SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
యుద్ధ ప్రభావం భారత్ వరకు చేరడానికి ప్రధాన కారణాలలో ఒకటి ఎల్‌పీజీ కొరత.
దీనివల్ల అనేకచోట్ల మెస్‌లు మూతపడ్డాయి, రెస్టారెంట్ల మెనూలు మారిపోయాయి, టీ, కాఫీలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.
ఎల్‌పీజీ కోసం భారత్ ఇతర దేశాలపై ఆధారపడటమే దీనికి ప్రధాన కారణం.
పుణెలోని నేషనల్ కెమికల్ లేబోరేటరీ శాస్త్రవేత్తలు దీనికి పరిష్కారాన్ని కనుగొన్నారు. ‘డై మిథైల్ ఈథర్’ అనే కృత్రిమ ఇంధనాన్ని ఎన్‌సీఎల్ శాస్త్రవేత్తలు తయారు చేశారు.
గత 20 ఏళ్లుగా ప్రయోగాలు చేసి వారు ఈ ఇంధనాన్ని రూపొందించారు. ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా నిలిచే ఈ ఇంధనాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రస్తుతం కృషి చేస్తున్నారు.

భారత్‌లో అందుబాటులో ఉన్న పదార్థాలతోనే..
డై మిథైల్ ఈథర్ అనేది ఒక కృత్రిమ ఇంధనం. దీనిని రసాయనిక ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. గత 20 ఏళ్లుగా ఎన్‌సీఎల్ డైరెక్టర్ డాక్టర్ ఆశిష్ లేలే, డాక్టర్ తిరుమలైస్వామి రాజా దీనిపై పరిశోధనలు చేస్తున్నారు.
“మేం డైరెక్ట్ డీఎంఈ, ఇన్‌డైరెక్ట్ డీఎంఈ రెండింటినీ తయారు చేయడానికి ప్రయత్నించాం. దీనికి అత్యంత ముఖ్యమైనది ఉత్ప్రేరకం” అని డాక్టర్ తిరుమలైస్వామి రాజా తెలిపారు.
“భారత్‌లో అందుబాటులో ఉన్న పదార్థాలతోనే ఈ ఉత్ప్రేరకాన్ని తయారు చేశాం. నాలుగు రకాల ఉత్ప్రేరకాలను సిద్ధం చేసి, చివరికి దీనిని రూపొందించాం” అని తెలిపారు.
డాక్టర్ ఆశిష్ లేలే మాట్లాడుతూ.. “100 శాతం డీఎంఈని ఉత్పత్తి చేయడంలో సహాయపడే ఉత్ప్రేరకాన్ని తయారు చేయడమే మా లక్ష్యం. దీనికి కావాల్సిన అన్ని వనరులు భారత్‌లోనే ఉన్నాయి. ఏదీ దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. సుమారు 10 బార్ పీడనం తట్టుకునేలా ఈ ఉత్ప్రేరకం తయారవుతుంది. ఇది చాలా దృఢంగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఆచరణలో క్లిష్టం
డాక్టర్ ఆశిష్ వివరణ ప్రకారం, ఈ రసాయనిక ప్రక్రియను అర్థం చేసుకోవడం చాలా సులభం. రెండు మిథనాల్ అణువులను కలిపి, వాటి నుంచి ఒక నీటి అణువును వేరు చేస్తే మిగిలేదే ‘డై మిథైల్ ఈథర్’.
అయితే, సిద్ధాంతపరంగా సులభంగా అనిపించినా, ఈ ప్రక్రియను ఆచరణలో పెట్టడం క్లిష్టమైన పని.
“మొదట మిథనాల్‌కు ఉత్ప్రేరకాన్ని జోడించినప్పుడు రసాయనిక చర్య జరిగి డీఎంఈ తయారవుతుంది. అయితే, చిన్న స్థాయిలో విజయవంతమైన ఈ ప్రక్రియను భారీ స్థాయిలో చేపట్టినప్పుడు కూడా అదే ఫలితం వస్తుందా? అనేది ప్రధాన ప్రశ్న. ఇందుకోసం మేం వేర్వేరు పరిమాణాల్లో డీఎంఈని తయారు చేసి చూశాం. ఈ ప్రయోగం కూడా సక్సెస్ అయ్యింది” అని డాక్టర్ ఆశిష్ వివరించారు.
ఫొటో సోర్స్, Getty Images
‘స్వచ్ఛ ఇంధనం’
ప్రస్తుత రూపంలో ఉన్న డీఎంఈని గ్యాస్ స్టవ్‌కు అనుసంధానించి వెలిగిస్తే, మంటలు కూడా కనిపించనంత స్వచ్ఛంగా ఈ ఇంధనం మండుతుంది. ఇది పొగ, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ ఆక్సైడ్లు, సూక్ష్మ కణాల ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది.
దీంతో పాటు, దీని ఉష్ణ సామర్థ్యం సంప్రదాయ ఇంధనాలతో సమానంగా ఉంటుంది. అందుకే ఇది ఒక ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. పర్యావరణ దృష్ట్యా కూడా ఈ ఇంధనం చాలా అనుకూలమైనది.
“మనం ఇంట్లో వాడే ఎల్‌పీజీ స్టవ్‌లలో కార్బన్ పేరుకుపోతుంటుంది. ఆ కార్బన్‌ను మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, డీఎంఈ విషయంలో మాత్రం అలాంటిదేమీ జరగదు. ఇది అత్యంత స్వచ్ఛంగా మండుతుంది, ఎంతలా అంటే దాని మంటలు కూడా మనకు స్పష్టంగా కనిపించవు” అని డాక్టర్ ఆశిష్ వివరించారు.
ఎన్‌సీఎల్ అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో కూడుకున్నది. దీని కోసం ఉపయోగించే ఉత్ప్రేరకం కూడా ఎంతో ఆదాను ఇస్తుంది.
డాక్టర్ తిరుమలైస్వామి రాజా ఈ ఉత్ప్రేరకం కోసం ప్రత్యేకంగా ఒక రియాక్టర్‌ను కూడా సిద్ధం చేశారు. ఇదే ఈ సాంకేతికతలోని ప్రధాన ప్రత్యేకత. ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌లో రోజుకు 12 నుంచి 13 కిలోల డీఎంఈ తయారవుతోంది. అయితే, ప్రస్తుతం రోజుకు 250 కిలోల ఇంధనాన్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
‘దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది’
ఎన్‌సీఎల్ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ప్రస్తుతం తక్కువ పరిమాణంలో డీఎంఈ తయారవుతున్నప్పటికీ, ఎల్‌పీజీపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడంలో ఇది పెద్ద ఊరటనిస్తుంది.
ఎన్‌సీఎల్‌లో ప్రస్తుతం సిద్ధం చేసిన ప్రోటోటైప్, 100 శాతం ఎల్‌పీజీ లేదా 100 శాతం డీఎంఈతో కూడా పనిచేయగలదు. బెంగళూరులోని ‘ఎల్‌పీజీ ఎక్విప్‌మెంట్ రీసెర్చ్ సెంటర్’ లో దీనిని ఇప్పటికే పరీక్షించారు. ఈ సాంకేతికత ద్వారా కేవలం 10 బార్ పీడనం వద్దే డీఎంఈని తయారు చేయవచ్చు. దీనిని నేరుగా ఎల్‌పీజీ సిలిండర్లలో నింపవచ్చు.
“ఎల్‌పీజీ ఎలాగైతే ద్రవ రూపంలోకి మారుతుందో, డీఎంఈ కూడా అలాగే మారుతుంది. 7 బార్ పీడనం వద్ద డీఎంఈ ద్రవంగా మారుతుంది, ఇది ఎల్‌పీజీలో పూర్తిగా కలిసిపోతుంది” అని డాక్టర్ ఆశిష్ తెలిపారు.
“ప్రస్తుతం ఎల్‌పీజీలో 8 శాతం డీఎంఈని కలిపి ప్రయోగాత్మకంగా పరిశీలించాం. ఇలా 8 శాతం కలిపిన ఇంధనాన్ని ప్రస్తుతమున్న స్టవ్‌లు, సిలిండర్లలోనే నేరుగా వాడుకోవచ్చు. మన మొత్తం ఎల్‌పీజీ వినియోగంలో 8 శాతం అంటే, అది దిగుమతులపై చూపే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మొదట 8 శాతంతో ప్రారంభించి, భవిష్యత్తులో దీనిని 20 శాతం వరకు పెంచవచ్చు” అన్నారు ఆశిష్.
ఆర్థికంగా దేశానికి ఊరట
భారత్ 2024లో 21 మిలియన్ టన్నుల ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంది. ఇందులో కేవలం 8 శాతం డీఎంఈ కలిపినా ఏటా వేలాది కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.
శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న 10.5 కోట్ల గ్యాస్ కనెక్షన్ల కోసం 8 శాతం డీఎంఈని ఉపయోగిస్తే, రోజుకు 1,300 టన్నుల డీఎంఈ ఉత్పత్తి అవసరం. దీనిని ఎల్‌పీజీలో కలిపి ఉపయోగించడం వల్ల వినియోగదారులు ప్రత్యేకంగా కొత్త స్టవ్‌లు లేదా సిలిండర్లు కొనాల్సిన అవసరం లేదు.
అనేక దేశాల్లో ఇప్పుడే డీఎంఈని తయారు చేస్తున్నారు కానీ, అక్కడ దీనిని పర్యావరణహిత ఉత్పత్తులైన డియోడరెంట్లు లేదా ఇతర రంగాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే, ఆ తయారీ సాంకేతికతను ఏ దేశం కూడా బయటకు వెల్లడించడం లేదు.
ఇప్పుడు భారత్ సొంతంగా ఉత్ప్రేరకాన్ని, డీఎంఈ తయారీ విధానాన్ని అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేశారు.
నేషనల్ కెమికల్ లాబొరేటరీ ప్రస్తుతం ఒక ఇంజనీరింగ్ భాగస్వామితో కలిసి రాబోయే 6 నుంచి 9 నెలల్లో రోజుకు 2.5 టన్నుల సామర్థ్యం గల పారిశ్రామిక ప్రదర్శన ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రోజుకు 500 నుంచి 1,000 టన్నుల సామర్థ్యం గల వాణిజ్య ప్లాంట్ల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



