Home LATEST NEWS telugu తాజా వార్తలు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు, రాజమండ్రి జైలుకు మాజీ మంత్రి, ఈ ఘటనల...

అంబటి రాంబాబు, జోగి రమేశ్ ఇళ్లపై దాడులు, రాజమండ్రి జైలుకు మాజీ మంత్రి, ఈ ఘటనల వెనక అసలేం జరిగింది?

22
0

SOURCE :- BBC NEWS

టీడీపీ, వైసీపీ, గుంటూరు, నెయ్యి, టీటీడీ, జగన్, చంద్రబాబు

ఫొటో సోర్స్, Prasanth

    • రచయిత, గరికిపాటి ఉమాకాంత్
    • హోదా, బీబీసీ కోసం
  • 1 ఫిబ్రవరి 2026

    అప్‌డేట్ అయ్యింది 9 గంటలు క్రితం

వైసీపీ నేత అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

శనివారం(జనవరి 31)రాత్రి పదిన్నర గంటల తర్వాత అంబటి రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు ఫిబ్రవరి 1 సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

న్యాయాధికారి రిమాండ్ విధించడంతో అంబటిని జైలుకు తరలించారు.

సీఎం చంద్రబాబును అభ్యంతరకర పదజాలంతో దూషించిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు.

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదానికి సంబంధించి వైసీపీకి చెందిన మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై ఆందోళనకారులు దాడులు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
టీడీపీ, వైసీపీ, సత్తెనపల్లి, నెయ్యి, టీటీడీ, జగన్

ఫొటో సోర్స్, ugc

జోగి రమేశ్ ఇంటిపై దాడులు

జనవరి 31వ తేదీ శనివారం విజయవాడ సమీప ఇబ్రహీంపట్నంలోని శ్రీఆంజనేయస్వామి గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం జోగిరమేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌పై పరుష పదాలతో విమర్శలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటిపై ఆందోళనకారులు ఆదివారం సాయంత్రం దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. పెట్రోల్ బాంబు వేసి ఇంట్లోని వస్తువులకు నిప్పుపెట్టారు. ఆ సమయంలో జోగి ఇంట్లో లేరు.

తిరుపతిలో ఉన్న ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి దాడులకు తాను భయపడేది లేదన్నారు.

ఫ్లెక్సీ దగ్గర ఉద్రిక్తత

ఈ ఘటనలు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశాలుగా మారాయి.

శనివారం రాత్రి అంబటి రాంబాబు అరెస్టుకు ముందు చాలా పొలిటికల్ డ్రామా జరిగింది.

తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీతో మొదలై అంబటి రాంబాబు అరెస్టు దాకా సాగిన పరిణామాలివీ..

తిరుమల లడ్డు కల్తీ వివాదానికి సంబంధించి ఇటీవల సిట్ రిపోర్ట్ బయటకు వచ్చిన నేపథ్యంలో గుంటూరుకు దగ్గరుండే గోరంట్లలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపాన “మహా పాపం” పేరుతో తెలుగుదేశం నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఆ ఫ్లెక్సీల పై అభ్యంతరం వ్యక్తం చేసిన గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. వాటిని వెంటనే తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని శుక్రవారం(జనవరి 30) ప్రకటించారు.

ఈ మేరకు శనివారం(జనవరి 31) ఉదయం అంబటి రాంబాబు గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి అక్కడ పూజల అనంతరం వైసీపీ కార్యకర్తలతో కలిసి ఫ్లెక్సీ దగ్గరకు బయలుదేరారు.

విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అప్పటికే భారీగా ఫ్లెక్సీ వద్దకు చేరుకున్నారు

దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉందంటూ పోలీసులు అంబటి రాంబాబుని ఫ్లెక్సీ వద్దకు రావద్దని సూచించారు. అయితే, అంబటి అందుకు అంగీకరించలేదు.

ఈ క్రమంలో తెలుగుదేశం శ్రేణులు, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం పెరిగింది. సరిగ్గా ఈ సమయంలోనే ఓ మీడియా చానల్‌తో అంబటి రాంబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ రాయలేని భాషలో చంద్రబాబును అంబటి దూషించారు.

టీడీపీ, వైసీపీ, గుంటూరు, నెయ్యి, టీటీడీ, జగన్, చంద్రబాబు

ఫొటో సోర్స్, Prasanth

సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉద్రిక్తత

చంద్రబాబుపై అంబటి చేసిన దూషణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శనివారం మధ్యాహ్నం నుంచే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.

టీడీపీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నాయకులు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ వచ్చారు.

హోం మంత్రి అనిత, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి సవిత.. అంబటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ… ఆయనపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

టీడీపీ, వైసీపీ, గుంటూరు, నెయ్యి, టీటీడీ, జగన్, చంద్రబాబు

ఫొటో సోర్స్, UGC

పొరపాటుగా మాట్లాడా.. అయినా అరెస్టుకు రెడీగా ఉన్నా: అంబటి రాంబాబు

తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో శనివారం సాయంత్రం తన ఇంటి వద్ద అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

‘‘నేను అలా మాట్లాడకుండా ఉండవలసింది, కానీ అక్కడ టీడీపీ కార్యకర్తలు నన్ను బూతులు తిడుతూ దాడి చేసేందుకు యత్నించడంతో ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యాను” అని చెప్పారు.

“నన్ను చంపడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకునేక్రమంలో చేసిన గావు కేక అది” అని ఆయన వ్యాఖ్యానించారు.

“నన్ను తిడుతున్న వాళ్ళని కూడా అలా తిట్టి ఉండాల్సింది కాదు.. అలా జరిగిపోయింది. అరెస్టు చేసుకుంటారా? చేసుకోండి. రెడీగా ఉన్నా. మీ రెడ్‌బుక్‌కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదు” అని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

టీడీపీ, వైసీపీ, సత్తెనపల్లి, నెయ్యి, టీటీడీ, జగన్

ఫొటో సోర్స్, Prasanth

అంబటి రాంబాబు ఇల్లు, ఆఫీస్‌పై దాడి

మరోవైపు శనివారం సాయంత్రం నుంచి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయంపై దాడులు జరిగాయి.

ఇంట్లోని ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు ఆయన కార్ల అద్దాలు పగలగొట్టారు. రాళ్లు, కోడిగుడ్లతో ఇంటిపై దాడి చేశారు.

పార్టీ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు ఫ్లెక్సీకి నిప్పంటించి కార్యాలయంలో వేయగా పోలీసులు వెంటనే ఆ మంటలను ఆర్పివేశారు.

అంబటి రాంబాబు ఏదో యాధృచ్ఛికంగానో.. పొరపాటుగానో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దారుణ వ్యాఖ్యలు చేయలేదని, కుట్రపూరితంగానే ఆ వ్యాఖ్యలు చేశారని టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు బీబీసీతో అన్నారు.

ఏపీ డీజీపీకి వైసీపీ లేఖ

ఈ క్రమంలో అంబటి రాంబాబుకి భద్రత కల్పించాలంటూ ఏపీ డీజీపీకి వైసీపీ లేఖ రాసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటికి ఫోన్ చేసి పరామర్శించారు.

తమకు రక్షణ కల్పించాలంటూ అంబటి రాంబాబు భార్య విజయలక్ష్మి శనివారం రాత్రి హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనతో పాటు 60 మందిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఆ పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.

టీడీపీ, వైసీపీ, గుంటూరు, నెయ్యి, టీటీడీ, జగన్

ఫొటో సోర్స్, UGC

కేసులు నమోదు

ముఖ్యమంత్రి చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు ఫిర్యాదుతో అంబటిపై కేసు నమోదు చేసినట్టు గుంటూరు పోలీసులు వెల్లడించారు.

అంబటిపై 126(2), 132, 196(1), 352, 351(2), 292 రెడ్ విత్ 3(5) – BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం రాత్రి 10 గంటలు దాటిన తర్వాత గుంటూరు నగర పోలీసులు భారీ సంఖ్యలో అంబటి నివాసానికి చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సమయంలో పెద్దయెత్తున టీడీపీ శ్రేణులు, ఆందోళనకారులు అంబటి ఇంటి వద్దకు చేరుకుని ఆయనపై దాడికి యత్నించారు. పోలీసులు అంబటి చుట్టూ వలయంగా ఏర్పడి ఆయనను పోలీసు వజ్ర వాహనం ఎక్కించి తీసుకెళ్లారు.

అంబటి రాంబాబుని శనివారం రాత్రి 10 గంటల 40 నిమిషాల సమయంలో ఇంటి వద్ద అరెస్టు చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్‌కి తరలించినట్టు నల్లపాడు సీఐ వంశీధర్ బీబీసీకి చెప్పారు. మాణిక్యాలరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

అంబటిపై ఫిర్యాదు చేసిన మాణిక్యాలరావు బీబీసీతో మాట్లాడుతూ, రాజ్యహింసను ప్రేరేపించే విధంగా వ్యవహరించిన రాంబాబుపై ఐపీఎస్ సెక్షన్ 6 కూడా నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

టీడీపీ, వైసీపీ, గుంటూరు, నెయ్యి, టీటీడీ, జగన్, చంద్రబాబు

ఫొటో సోర్స్, X/YSR Congress Party

అంబటిపై దాడి అన్యాయం: జగన్

చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గాలను, అన్యాయాలను ప్రశ్నించినందుకే అంబటి రాంబాబుపై దాడికి పాల్పడుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ ‘ఎక్స్’‌లో ఆరోపణలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ “జంగిల్‌రాజ్‌”గా మారిపోయిందని.. చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా పోయిందని విమర్శించారు. పార్టీ సీనియర్‌ నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.

వైసీపీ సీనియర్‌ నాయకులపై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనంగా నిలిచాయని, రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

టీడీపీ, వైసీపీ, గుంటూరు, నెయ్యి, టీటీడీ, జగన్, చంద్రబాబు

ఫొటో సోర్స్, facebook

అంబటి మాట్లాడిన తీరు సరికాదు: హోం మంత్రి అనిత

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత ఫైర్ అయ్యారు.

“వైసీపీ నాయకులు దిగజారి రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు గురించి అంబటి రాంబాబు అత్యంత నీచంగా మాట్లాడారు.

చంద్రబాబు గురించి ఇష్టానుసారం మాట్లాడితే కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి” అన్నారు హోం మంత్రి అనిత.

“విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు. కచ్చితంగా కేసు నమోదు చేస్తాం. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ఉపేక్షించేది లేదు” అని చెప్పారు.

టీడీపీ, వైసీపీ, సత్తెనపల్లి, నెయ్యి, టీటీడీ, జగన్

ఫొటో సోర్స్, Ambati Rambabu/facebook

‘అంబటిది తప్పే.. కానీ నేరం ఇరు పార్టీలది’

‘‘ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేత అంబటి రాంబాబు, మంత్రి నారా లోకేష్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి జోగి రమేశ్ మాట్లాడింది తప్పే. అందులో సమర్ధించాల్సింది ఏమీ లేదు. కానీ, ఇలాంటి సంస్కృతిని రాష్ట్రంలో టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా పెంచి ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో ఇరుపార్టీలదీ నేరమే. ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఇలాంటి వ్యక్తిగత దూషణలకే ప్రాధాన్యతనిస్తూ నాయకులు కాలయాపన చేస్తున్నారు” అని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు గాలి నాగరాజు అభిప్రాయపడ్డారు.

విపక్ష పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఇలాంటి విమర్శలతోనే కాలం గడిపేస్తోందని, ఇలాంటి రాజకీయాలు రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదమని ఆయన అన్నారు.

కక్షలకు, ద్వేషాలకు, దాడులకు తావులేకుండా ఉన్నతమైన రాజకీయాలు చేసినప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించిన వాళ్లమవుతాం” అని గాలి నాగరాజు వ్యాఖ్యానించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

SOURCE : BBC NEWS