SOURCE :- BBC NEWS
ఫొటో సోర్స్, Anna Moneymaker/Getty Images
2 గంటలు క్రితం
చదివే సమయం: 5 నిమిషాలు
‘‘ఆకస్మిక దాడి (సర్‌ప్రైజ్) గురించి జపాన్ కంటే బాగా ఎవరికి తెలుసు’’ అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అమెరికా పర్యటన సందర్భంగా జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకాయిచి, గురువారం వైట్ హౌస్‌లో డోనల్డ్ ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ ఇద్దరు సంయుక్తంగా విలేఖరుల సమావేశం నిర్వహించారు.
”మీరు ఇరాన్‌పై దాడి చేయడానికి ముందు యూరప్, ఆసియాలోని మీ మిత్ర దేశాలకు, ముఖ్యంగా జపాన్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? జపాన్ ప్రజలమంతా చాలా గందరగోళంలో ఉన్నాం” అని జపాన్‌కు చెందిన ఓ రిపోర్టర్ఈ డోనల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించారు.
దీనికి ట్రంప్ స్పందిస్తూ, ”చూడండి, అన్ని ముందుగానే సంకేతాలు ఇవ్వరు. మేము దాడి చేసినప్పుడు, అది చాలా భారీ స్థాయిలో జరిగింది. మేము దీన్ని ఆకస్మికంగా చేయాలనుకున్నాం, అందుకే ముందే ఎవరికీ తెలియజేయలేదు” అని అన్నారాయన.
‘‘ఆకస్మిక దాడి గురించి జపాన్ కంటే బాగా ఎవరికి తెలుస్తుంది? పెర్ల్ హార్బర్‌పై దాడి గురించి మీరు (జపాన్) మాకు (అమెరికాకు) ముందుగా ఎందుకు చెప్పలేదు అని నేనూ మిమ్మల్ని అడగవచ్చు. బహుశా మాకంటే ఎక్కువగా మీరే ఆకస్మిక దాడిని నమ్ముకుంటారు. మేము కూడా అదే చేశాం’’ అన్నారు ట్రంప్.

ఇరాన్‌లో చేపట్టిన ఆపరేషన్ గురించి ట్రంప్ మాట్లాడుతూ, ”ఇది ఆకస్మిక దాడి కావడం వల్లే, ఆరంభంలోనే 50 శాతానికి పైగా విజయం అందుకున్నాం. ఇది మేము ఆశించిన దానికంటే చాలా ఎక్కువ. ఒకవేళ దీని గురించి ముందే అందరికీ తెలిసేలా చేసి ఉంటే, ఇందులో సర్‌ప్రైజ్ ఉండేది కాదు” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇదే సందర్భంలో పెర్ల్ హార్బర్ గురించి ట్రంప్ ప్రస్తావించారు.
ఫొటో సోర్స్, Getty Images
రెండో ప్రపంచ యుద్ధ గమనమే మారిపోయింది…
పసిఫిక్ మహాసముద్రం మధ్యలోనున్న ద్వీపాల సమూహంపై 1941, డిసెంబర్ 7న రెండు గంటల పాటు భీకరమైన బాంబు దాడులు జరిగాయి. ఈ సంఘటన రెండో ప్రపంచ యుద్ధం గమనాన్నే మలుపుతిప్పింది.
పెర్ల్ హార్బర్‌పై దాడి యుద్ధం గమనాన్ని మాత్రమే కాదు అమెరికా, జపాన్ దేశాల భవిష్యత్తును కూడా శాశ్వతంగా ప్రభావితం చేసింది.
అదే రోజు ఉదయాన్నే హవాయి ద్వీప సమూహంలోని అమెరికా నౌకాదళ స్థావరంపై ఆకస్మిక దాడి చేసింది జపాన్.
అప్పటికే ప్రపంచమంతా యుద్ధంలో ఉన్నప్పటికీ అప్పటివరకూ అమెరికా మాత్రం దానికి దూరంగా ఉంది. కానీ, జపాన్ దాడి అమెరికాను ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యేలా చేసింది. దీంతో, అమెరికా కూడా మిత్రదేశాల పక్షాన యుద్ధరంగంలోకి దిగింది.
పెర్ల్ హార్బర్‌లో అమెరికా మోహరించిన ఎనిమిది యుద్ధ నౌకలు జపాన్ దాడితో ధ్వంసమయ్యాయి. వాటిలో నాలుగు యుద్ధ నౌకలు సముద్రంలో మునిగిపోయాయి.
రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా భూభాగంపై జరిగిన మొదటి దాడి ఇదే.
జపాన్ జరిపిన ఈ దాడిలో 2400 మందికి పైగా అమెరికా సైనికులు చనిపోయారు. ఆ ఎనిమిది యుద్ధ నౌకలతోపాటు మొత్తం 19 నౌకలు ధ్వంసమయ్యాయి.
అలాగే, అమెరికాకు చెందిన 328 యుద్ధ విమానాలు పాక్షికంగా దెబ్బతినడమో లేదా పూర్తిగా ధ్వంసం కావడమో జరిగాయి.
పెర్ల్ హార్బర్‌పై జపాన్ ఏకధాటిగా ఒక గంటా 15 నిమిషాల పాటు బాంబుల వర్షం కురిపించింది.
ఈ భీకర దాడిలో వందిమందికి పైగా జపాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
అమెరికా ఈ సంఘటన తర్వాతే రెండో ప్రపంచ యుద్ధ రంగంలోకి నేరుగా అడుగుపెట్టింది. మిత్రదేశాల పక్షాన నిలిచి యుద్ధ రంగాన్ని తన చేతుల్లోకి తీసుకుంది.
ఫొటో సోర్స్, Reuters
అమెరికా ‘ప్రతీకారం’….
జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై 1945లో అమెరికా అణుబాంబులు వేసినప్పుడు, అది పెర్ల్ హార్బర్ దాడికి ప్రతీకారంగానే జరిగిందని విశ్లేషకులు భావించారు.
”1941 డిసెంబర్ 7వ తేదీ ఉదయం జపాన్ సైన్యం పెర్ల్ హార్బర్‌పై జరిపిన దాడి కేవలం ఒక సంఘటన మాత్రమే కాదు” అని ‘ది రిలక్టెంట్ ఫండమెంటలిస్ట్’ రచయిత మొహ్సిన్ హమీద్ ఒక సందర్భంలో అన్నారు.
ఈ దాడి అమెరికాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఎందుకంటే, జపాన్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించాలని జపాన్ ప్రతినిధులు అదే సమయంలో అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి కార్డెల్ హల్‌తో వాషింగ్టన్‌లో చర్చలు జరుపుతున్నారు.
చైనాలో పెరుగుతున్న జోక్యం, దురాక్రమణల కారణంగా జపాన్‌పై అమెరికా ఆ ఆర్థిక ఆంక్షలను విధించింది.
ఇలా తమపై ఆర్థిక ఆంక్షలు విధించడం, మరోవైపు చైనాకు మిత్రదేశాల సైన్యం సహాయం చేయడంతో ఆగ్రహం చెందిన జపాన్, అమెరికాపై యుద్ధం ప్రకటించింది.
ఆ క్రమంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్‌వెల్ట్ కూడా జపాన్‌పై అధికారికంగా యుద్ధం ప్రకటించారు.
ఫొటో సోర్స్, Reuters
జపాన్-అమెరికా సంబంధాలు…
పెర్ల్ హార్బర్’పై దాడి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత కూడా సుదీర్ఘకాలం పాటు జపాన్, అమెరికా మధ్య సంబంధాలను, అలాగే ఈ రెండు దేశాల ప్రజలను జీవితాలను మార్చివేసింది.
1945లో హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణుబాబు దాటికి సుమారు 1.50 లక్షల మంది వరకూ మరణించారని అంచనా.
2016, మే నెలలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, నాటి జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో కలిసి హిరోషిమా నగరాన్ని సందర్శించారు. ఇదొక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయింది.
అమెరికా ప్రపంచంలోనే మొట్టమొదటి అణుబాంబును ప్రయోగించిన హిరోషిమాను సందర్శించిన అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చరిత్రలో నిలిచిపోయారు.
ఈ నాయకులు ఇద్దరూ కలిసి కొద్ది నెలల వ్యవధిలోనే, 2016 డిసెంబర్‌లో మరో చరిత్ర సృష్టించారు.
పెర్ల్ హార్బర్ దాడి జరిగి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బరాక్ ఒబామా, షింజో అబే కలిసి ఆ చారిత్రాత్మక ప్రదేశంలో పర్యటించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)



