Home జాతీయ national telgu ‘అడవి ఆవులు’ ఉన్నాయా, ఏపీ అసెంబ్లీలో చర్చకు వచ్చిన ఈ అవుల కథేంటి?

‘అడవి ఆవులు’ ఉన్నాయా, ఏపీ అసెంబ్లీలో చర్చకు వచ్చిన ఈ అవుల కథేంటి?

4
0

SOURCE :- BBC NEWS

అడవి ఆవులు, నల్లమల అడవులు, కృష్ణా పరీవాహ ప్రాంతం.

ఫొటో సోర్స్, Krishna district collecterate

ఇటు శ్రీకాకుళం.. అటు చిత్తూరు జిల్లాల్లో అడవి ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేసిన ఘటనలు చూస్తున్నాం.

అడవి పందుల గురించి విన్నాం.

శ్రీశైలం అడవుల్లో అరుదుగా కనిపించే అడవి దున్నల గురించి కూడా అప్పుడప్పుడూ వార్తలొస్తున్నాయి.

కానీ కృష్ణానది లంకల్లోని ‘అడవి ఆవులు’ తమ పొలాలను ధ్వంసం చేస్తునాయని అక్కడి రైతులు ఆందోళన వ్యక్తం చేసే వరకూ అసలు వీటి ప్రస్తావన ఎప్పుడూ ఎక్కడా రాలేదనే చెప్పాలి.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు కూడా ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఇదే మాట అన్నారు.

“అడవి ఆవులా.. ఇవేమిటి? నేనెప్పుడూ వినలేదే” అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఎన్‌టీఆర్‌ జిల్లా నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య తన నియోజకవర్గ పరిధిలోని చందర్లపాడు మండలంలోని గ్రామాల్లో పంటలను అడవి ఆవులు ధ్వంసం చేస్తున్నాయని, వాటి బారి నుంచి కాపాడాలని అసెంబ్లీలో ప్రస్తావించారు. వెంటనే స్పందించిన జిల్లా అధికార యంత్రాంగం అక్కడికి వెళ్లి డ్రోన్లతో వాటిని పరిశీలించింది.

ఇప్పుడు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై వివిధ మార్గాలను అన్వేషిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
అడవి ఆవులు, నల్లమల అడవులు, కృష్ణా పరీవాహ ప్రాంతం.

ఫొటో సోర్స్, Krishna district collecterate

నిజంగా అవి ”అడవి ఆవులేనా”?

‘వాస్తవానికి అవి మామూలు ఆవులే, అడవి ఆవులు కాదు. రైతులు తమ పరిభాషలో వాటిని ‘అడవి ఆవులు’గా పేర్కొనడం వల్లనే వాటికి ఆ పేరు వచ్చింది’ అని పశు సంవర్ధకశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ హనుమంతరావు, ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరెడ్డి బీబీసీతో మాట్లాడుతూ స్పష్టం చేశారు.

సహజంగా మనుషుల్లో ఎవరైనా కాస్త మొరటుగా ప్రవర్తిస్తే ”అడవి మనిషి” అని వాడుకలో అన్నట్టుగానే మామూలు ఆవులకు భిన్నంగా, దూకుడుగా ప్రవర్తిస్తున్న ఈ ఆవులను సమీప గ్రామాల ప్రజలు అడవి ఆవులని పిలవడం పరిపాటైంది.

ఆవులు చాలా సున్నితంగా ఉంటాయి. కానీ ఈ ఆవులు కాస్త దూకుడుగా ఉన్నాయి.

పట్టుకోవడానికి వెళితే దాడులకు తెగబడే ప్రమాదముందని అధికారులు చెబుతున్నారు.

అయితే మనుషుల కనిపిస్తే చాలు అవి దూరంగా వెళ్లిపోతాయి.

అడవి ఆవులు, నల్లమల అడవులు, కృష్ణా పరీవాహ ప్రాంతం.

ఫొటో సోర్స్, Krishna district collecterate

అక్కడకి ఎలా వెళ్లాయి?

కృష్ణా నది ఒడ్డున ఉండే గ్రామాల రైతులు నది లోపల ఉండే లంక భూముల్లో ఒకప్పుడు పెద్ద ఎత్తున వ్యవసాయం చేసేవారు.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పులిచింతల ప్రాజెక్టు దిగువ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ వేల ఎకరాల్లో లంక భూములు ఉండేవి.

అప్పట్లో అక్కడ కావాల్సినంత పచ్చగడ్డి ఉండటంతో, రైతులు తమ పశువులను మేత కోసం లంకపొలాలకు తీసుకెళ్లి, తీసుకొచ్చేవారు.

ఈ క్రమంలో కొన్ని ఆవులు, ఎద్దులు గ్రామాలకు తిరిగి రాకుండా అక్కడే ఉండిపోయాయి.

క్రమంగా అవి అక్కడే సంతతిని వృద్ధి చేసుకున్నాయి.

ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న ఆవులు, ఎద్దులు ఇప్పుడు దాదాపు 1500వరకు ఉండవచ్చని నందిగామ రెవిన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ కె.బాలకృష్ణ బీబీసీతో చెప్పారు.

అడవి ఆవులు, నల్లమల అడవులు, కృష్ణా పరీవాహ ప్రాంతం.

ఫొటో సోర్స్, Getty Images

ఎందుకలా ‘ఆటవికంగా’ మారాయి?

ఒకప్పుడు వేసవిలోనూ పచ్చగడ్డితో కళకళలాడిన లంక భూముల వెంబడి కొన్నేళ్ల కిందటి నుంచి నీటి ప్రవాహం తగ్గిపోయింది.

దీంతో రైతులు అక్కడ సాగు తగ్గించారు. అటు వైపు వెళ్లడం మానేశారు.

అయితే ఆవులు మాత్రం అక్కడే ఉండి సంతతిని వృద్ధి చేసుకున్నాయి.

క్రమంగా వీటికి మనుషులతో సంబంధాలు తెగిపోయాయి.

మనుషులకు దూరంగా పెరగడం, వాటి మీద అజమాయిషీ లేకపోవడంతో, రైతులు కనిపిస్తే ఆటవికంగా ప్రవర్తిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

అడవి ఆవులు, నల్లమల అడవులు, కృష్ణా పరీవాహ ప్రాంతం.

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడెందుకు పొలాల మీద పడుతున్నాయి?

గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలోకి వచ్చే లంక భూములను ప్రభుత్వం పదేళ్ల కిందట అక్కడి స్థానిక పేద రైతులకు పంపిణీ చేసింది.

దాంతో రైతులు అక్కడ యూకలిప్టస్, సుబాబుల్‌ తోటలు పెంచుతున్నారు.

ఈ క్రమంలో నాలుగైదేళ్లుగా పశువులకు అక్కడ మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆహారం కోసం ఆవులు ఎన్‌టిఆర్‌ జిల్లా పరిధిలోకి వచ్చే కృష్ణా నదీ తీర గ్రామాల్లోని పొలాల్లోకి వస్తున్నాయి.

అవి ఒకటి లేదా రెండు కాకుండా మందలు మందలుగా సంచరిస్తున్నాయని, ఒక్కో మందలో కనీసంగా వంద ఆవులు ఉంటాయని అక్కడి బాధిత రైతులు బీబీసీకి చెప్పారు.

కోత దశకు వచ్చిన పంటలు తొక్కేసి తమను తీవ్రంగా నష్ట పరిచాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

“నేను పదిఎకరాల్లో పామాయిల్‌ పంట వేశాను. అంతర్‌ పంటలుగా పెసర. మినుము సాగు చేశాను. రాత్రికి రాత్రి వందకు పైగా ఆవులు వచ్చి పంటలు తొక్కేశాయి. ఫెన్సింగ్‌ వేసినా తొక్కుకువచ్చి ధ్వంసం చేశాయి. ఫలితంగా ఈ ఏడాది పదిలక్షల రూపాయలకు పైగా నష్టపోయాను” అని చందర్లపాడు మండలం వెలది కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతు అర్జున్‌రావు బీబీసీకి చెప్పారు.

తాను ఐదు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా రాత్రికి రాత్రే ధ్వంసం చేశాయని చందర్లపాడు మండలం కొడవటికల్లుకు చెందిన రైతు కోట వీరబాబు బీబీసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

తాము 12ఎకరాల్లో మొక్కజొన్న, పదిహేను ఎకరాలు కౌలు తీసుకుని చెరకు సాగు చేయగా ఈ ఏడాది పంట మొత్తం అడవి ఆవులు నాశనం చేశాయని చందర్లపాడు మండలం ఏటూరు గ్రామానికి చెందిన సాంబశివరావు బీబీసీకి చెప్పుకొచ్చారు.

ఇలా మండలంలోని వందలాది ఎకరాల్లో పొలాలను ధ్వంసం చేసిన పరిస్థితుల్లో రైతులు ఎమ్మెల్యే సౌమ్య దృష్టికి తీసుకురాగా ఆమె మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్య గురించి ప్రస్తావించారు.

అప్పటి నుంచి అధికారులు దీన్ని ఎలా పరిష్కరించాలనే దానిపై సమాలోచన చేస్తున్నారు.

అయితే ఇప్పటికీ ఎలాంటి పరిష్కార మార్గం కనుక్కోలేకపోయారు.

అడవి ఆవులు, నల్లమల అడవులు, కృష్ణా పరీవాహ ప్రాంతం.

ఫొటో సోర్స్, Civil Supplies, Krishna dist

పరిష్కారమార్గాలను ఆలోచిస్తున్నాం: కలెక్టర్‌ లక్ష్మీషా

“ఇది చాాలా సున్నిత సమస్య. మనం ఆవులకు ఇబ్బంది కలిగించకూడదు. అదే సమయంలో రైతుల పొలాలను కాపాడాలి. అందుకే అనేక పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాం” అని ఎన్‌టిఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీషా బీబీసీకి తెలిపారు.

”ముందుగా వాటిని ఆ లంక భూముల నుంచి తరలించి మనుషులతో కలిసిపోయేలా చేయాలి. అయితే వాటిని అక్కడి నుంచి తరలించడం చాలా కష్టం, మత్తు మందు ఇచ్చి బయటకు తీసుకురావాలి. అయితే అడవి జంతువులైన పులి, సింహం, ఎలుగుబంటి వంటి వాటికి మాత్రమే మత్తుమందు ఇచ్చి తెచ్చేందుకు అనుమతి ఉంది కానీ ఆవులను అలా తెచ్చేందుకు నిబంధనలు అంగీకరించవు. నిజానికి అవి ఆటవికంగా ప్రవర్తిస్తున్నా మామూలు ఆవుల కిందే లెక్క. అందుకని ఏ మోతాదులో ఇంజక్షన్‌ ఇవ్వాలి. అసలు అలా తేవొచ్చా.. అనే అంశాలపై అనుమతి కోసం ప్రిన్సిపల్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌కి లేఖ రాశాం. ఇంకా స్పందన రాలేదు” అని కలెక్టర్‌ తెలిపారు.

ఒకవేళ అనుమతి వచ్చి బయటికి తీసుకొచ్చిన తర్వాత వాటిలో 50 నుంచి 100 ఆవులను సమీపంలోని గోశాలకు తరలించాలని అధికారులు భావిస్తున్నారు.

ఇందు కోసం గోశాలను పరిశీలించినట్లు చెప్పారు.

“మరో ఆలోచన కూడా చేస్తున్నాం. మేత లేకపోవడం వల్లనే అవి పొలాల్లోకి వస్తున్నాయి. అక్కడ మేత పెంచేలా చర్యలు తీసుకుంటే వాటి ఆవాసాలను మనం రక్షించవచ్చు. దీని గురించి గుంటూరు జిల్లా అధికారులతో మాట్లాడాలని భావిస్తున్నాం. అక్కడ పొలాలు సాగు చేస్తున్న రైతులు కేవలం సుబాబుల్‌ మాత్రమే కాకుండా, ఆవులకు మేత సాగు చేసేలా అవగాహన కల్పించాలి. అలా చేయడం రైతులకు ఇబ్బంది అయితే, వారికి వేరే చోట భూములు కేటాయించి ఆవులను అక్కడే ఉండేలా చేయాలి. ఇదంతా పెద్ద ప్రక్రియ. అయితే ఖరీఫ్ నాటికి ఏదో ఒకటి చేస్తాం” అని కలెక్టర్ లక్ష్మీషా చెప్పారు.

అడవి ఆవులు, నల్లమల అడవులు, కృష్ణా పరీవాహ ప్రాంతం.

ఫొటో సోర్స్, Ravuri Ramesh babu

భూమి ఇస్తే ఆవులను రక్షిస్తాం.

“కేవలం ఆహారం కోసం అల్లాడిపోతూ పొలాలను ధ్వంసం చేస్తున్నాయే కానీ అవి కూడా మామూలు ఆవులే. వాటిని కొన్నాళ్లు ఇబ్బంది పడి సాకితే చాలు. మనతో కలిసిపోతాయి. మేం ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, అయితే ఆ మేరకు భూమి మా వద్ద లేదు. ప్రభుత్వం భూమి ఇస్తే చాలు. వాటి మేత, ఇతర సంరక్షణ బాధ్యత మొత్తం మేం చూసుకుంటాం” అని నందిగామకు చెందిన సహజ జీవన గోశాల వ్యవస్థాపకుడు రావూరి రమేష్‌బాబు బీబీసీతో చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)