Home జాతీయ national telgu Ind vs Usa: సూర్య కుమార్ ఇన్నింగ్స్ గురించి పాకిస్తాన్ క్రికెటర్లు ఏమన్నారు, తొలిమ్యాచ్‌లో తమ...

Ind vs Usa: సూర్య కుమార్ ఇన్నింగ్స్ గురించి పాకిస్తాన్ క్రికెటర్లు ఏమన్నారు, తొలిమ్యాచ్‌లో తమ జట్టు ఆట తీరుపై ఎలా స్పందించారు?

9
0

SOURCE :- BBC NEWS

సూర్య కుమార్ యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

4 గంటలు క్రితం

టీ ట్వంటీ వరల్డ్ కప్‌లో శనివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై భారత్ 29 పరుగుల తేడాతో గెలిచింది.

టోర్నీలో బలహీనమైన జట్టుగా భావించిన అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఒక దశలో భారత్ పరిస్థితి అంత బాగా లేదు.

టాస్ గెలిచిన అమెరికా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత బ్యాట్స్‌మెన్ తక్కువ స్కోరుకే పెవిలియన్ పట్టడం చూస్తే, అమెరికా నిర్ణయం సరైనదేనని అందరూ భావించారు.

అభిషేక్ శర్మ మొదటి బంతికే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లారు.

వికెట్లు పడిపోతున్నా కెప్టెన్ సూర్యకుమార్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 84 పరుగులు చేశాడు. యాదవ్ ఇన్నింగ్స్‌పై పాక్‌లో విస్తృత చర్చ జరుగుతోంది. సూర్య కుమార్ తన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేశాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

చిన్నజట్ల చేతిలో ఇబ్బందులు

పాకిస్తాన్ జట్టు కూడా తన తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్ మీద గెలవడానికి చెమటోడ్చాల్సి వచ్చింది.

శనివారం శ్రీలంకలో జరిగిన మ్యాచ్‌లో చివరి మూడు బంతులు మిగిలి ఉండగా పాక్ నెదర్లాండ్స్ మీద 3 వికెట్ల తేడాతో నెగ్గింది.

భారత్, పాకిస్తాన్‌ తమ ప్రారంభ మ్యాచ్‌లలో గెలిచాయి. అయితే ఆ రెండు దేశాల జట్లు తమ ప్రత్యర్థుల మీద ఆడిన తీరు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

టీ ట్వంటీ వరల్డ్ కప్, భారత్ అమెరికా మ్యాచ్, సూర్య కుమార్ యాదవ్, పాకిస్తాన్ క్రికెటర్లు

ఫొటో సోర్స్, AFP via Getty Images

పాక్ క్రికెటర్ల ప్రశంసలు

టీ ట్వంటీకి భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తిరిగి ఫామ్‌లోకి రావడాన్ని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ ప్రశంసించారు.

“ఒక దశలో భారత జట్టు 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. జట్టు పీకల్లోతు కష్టాల్లో పడిన సమయంలో సూర్యకుమార్ పరిస్థితిని చక్కదిద్దాడు. టీ ట్వంటీల్లో 8 నెలలుగా అతని ఫామ్ చూస్తే చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. అయితే అతను సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చాడు” అని సల్మాన్ భట్ ఒక టీవీ డిబేట్‌లో చెప్పారు.

“శనివారం ఉదయం పాకిస్తాన్ ఆడిన మ్యాచ్‌లో వాళ్లు ఒక దశలో పటిష్టంగా ఉండి తర్వాత ఇబ్బందుల్లో పడ్డారు. భారత్ కూడా క్లిష్టమైన దశ నుంచి కోలుకుంది. పెద్ద జట్టు, చిన్నజట్టు మధ్య తేడా ఏంటంటే ఒక ఆటగాడు బాగా ఆడితే అతను ప్రత్యర్థి జట్టును అధిగమిస్తాడు” అని సల్మాన్ భట్ అన్నారు.

“సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆ తర్వాత అతను దూకుడుగా ఆడాడు. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళుతున్న బంతుల్ని సిక్సర్లుగా మలిచాడు. అతనికి ఆ స్టేడియంలో అన్నీ తెలుసు. అతనికి అది హోం గ్రౌండ్” అని మాజీ క్రికెటర్ బాసిత్ అలీ అన్నారు.

“ఒక ఎండ్‌లో వికెట్లు పడిపోతున్నా మరో ఎండ్‌లో సూర్యకుమార్ దృఢంగా నిలబడ్డాడు. చాలా బాగా ఆడాడు. 84 పరుగులు నాటౌట్. భారత జట్టు 130-35 మధ్య పరుగులు చేస్తుందని అనుకున్నాను. కానీ 161 పరుగులు చేసిందంటే ఆ క్రెడిట్ అంతా సూర్యకుమార్ యాదవ్‌కే చెందుతుంది. అతను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు” అని బాసిత్ అలీ చెప్పారు.

అయితే సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన క్రెడిట్‌ గౌతమ్ గంభీర్‌కు దక్కుతుందని సక్లైన్ ముష్తాక్ చెబుతున్నారు.

“ఆటగాళ్ల మీద మేనేజ్‌మెంట్‌కు పూర్తి విశ్వాసం ఉండాలి. సూర్య కుమార్ మీద గౌతమ్ గంభీర్, సెలక్టర్లు నమ్మకం ఉంచారు. అతను రాణించనప్పుడు కూడా మేనేజ్‌మెంట్ అతన్ని నమ్మింది. అతను ఎలాంటి ఆటగాడో మేనేజ్‌మెంట్‌కు తెలుసు. అతను దాన్ని నిరూపించుకున్నాడు” అని సక్లైన్ చెప్పారు.

“సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చినప్పటి నుండి ఆకట్టుకున్నాడు. అతను బాగా రాణించకపోయినా జట్టు యాజమాన్యం అతనిపై నమ్మకం ఉంచింది. పదే పదే విఫలమవుతున్నా అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కొనసాగించాడు. అతను జట్టు కోసం చేయాల్సిన పని ఉంది. అది అతను చేస్తున్నాడు” అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ హఫీజ్ అన్నారు.

టీ ట్వంటీ వరల్డ్ కప్, భారత్ అమెరికా మ్యాచ్, సూర్య కుమార్ యాదవ్, పాకిస్తాన్ క్రికెటర్లు

ఫొటో సోర్స్, AFP via Getty Images

పిచ్ గురించి వ్యాఖ్యలు

భారత్- అమెరికా టీ ట్వంటీ మ్యాచ్ గురించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడారు.

“భారత్- అమెరికా మధ్య ఇలాంటి ఇలాంటి మ్యాచ్ జరుగుతుందని అనుకోలేదు. ముంబైలో బంతి బౌన్స్ అయింది. ఒక్కోసారి బ్రేక్ అయింది. ఇంకొన్నిసార్లు పక్కకు పోయింది. అక్కడ ఇలాంటి పిచ్‌ను నేనెప్పుడూ చూడలేదు” అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

“టాస్ గెలిచిన అమెరికా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరు ఓవర్లలో భారత్ 4 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. 77 పరుగులకే ఆరు వికెట్లు పడిపోయాయి. ఇండియా 130-135 మాత్రమే స్కోర్ చేయగలదని అనిపించింది. కానీ స్కోరు 161కి చేరుకుంది” అని బాసిత్ అలీ చెప్పారు.

టీ ట్వంటీ ప్రపంచ కప్ తొలి రోజున జరిగిన మ్యాచ్‌లలో బలహీనమైనవని భావించిన అమెరికా, నెదర్లాండ్స్ జట్లు ప్రత్యర్థులు 200పరుగులు చేసే అవకాశం ఇవ్వలేదని ఆయన అన్నారు.

“యునైటెడ్ స్టేట్స్ జట్టు 77 పరుగులకు ఆరు వికెట్లు తీసింది. ఆ జట్టు తర్వాతి మ్యాచ్ పాక్‌తో అడుతుంది. గత ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ తొలి రౌండ్ ఎలిమినేషన్‌లో కీలక పాత్ర పోషించిన జట్టు ఇదే” అని బాసిత్ అలీ అన్నారు.

నెదర్లాండ్స్ కూడా పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ ఇచ్చిన క్యాచ్ వదిలేయడం వల్లే ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు.

టీ ట్వంటీ వరల్డ్ కప్, భారత్ అమెరికా మ్యాచ్, సూర్య కుమార్ యాదవ్, పాకిస్తాన్ క్రికెటర్లు

ఫొటో సోర్స్, AFP via Getty Images

‘అది పాకిస్తాన్‌ అదృష్టమే’

నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్ గెలిచినప్పటికీ, ఆ విజయం పాక్ మాజీ క్రికెటర్లకు పెద్దగా కిక్ ఇవ్వలేదు.

“ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లోని పాకిస్తాన్ అదృష్టం వల్ల గెలిచింది” అని పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అన్నారు.

ఆయన ది గేమ్ ప్లాన్ చానెల్‌లో మాట్లాడుతూ “చివర్లో ఫహీమ్ అష్రఫ్ 11 బంతుల్లో 29 పరుగులు చేశాడు. ఇది మంచి పెర్ఫార్మెన్స్” అని అన్నారు.

పాకిస్తాన్ జట్టులోని ఆటగాళ్ల ఆర్డర్ విషయంలో యాజమాన్యం విమర్శలను ఎదుర్కొంటోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో కూడా అదే పునరావృతం అయింది.

ఏ బ్యాట్స్‌మెన్ ఎప్పుడు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో, ఏ బౌలర్ ఎప్పుడు బౌలింగ్ వేయాలో, ఫీల్డర్ల మోహరింపు విషయంలో పాక్ జట్టు వద్ద వ్యూహం లేదని కమ్రాన్ అక్మల్, బాసిత్ అలీ అన్నారు.

“ఎలా ఆడాలి? మన లక్ష్యం ఏంటి? ఏ బౌలర్ ప్రత్యేకత ఏంటి? అని తెలియని జట్టు ఆడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది” అని బాసిత్ అలీ చెప్పారు.

టీ ట్వంటీ వరల్డ్ కప్, భారత్ అమెరికా మ్యాచ్, సూర్య కుమార్ యాదవ్, పాకిస్తాన్ క్రికెటర్లు

ఫొటో సోర్స్, AFP via Getty Images

వాంఖడే, కొలంబో పిచ్‌ల గురించి మాజీ క్రికెటర్లు ఏమన్నారు?

వాంఖడే స్టేడియం పిచ్‌పై బాసిత్ అలీ సందేహాలు లేవనెత్తగా, పాకిస్తాన్ మాజీ ఆటగాడు సక్లైన్ ముష్తాక్ శ్రీలంక పిచ్‌పై స్పందించారు.

పిచ్ సరిగ్గా లేకపోవడం వల్లే భారత్ 77 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిందని బాసిత్ అలీ అన్నారు.

పాకిస్తాన్ జట్టు ఆటతీరుపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు సక్లైన్ ముష్తాక్.

“శ్రీలంక పిచ్‌లపై ఇంత గడ్డిని నేను ఎప్పుడూ చూడలేదు” అని సక్లైన్ అన్నారు.

పీటీవీలో ‘గేమ్ ఆన్ హై’ కార్యక్రమంలో సక్లైన్ ముష్తాక్ మాట్లాడారు.

“పాకిస్తాన్ స్పిన్ బౌలింగ్‌పై ఆధారపడి ఉందని ఐసీసీకి తెలుసు. అందుకే పాకిస్తాన్‌కు అనుకూలంగా లేని పిచ్‌లను సిద్ధం చేస్తున్నారు. పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ వ్యూహాలను మార్చుకోవలసి ఉంటుంది” అని సక్లైన్ ముష్తాక్ అన్నారు.

టీ ట్వంటీ వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్నప్పటికీ, ఈ టోర్నమెంట్‌ కోసం పిచ్‌లను ఐసీసీ పర్యవేక్షణలో తయారు చేస్తారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)