SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
దిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో కీలక ప్రసంగం చేయాల్సిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, చివరి నిమిషంలో విరమించుకున్నారు. ప్రసంగానికి కొద్ది గంటల ముందు గేట్స్ ఫౌండేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది.
సదస్సు తాలూకా అసలు లక్ష్యంపైనే అందరి దృష్టి ఉండాలని, బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. అయితే, దీనిపై పూర్తిస్థాయిలో వివరణ ఇవ్వలేదు.
లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించి అమెరికా న్యాయశాఖ జనవరిలో విడుదల చేసిన కొత్త పత్రాలలో బిల్ గేట్స్ పేరు బయటకు వచ్చింది. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్ గేట్స్‌కు ఉన్న సంబంధాలపై వివాదం నెలకొంది.
బిల్ గేట్స్ ఏదైనా తప్పు చేసినట్లు ఎప్‌స్టీన్ బాధితుల్లో ఎవరూ ఆరోపణలు చేయలేదు. అలాగే, ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బిల్ గేట్స్ పేరు కనిపించినంత మాత్రాన ఆయన ఏదైనా నేరానికి పాల్పడినట్లు అర్థం కాదు.
ఆ పత్రాలలో ఉన్న ఆరోపణలు అత్యంత హాస్యాస్పదమైనవని, పూర్తిగా అవాస్తవమని గేట్స్ ప్రతినిధి కొట్టిపారేశారు. అలాగే, ఎప్‌స్టీన్‌తో సమయం గడిపినందుకు తాను విచారిస్తున్నానని బిల్ గేట్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం నేపథ్యంలోనే బిల్ గేట్స్ ఇండియా ఏఐ సమ్మిట్ నుంచి వైదొలిగారు.
బిల్ గేట్స్‌కు బదులుగా మైక్రోసాఫ్ట్ ఆఫ్రికా, ఇండియా విభాగాల అధ్యక్షుడు అంకుర్ వోరా ఈ సదస్సులో ప్రసంగిస్తారని గేట్స్ ఫౌండేషన్ తెలిపింది. భారత్‌తో సమష్టిగా నిర్దేశించుకున్న ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ఆ సంస్థ స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
బిల్ గేట్స్ నిర్ణయం ప్రభావం ఎంత?
బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. అయితే దిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నుంచి తప్పుకుంటారని గత కొన్ని రోజులుగా మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి.
ఆ వార్తలను గేట్స్ ఫౌండేషన్ తోసిపుచ్చడమే గాక, నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే బిల్ గేట్స్ ప్రసంగం ఉంటుందని పేర్కొంటూ మంగళవారం ప్రకటించింది.
కానీ, చివరకు గురువారం ఉదయం బిల్ గేట్స్ ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లుగా గేట్స్ ఫౌండేషన్ వెల్లడించింది.
బిల్ గేట్స్ ఆఖరి నిమిషంలో ఇలా విరమించుకోవడం ఈ సమ్మిట్‌కు ఒక పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే, భారతదేశాన్ని ప్రపంచ ఏఐ హబ్‌గా నిలబెట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సదస్సును ఒక ప్రతిష్ఠాత్మకమైన వేదికగా ప్రచారం చేసింది.
కొన్ని దేశాల నుంచి అగ్రస్థాయి నేతలతో పాటు, దాదాపు వంద కంటే ఎక్కువ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారత్ సహా పలు దేశాల్లో ఏఐ మౌలిక సదుపాయాలను, సాంకేతికతను విస్తరించడానికి భారీగా పెట్టుబడులు పెడతామని ఈ సదస్సులో హామీ ఇచ్చాయి.
ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్, ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడై తదితర ప్రముఖులు సదస్సుకు హాజరయ్యారు.
ఫొటో సోర్స్, Reuters
ఏఐ వికేంద్రీకరణకు పిలుపు…
ఏఐ నియంత్రణకు ప్రపంచ దేశాలు తక్షణమే చర్యలు చేపట్టాలని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ కోరారు.
”మానవాళి వికాసానికి ఏఐ సాంకేతికతను వికేంద్రీకరించడం అత్యుత్తమ మార్గం. ఒకే సంస్థ లేదా ఒకే దేశం చేతుల్లో ఇది కేంద్రీకృతమైతే, అది వినాశనానికి దారితీస్తుంది” అని ఆయన హెచ్చరించారు.
దీని అర్థం మనకు ఎటువంటి నియంత్రణలు లేదా రక్షణలు అవసరం లేదని కాదన్నారు.
అంతకుముందు ఈ సమ్మిట్‌లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కూడా ఈ తరహా అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.
”ఏఐ అనేది అందర్నీ కలుపుకొనిపోయేదిగా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాధికారతను సమకూర్చే సాధనంగా మారాలి” అని మోదీ పిలుపునిచ్చారు.
మోదీతో ద్వైపాక్షిక చర్చల తర్వాత మేక్రాన్ మాట్లాడుతూ, ఏఐకు సంబంధించిన చర్చలను ‘మనం ఇంకా ఎక్కువ చేద్దాం’ అనే స్థాయి నుంచి ‘మనం సమష్టిగా మరింత మెరుగ్గా చేద్దాం’ అనే దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదే అంశాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరిస్ సహా పలువురు వక్తలు ప్రస్తావించారు.
ఫొటో సోర్స్, Getty Images
విశాఖపట్నంలో ఫుల్-స్టాక్ ఏఐ హబ్…
సమ్మిట్‌లో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రసంగిస్తూ, ఏఐ రంగంలో పెరుగుతున్న భారత్ పాత్రను ప్రస్తావించారు. విశాఖపట్నంలో తమ సంస్థ ఒక ఫుల్-స్టాక్ ఏఐ హబ్‌ను ఏర్పాటుచేసే పనిలో ఉందని చెప్పారు. ఇది భారతీయులకు ఉద్యోగాలను, అత్యున్నత స్థాయి ఏఐ సాంకేతికతను చేరువ చేస్తుందని అన్నారు.
భారతదేశపు ఏఐ ఎకోసిస్టమ్‌ను తీర్చిదిద్దడానికి రానున్న ఏడేళ్లలో 110 బిలియన్ డాలర్ల (సుమారు 9.15 లక్షల కోట్ల రూపాయలు) భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ప్రకటించారు.
అలాగే, ఏఐ మోడల్స్ భద్రత, రక్షణపరమైన రిస్క్‌లను పరీక్షించడం, అంచనా వేసే విషయంలో భారతదేశంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆంత్రోపిక్ సీఈవో డారియో అమోడై చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



