SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Getty Images
9 గంటలు క్రితం
చదివే సమయం: 4 నిమిషాలు
‘జాతీయ జట్టు ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో కిచెన్, పాత్రలు, దుస్తులు, బాత్రూమ్‌లు శుభ్రం చేయాల్సి వచ్చింది. మా ఆహారాన్ని మేమే వండుకున్నాం, వీధుల్లో నివసించాం. పాత్రలు కడిగి శుభ్రం చేసిన తర్వాత ఆటగాళ్లు మ్యాచ్‌లో ఎలా రాణిస్తారు?’
..పాకిస్తాన్ జాతీయ హాకీ జట్టు కెప్టెన్ ఇమాద్ బట్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత లాహోర్ విమానాశ్రయంలో మీడియాతో చేసిన వ్యాఖ్యలివి.
ప్రో హాకీ లీగ్‌లో ఆస్ట్రేలియాలో వరుస పరాజయాల తర్వాత పాకిస్తాన్ హాకీ జట్టు బుధవారం ఉదయం స్వదేశానికి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్‌పై కెప్టెన్ ఇమాద్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుత టీం మేనేజ్‌మెంట్‌లో కొనసాగలేమని చెప్పారు.
మరోవైపు, యాజమాన్యంపై వచ్చిన ఆరోపణలను హాకీ జట్టు కోచ్ తిరస్కరించారు, దర్యాప్తునకు డిమాండ్ చేశారు.
గత కొన్ని రోజులుగా, ఆస్ట్రేలియాలో ఉన్న పాకిస్తాన్ హాకీ జట్టు ఆటగాళ్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వారు వంట చేస్తున్నట్లు, పాత్రలు శుభ్రం చేస్తున్నట్లు ఆ ఫొటోలు, వీడియోలలో ఉంది. కొన్ని ఫోటోలలో ప్లేయర్లు బ్యాగులతో రోడ్డు పక్కన కూర్చున్నట్లు కనిపించింది.
మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. పాకిస్తాన్ హాకీ టీం మేనేజ్‌మెంట్ లోపం, నిధుల కొరత కారణంగా ఆస్ట్రేలియాలో ఆ జట్టు వసతి, ఆహారం విషయంలో సమస్యలను ఎదుర్కొంది. ఈ ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత పాక్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ దర్యాప్తునకు ఆదేశించారు.

ఫొటో సోర్స్, Hockey Pakistan
పాక్ హాకీ జట్టు కెప్టెన్ ఏం చెప్పారు?
బుధవారం ఉదయం లాహోర్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన కెప్టెన్ ఇమాద్ బట్.. సోషల్ మీడియాలో వారి దుస్థితిని చూపించే చిత్రాలు, వీడియోలు నిజమేనని అన్నారు.
అయితే, బీబీసీ ఈ ఫోటోలు, వీడియోలను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
“ఆస్ట్రేలియాలో కిచెన్, పాత్రలు, బాత్రూమ్‌లు శుభ్రం చేసుకోవల్సి వచ్చింది. వీధుల్లో నివసించాం. దీనిపై నేను పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డుతో మాట్లాడితే, జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరే ముందే పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్‌కు అవసరమైన నిధులు ఇచ్చామన్నారు. కానీ, నేను జట్టు మేనేజ్‌మెంట్‌ను అడిగితే, స్పోర్ట్స్ బోర్డు కావాల్సిన నిధులు ఇవ్వలేదని బదులిచ్చారు” అని కెప్టెన్ ఇమాద్ అన్నారు.
“పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు తప్పు చేసిందో లేక పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ అడ్మినిస్ట్రేషన్ తప్పు చేసిందో నాకు తెలియదు కానీ, మా జట్టు మేనేజ్‌మెంట్ చాలా అబద్ధాలు చెప్పిందని అర్థమైంది” అన్నారు ఇమాద్.
“నేను ఎవరికీ భయపడను. జట్టు మేనేజ్‌మెంట్ ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసింది. ప్రతి ఆటగాడిని కెప్టెన్ ఇమాద్ బట్ వెంట ఉన్నారా లేదా పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్‌తో ఉన్నారా అని అడిగింది” అన్నారు ఇమాద్.
పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్ లేదా స్పోర్ట్స్ బోర్డు ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు.
“ఆస్ట్రేలియాకు చేరుకున్న తర్వాత, ఆటగాళ్లు 13 నుంచి 14 గంటల పాటు ఒపెరా స్ట్రీట్‌లో నిరాశ్రయుల్లా తిరిగారు. అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి సహాయం లేదు. హాకీ జట్టు రోడ్డుపై కూర్చున్నట్లు సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు, ఫోటోలు అన్నీ నిజమే” అని ఇమాద్ అన్నారు.
“ఐదు రోజుల్లో ప్రపంచకప్ అర్హత రౌండ్ ప్రారంభం కానుంది. ఇది పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్, జాతీయ జట్టు రెండింటికీ ముఖ్యమైన ఈవెంట్. ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉన్నందున, ప్రస్తుత జట్టు మేనేజ్‌మెంట్‌తో ముందుకు సాగలేం” అని చెప్పారు కెప్టెన్ ఇమాద్.
“ఈ ఘటనపై వీలైనంత త్వరగా దృష్టి సారించాలని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్‌లను అభ్యర్థిస్తున్నాను” అన్నారు.
అయితే, హాకీ ఆటగాళ్ల ఘటనపై దర్యాప్తునకు ఆదేశించి, దోషులపై తక్షణ చర్యలు తీసుకుంటామని ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మంగళవారం ప్రకటించారు.
ఫొటో సోర్స్, Hockey Pakistan
కోచ్ ఏమన్నారు?
నిన్నటివరకు జట్టు మేనేజ్‌మెంట్ పనితీరును ప్రశంసించారని, జట్టు మెరుగుపడుతోందని, కానీ ఇటీవలి విషయాలు మీడియా ద్వారా మాత్రమే తెలిశాయని పాకిస్తాన్ హాకీ జట్టు ప్రధాన కోచ్ తాహిర్ జమాన్ చెప్పారు.
అకస్మాత్తుగా ఏం జరిగిందని, యాజమాన్యంతో ఎందుకు కలిసి పనిచేయకూడదని ఆయన ప్రశ్నించారు.
ఇతర కోచ్‌లు మొహమ్మద్ ఉస్మాన్, జీషన్ అష్రఫ్‌లతో కలిసి మీడియాతో మాట్లాడిన తాహిర్ జమాన్, సమస్యలకు పరిష్కారం దొరకాలన్నా, పరిస్థితులను సరైన దిశలో నడిపించాలన్నా, దీని వెనుక ఉన్న ఉద్దేశాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
“పాకిస్తాన్ హాకీ ముందుకు సాగుతోంది. ఓటమి ఆటలో భాగమే” అన్నారాయన.
ఆటగాళ్లలో విభేదాలపై ప్రశ్నిస్తే, కొన్నిసార్లు క్లిష్ట పరిస్థితుల్లో వాటికవే పరిష్కారమవుతాయని అన్నారు కోచ్ తాహిర్ జమాన్.
“డబ్బులు లేవని, ప్లేయర్లను బయటకు పంపించారనడం తప్పుడు ప్రకటనలు. ప్లేయర్లు అపరిపక్వతను చూపిస్తున్నారు” అని తాహిర్ జమాన్ అన్నారు.
యాజమాన్యంపై విమర్శలు చేసిన ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారా అని అడిగితే, పరిస్థితిపై వివరణాత్మక నివేదికను పాకిస్తాన్ హాకీ ఫెడరేషన్‌కు సమర్పించామని, వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తాహిర్ జమాన్ అన్నారు.
ఘటనపై పారదర్శక దర్యాప్తు జరగాలని, భవిష్యత్తులో మీడియాతో మాట్లాడేవారికి అధికారిక ప్రవర్తనా నియమావళిని కూడా సిద్ధం చేయాలని కోచ్ అభిప్రాయపడ్డారు.
“క్రమశిక్షణ ముఖ్యమని నమ్ముతాను. ఇది అందరికీ, అధికారులకు, ఆటగాళ్లకు ముఖ్యం” అన్నారు తాహిర్ జమాన్.
ఘటనపై పాకిస్తాన్ మాజీ హాకీ ప్లేయర్ ఫైసల్ ఇక్బాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ ‘పాకిస్తాన్ ప్రభుత్వం ఈ విషయంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి పన్ను చెల్లింపుదారుల డబ్బు ఎక్కడికి వెళుతోంది, హాకీ అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారా లేదా తెలుసుకోవాలి’ అని తెలిపారు.
“పాకిస్తాన్‌లో హాకీ ఈ స్థితికి రావడానికి అసలు కారణం అవినీతి. హాకీ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోంది” అన్నారు ఫైసల్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



