Home జాతీయ national telgu ఈ తిమింగలానికి ఏమైంది?

ఈ తిమింగలానికి ఏమైంది?

13
0

SOURCE :- BBC NEWS

జర్మనీ, బార్జ్‌, తిమింగలం, సముద్రం, రెస్క్యూ ఆపరేషన్, జంతువులు

ఫొటో సోర్స్, dpa/Alamy Live News

జర్మనీ తీరంలో తక్కువ లోతు నీటిలోకి వచ్చిన ఒక హంప్‌బ్యాక్ తిమింగలం వెనక్కి వెళ్లలేక అక్కడే ఇరుక్కుపోయింది. దాదాపు ఐదు వారాల తర్వాత, ఒక బార్జ్‌లో(బల్లకట్టు వంటి నిర్మాణం) దాన్ని జర్మనీ తీర ప్రాంతం నుంచి ఉత్తర సముద్రం వైపు తీసుకెళ్లారు.

తీరం నుంచి సముద్రంలోపలికి పంపించేందుకు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వకపోవడంతో తిమింగలాన్ని కాపాడేందుకు ఇలా బార్జ్‌లో తీసుకెళ్తున్నారు.

మంగళవారం ఇద్దరు జర్మన్ వ్యాపారవేత్తలు నిధులు అందించడంతో ఈ తిమింగలాన్ని నీటితో నిండిన బార్జ్‌లోకి నెమ్మదిగా దింపారు.

దీన్ని లోతైన నీటిలోకి తీసుకెళ్లడానికి చేసిన ప్లాన్ మంచిదే అయినప్పటికీ ఈ తిమింగలం చాలా బలహీనంగా కనిపిస్తోందనీ, బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇంటర్నేషనల్ వేలింగ్ కమిషన్ నిపుణుల బృందం తెలిపేంది. అందుకే వారు ఈ చర్యలో పాల్గొనలేదు.

తిమింగలం బతుకుతుందా, లేదా అన్న అనుమానాలు ఉన్నప్పటికీ, ఈ ప్లాన్ విజయవంతం కావడంతో ఇందులో పాల్గొన్న వారంతా సంతోషించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఈ రెస్క్యూ ఆపరేషన్‌కి ఉత్తర జర్మనీలోని మెక్డెన్‌బర్గ్-వోర్పోమెర్న్ పర్యావరణ మంత్రి టిల్ బాక్‌హౌస్ ప్రధాన కారణం అని చాలామంది భావిస్తున్నారు.

ఈ ఆపరేషన్‌ విజయవంతమైందని ప్రశంసిస్తూ, జర్మనీ ఏం సాధించగలదనడానికి తార్కాణం ఇదని ఆయన అన్నారు.

“అంతా సవ్యంగా జరిగితే రెండు రోజుల్లో ఇది ఉత్తర సముద్రానికి చేరుతుంది” అని ఆయన రిపోర్టర్లకు చెప్పారు. అలాగే తిమింగలం బాగానే ఉందని చెప్పారు.

పాయెల్ దీవి సమీపంలోని తక్కువ లోతు నీటిలో గత 29 రోజులుగా ఇరుక్కుపోయిన తిమింగలాన్ని కాపాడడంతో.. ఈ రక్షణ చర్యకు నిధులు ఇచ్చిన ఇద్దరు వ్యాపారవేత్తలు చాలా సంతోషించారు.

జర్మనీ, బార్జ్‌, తిమింగలం, సముద్రం, రెస్క్యూ ఆపరేషన్, జంతువులు

ఫొటో సోర్స్, Danny Gohlke/AFP

“నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను, నా జీవితంలో దేనికోసం ఇంతగా ప్రార్థించలేదు” అని కారిన్ వాల్టర్-మోమ్మెర్ట్ అన్నారు.

తిమింగలాన్ని లాగుతున్న ఫోర్టునా బీ అనే రవాణా నౌక జర్మనీ జలాల నుంచి బాల్టిక్ సముద్రం ద్వారా డెన్మార్క్ జలాల్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ఉత్తర దిశగా ప్రయాణించి, డెన్మార్క్ ఉత్తర తీరంలోని జ్యూట్‌లాండ్ ప్రాంతం నుంచి స్కాగెరాక్ జలసంధి ద్వారా ఉత్తర సముద్రంవైపు పయనిస్తోంది.

మంగళవారం తిమింగలం బార్జ్‌లోకి వెళ్లినప్పుడు రక్షణ బృందంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. బుధవారం రిపోర్టర్లతో మాట్లాడినప్పుడు కూడా వారెంత సంతోషపడుతున్నారో కనిపించింది.

పర్యావరణ మంత్రి టిల్ బాక్‌హౌస్ నుంచి జర్మన్ లైఫ్‌గార్డ్ సంస్థ డీఎల్ఆర్‌జీ వరకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ ఈ మిషన్ టెక్నికల్ హెడ్ ఫెలిక్స్ బోన్‌సాక్ ప్రశంసించారు. అయితే ఈ మిషన్ ఇంకా పూర్తిగా విజయవంతం కాలేదని ఆయన అన్నారు.

కాగా.. వేల్ అండ్ డాల్ఫిన్ కన్జర్వేషన్ సంస్థ(డబ్యూడీసీ) ఈ తిమింగలం భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తంచేసింది. అది ఎక్కువకాలం బతికే అవకాశం లేదని తెలిపింది.

జర్మనీ బాల్టిక్ సముద్ర తీరంలోని నీటిలో ఉప్పుశాతం తక్కువగా ఉండటంతో తిమింగలం చర్మం బాగా దెబ్బతిందని ఆ సంస్థ తెలిపింది.

ఈ రెస్క్యూ మిషన్ విజయవంతమైందని చెప్పాలంటే, తిమింగలం చర్మం పూర్తిగా నయం అయ్యి, తన ఆహారాన్ని స్వయంగా సమకూర్చుకోగలగాలని డబ్యూడీసీ చెప్పింది.

అయితే మరైన్ బయాలజిస్ట్ ఫాబియన్ రిట్టర్ మాత్రం ఆశాజనకంగా మాట్లాడారు.

జర్మన్ ప్రెస్ ఏజెన్సీ డీపీఏతో మాట్లాడుతూ. ఇలాంటి రక్షణ చర్య ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని, దీని ప్రభావం తిమింగలంపై ఎలా ఉంటుందో తెలియదని అన్నారు.

తిమింగలం చాలా బలహీనంగా ఉండటంతో మునిగిపోయే ప్రమాదం ఉందని జర్మన్ ఓషనోగ్రాఫిక్ మ్యూజియం తెలిపింది.

మొదటగా అది వలలో చిక్కుకున్నప్పుడు ఈ తిమింగలానికి సమస్యలు మొదలైనట్టు కనిపిస్తోంది. ఇది గత నెల ప్రారంభంలో మొదట కనిపించింది, కానీ మార్చి 23న ల్యూబెక్ బేలోని టిమ్మెన్‌డార్ఫర్ బీచ్ వద్ద ఇరుక్కుపోయింది.

అప్పటి నుంచి ఇది జర్మనీలో చాలా ప్రాచుర్యం పొందిన కేసుగా మారింది. తిమింగలం బయటకు వెళ్లేందుకు ఒక కాలువ తవ్వారు, కానీ అది తూర్పు దిశగా వెళ్లి విస్మార్ బే చేరింది. మార్చి చివరికి పాయెల్ దీవి సమీపంలోని తక్కువ లోతు నీటిలోకి వెళ్లింది. మంగళవారం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేదాకా అక్కడే ఇరుక్కుపోయింది.

కొంతమంది రక్షణ బృంద సభ్యులు, మీడియా దీనికి “టిమ్మీ” (టిమ్మెన్‌డార్ఫర్ బీచ్ పేరు ఆధారంగా) లేదా “హోప్” అనే పేర్లు పెట్టారు.

తిమింగలం బార్జ్‌లోకి ఈదిన క్షణం ఊహించలేనంత భావోద్వేగంగా ఉందని, తమ కళ్లలో కన్నీళ్లు వచ్చాయని, ఆ దృశ్యాలను ఎప్పటికీ మర్చిపోలేమని రెస్క్యూ డైరెక్టర్ ఫెలిక్స్ బోన్‌సాక్ బుధవారం చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)