Home జాతీయ national telgu ఆంధ్రప్రదేశ్: జలపాతం వద్ద ముగ్గురు బాలికలు నీళ్లలో మునిగిపోతున్న వీడియో వైరల్, అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్: జలపాతం వద్ద ముగ్గురు బాలికలు నీళ్లలో మునిగిపోతున్న వీడియో వైరల్, అసలేం జరిగింది?

18
0

SOURCE :- BBC NEWS

అల్లూరి జిల్లా, వాటర్ ఫాల్స్, ప్రమాదం, యువతులు, నేరాలు, వాటర్ ఫాల్స్

ఫొటో సోర్స్, UGC

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక జలపాతం వద్ద ముగ్గురు అమ్మాయిలు నీళ్లలో మునిగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సెలవుల్లో సరదాగా గడుపుదామని వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లిన నలుగురిలో ముగ్గురు టీనేజ్ బాలికలు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారని, ఫోటోల సరదా ఆ ముగ్గురి ప్రాణాలు తీసిందని అల్లూరి జిల్లా పోలీసులు తెలిపారు.

వాటర్ ఫాల్స్‌ వద్ద ప్రమాదవశాత్తూ మరణించిన ముగ్గురు బాలికలు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల పిల్లలని హుకుంపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ బీబీసీకి చెప్పారు.

గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్ఐ దుర్గాప్రసాద్ బీబీసీకి వివరించారు.

హుకుంపేట మండలం జంబువలస గ్రామానికి చెందిన సాలేపు త్రిష (17), సాలేపు పవిత్ర (16), సాలేపు రత్నకుమారి (16), అంజలి (16) అనే నలుగురు బాలికలు గురువారం సాయంత్రం అనంతగిరి మండలం మలుంగుమ్మి వాటర్‌ఫాల్స్ సందర్శనకు వెళ్లారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఎలా జరిగిందంటే..

ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం, “గురువారం ఉదయం 9 గంటల తర్వాత పొలానికి వెళ్లొస్తానని ఇంట్లో చెప్పి త్రిష బయలుదేరింది. వెళ్తూవెళ్తూ అదే గ్రామానికి చెందిన తన బంధువులు, స్నేహితులైన పవిత్ర, రత్నకుమారిలను కలిసింది. వారు కూడా త్రిషతో కలిసి వెళ్లారు. అలా వెళ్తున్న సమయంలో మరో స్నేహితురాలు అంజలి కనపడడంతో ఆమెను కూడా తమవెంట తీసుకెళ్లారు.

వీరిలో త్రిష ఇంటర్ పరీక్షలు రాశారు, ఫలితాలు రావాల్సి ఉంది. మిగిలిన ముగ్గురు పదో తరగతితో చదువు ఆపేశారు. గ్రామంలోనే ఉంటున్నారు.”

వీరిలో ఎవరికి ఈత రాదని తమ విచారణలో తేలినట్లు ఎస్సై తెలిపారు.

“పెద్దగా ఎవరికీ తెలియని మలుంగుమ్మి వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు. గ్రామంలోని చాలామందికి అక్కడ వాటర్ ఫాల్ ఉందనే విషయం మేం గుర్తుచేస్తే కానీ గుర్తురాలేదు. అలాంటి వాటర్ ఫాల్ దగ్గరకు వెళ్లి.. దాని అంచున నిలబడి సెల్ఫీలు, వీడియోలు తీసుకుంటూ మధ్యాహ్నం వరకు నలుగురు సరదాగా గడిపారు. వేసవికాలం కావడంతో నీళ్లలో చాలా సమయం గడిపారు.”

అల్లూరి జిల్లా, వాటర్ ఫాల్స్, ప్రమాదం, యువతులు, నేరాలు, వాటర్ ఫాల్స్

ఫొటో సోర్స్, UGC

ఒకరిని కాపాడబోయి మరొకరు.. అలా ముగ్గురు..

“మధ్యాహ్నం తర్వాత.. త్రిష, పవిత్ర, రత్నకుమారిలో నీళ్లలో ఉండగా అంజలి ఫోటోలు, వీడియోలు తీస్తున్నారు. ఆ సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆ వీడియోలో రత్నకుమారి చేయి పట్టుకుని త్రిష వెనక్కి లాగుతున్నట్లు కనిపిస్తుంది. అదంతా గట్టున ఉండి వీడియో తీస్తున్న అంజలి ఫోన్‌లో రికార్డైంది” అని పోలీసులు చెప్పారు.

వైరల్ వీడియోలో రత్నకుమారి చేయి పట్టుకుని త్రిష వెనక్కి లాగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో జారిపడుతూ త్రిష సహాయం కోసం అరుస్తున్నట్లు వినిపిస్తుంది.

“వెనక్కి వెళ్లిపోతున్న త్రిషని ముందుకు లాగేందుకు పవిత్ర ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆమె కూడా మునిగిపోయింది. అప్పటీకే ఫోటోలు తీసుకుంటున్న రత్నకుమారి ఇదంతా చూసి వారిని కాపాడుందుకు వెళ్లింది. కానీ, ఆమె కూడా అక్కడ నీటిలో మునిగిపోయింది. ఇదంతా చూస్తున్న అంజలి వారి కోసం గట్టుపై పరుగులు తీస్తూ పడిపోయారు.”

అల్లూరి జిల్లా, వాటర్ ఫాల్స్, ప్రమాదం, యువతులు, నేరాలు, వాటర్ ఫాల్స్

ఫొటో సోర్స్, UGC

ఉదయం వెళ్లిన అమ్మాయి ఇంకా రాలేదేంటని త్రిష బంధువులు ఆమెను వెతుక్కుంటూ గ్రామమంతా తిరుగుతుండగా.. వాటర్ ఫాల్స్ వద్ద వారిని చూసినట్లు స్థానికులు కొందరు సమాచారం ఇచ్చారు.

అనంతరం, అక్కడికి వెళ్లేసరికి అంజలి పడిపోయి ఉన్నారు. కానీ త్రిష, పవిత్ర, రత్నకుమారి కనిపించలేదు. కొద్దిదూరంలో వెతకగా ముగ్గురి మృతదేహాలు నీటిపై తేలుతూ కనిపించాయి.

ఈ సమాచారం పోలీసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో అక్కడికి పెద్దయెత్తున్న జనం వచ్చారు.

మరణించిన ముగ్గురు బాలికలు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల కుమార్తెలు కావడంతో ఆ గ్రామంలో తీవ్రవిషాదం నెలకొంది.

బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, పోస్టుమార్టం కార్యక్రమాలు జరుగుతుండటంతో వారితో మాట్లాడటం సాధ్యపడలేదు.

అల్లూరి జిల్లా, వాటర్ ఫాల్స్, ప్రమాదం, యువతులు, నేరాలు, వాటర్ ఫాల్స్

ఫొటో సోర్స్, UGC

జలాశయాల వద్ద ఫోటోలు, సెల్పీలు ప్రమాదకరం..

ప్రమాదకర ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ యువత ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని ఎస్ఐ దుర్గా ప్రసాద్ అన్నారు. “ఈత రాని వారు నీటిలోకి దిగడం ప్రమాదకరం. సెల్ఫీల కోసం అంచుల వద్దకు వెళ్లడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. నీళ్లలోకి దిగేటప్పుడు మునిగిపోకుండా ఉండేందుకు ట్యూబ్ లాంటివి వెంట తెచ్చుకోవడం మంచిది” అని ఆయన సూచించారు.

గాయపడిన అంజలికి ప్రస్తుతం అనంతగిరి మండలం లుంగపర్తి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

“ప్రాథమిక విచారణలో ఇది ప్రమాదమని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం” అని హుకుంపేట ఎస్ఐ దుర్గాప్రసాద్ బీబీసీతో చెప్పారు.

అల్లూరి జిల్లా, వాటర్ ఫాల్స్, ప్రమాదం, యువతులు, నేరాలు, వాటర్ ఫాల్స్

ఫొటో సోర్స్, UGC

జలపాతాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షకాలం వస్తే అందంగా ఉందని, ఎండకాలంలో సేదతీరుదామని చాలామంది జలపాతాల వద్దకు వెళ్తుంటారు. దేశవ్యాప్తంగా జలపాతాల వద్ద సెల్ఫీలు, రీల్స్ తీసే సమయంలో జరిగే ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు

జలపాతాల వద్ద మైమరిచిపోయి దగ్గరికి వెళ్లడం, అక్కడ కాలుజారి పడిపోవడం, ఆ పడిపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.

కొంతమంది యువత అత్యుత్సాహంతో మత్తుపదార్థాలు తీసుకుని వస్తుంటారు. ఆ మత్తులో కూడా చాలా వరకు తప్పిదాలు జరుగుతాయి. అలా చేయవద్దు.

మరీముఖ్యంగా చాలా మరణాలకు కారణమవుతున్నది ఈ ఫోటోలు, సెల్ఫీలు. మంచి యాంగిల్‌లో ఫోటో రావాలనుకోవడం వల్ల కొద్దిదూరం వెళ్లడం, ఇంకొద్ది దూరం వెళ్లడం.. అలా జారిపడటం, ప్రమాదాలకు గురికావడం, రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టి లైక్స్ ఎక్కువగా రావాలనుకోవడం చాలా ప్రమాదాలకు కారణమవుతోంది.

జలపాతాలనేవి చాలా ఎత్తైన ప్రదేశాల్లోనే ఉంటాయి. కాబట్టి అక్కడ స్నానాలు చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఎత్తైన ప్రదేశాల్లో వర్షాలు కురిసినప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జలపాతాలను దూరం నుంచి చూడటమే కానీ అక్కడ స్నానాలకు ప్రయత్నించకుండా ఉంటే మంచిది.

పర్యటక ప్రాంతాలకు వెళ్లే వారు అక్కడున్న సిబ్బంది సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే, అక్కడి స్థానిక పరిస్థితులపై వారికి సంపూర్ణ అవగాహన ఉంటుంది. వారు మన సంరక్షకులు, కాబట్టి వారి సూచనలు పాటించడం ఉత్తమం.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)