SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
49 నిమిషాలు క్రితం
చదివే సమయం: 3 నిమిషాలు
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం గురించి మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధాన్ని త్వరలో ముగించాలని తాను భావిస్తున్నట్టు ‘ట్రూత్‌సోషల్’లో ఆయన పోస్ట్ చేశారు.
మరోవైపు భూతల దాడుల కోసం సైన్యాన్ని దించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
యుద్ధాన్ని ముగించడం గురించి ట్రంప్ తన పోస్ట్‌లో రాశారు.
“మా లక్ష్యాలను సాధించడానికి చాలా దగ్గరగా ఉన్నందున, ఇరాన్‌లో ఉగ్రవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా మధ్యప్రాచ్యంలో ప్రారంభించిన మా ప్రధాన సైనిక కార్యకలాపాలను క్రమంగా ముగించాలని భావిస్తున్నాం” అని ట్రంప్ పేర్కొన్నారు.
హార్ముజ్ జలసంధికి సంబంధించి ఆయన మరో విషయాన్ని ప్రస్తావించారు. “దానిని (హార్ముజ్ జలసంధిని) పర్యవేక్షించే, రక్షణ కల్పించే బాధ్యతను ఆ మార్గాన్ని ఉపయోగించుకునే దేశాలే తీసుకోవాలి” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Contributor/Getty Images
‘మా లక్ష్యాలకు చేరువలో ఉన్నాం’
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం హార్ముజ్ జలసంధి మీదుగా జరుగుతుందని అంచనా.
”ఆయా దేశాలు కోరితే హార్ముజ్ జలసంధి భద్రతకు తీసుకునే ప్రయత్నాలలో మేం సాయం చేస్తాం” అని ట్రంప్ అన్నారు.
“అయితే ఇరాన్ ముప్పు తొలగిపోయిన తర్వాత దీని అవసరం ఉండదు. ఈ దేశాలకు ఇదొక తేలికపాటి మిలటరీ ఆపరేషన్ అవుతుంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్‌పై యుద్ధంలో ఇప్పటివరకు సాధించిన విజయాలను కూడా ట్రంప్ ప్రస్తావించారు.
ఇరాన్ క్షిపణి సామర్థ్యం పూర్తిగా ధ్వంసమైందని, దాని సైనిక పారిశ్రామిక స్థావరం నాశనమైందని, తద్వారా అణ్వాయుధ అభివృద్ధి దరిదాపుల్లోకి కూడా ఇరాన్ రాదని ట్రంప్ తెలిపారు.
మధ్యప్రాచ్యంలోని తన మిత్రదేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఇతర దేశాలకు అమెరికా అత్యున్నత స్థాయి భద్రతను కల్పించిందని ట్రంప్ అన్నారు.
ఫొటో సోర్స్, PTI
‘హార్ముజ్ భద్రతకు హామీ ఇవ్వని ట్రంప్’
ఇరాన్‌లో అమెరికా సైనిక కార్యకలాపాలను “క్రమంగా తగ్గించాలని” చెప్పిన ట్రంప్ తాజా ట్రూత్‌సోషల్ పోస్ట్ ప్రింటౌట్‌లను వాషింగ్టన్ నుంచి వెస్ట్ పామ్ బీచ్‌కు వెళ్తున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానం ప్రయాణం మధ్యలో ప్రెస్ పూల్‌కు అందించారని బీబీసీ ప్రతినిధి ఆంథోనీ జర్కర్ చెప్పారు.
అధ్యక్షుడు తాను ప్రత్యేకంగా ప్రచారం చేయాలనుకుంటున్న సోషల్ మీడియా సందేశాల కోసం ఉపయోగించే పద్ధతి కూడా ఇదేనని, దక్షిణ కొరియాలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమై అమెరికాకు తిరిగి వస్తున్నప్పుడు గత అక్టోబర్‌లో కూడా ట్రంప్ ఇలాగే వ్యవహరించారని తెలిపారు.
ఇరాన్‌పై ప్రస్తుత సందేశం చాలా జాగ్రత్తగా రూపొందించినట్టు కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనిక లక్ష్యాలను ఇందులో ఒక క్రమ పద్ధతిలో జాబితాగా తయారుచేశారు.
మార్కో రూబియోతో కలిసి ఫ్లోరిడా వెళ్తున్న ట్రంప్, దౌత్యపరమైన జాగ్రత్తలతో తన మాటలను ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.
అయితే, హార్ముజ్ జలసంధి భద్రతకు అమెరికా నాయకత్వం వహించదనే సందేశాన్ని అమెరికా మిత్రదేశాలు అంతగా స్వాగతించకపోవచ్చు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



