Home జాతీయ national telgu ఇరాన్‌ దాడులు: అమెరికాపై గల్ఫ్ దేశాలకు నమ్మకం పోయిందా?

ఇరాన్‌ దాడులు: అమెరికాపై గల్ఫ్ దేశాలకు నమ్మకం పోయిందా?

14
0

SOURCE :- BBC NEWS

ఇరాన్ యుద్ధం

ఫొటో సోర్స్, AFP via Getty Images

అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం విస్తృత ప్రాంతీయ సంఘర్షణగా మారింది.

ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు గల్ఫ్‌లోకి లోతుగా చొచ్చుకుపోతున్నాయి. ఈ దాడులు అమెరికా స్థావరాలనే కాక, గల్ఫ్ దేశాల్లోని వైమానిక స్థావరాలు, ఇంధన కేంద్రాలు, ఓడరేవులు, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

అరబ్, పశ్చిమ దేశాల నేతలు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. ముదురుతున్న సంక్షోభాన్ని నియంత్రించే మార్గాల అన్వేషణ కోసం ఈ ప్రాంతంలోని కీలక దేశాలు చర్చలను ముమ్మరం చేశాయి.

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌ (జీసీసీ)కు చెందిన విదేశాంగ మంత్రులు ఓ అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ ప్రాంతంలో జరుగుతున్న మరిన్ని దాడులు తమ సామూహిక ఆత్మ రక్షణ చర్యలకు దారి తీయవచ్చని హెచ్చరించారు. ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చారు.

ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు ఎలాంటి ప్రతీకార చర్యలు తీసుకోనప్పటికీ, ఇరాన్ దాడులతో తమ ప్రాంతాల్లోని పౌరులు, కీలక మౌలిక సదుపాయాలకు జరుగుతున్న నష్టం కారణంగా తాము కూడా ఈ సంఘర్షణల్లో ఇరుక్కుపోవాల్సి వస్తోందని బహ్రెయిన్‌కు చెందిన దెరాసత్ సెంటర్ చెప్పింది.

ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 51 కింద కఠినమైన అంతర్జాతీయ జవాబుదారీతనం ఉండాలనే డిమాండ్ పెరుగుతోంది.

ఈ ప్రాంతీయ సంఘర్షణ ముదురుతుండటం అమెరికాతో తమ భద్రతా సంబంధాలను గల్ఫ్ దేశాలు పున: పరిశీలించుకునేలా చేస్తోంది.

ఇది భవిష్యత్‌లోని వారి వ్యూహాత్మక భాగస్వామ్య స్వరూపాన్ని పరిశీలించుకోవడానికి, వారి రక్షణ వ్యూహాలను పునరాలోచించుకోవడానికి కూడా దోహదం చేస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అమెరికా, గల్ఫ్ సంబంధాలు

అమెరికా పట్ల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌(జీసీసీ) దేశాల వైఖరిని భిన్నమైన రీతిలో వెల్లడిస్తోంది అరబ్ ప్రాంతీయ, దేశీయ మీడియా.

హార్ముజ్ జలసంధి సంక్షోభం ముదురుతుండటంతో.. ఇరాన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికాపై గల్ఫ్ దేశాలు ఒత్తిడి తెచ్చాయని రాయిటర్స్ రిపోర్టును ఉటంకిస్తూ కొన్ని మీడియా అవుట్‌లెట్లు పేర్కొన్నాయి.

మరోపక్క, ఇరాన్‌పై దాడి చేయాలనే అమెరికా నిర్ణయాన్ని విమర్శిస్తూ.. “గల్ఫ్ దేశాలు లక్ష్యంగా మారే అవకాశాన్ని అమెరికా విస్మరిస్తోంది” అని ఇతర మీడియా అవుట్‌లెట్లు ఆరోపించాయి.

అమెరికా కల్పించే భద్రత విషయంలో గల్ఫ్ దేశాలకున్న దృక్పథాన్ని ఈ యుద్ధం ప్రాథమికంగా మార్చేసిందని నిపుణులు చెప్పారు.

అమెరికాతో గల్ఫ్ దేశాలకున్న సంబంధాలను, వారి వ్యూహాత్మక కూటమి భవిష్యత్‌ను ఇది మార్చే అవకాశముందని అంటున్నారు.

సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ఫొటో సోర్స్, Chip Somodevilla/Getty Images

గల్ఫ్ దేశాల్లోని ప్రస్తుత సంక్షోభం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలను మార్చి 16న అరబిక్ పాడ్‌కాస్ట్ ‘ఎహతా’లో చర్చించారు.

గల్ఫ్ దేశాల భద్రతా వైఖరి బలహీనపడిందని, ఈ ప్రాంతంలో అమెరికా ఉనికి ఆర్థికంగా, సైనికంగా కూడా భారంగా మారుతోందని పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నిపుణులు చెప్పారు. ఇరాన్ ఇప్పుడు ఆ ప్రాంతాల్లోని అమెరికా ఆస్తులను చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణించడమే దీనికి కారణం.

అమెరికా తమపై దాడికి పాల్పడితే, ప్రతీకార చర్యలుగా ఆ దేశ ఆర్థిక ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించినప్పటికీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఉద్రిక్తతలను పెంచుతూనే ఉందని నిపుణులు అన్నారు.

ఇది అమెరికా తమ భద్రతాపరమైన ఆందోళనలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయాన్ని గల్ఫ్ దేశాలలో మరింత బలపర్చిందని నిపుణులు చెప్పారు.

ఇది గల్ఫ్ దేశాల్లో ‘నమ్మక ద్రోహం లేదా మోసం’ అనే భావనను కలిగించిందని ఒక నిపుణుడు చెప్పారు.

”అమెరికా ఏకపక్షంగా వ్యహరిస్తూ.. ఇరాన్ ప్రతీకార చర్యలలో గల్ఫ్ దేశాలను ప్రమాదానికి గురిచేస్తోందనే అభిప్రాయం ఉంది” అని తెలిపారు. అయినా అమెరికాతో భద్రతా భాగస్వామ్యాన్ని ముగించుకోలేమని గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు భావిస్తున్నాయని చెప్పారు.

రష్యా, చైనా

ఫొటో సోర్స్, Getty Images

రష్యా, చైనా వైపు చూస్తున్నాయా?

అమెరికాతో తమ భాగస్వామ్యం పట్ల గల్ఫ్ దేశాలు నిరాశ చెందాయని కొందరు నిపుణులు చెబుతున్నప్పటికీ, రష్యా లేదా చైనాతో కొత్త భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంపై వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఎహతా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన నిపుణులు.. అమెరికాతో కాకుండా చైనా లేదా రష్యాతో పూర్తిగా భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆచరణ సాధ్యం కాదని చెప్పారు.

అయితే, అమెరికాతో ప్రస్తుతం వాటికున్న భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే.. ప్రాంతీయ దౌత్య స్వయం ప్రతిపత్తిని విస్తరించుకునేందుకు గల్ఫ్ దేశాలు ప్రయత్నించవచ్చు.

యుద్ధం తర్వాత గల్ఫ్ దేశాల్లోని వాస్తవ పరిస్థితులపై ఖతార్ అల్ జజీరా ముబాషెర్ టీవీలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఒక నిపుణుడు మాట్లాడుతూ.. ”అమెరికాతో తమ భాగస్వామ్యాన్ని పూర్తిగా వదలుకోవడానికి గల్ఫ్ దేశాలు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదని’’ అన్నారు.

కానీ, ఈ అనుభవం యుద్ధానంతర ప్రణాళికలో ఒక అడుగు ముందుకు వేసేందుకు సహకరించింది.

గల్ఫ్ దేశాల స్వావలంబనకు అమెరికాతో కానీ లేదా ఇతర దేశాలతో కానీ ఉన్న బాహ్య భాగస్వామ్యాలు ప్రత్యామ్నాయం కావనే విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు సాయపడింది.

”ఒకప్పుడు తమ చిన్న, బలహీనమైన దేశాలను కాపాడతాయని భావించిన గల్ఫ్ దేశాలు అమెరికా సైనిక స్థావరాలలో బిలియన్ డాలర్లను కుమ్మరించాయి. అయినప్పటికీ, ఎలాంటి మినహాయింపు లేకుండా అన్ని గల్ఫ్ రాజధానులను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంతో ఈ స్థావరాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఈ యుద్ధం నిరూపించింది” అని నిపుణులు తెలిపారు.

”అమెరికా అందించే రక్షణను మాత్రమే కాక, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర శక్తిమంతమైన దేశాలతో ఆరు జీసీసీ దేశాలకు ఉన్న ఒప్పందాల విస్తృతమైన నెట్‌వర్క్‌ను సమగ్రంగా పున:సమీక్షించేందుకు ఇది దారితీసింది. ఈ ప్రాంతంపై దాడి జరుగుతున్నప్పుడు ఏ ఒప్పందం ప్రయోజనకరం కాదని నిరూపితమైంది” అన్నారు.

గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

గల్ఫ్ దేశాల ప్రాధాన్యాలు

ఉమ్మడి రక్షణను బలోపేతం చేసుకోవడం గల్ఫ్ దేశాలకు అత్యంత ప్రాధాన్యత అంశంగా మారిందని పలు పత్రికా నివేదికలు పేర్కొంటున్నాయి.

ప్రాంతీయ ముప్పును ఎదుర్కోవడానికి గల్ఫ్ దేశాలు ఏకం కావాలని రచయిత అబ్దుల్లా అహ్మద్ అలీ పిలుపునిచ్చారు.

‘ ప్రస్తుత సంక్షోభం ఆధునిక యుద్ధాన్ని కేవలం ఎంత సైన్యముంది? లేదా ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయనే దాన్ని బట్టి కొలవలేమని స్పష్టం చేసింది. బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, సైబర్ దాడులు వంటి సంక్లిష్ట ముప్పులను ఎదుర్కొనే రక్షణ వ్యవస్థల సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునే దేశ సమర్థత ఆధారంగా ఇది కొలవగలమని నిరూపించింది” అని ఎమిరేట్స్‌కు చెందిన వార్తాపత్రిక అల్-ఖలీజ్‌లో ప్రచురితమైన వ్యాసంలో పేర్కొన్నారు.

తాత్కాలిక గల్ఫ్ సమన్వయం నుంచి నిజమైన, దీర్ఘకాల సమైక్యత వైపుకు గల్ఫ్ దేశాలు మారగలవా అనే ప్రశ్నను ఈ రచయిత లేవనెత్తారు.

ఈ అంశాన్ని సమర్థిస్తూ.. జాసిమ్ అల్-మాలికి అనే రచయిత గల్ఫ్ దేశాలు సైనిక శక్తులతో ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ఖతార్ అల్-షార్క్ వార్తాపత్రికలో ప్రచురితమైన వ్యాసంలో.. సంయుక్త గల్ఫ్ సైనిక దళం అంటే.. ప్రతి దేశానికి చెందిన సైన్యాల నుంచి యూనిఫైడ్ ఆర్మీని ఏర్పాటు చేయడం కాదని, దానికి బదులుగా సమీకృత రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని జాసిమ్ అల్-మాలికి అన్నారు.

”ఆధునిక భద్రతా సవాళ్లు మునుపటిలా లేవు. ప్రస్తుతం బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు, సైబర్ దాడులు, సముద్ర రవాణా ముప్పులు ఎదురవుతున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి ఆయా దేశ సామర్థ్యాలకు మించి సామూహిక ప్రతిస్పందన కావాల్సి ఉంది” అని రాశారు.

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు సైనిక చర్యకు దిగుతాయా?

సంక్షోభం ముదురుతుండటంతో.. తాము ప్రారంభించని యుద్ధంలోకి తాము కూడా వెళ్తున్నామనే భయం, ఆత్మ రక్షణ కోసం తమను తాము కాపాడుకోవాల్సిన అవసరం మధ్య గల్ఫ్ దేశాలు నలిగిపోతున్నట్లు కనిపిస్తోంది.

ఇరాన్‌తో నేరుగా యుద్ధంలోకి వెళ్లకుండా ఉండటమే గల్ఫ్ దేశాల అత్యంత ప్రాధాన్యతా అంశాల్లో ఒకటి.

యుద్ధంలో గల్ఫ్ దేశాలు భాగం కావని గత కొన్ని వారాలుగా చాలామంది నిపుణులు, గల్ఫ్ అధికారులు నొక్కి చెబుతున్నారు.

మార్చి 19న, తమ దేశంపైనా, ఇతర గల్ఫ్ దేశాలపై జరిగే దాడులను సహించేందుకు ఒక హద్దు ఉంటుందని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ ఇరాన్‌ను హెచ్చరించారు.

సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాలకు కూడా దాడులు చేయగల సామర్థ్యాలు, సమర్థత ఉన్నాయని చెప్పారు.

ఇరాన్‌పై దాడిలో గల్ఫ్ దేశాలు పాల్గొనేందుకు ఉన్న వాదనలను అల్ జజీరా పేర్కొంది.

అంతర్జాతీయ చట్టం ప్రకారం గల్ఫ్ దేశాలకు ఆత్మ రక్షణ హక్కుతో పాటు అమెరికాతో బలమైన భద్రతా భాగస్వామ్యానికి ఉన్న అవకాశం, గల్ఫ్ ప్రయోజనాలకు అనుగుణంగా ఇరాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సాయం చేయడం వంటివి ఉన్నాయని తెలిపింది.

అదే సమయంలో యుద్ధంలో పాల్గొనడం ద్వారా ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అండగా నిలుస్తున్నామనే వారి వాదన కూడా బలపడుతుందనే ఆందోళనలూ ఉన్నాయి.

ఒకవేళ గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలో చేరితే, అమెరికా, ఇజ్రాయెల్ ఈ సంఘర్షణ నుంచి తప్పుకుంటాయని, ఆపై ఇరాన్, గల్ఫ్ పరస్పరం బలహీనపర్చుకున్నాక, గల్ఫ్ దేశాలను రక్షించడానికి అమెరికా, ఇజ్రాయెల్ ‘రక్షక పాత్ర’ పేరుతో యుద్ధం ముగింపునకు పిలుపునిస్తూ ప్రతిగా భారీ రాయితీలను డిమాండ్ చేస్తాయని గల్ఫ్ దేశాలు భయపడుతున్నాయని ఆ చానల్ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)