు”
“ప్రమోద్, న్యూయార్క్‌లో నివసిస్తున్న సంజీవ్‌ను మీరు ఏదైనా అడగాలనుకుంటే ఈ మెయిల్‌లో కాపీ చేశాను” అని తెలిపారు.
జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు ప్రమోద్ బజాజ్ అక్టోబర్ 24న ఒక ఈమెయిల్ పంపారు.
హర్దీప్ సింగ్‌కు ఎప్‌స్టీన్ పంపిన ఈమెయిల్‌ను ఇందులో ఉటంకిస్తూ, “మీ వీసా విషయంలో సహాయం చేయడానికి సంతోషంగా ఉన్నాం” అని పేర్కొన్నారు.
“ఇపుడు వీసా ప్రక్రియ ఆన్‌లైన్‌లో జరుగుతోంది. మీ ఉద్యోగిని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోమని చెప్పండి, ఆ తర్వాత, వీసా దరఖాస్తు హార్డ్ కాపీని అవుట్‌సోర్సింగ్ కంపెనీ కార్యాలయానికి సమర్పించాలి”
“ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మాకు తెలియజేయండి. తదుపరి ప్రక్రియలో మేం మీకు సహాయం చేస్తాం”
“మీ సహోద్యోగికి ఏదైనా అదనపు సమాచారం లేదా సహాయం అవసరమైతే, దయచేసి మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి” అని రాశారు.
ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images
డిజిటల్ ఇండియా
2014 డిసెంబర్ 24:
ఎప్‌స్టీన్‌కు హర్దీప్ సింగ్ పురి ఒక ఈమెయిల్ పంపారు. అందులో, ఆయన “ప్రత్యేక ద్వీపం గురించి ప్రస్తావించారు.
“మీరు మీ ‘ప్రత్యేక ద్వీపం’ నుంచి తిరిగి రాగానే నాకు తెలియజేయండి. మిమ్మల్ని కలిసి, మాట్లాడాలనుకుంటున్నాను. భారతదేశంపై మీ ఆసక్తిని రేకెత్తించే కొన్ని పుస్తకాలను కూడా ఇవ్వాలనుకుంటున్నా” అని రాశారు హర్దీప్ సింగ్.
అదే రోజు ఎప్‌స్టీన్ రిప్లై ఇస్తూ ” అద్భుతం! నేను రీడ్‌తో మాట్లాడాను” అని తెలిపారు.
హర్దీప్ సింగ్ కూడా జవాబిస్తూ “నిజానికి , ఇది టెలిపతి. మీరు తిరిగి వచ్చినప్పుడు నాకు తెలియజేయండి. ఆనందించండి – దానికి మీకు మరెవరి ప్రోత్సాహం అవసరం లేదు!” అని తెలిపారు.
డిజిటల్ ఇండియా ప్రస్తావన…
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 జూలై 1న ‘డిజిటల్ ఇండియా’ ప్రారంభించారు. కానీ, దానికి ఏడున్నర నెలల ముందు, 2014 నవంబర్ 13న, హర్దీప్ సింగ్ పురి జెఫ్రీకి ఒక ఈమెయిల్ పంపారు. అందులో దీన్ని ప్రస్తావించారు.
“జెఫ్, అక్టోబర్ 3న సిలికాన్ వ్యాలీలో రీడ్‌తో జరిగిన సంభాషణ గురించి మీకు చెప్పాను కదా. రీడ్ వీలైనంత త్వరగా భారతదేశాన్ని సందర్శించాలని మీరు బదులిచ్చారు. అక్టోబర్ మధ్యలో భారత్‌కు తిరిగి వచ్చిన నాకు, ఇంటర్నెట్ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలకు భారతదేశం ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుందని గతంలో కంటే ఇప్పుడు మరింత నమ్మకం కలిగింది”
“ఉదాహరణకు, జపాన్ టెలికాం, ఇంటర్నెట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ ఇటీవల భారత ఇ-కామర్స్ రంగంలో రాబోయే 10 సంవత్సరాలలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడికి యోచిస్తున్నట్లు ప్రకటించింది. 600 మిలియన్ డాలర్ల నిధులను అందుకున్న మొదటి భారతీయ కంపెనీ స్నాప్‌డీల్. కొత్త ప్రభుత్వం రాక మార్కెట్లో ఉత్సాహాన్ని మరింత పెంచింది. ‘డిజిటల్ ఇండియా’పై ప్రత్యేక దృష్టి సారించి భారత ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ఇది కట్టుబడి ఉంది”
2015లో డిజిటల్ ఇండియా ప్రారంభిస్తే, 2014 నవంబర్‌లోనే దాని గురించి ఎప్‌స్టీన్‌తో హర్దీప్ సింగ్ ఎలా చర్చించారనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో కూడా తలెత్తుతోంది.
(హెచ్చరిక: ఈ ఈమెయిల్‌లో జాత్యహంకార పదాలు ఉన్నాయి.)
2015 డిసెంబర్ 25న, హర్దీప్ సింగ్ పురి పంపిన ఒక మెయిల్‌ను నార్వేజియన్ దౌత్యవేత్త టెర్జే రాడ్-లార్సెన్‌కు ఎప్‌స్టీన్ ఫార్వార్డ్ చేశారు.
ఈ ఈమెయిల్ దిగువన, “కాఫీ తాగడానికి సమయముందా?” అని ఎప్‌స్టీన్‌ను హర్దీప్ సింగ్ అడిగారు.
రాడ్-లార్సెన్‌కు ఫార్వార్డ్ చేసిన ఈమెయిల్‌లో, ఎప్‌స్టీన్ “రెండు ముఖాలు(టూ ఫేసెస్)” అని రాశారు.
దానికి రాడ్-లార్సెన్ రిప్లై ఇస్తూ “మీరు ఒక భారతీయుడిని, పామును చూస్తే, ముందుగా భారతీయుడిని చంపండి” అనే సామెతను విన్నారా అని తెలిపారు.
దీనికి “రెండింటి మధ్య తేడాను మీరు ఎలా గుర్తించగలరు అనేదే ప్రశ్న” అని ఎప్‌స్టీన్ బదులిచ్చారు.
ఫొటో సోర్స్, ANI
ప్రతిపక్షం ప్రశ్నలు ఏంటి?
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో వచ్చిన తర్వాత ప్రభుత్వంపై విమర్శల దాడిని కాంగ్రెస్ పార్టీ ఉధృతం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని, మంత్రి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. అలాగే, పలు ప్రశ్నలనూ లేవనెత్తుతోంది.
తొలుత కేంద్ర మంత్రి పదవికి హర్దీప్ సింగ్ పురి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అంతర్జాతీయ స్థాయి నేర పరిశోధనకు సంబంధించిన పత్రాలలో ఒక కేంద్ర మంత్రి పేరు వచ్చినప్పుడు, వారు నైతికంగా ఆ పదవిలో కొనసాగకూడదని చెబుతోంది.
హర్దీప్ సింగ్ పురికి సంబంధించిన మెయిల్ విషయంలో కాంగ్రెస్ లేవనెత్తిన ఆరు ప్రశ్నలు:
- రీడ్ హాఫ్‌మాన్‌తో హర్దీప్ భేటీ గురించి ఎప్‌స్టీన్‌కు ముందే ఎలా తెలిసింది?
- రీడ్ హాఫ్‌మాన్‌తో సమావేశం ఏర్పాటుచేసిన ఆ ‘కాంటాక్ట్’ ఎప్‌స్టీనేనా?
- హర్దీప్ ఆ సమావేశం వివరాలను ఎప్‌స్టీన్‌తో ఎందుకు చర్చించారు?
- ఎప్‌స్టీన్‌ను ‘మిత్రమా’ అని ఎందుకు సంబోధించారు?
- హర్దీప్ కోసం ఎప్‌స్టీన్ ఏ పనులు చక్కబెడుతున్నారు?
- వారి మధ్య సంబంధం కేవలం యాదృచ్ఛికమైనదో లేదా పైపైదే అయితే, హర్దీప్ ఎప్‌స్టీన్‌ను ‘సలహా’ ఎందుకు అడిగారు?
ఈ క్రమంలో, కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా మంగళవారం మాట్లాడుతూ, 2014 నుంచి 2017 మధ్యకాలంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ మధ్య 62 మెయిల్స్ మార్పిడి జరిగిందని చెప్పారు. దీన్నిబట్టి, హర్దీప్ సింగ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి డిమాండ్ చేశారు.
ఫొటో సోర్స్, ANI
హర్దీప్ సింగ్ పురి వివరణ…
”ఎప్‌స్టీన్‌పైనున్న కేసులు తప్పుడు పనులు, నేరాలకు సంబంధించినవి. ఆ కేసుల్లోని వివరాల ప్రకారం, ఎప్‌స్టీన్‌కు ఒక ద్వీపం ఉండేది. లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అతను అక్కడికి జనాలను తీసుకెళ్లేవారు. బాలలపై లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఆయా బాధితులు కేసులు కూడా పెట్టారు. వీటన్నింటితో నాకు ఎటువంటి సంబంధమూ లేదు” అని ఆయన వివరణ ఇచ్చారు.
”ఎప్‌స్టీన్‌కు సంబంధించి 30 లక్షల ఫైళ్లు బయటకు వచ్చాయి. న్యూయార్క్‌లోనున్న ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారిగా 2009, మే నెలలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 2017లో మంత్రి అయ్యేవరకూ నేను న్యూయార్క్‌లో ఉన్న కాలం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ఎనిమిదేళ్లలో బహుశా మూడు లేదా నాలుగు సమావేశాలకు సంబంధించిన ప్రస్తావనలు మాత్రమే కనిపిస్తాయి” అని హర్దీప్ సింగ్ పురి అన్నారు.
”రాహుల్ గాంధీ నిరుడు నవంబర్‌లో ఒక కార్యక్రమం సందర్భంగా నావద్దకు వచ్చి, ‘కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాల్లో, కొన్ని పేర్లు వచ్చాయి’ అని చెప్పారు. ఆ తర్వాత ఆయనకు వాస్తవాలు చెప్పాలనుకున్నాను. ఒక నోట్ పంపిస్తానని చెప్పాను” అని మంత్రి గుర్తుచేశారు.
రాహల్ గాంధీకి పంపిన నోట్‌లో వివరాలను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
”అమెరికాలో భారత రాయబారిగా పదవీ విమరణ చేసిన తర్వాత ఇంటర్నేషనల్ పీస్ ఇన్‌స్టిట్యూట్ (ఐపీఐ) నన్ను ఆహ్వానించింది. నేను ఐసీఎం (ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ మల్టీలేటరలిజం)లో సెక్రటరీ జనరల్‌గా ఉన్నాను. దీనికి ఆస్ట్రేలియా మాజీ ప్రధాని చైర్మన్‌గా వ్యవహరించారు. ఐసీఎం అనేది ఐపీఐ తాలూకా ఒక ప్రాజెక్టు. ఐపీఐలో నా బాస్ టెర్జే రోడ్-లార్సన్‌కు ఎప్‌స్టీన్‌తో పరిచయం ఉంది. ఐపీఐ, ఐసీఎం ప్రతినిధిగా నేను కొన్ని సందర్భాల్లో ఎప్‌స్టీన్‌ను కలిశాను. మహా అయితే మూడు లేదా నాలుగుసార్లు కలిశాను. అంతర్జాతీయ వ్యవహారాలను చూసే ఐసీఎంలో ఎప్‌స్టీన్ భాగస్వామి కాదు” అని ఆయన చెప్పారు.
లైంగిక కేసుల్లో శిక్ష పడిన నేరస్థుడితో ఎందుకు సంబంధం పెట్టుకున్నారన్న ప్రశ్నకు హర్దీప్ సింగ్ పురి స్పందిస్తూ, ”ఆయన (ఎప్‌స్టీన్) న్యూయార్క్ సమాజంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి. ఆయన పరిచయస్థుల్లో సగం మందికి ఆయన గత చరిత్ర ఏమిటో కనీసం అవగాహన కూడా లేదు. కానీ ఇక్కడ విషయం అది కాదు. మా వంటి వారు తమ జీవితంలో రకరకాల వ్యక్తులను కలవాల్సి ఉంటుంది” అని వివరించారు.
ఫొటో సోర్స్, ANI
‘ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌తో కూడా మాట్లాడాను…’
ఎప్‌స్టీన్ ఫైల్స్ తన పేరు వచ్చిన విషయాన్ని సమర్థించుకుంటూ మంత్రి హర్దీప్ సింగ్ పురి మరింత వివరణ ఇచ్చారు.
”నేను కొలంబోలో ఫస్ట్ సెక్రటరీగా ఉన్నప్పుడు అప్పటి ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌తో చర్చలు జరపడానికి పంపించారు. తర్వాత మన ప్రధానమంత్రి (రాజీవ్ గాంధీ) హత్యకు ప్రధాన బాధ్యుడిగా ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంటే, నేను ఒక ఉగ్రవాదితో మాట్లాడాను కాబట్టి, ఆయన విలువలను కూడా నేను పంచుకుంటున్నానని అర్థమా?” అని ప్రశ్నించారు.
రీడ్ హాఫ్‌మాన్‌తో సమావేశం గురించి మంత్రి వివరిస్తూ, ”ఎనిమిదేళ్ల కాలంలో, కేవలం రెండు ప్రస్తావనలు, లేదా ఒక ఈమెయిల్ మాత్రమే ఉన్నాయి. నాకు తెలిసినవారు నన్ను లింక్‌డిన్ వ్యవస్థాపకుడైన రీడ్ హాఫ్‌మాన్‌కు పరిచయం చేశారు. కాబట్టి నేను రీడ్ హాఫ్‌మాన్‌ను కలిశాను. ఆ సమావేశం ముగిసిన తర్వాత నేనొక మెసేజ్ పంపాను” అని చెప్పారు.
”2014 నవంబర్‌లో నేనొక సాధారణ పౌరుడిని. వారు (రీడ్ హాఫ్‌మాన్) భారతదేశం గురించి అవగాహన చేసుకోవాలనుకుంటున్నారని ఎవరో చెప్పారు. అమెరికా పశ్చిమ తీరంలో మాకు ఆయనతో సమావేశం జరిగింది. ‘నేటి భారతదేశం ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తుందని మునుపటి కంటే చాలా నమ్మకంగా ఉన్నాను. రీడ్ హాఫ్‌మాన్ భారతదేశానికి వచ్చి, ఇక్కడ వస్తున్న మార్పులను స్వయంగా చూడాలి’ అనే మాటలతో నా ఈమెయిల్‌ను ప్రారంభించాను” అని మంత్రి హర్దీప్ సింగ్ వెల్లడించారు.
”నేను 2014 నవంబర్‌లోనే డిజిటల్ ఇండియా గురించి మాట్లాడాను. నాకు గుర్తున్నంతవరకూ, ఈ ప్రాజెక్టులు 2015లో ప్రారంభమయ్యాయి. మోదీ ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతుందో ముందుగానే గ్రహించిన దూరదృష్టిగల ఒక సాధారణ పౌరుడిగా నేను అక్కడ ఉన్నాను” అని ఆయన చెప్పారు.
ఎప్‌స్టీన్ అనుచరులకు వీసా ఇప్పించడంలో సహకరించారనే ఆరోపణలపై కూడా మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు.
”వీసా కోసం అభ్యర్థన వచ్చినప్పుడు, నేను దానికి సమాధానమివ్వలేదు. దాన్ని మరో సహోద్యోగికి పంపాను. ఆయనేమో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోమని చెప్పారు. దీనిని ‘ఉపకారం’ చేయడం అంటారా?” అని ప్రశ్నించారు.
ఎప్‌స్టీన్ గురించి మాట్లాడుతూ, ”ఎప్‌స్టీన్ నా గురించి ‘టూ-ఫేస్డ్’ అని రాశారు. మరి ‘టూ-ఫేస్డ్’ అంటే అర్థమేమిటి? ఈ వ్యక్తి సరైనవాడు కాదని. ఆయన విలువల వ్యవస్థలో నేను అస్సలు సరిపోలేదు” అని మంత్రి వివరించారు.
అంతేగాకుండా, ‘భారతీయులు, పాములు’ సంఘటనను ప్రస్తావిస్తూ, ఎప్‌స్టీన్‌తో తనకు ఎలాంటి సన్నిహిత సంబంధాలు లేవని నిరూపించడానికి మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రయత్నించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



