Home జాతీయ national telgu Ind Vs Pak: పాకిస్తాన్‌పై 61 పరుగుల తేడాతో భారత్ విజయం

Ind Vs Pak: పాకిస్తాన్‌పై 61 పరుగుల తేడాతో భారత్ విజయం

13
0

SOURCE :- BBC NEWS

క్రికెట్, భారత్, పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

15 ఫిబ్రవరి 2026, 19:15 IST

అప్‌డేట్ అయ్యింది 33 నిమిషాలు క్రితం

చదివే సమయం: 5 నిమిషాలు

టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది.

పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది.

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ దూకుడు ప్రదర్శించింది.

భారత ఆటగాళ్లు సమష్టిగా రాణించారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత జట్టు పాకిస్తాన్ కంటే మెరుగైన ప్రదర్శన చేసింది.

భారత బ్యాట్స్‌మెన్లలో ఇషాన్ కిషన్ చెలరేగి 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది.

క్రికెట్, భారత్, పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

176 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన పాకిస్తాన్ టాప్ ఆర్డర్ తడబడింది. వెంటవెంటనే వికెట్లు పడడంతో కష్టాల్లో పడింది.

పాక్ జట్టు 18 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది.

పాక్ టాప్ ఆర్డర్‌లో నలుగురు బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగారు.

పాండ్యా, హార్దిక్, అక్షర్ పటేల్ పాక్ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు.

పాక్ బ్యాట్స్‌మెన్ ఏ దశలోనూ భారత బౌలర్లను ఎదుర్కొని పరుగులు రాబట్టలేకపోయారు.

షాదాబ్ ఖాన్ కొద్దిసేపు ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు.

క్రికెట్, భారత్, పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

తొలి ఓవర్లో మూడో బంతికే పాకిస్తాన్ మొదటి వికెట్ కోల్పోయింది.

హార్దిక్ పాండ్యా వేసిన బంతిని షాహిబ్ ‌జాదా పర్హాన్ లాంగాన్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.

అయితే బంతి ఎడ్జ్ తీసుకోవడంతో రింకూ సింగ్‌కు దొరికిపోయాడు. డకౌట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు.

క్రికెట్, భారత్, పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

తరువాతి ఓవర్లో జస్‌ప్రీత్ బూమ్రా రెండు వికెట్లు తీశాడు. రెండో బంతికి సయీమ్ అయూబ్‌ను ఎల్‌బీడబ్య్లూగా పంపిన బూమ్రా, చివరి బంతికి సల్మాన్ ఆఘా వికెట్ తీశాడు.

సల్మాన్ ఆఘా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి హార్దిక్ పాండ్యాకు దొరికిపోయాడు.

పాక్ 2 ఓవర్లలో 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.

నాలుగో ఓవర్లో అక్షర్ పటేల్ మరోసారి పాక్‌ను దెబ్బ కొట్టాడు. బాబర్ ఆజమ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో పాకిస్తాన్ 34 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది.

పాకిస్తాన్ టాప్ ఆర్డర్‌లో నలుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు.

క్రికెట్, భారత్, పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, షాదాబ్ ఖాన్‌తో కలిసి ఉస్మాన్ ఖాన్ పాక్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. షాదాబ్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డుని ముందుకు నడిపాడు. ఐదో వికెట్‌కు 39 పరుగులు జోడించారు.

ఈ జోడీ కుదురుకుంటున్న సమయంలో అక్షర్ పటేల్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.

అక్షర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు షాదాబ్ ముందుకెళ్లడంతో ఇషాన్ స్టంపింగ్ చేశాడు.

ఉస్మాన్ ఖాన్ 34 బంతుల్లో 6ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 44 పరుగులు చేశాడు.

క్రికెట్, భారత్, పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఉస్మాన్ స్థానంలో వచ్చిన మొహమ్మద్ నవాబ్ 4 పరుగులకే కులదీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఆ తర్వాత షాదాబ్ ఖాన్ 14 పరుగులకే తిలక్ వర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

15వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి పాక్‌ను గట్టి దెబ్బ తీశాడు.

ఒకే ఓవర్లో ఫహీమ్ అష్రఫ్, అబ్రార్ అహ్మద్‌ను ఔట్ చేశాడు. దీంతో పాక్ జట్టు 15.4 ఓవర్లలో 97 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

18వ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఉస్మాన తారిక్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ ముగిసింది.

క్రికెట్, భారత్, పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది.

కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

బ్యాటింగ్‌కు వచ్చిన భారత ఓపెనర్లలో అభిషేక్ శర్మ తొలి ఓవర్‌లో సున్నా పరుగులకే వెనుదిరిగాడు.

సల్మాన్ ఆఘా వేసిన తొలి ఓవర్‌లో చివరి ఆడిన అభిషేక్ శర్మ మిడాన్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి గాల్లోకి లేవడం, షహీన్ అఫ్రిది క్యాచ్ అందుకోవడంతో అభిషేక్ శర్మ పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది.

క్రికెట్, భారత్, పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఇషాన్ కిషన్ దూకుడు

రెండో ఓవర్ నుంచి ఇషాన్ కిషన్ చెలరేగి ఆడాడు. పాకిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇషాన్ దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో భారత రన్ రేట్‌తో పాటు స్కోరు బోర్డు పరుగులు తీసింది.

భారత జట్టు 6 ఓవర్లలో 52 పరుగులు చేసింది. ఇందులో ఇషాన్ కిషన్ ఒక్కడే 42 పరుగులు చేశాడు.

ఇషాన్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో చెలరేగి ఆడాడు. మైదానంలో అన్ని వైపులకు ఫోర్లు కొట్టాడు.

అబ్రార్ వేసిన ఒక ఓవర్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి తన దూకుడు కొనసాగించాడు. షాదాబ్ ఖాన్ వేసిన ఓవర్‌లో భారీ సిక్సర్, ఫోర్ కొట్టాడు.

భారత్ స్కోరు 8 ఓవర్లకు 82 పరుగులు ఉంటే అందులో ఇషాన్ కిషన్‌ చేసిన పరుగులు 72 ఉన్నాయి.

ఇషాన్ కిషన్ పాకిస్తాన్ మీద అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. భారత జట్టు 88 పరుగుల వద్ద ఇషాన్ వికెట్ కోల్పోయింది.

ఇండియా, పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్, కొలంబో, శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

ఆచితూచి ఆడిన సూర్య కుమార్

ఇషాన్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ ఆచితూచి ఆడాడు.

మూడో వికెట్‌కు సూర్య కుమార్ యాదవ్ తిలక్ వర్మ 38 పరుగులు జోడించారు.

14 ఓవర్‌లో స్కోరు 126 పరుగుల వద్ద ఉండగా తిలక్ వర్మ ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తిలక్ వర్మ 24 బంతుల్లో 25 పరుగులు చేశాడు.

తిలక్ వర్మ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి తొలి బంతికే ఔటయ్యాడు.

పాక్ బౌలర్ బాబర్ ఆజమ్‌కు హ్యాట్రిక్ అవకాశం వచ్చింది. అయితే, హార్దిక్ స్థానంలో వచ్చిన శివమ్ దూబే అడ్డుకున్నాడు.

క్రికెట్, భారత్, పాకిస్తాన్, టీ20 వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

చివరి మూడు ఓవర్లలో..

సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి నిదానంగా ఆడిన శివమ్ దూబే 17 ఓవర్లో షాట్లు ఆడాడు. ఈ ఓవర్లో సూర్య ఫోర్, శివమ్ దూబే సిక్సర్ కొట్టారు.

తారిక్ వేసిన ఓవర్‌లో భారీ షాట్ కోసం ప్రయత్నించిన సూర్య కుమార్ యాదవ్ ఔటయ్యాడు.

సూర్య 29 బంతుల్లో 32 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు ఉన్నాయి.

భారత్ చివరి ఓవర్లో 16 పరుగులు చేసినప్పటికీ చివరి రెండు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది.

పాక్ బౌలర్లో ఉస్మాన్ తారిక్, మొహమ్మద్ నవాజ్, సయీమ్ అయూబ్, సల్మాన్ అఘా పొదుపుగా బౌలింగ్ చేశారు.

సయీమ్ అయూబ్‌కి 3 వికెట్లు, ఉస్మాన్ తారిక్‌కు 1, సల్మాన్ అఘాకు ఒక వికెట్ దక్కాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌

ఆసియా కప్‌లో ఈ రెండు జట్ల కెప్టెన్లు షేక్‌హ్యాండ్ ఇచ్చుకోలేదు. అదే ఇక్కడ కూడా కొనసాగింది.

టాస్ తర్వాత, సల్మాన్ ఆఘా, సూర్యకుమార్ యాదవ్ ఒకరినొకరు పట్టించుకోకుండా పెవిలియన్‌కు తిరిగి వచ్చారు.

ఈ టోర్నీలో రెండు జట్లు ఇప్పటి వరకు రెండేసి మ్యాచ్‌లు ఆడాయి.

భారత్ తొలి మ్యాచ్ అమెరికా, తర్వాతి మ్యాచ్ నమీబియాతో ఆడింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

మొదటి స్థానంలో భారత్..

ఈ టోర్నమెంట్‌లో ఇప్పటి వరకు భారత్, పాక్ చెరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో భారత్ మూడు మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. పాక్ రెండు మ్యాచ్‌లలో గెలిచి ఒకటి ఓడిపోయి రెండో స్థానంలో నిలిచింది.

ఫిబ్రవరి 18న భారత్ తన తదుపరి మ్యాచ్ నెదర్లాండ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)