SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో వేసవి ప్రతాపం మొదలైంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం ఇప్పటికే సుమారు 55 వేల కోట్ల రూపాయల విలువైన నీటిబాటిళ్ల పరిశ్రమపై ఒత్తిడి పెంచుతోంది. కీలక ముడి పదార్థాల కొరతతో తయారీదారులు ఇబ్బంది పడుతున్నారు.
గత నెలలో బిస్లరీ కంపెనీ తన ధరలను 11 శాతం పెంచింది. దీంతో డజన్ వన్ లీటర్ బాటిళ్ల పెట్టె ధర 24 రూపాయల మేర పెరిగింది. బైలీ, క్లియర్ ప్రీమియం వాటర్ వంటి ఇతర బ్రాండ్లు కూడా ధరలను పెంచినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
దేశంలో పట్టణ ప్రాంతాల్లో సుమారు 15 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 6 శాతం కుటుంబాలు తాగునీటి కోసం బాటిల్డ్ వాటర్‌పై ఆధారపడుతున్నాయి. అయితే ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఖర్చుతో కూడుకున్నది. నీటి కొరత, భూగర్భ జలాల కాలుష్యం, మౌలిక సదుపాయాల లోపం వంటి కారణాల వల్ల వేసవిలో అనేక ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీటి లభ్యత సవాలుగా మారుతోందని డేటా ఫర్ ఇండియా అధ్యయనం తెలిపింది.
ఈ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే బాటిల్ నీరు అనేకమందికి అందనంత ఖరీదైన వస్తువుగా మారే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రపంచ చమురు, ఎల్‌పీజీ రవాణాలో కీలకమైన హార్మూజ్ జలసంధి దాదాపు మూసుకుపోవడంతో అంతర్జాతీయ నౌకా రవాణా దెబ్బతింది. దీని ప్రభావంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి.
దేశీయ అవసరాల కోసం చమురు, సహజ వాయువు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌పై ఈ పరిస్థితి తీవ్ర ప్రభావం చూపుతోంది.

బాటిల్ నీటి ధరలు పెరగడానికి ముడి చమురు ధరల పెరుగుదలే ప్రధాన కారణమని మహారాష్ట్ర బాటిల్ వాటర్ తయారీదారుల సంఘం అధ్యక్షుడు విజయ్‌సింహ్ దుబ్బల్ చెప్పారు.
ఈవారం ప్రారంభంలో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు సుమారు 119 డాలర్లకు చేరింది.
ప్లాస్టిక్ బాటిళ్ల తయారీలో ఉపయోగించే పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET) రెసిన్ గుళికలు ముడి చమురుతో తయారవుతాయి. వీటిని వేడి చేసి అచ్చుల్లో పోసి ‘ప్రీఫార్మ్స్’గా రూపొందిస్తారు. ఇవి ప్లాస్టిక్ టెస్ట్ ట్యూబుల్లా కనిపిస్తాయి. తర్వాత వీటిని బాటిల్ తయారీదారులు అవసరానికి అనుగుణంగా వివిధ ఆకారాలు, పరిమాణాల్లో బాటిళ్లుగా మలుస్తారు.
“పెట్ ప్రీఫార్మ్స్ ధర కిలోకు 115 రూపాయల నుంచి సుమారు 180 రూపాయల వరకు పెరిగింది. వీటి సరఫరా కూడా తగ్గింది,” అని దుబ్బల్ తెలిపారు. మహారాష్ట్రలో సుమారు 20 శాతం బాటిల్ తయారీ యూనిట్లు తాత్కాలికంగా మూతపడ్డాయని ఆయన చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
కీలక సమయంలో..
కొన్ని కంపెనీలు ధరలు పెంచినప్పటికీ, వినియోగదారులపై భారం పడకుండా అనేక బ్రాండ్లు, అమ్మకందారులే ఇప్పటివరకు అదనపు ఖర్చులను భరిస్తున్నారని దుబ్బల్ తెలిపారు.
ప్రస్తుతం ఒక లీటర్ తాగునీటి బాటిల్ ధర సుమారు 20 రూపాయల వద్ద ఉంది. అలాగే ఐదు లీటర్ల బాటిళ్లు రూ.60 నుంచి 70 మధ్య ధరకు అమ్ముతున్నారు.
“అదనపు ఖర్చులను భరించడం కంపెనీలకు దీర్ఘకాలికంగా సాధ్యం కాదు. పరిస్థితులు ఇంకా దిగజారితే ఆ ప్రభావం వినియోగదారులపై పడే అవకాశం ఉంది” అని దుబ్బల్ చెప్పారు.
భారత్‌లో వేసవి తాపం ఎక్కువగా ఉండే ఏప్రిల్, మే నెలల్లో బాటిల్ నీరు.. ఆల్కహాల్ లేని డ్రింక్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. ఇలాంటి అత్యంత కీలక సమయంలోనే సరఫరా ఒత్తిడి ఏర్పడటం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చిందని ఆయన తెలిపారు.
భారత్‌లో పెట్ ప్రీఫార్మ్స్ సరఫరాలో అగ్రగామిగా ఉన్న కెమ్కో ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ వైభవ్ సరోగి మాట్లాడుతూ, ప్రీఫార్మ్స్ ధరల పెరుగుదల ‘‘కేవలం బాటిల్ నీటి రంగానికే కాకుండా మొత్తం ప్యాకేజింగ్ పరిశ్రమపై ప్రభావం చూపుతుంది’’ అన్నారు.
భారత్‌లో పెట్ ప్యాకేజింగ్ మార్కెట్ పరిమాణం 2024లో సుమారు 1.5 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2033 నాటికి అది 2.2 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. బాటిల్ నీరు, డ్రింక్స్‌తో పాటు సౌందర్య, ఔషధ రంగాలు, అలాగే రెస్టారెంట్లు, ఫుడ్ డెలివరీ సేవల్లో కూడా పెట్ ప్యాకేజింగ్ విస్తృతంగా వినియోగంలో ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
గాజు సీసాలపైనా..
గాజు సీసాల తయారీదారులు కూడా ఈ యుద్ధ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.
గాజు బాటిళ్ల ధరలు సుమారు 20 శాతం పెరిగాయని హైనెకెన్, కార్ల్స్‌బర్గ్ వంటి గ్లోబల్ బ్రూవర్లకు ప్రాతినిధ్యం వహించే బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది.
దీంతో బీరు ధరలను 12 నుంచి 15 శాతం పెంచేందుకు రాష్ట్రాలను సంప్రదించాలని సభ్య సంస్థలను కోరినట్లు బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాయిటర్స్‌కు తెలిపింది. (భారత్‌లో మద్యం ధరలు రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. అందుకే ఒక్కో రాష్ట్రంలో ధరలు ఒక్కోలా ఉంటాయి)
ఇదే విషయంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ కూడా ధరలు పెంచాలని రాష్ట్రాలకు లేఖ రాసినట్లు సమాచారం.
ఫార్మా కంపెనీలు, బ్రూవరీలు విస్తృతంగా ఉపయోగించే అంబర్ గాజు బాటిళ్ల తయారీ, మార్కెటింగ్‌లో ప్రసిద్ధి చెందిన విట్రమ్ గ్లాస్ సీఈఓ విఠోబ్ శేఠ్ మాట్లాడుతూ సహజ వాయువు సరఫరాలో మార్పులే ధరల పెరుగుదలకు కారణమని చెప్పారు.
గాజు తయారీదారులు తమ ఫర్నేస్‌లను నడపడానికి సహజ వాయువును ఉపయోగిస్తారు. ఈ ఫర్నేస్‌లలో ఇసుక, సోడా యాష్, లైమ్‌స్టోన్, రీసైకిల్ చేసిన గాజును కరిగించి ద్రవరూప గాజుగా మారుస్తారు. తర్వాత ఆ ద్రవాన్ని బాటిళ్ల రూపంలో మలుస్తారు.
అయితే యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ సహజ వాయువు వినియోగంపై నియంత్రణలను కఠినతరం చేసింది. దేశీయ అవసరాలు కొన్ని ముఖ్య వాణిజ్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తోంది.
సహజ వాయువు సరఫరా సుమారు 20 శాతం తగ్గిందని శేఠ్ తెలిపారు. దీంతో తమ ఫర్నేస్‌లను నడపడం గాజు తయారీదారులకు కష్టంగా మారింది.
విట్రమ్ గ్లాస్ వంటి కొన్ని సంస్థలు ఈ కొరతను భర్తీ చేసేందుకు చమురును ఉపయోగిస్తున్నాయి. అయితే ముడి చమురు ధరలు ఎక్కువగా ఉండటంతో ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయి.
దేశంలో ఇంధన సరఫరా స్థిరంగా ఉందని భారత ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, యుద్ధం ప్రారంభమైన తర్వాత వంట గ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా అనేక వాణిజ్య ఆహార కేంద్రాలు మూతపడ్డాయి.
ఇంధన కొరత ప్రభావం సిరామిక్స్, ఎరువుల పరిశ్రమలపైనా పడింది. విమానయాన రంగం కూడా జెట్ ఇంధన ధరలు పెరగడంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
“పరిస్థితి తీవ్రంగా ఉంది” అని శేఠ్ అన్నారు. “నీరు, ఔషధాలు వంటి వస్తువులు అత్యవసరమైనవి. వీటి సరఫరాలో స్వల్ప తగ్గుదల కూడా పెద్ద ప్రభావం చూపుతుంది” అని ఆయన హెచ్చరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



