Home LATEST NEWS telugu తాజా వార్తలు ‘ఇప్పుడు ఏం జరిగినా మా పిల్లలైతే తిరిగిరారు’- షెల్లింగ్‌లో కవలల్ని పోగొట్టుకున్న ఓ కుటుంబపు...

‘ఇప్పుడు ఏం జరిగినా మా పిల్లలైతే తిరిగిరారు’- షెల్లింగ్‌లో కవలల్ని పోగొట్టుకున్న ఓ కుటుంబపు వేదన

4
0

SOURCE :- BBC NEWS

భారత్ పాకిస్తాన్ సంఘర్షణ, పూంఛ్,  పాకిస్తాన్ షెల్లింగ్

ఫొటో సోర్స్, Maria Khan

  • రచయిత, దివ్య ఆర్య
  • హోదా, బీబీసీ ప్రతినిధి
  • 13 మే 2025

మరియా ఖాన్‌కు సంబంధించినంత వరకు భారత్ పాక్ మధ్య గత వారాంతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం చాలా ఆలస్యమైనట్లు లెక్క.

మరియా కశ్మీర్‌లో ఉంటారు. మే 7న పాకిస్తాన్ దాడుల్లో ఆమె తనకు కొడుకు, కూతురు వరసయ్యే 12 ఏళ్ల జైన్ అలీ, ఉర్వా ఫాతిమా లను కోల్పోయారు.

పిల్లల తల్లిదండ్రులు యురుసా, రమీజ్‌ ఖాన్‌లు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పహల్గాం తీవ్రవాదుల దాడిలో 26 మంది పర్యటకులు చనిపోయిన తర్వాత మే 7 తెల్లవారు జామున పాకిస్తాన్, పాక్ ఆధీనంలోని కశ్మీర్ మీద భారత్ వరుస దాడులు చేసింది.

ఇరువైపులా డ్రోన్ దాడులు, షెల్లింగ్ శనివారం వరకు కొనసాగింది.

భారత్ పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖ వద్ద జీవిస్తున్నవారు ఈ షెల్లింగ్ వల్ల తీవ్రంగా నష్టపోయారు. పాక్ ప్రయోగించిన షెల్స్‌ వారి ఇళ్లను ధ్వంసం చేశాయి.

జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్‌లో ఉంటారు మరియా. ఈ సంఘర్షణ వల్ల దగ్గరి బంధువులను కోల్పోయిన అనేక మందిలో ఆమె కూడా ఒకరు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
భారత్ పాకిస్తాన్ సంఘర్షణ, పూంఛ్,  పాకిస్తాన్ షెల్లింగ్

ఫొటో సోర్స్, Maria Khan

‘బాంబు తాకిడికి పిల్లాడు ఎగిరిపడ్డాడు’

మే 7న పాకిస్తాన్ జరిపిన షెల్లింగ్‌ వల్ల 16 మంది చనిపోయారని భారత్ ప్రకటించింది. మే 7 తెల్లవారుజామున భారత్ జరిపిన దాడుల్లో 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు పాకిస్తాన్ తెలిపింది.

మిగతా రోజుల మాదిరే మే 6న కూడా జైన్, ఉర్వా స్కూల్ నుంచి వచ్చి హోమ్ వర్క్ చేశారు. ఆ తర్వాత కాసేపు ఆడుకున్నారు. భోజనం చేసి పడుకున్నారు.

పూర్తిగా చీకటి పడక ముందే, తమ ఇంటి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఖాన్ కుటుంబ సభ్యులకు కాల్పుల శబ్దం వినిపించింది.

ఈ శబ్దం వచ్చిన తర్వాత భయంతో నేలపై పడుకుని తమను తీసుకెళ్లేందుకు వచ్చే బంధువు కోసం ఎదురు చూశామని మరియా చెప్పారు.

“నా చెల్లెలు ఉర్వా చేయి పెట్టుకుంది. నా మరిది అలీ చేయి పట్టుకున్నారు. వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రాగానే వారికి దగ్గర్లోనే షెల్ పేలింది. దాని శకలాలు వారికి తగిలాయి. ఉర్వా అక్కడికక్కడే చనిపోయింది. పేలుడు ధాటికి జైన్ గాలిలోకి ఎగిరి ఎక్కడో పడిపోయాడు” అని మరియా చెప్పారు.

తన చెల్లెలు దూరంగా పడిన జైన్‌ కోసం పెద్దగా అరుస్తూ వెతుకుతుండగా సమీపం నుంచి వచ్చిన ఓ వ్యక్తి అతనికి సీపీఆర్ చేస్తూ బతికించే ప్రయత్నం చేశారని, అయితే ఆయన ప్రయత్నం విఫలమైందని మరియా చెప్పారు.

తీవ్రగాయాలతో రక్తమోడుతున్న రమీజ్ అప్పటికే స్పృహ కోల్పోయారని చెప్పారామె. ఆయన్ను మొదట పూంఛ్‌లో ఉన్న స్థానిక ఆసుపత్రికి ఆ తర్వాత 4 గంటల ప్రయాణం చేసి రజౌరీలో పెద్ద హాస్పిటల్‌కు తీసుకెళ్లారని మరియా చెప్పారు.

పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో, మరో నాలుగు గంటల ప్రయాణం తర్వాత రమీజ్‌ను జమ్మూ ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు.

భారత్ పాకిస్తాన్ సంఘర్షణ, పూంఛ్,  పాకిస్తాన్ షెల్లింగ్

ఫొటో సోర్స్, Getty Images

‘ముందే సమాచారం ఇచ్చినట్లయితే…’

ఉర్వా, అలీ- ఈ కవలలిద్దరంటే ఆ తల్లిదండ్రులకు ప్రాణం. టీచర్‌గా పని చేస్తున్న రమీజ్ తన బిడ్డలకు మంచి చదువు చెప్పించాలని అనుకునేవారు. పిల్లలు చదువుకుంటున్న క్రిస్ట్‌ స్కూలుకు దగ్గరలో ఓ ఇల్లు తీసుకున్నారు.

పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి భారీగా షెల్లింగ్ జరిపినప్పుడు, ఓ షెల్ పూంఛ్‌లోని క్రిస్ట్ స్కూల్‌ వెనుక పడి పేలిందని మే 9న భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశంలో చెప్పారు.

రమీజ్‌కు ఇప్పటి వరకు తన పిల్లలు చనిపోయిన విషయం తెలియదని, బాధ పడతారనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు ఆ విషయం ఆయనకు చెప్పలేదని మరియా చెప్పారు.

మే 7న పాకిస్తాన్ షెల్లింగ్ తర్వాత వందల మంది ప్రజలు పూంఛ్‌తో పాటు ఇతర సరిహద్దు పట్టణాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత వారు నెమ్మదిగా తిరిగి వస్తున్నారు.

“సరిహద్దుల్లో ఉంటున్న వారికి ప్రభుత్వం ముందే సమాచారం ఇచ్చి ఉంటే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేవారు. అలా జరిగి ఉంటే బహుశా మా పిల్లలు ఇవాళ మాతో ఉండేవారు” అని ఆమె అన్నారు.

“దేశ భద్రత కోసం యుద్ధం తప్పనిసరైతే, మేము అందుకు మద్దతిస్తాం” అని మరియా అన్నారు.

“పహల్గాంలో తీవ్రవాదుల దాడి గురించి విని మేము కూడా బాధపడ్డాం. అయితే మనం సరిహద్దుల్లో జీవిస్తున్న వారి గురించి కూడా ఆలోచించాలి కదా. మేము మనుషులం కాదా?” అని ఆమె ప్రశ్నించారు

“యుద్ధం లేదా కాల్పుల విరమణ, ఏదైతే ఏంటి? మా పిల్లలు తిరిగి రారు కదా” అని మరియా ఆవేదన వ్యక్తం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS