Home జాతీయ national telgu ఇండియా – బంగ్లాదేశ్ : సంబంధాల బలోపేతానికి షేక్ హసీనానే అడ్డమా?

ఇండియా – బంగ్లాదేశ్ : సంబంధాల బలోపేతానికి షేక్ హసీనానే అడ్డమా?

13
0

SOURCE :- BBC NEWS

భారత్, బంగ్లాదేశ్, సంబంధాలు, తారిక్ రెహమాన్, షేక్ హసీనా

ఫొటో సోర్స్, Getty Images

బంగ్లాదేశ్‌లో 2024 ఆగస్ట్‌లో జరిగిన తిరుగుబాటు తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

రెండు దేశాల మధ్య సంబంధాలు మందగించడమే కాకుండా మైనారిటీల హక్కులు వంటి అనేక అంశాలపై ఉద్రిక్తతలు కూడా తలెత్తాయి.

కానీ ఇప్పుడు, సార్వత్రిక ఎన్నికల అనంతరం, బంగ్లాదేశ్ రాజకీయ దృశ్యం మారింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) కూటమి మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది.

మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు.

బీఎన్‌పీ చైర్‌పర్సన్, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ఇప్పుడు ప్రధాని అయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఫిబ్రవరి 13 ఉదయం బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే బంగ్లాదేశ్ కొత్త ప్రధాని తారిక్ రెహమాన్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

తారిక్ రెహమాన్‌ను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, “ఈ విజయం బంగ్లాదేశ్ ప్రజలు మీ నాయకత్వంపై ఉంచిన నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది” అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ పంపిన సందేశాన్ని బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రి తారిక్ రెహమాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు.

అదే సమయంలో, బీఎన్‌పీ చైర్మన్ తారిక్ రెహమాన్ సలహాదారు హుమాయూన్ కబీర్ కూడా ఒక ప్రకటనలో బంగ్లాదేశ్ భారత్‌తో తన సంబంధాలను కొత్త దిశలో తీసుకెళ్లాలని కోరుకుంటోందని చెప్పారు.

అయితే ” భారత్ ఆలోచనల్లో మార్పు రావాలి.. నేటి బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా, అవామీ లీగ్‌కు చోటులేదు” అని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హుమాయూన్ కబీర్ చెప్పారు.

భారత్, బంగ్లాదేశ్, సంబంధాలు, తారిక్ రెహమాన్, షేక్ హసీనా

ఫొటో సోర్స్, Getty Images

బంగ్లాదేశ్‌లో పదవీచ్యుతురాలైన షేక్ హసీనా 2024 ఆగస్ట్ 5న భారత్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే నివసిస్తున్నారు.

మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణల కేసులో నిరుడు నవంబర్‌లో బంగ్లాదేశ్ ఇంటర్‌నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.

షేక్ హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ అభ్యర్థనకు భారత్ ఇంకా అంగీకారం తెలపలేదు.

షేక్ హసీనా భారత్‌లో ఉండటం ఇరు దేశాల సంబంధాలలో సమస్యలు సృష్టించింది.

ఈ నేపథ్యంలో బీఎన్‌పీకి చెందిన తారిక్ రెహమాన్ , అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా మధ్య భారత్ ఎలాంటి సమతుల్యత పాటిస్తుందనే విషయం కీలకంగా మారింది

బంగ్లాదేశ్‌లోని కొత్త ప్రభుత్వంతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం భారత్‌కు కష్టం కాదని విశ్లేషకులు నమ్ముతున్నారు. షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందడం, భారత్, బంగ్లాదేశ్ సంబంధాలపై నిర్ణయాత్మక ప్రభావం చూపకపోవచ్చంటున్నారు.

“షేక్ హసీనాకు భారత్‌లో ఆశ్రయమివ్వడం అసాధారణ చర్యేమీకాదు. ఇది భారత్ పాత సంప్రదాయంలో భాగమే. చైనాతో సంబంధాలు దెబ్బతినే ముప్పు ఉన్నప్పటికీ భారత్ దలైలామాకు కూడా ఆశ్రయం ఇచ్చింది. అఫ్గనిస్తాన్ మాజీ నాయకుడు నజీబుల్లా కుటుంబానికి కూడా ఆశ్రయం ఇచ్చింది. పాకిస్తాన్, ఇతర దేశాల రాజకీయ శరణార్థులకు కూడా భారత్ స్థానం కల్పించింది. కాబట్టి దీనిని ప్రత్యేక రాజకీయ నిర్ణయంగా చూడాల్సిన అవసరం లేదు” అంటారు సీనియర్ జర్నలిస్ట్ , అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు జయంతా చౌదరి

“భారత్ గతంలో వేర్వేరు దేశాల రాజకీయ నాయకులతో సమాంతర సంబంధాలను కొనసాగించింది. ఉదాహరణకు నేపాల్‌లో వేర్వేరు ప్రధానమంత్రులతోనూ, పాకిస్తాన్‌లో వేర్వేరు ప్రభుత్వాలతోనూ భారత్ సంబంధాలు కొనసాగించింది” అన్నారు జయంతా చౌదరి.

భారత్, బంగ్లాదేశ్, సంబంధాలు, తారిక్ రెహమాన్, షేక్ హసీనా

ఫొటో సోర్స్, Getty Images

తారిక్ రెహమాన్‌‌ను భారత్ ఒప్పిస్తుందా?

భారత్ తన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తారిక్ రెహమాన్‌ను ఒప్పించడానికి ప్రయత్నిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు డాక్టర్ సంజయ్ భరద్వాజ్ మాట్లాడుతూ, “మనం ‘ప్రస్తుత ప్రభుత్వం’తో కలిసి పనిచేయాలని భారత్ అర్థం చేసుకుంది. అంటే అధికారంలో ఎవరున్నావారితో సంబంధాలు కొనసాగించి, తమ ప్రయోజనాలను కాపాడుకోవాలి. ఈ సందర్భంలో తారిక్ రెహమాన్‌కు ప్రజల మద్దతు లభించి ఆయన ప్రధాని అయ్యారు కనుక భారత్ ఆయనతో పనిచేస్తుంది, బంగ్లాదేశ్ భారత్‌కు అత్యంత ముఖ్యమైన పొరుగు దేశం” అన్నారు.

“భారత్ ఎప్పుడూ ఒకే పార్టీతో సంబంధాలు కొనసాగించలేదు. జనరల్ జియా ఉర్ రెహమాన్ కాలంలో కూడా భారత ప్రధాని మోరార్జీ దేశాయ్ బంగ్లాదేశ్ వెళ్లారు. ఖలీదా జియా అధికారంలో లేకపోయినా, దిల్లీకి వచ్చినప్పుడు ఆమెకు ‘హెడ్ ఆఫ్ స్టేట్’ స్థాయి ప్రోటోకాల్ ఇచ్చారు” అని జయంతా చౌదరిచెప్పారు.

“నరేంద్ర మోదీ ఢాకా వెళ్లినప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా ఖలీదా జియాతో సమావేశమయ్యారు. అలాగే జమాత్-ఎ-ఇస్లామీ వంటి మూడో రాజకీయ శక్తితో కూడా భారతీయ దౌత్యస్థాయిలో చర్చలు జరిగాయి. కాబట్టి భారత్ ఒకే పక్షంతో నిలబడుతుంది అని చెప్పడం పూర్తిగా సరైనది కాదు” అన్నారు.

అయితే షేక్ హసీనా తన పదవీకాలంలో భారత్‌కు ప్రాధాన్యం ఇచ్చారని , భారత్, బంగ్లాదేశ్ మధ్య ప్రతి స్థాయిలో సహకారాన్ని పెంచారని విశ్లేషకులు అంగీకరిస్తున్నారు.

షేక్ హసీనా పదవీకాలంలో, భారత్, బంగ్లాదేశ్‌కు సుమారు 10 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 92,000 కోట్లు రూపాయలు) రుణాన్ని అందించింది. దీంతోఈశాన్య ప్రాంతాల అనుసంధానం, ఇంధనం, వాణిజ్యం , అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు జరుగుతున్నాయి.

“భారత్,తూర్పు ప్రాంతం వ్యూహాత్మక , ఆర్థిక స్థిరత్వంలో బంగ్లాదేశ్ కీలక పాత్ర పోషిస్తుంది. రెండు దేశాల మధ్య చాలా లోతైన పరస్పర ఆధారిత సంబంధం ఏర్పడింది. ఏ ప్రభుత్వమూ సంబంధాలను తెంచుకోవడం లేదా దూరాన్ని సృష్టించడం ఆచరణాత్మకం కాదు” అని సంజయ్ భరద్వాజ్ అన్నారు.

తారిక్ రెహమాన్‌ నేతృత్వంలోని బీఎన్‌పీ, జమాత్-ఎ-ఇస్లామీలా అతివాద ఇస్లాం వైపు మొగ్గు చూపకపోయినా, ఇస్లాం పట్ల ఉదారంగా వ్యవహరిస్తుంది.

ఈ పరిస్థితిలో, కొత్త ప్రధాన మంత్రి తారిక్ రెహమాన్‌పై భారత్ ఎంత నమ్మకం ఉంచాలనేది కీలక ప్రశ్న.

“భారత్ భద్రతా ఆందోళనలలో షేక్ హసీనా చాలా అంశాలను పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఆమె నాయకత్వంలో భారత్–బంగ్లాదేశ్ సంబంధాలకు బలమైన పునాది ఏర్పడింది. ఆమె రాజకీయం లౌకికవాదం, సమగ్రతతో కూడిన బెంగాలీ జాతీయవాదంపై ఆధారపడి ఉంది. దీనికి విరుద్ధంగా, బీఎన్‌పీ ప్రాథమిక సిద్ధాంతం ‘ఇస్లాం పట్ల ఉదారతతో’ అనుబంధమై ఉంది. ఇది జమాత్-ఎ-ఇస్లామీలా అతివాద ఇస్లాం కాదు, కానీ చారిత్రకంగా మతపరమైన గుర్తింపును రాజకీయ చర్చల్లోకి తీసుకురావడం బీఎన్‌పీ ధోరణిగా ఉంది” అని ప్రొఫెసర్ సంజయ్ భరద్వాజ్ అన్నారు.

తారిక్ రెహమాన్‌ తండ్రి జియా ఉర్ రెహమాన్‌ కాలంలో, రాజ్యాంగంలోని ఐదవ సవరణ ద్వారా ‘సెక్యులరిజం’ అనే పదాన్ని తొలగించి, ‘అల్లాపై విశ్వాసం’ వంటి పదాలను చేర్చారు. బెంగాలీ జాతీయవాదాన్ని ‘బంగ్లాదేశీ జాతీయవాదం’గా పునర్నిర్వచించారు.

“ఈ సిద్ధాంతపరమైన నేపథ్యం బీఎన్‌పీ రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. కాబట్టి తారిక్ రెహమాన్‌పై ఎంత నమ్మకం ఉంచాలనేది భారత్ ముందున్న ప్రశ్నగానే ఉంటుంది” అని ప్రొఫెసర్ సంజయ్ భరద్వాజ్ అన్నారు.

దీని వెనుక చారిత్రక కారణాలు ఉన్నాయి. 2001, 2006 మధ్య, బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ అధికారంలో ఉన్నప్పుడు, భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు అంత బాగా లేవు.

“ఆ సమయంలో, ఈశాన్య ప్రాంతాల నుంచి అనేక తిరుగుబాటు గ్రూపులు బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందుతున్నాయని , ఇస్లామిక్ ఛాందసవాద సంస్థల కార్యకలాపాలు కూడా పెరిగాయని ఆరోపణలు వచ్చాయి” అని ప్రొఫెసర్ సంజయ్ భరద్వాజ్ అన్నారు.

బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం కూడా భారత్‌తో సంబంధాలపై స్పష్టమైన సందేశం ఇస్తోంది.

తారిక్ రెహమాన్ సలహాదారు హుమాయున్ కబీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “భారత్ బంగ్లాదేశ్ కొత్త రాజకీయ వాస్తవాన్ని అర్థం చేసుకుని, తన విధానాన్ని దానికి అనుగుణంగా మార్చుకోవాలి. కొత్త ప్రభుత్వం భారత్‌తో సమతుల్య, పరస్పర గౌరవం, పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉన్న సంబంధాలను కోరుకుంటోంది. ఏకపక్షంగా ఆధారపడే సంబంధాలను కాదు” అన్నారు.

భారత్, బంగ్లాదేశ్, సంబంధాలు, తారిక్ రెహమాన్, షేక్ హసీనా

ఫొటో సోర్స్, Getty Images

దేశీయ సవాళ్లు

ఇటీవలి నెలల్లో భారత్–బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతలు కనిపించాయి. రెండు దేశాలు ఒకదానిపై మరొకటి మైనారిటీల హక్కుల ఉల్లంఘనపై ప్రశ్నలు లేవనెత్తాయి.

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై హింసాత్మక ఘటనల నివేదికల తర్వాత భారత్‌లో ఆగ్రహం వ్యక్తమైంది, అనేక చోట్ల నిరసనలు కూడా జరిగాయి.

భారతీయ రాజకీయ పార్టీలు అక్రమ బంగ్లాదేశీల సమస్యను తరచూ ప్రస్తావిస్తుంటాయి, కొంతమంది నేతలు దీనిపై కఠిన వ్యాఖ్యలు కూడా చేశారు.

అదే సమయంలో, బంగ్లాదేశ్‌లో కూడా ఇటీవలి నెలల్లో భారత్ వ్యతిరేక భావన వ్యక్తమైంది.అయితే, బంగ్లాదేశ్‌లో కొత్త ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

“కొన్నేళ్ల క్రితం వరకు బంగ్లాదేశ్‌పై భారత ప్రజల దృక్పథం చాలా సానుకూలంగా ఉండేది. కానీ దాదాపు ఏడున్నర సంవత్సరాల్లో రాజకీయ అస్థిరత, మైనారిటీలపై దాడుల వార్తలు భారతీయ ప్రజాభిప్రాయంలో మార్పు తీసుకువచ్చాయి. ఇలాంటి భావనలు శాశ్వతం కావు” అని సంజయ్ భరద్వాజ్ అంటున్నారు.

అయితే తారిక్ రెహమాన్‌కు అంతర్గతంగానూ ఒక సవాలు ఉంటుంది. ఆయన భారత్ ప్రభావంలో లేరని నిరూపించుకోవాలి అని విశ్లేషకులు భావిస్తున్నారు.

“చిన్న దేశాల రాజకీయాల్లో పెద్ద పొరుగు దేశంపై అనుమానం లేదా పోటీ భావన సహజం. బంగ్లాదేశ్‌లో కూడా ఏ నాయకుడిపైనైనా ‘భారత్‌కు అమ్ముడయ్యాడు’ అనే ఆరోపణ రావడం కొత్త విషయం కాదు. కాబట్టి తారిక్ రెహమాన్‌ కూడా జాగ్రత్తగా అడుగులు వేయాలి, లేకపోతే దేశీయ రాజకీయాల్లో ఆయనపై ఈ భావన ఏర్పడే ప్రమాదం ఉంది” అని జయంతా చౌదరి అన్నారు.

భారత్ సమతుల్యతను కాపాడుకోగలదా?

గతేడాది నవంబర్‌లో షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ భారత్‌ను డిమాండ్ చేసింది. అయితే, బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉన్నామని భారత్ అప్పట్లో ప్రకటించింది.

ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం షేక్ హసీనాను అప్పగించాలని డిమాండ్ చేస్తే, భారత్ ఏం చేస్తుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

“షేక్ హసీనాను భారత్ అంత తేలికగా వెనక్కి పంపుతుందని అనుకోను, ఇది ఢాకాలో పెద్ద రాజకీయ చర్చ అవుతుంది. కొత్త ప్రభుత్వం ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటే, అది దేశంలో అస్థిరతను పెంచుతుంది. ఏమీ చేయకపోయినా, రాజకీయ ప్రమాదం ఉంటుంది” అని జయంతా చౌదరి అన్నారు.

అయితే సమీప భవిష్యత్తులో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగుపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

“భారత్–బంగ్లాదేశ్ రెండూ ఒకటి లేకుండా మరొకటి ముందుకు సాగలేవని తెలుసుకున్నాయి. కాబట్టి రాజకీయ ఒడిదుడుకులున్నా సహకారం కొనసాగుతుంది. తేడా ఏమిటంటే, కొత్త ప్రభుత్వం దేశీయ రాజకీయాలు, ప్రాంతీయ సమతుల్యత మధ్య సరైన మార్గం కనుక్కోవాలి” అని జయంతా చౌదరి అన్నారు.

బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వ వ్యవహరించే తీరుపై భారత్ వైఖరి ఆధారపడి ఉంటుందని సంజయ్ భరద్వాజ్ అన్నారు.

“ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు భారత్ అవసరం ఎంత ఉందో అంతకంటే ఎక్కువగా భారత్‌కు బంగ్లాదేశ్ అవసరం ఉంది” అని బంగ్లాదేశ్, దక్షిణాసియా వ్యవహారాల నిపుణులు ప్రొఫెసర్ మహేంద్ర లామా అభిప్రాయపడ్డారు.

భారత్ పొరుగు దేశాలను తనపై ఆధారపడేలా ఉంచుతుందనే భావన ఉంది. ఇప్పుడు భారత్ పరస్పర ఆధారిత సంబంధాల వైపు అడుగులు వేయాలి, పొరుగు దేశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి” అని ఆయన అన్నారు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య పొడవైన సరిహద్దు ఉంది. భారత్‌ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ చుట్టూ ఉన్నాయి.

ఈ భౌగోళిక వాస్తవాన్ని ప్రస్తావిస్తూ “భారత్ ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో సంబంధాలను పెంచడానికి నిజమైన చర్యలు తీసుకోవాలి. తారిక్ రెహమాన్‌ తల్లి, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మరణించినప్పుడు, ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్‌ను బంగ్లాదేశ్‌కు పంపారు. ఇది ఒక సానుకూల సంకేతం. దీని ద్వారా సంభాషణ, సంబంధాలను మెరుగుపరచడానికి మార్గం తెరుచుకుంది. భారత్ ఈ దిశలో మరింత ముందుకు సాగాలి” అన్నారు ప్రొఫెసర్ లామా.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)